7
ఇప్పుడు టైమెంత అయి ఉంటుందో ....? ఆస్పత్రి వదిలాను.. తెగిన గాలిపటం లా తిరుగుతున్నాను... గమ్యం లేదు...ఆస్పత్రి లో ఉండగా వేళకింత తినడానికి దొరుకుతూ ఉండేది....' ఇప్పుడదీ లేదు..రెండు రోజులు ఏమీ తిననందున కళ్ళు తిరుగుతున్నాయి...చివరకు నేనే ఏమైపోతానో..ఏమో?ఏమిటీ జనం...?అంత రద్దీగా ఉందెం...? బహుశా సినిమా వదిలి నట్లున్నారు. వెట్టి వేస్తున్నారు... అయ్యో....కాళ్ళు తడబడుతున్నాయి....ఆ ...ఎదురుగా కారు వస్తూ ఉంది...ప్రక్కగా వెళ్ళాలి....పడిపోయాను.... ఏమీ తెలియడం లేదు.. తలకు దెబ్బ తగిలినట్లుగా ఉంది...తడిమి చూసుకున్నాను... తడి....జిగట..రక్తం కారుతూ ఉంది. భయంతో వణికిపోయాను. కళ్ళు మూతలు పడ్డాయి. అంతే! ఆ తర్వాత ఏం జరిగిందో నాకు తెలియదు.
స్పృహ వచ్చేసరికి ఒక ఆస్పత్రిలో ఉన్నాను.... ఆశ్చర్యం కలిగింది నాకు. ఆస్పత్రి వదిలి వెళ్లిన నేను మళ్ళీ ఆస్పత్రికి చేరడం... కాని యిది ఒదిలి వెళ్లిన ఆస్పత్రి కాదు.... మరొకటి! జరిగిన సంగతులన్నీ క్రమంగా స్పురణ కు రాసాగాయి.... అవును. గాయపడి రోడ్డు మీద నిస్సహాయ స్థితిలో ఉన్న నన్ను ఎవరో మళ్ళీ ఈ ఆస్పత్రిలో చేర్చారు. ఈసారైనా నర్సులతో...డాక్టర్ల తో పేచీ పడకూడదు.. తలమీది గాయం బాగా మంటపుడుతూ ఉంది. తలకు కట్టుకట్టారు. చేతికితగిలిన గాయాలకు మూడు నాలుగు చోట్ల టింక్చరు అయిడిన్ లో తడిపిన దూది అతికించారు. పాత క్రొత్త...మళ్ళీ హింసకు గురి కాసాగాను. ప్రక్క మంచాల పై ఉన్న రోగులు మాట్లాడుకుంటున్న మాటలు నా చెవిన పడసాగాయి.
'ఎవరో పాపం....!'
'మన పేద డాక్టరు బాబుగారి కారు వెడుతూ ఉండగా కళ్ళు తిరిగి దాని ముందు పడిపోయాడట!'
'ఆస్పత్రికి తీసుకు వచ్చి చాలా రాత్రి వరకు అవస్త పడ్డారు డాక్టరమ్మ గారు, పెద్ద డాక్టరు గారు.'
'వేషం చూస్తె బికారి....ముఖ వర్చస్సు చూస్తె మాత్రం మంచి కుటుంబానికి చెందినా వాడిలా కనుపిస్తున్నాడు....'
'ఎంతైనా మన డాక్టరు బాబు గారు ధర్మ ప్రభువులు...ఆ గుణంలో వారమ్మాయి గారు వారిని మించిపోయారు.'
'ఇటువంటి వారినెందరి నో ఒకదరికి చేర్చారు.'
నా గురించి మాట్లాడుకుంటున్నారన్న సంగతి వెంటనే అర్ధమైంది... ఇప్పుడు నేనున్నది ప్రవైటు నర్శింగ్ హోం అని తెలుసుకున్నాను. పైగా డాక్టర్ గారు... వారమ్మాయి యిద్దరూ మంచివారనే విషయాన్ని వీరి మాటలు రుజువు పరుస్తూన్నాయి... వారిని బ్రతిమాలుకొని ఎలాగైనా నా జబ్బు పూర్తిగా నయమయ్యేంత వరకు యిక్కడే గడపాలి.
'ఇప్పుడు మీకెలా ఉంది....?'
నా ఆలోచనలకూ అంతరాయం కలిగింది. నా చూపులు ఆ మాటల ననుసరించాయి. తెల్లటి దుస్తులలో చిరునవ్వు చిందిస్తూ కనుపించింనొక నర్సు. వయసు సుమారుగా యిరవై దాటే ఉంటుంది.... ముఖంలో ఆప్యాయత.... ఆదరణ... ప్రసన్నత కనుపిస్తున్నాయి.
'గాయం చాలా బాధ పెడుతూ ఉంది....డాక్టరు గారెప్పుడోస్తారు?"
'టైమైంది ...పది లేక పదిహేను నిముషాలలో రావచ్చు.' సమాధానం చెప్పిందా నర్సు.
'ఉమా...! ఎక్కడున్నావ్? ఏం చేస్తున్నావ్?' హడావుడి గా నా గది లోపలికి ప్రవేశించింది ; మరొక నర్సు.
'ఉమా....! అమ్మాయి గారొచ్చారు... నీవేళ్ళు యిక్కడి పని నే చూసుకుంటాను.'
నా బెడ్ కు ఒక ప్రక్క తగిలించి ఉన్న చార్టు ను చేతిలోకి తీసుకుని నా వైపు చూస్తూ ప్రశ్నలు ప్రారంభించింది.
'మీ పేరు?'
'...........'
'మిమ్మల్నే......'
ఏం చెప్పాలో అర్ధం కాదు...గత జీవితంలో నన్ను సూర్యం -- సూరి అని పిలిచేవాళ్ళు. ఆ పేరు చెప్పడం నాకు యిష్టం లేకపోయింది. ఆ పిలుపు నాకే అసహ్యాన్ని కలిగిస్తూ ఉంది. ఆ పేరు చెప్పా తలచు కోలేదు. పేరు చెప్పడం ఆలస్య మైనందు వల్ల మరీదగ్గరగా వచ్చింది నర్సు. నా ముఖంలోకి పరిశీలనగా చూస్తూ 'ఏమాలోచిస్తున్నారండీ..? దయచేసి మీ పేరు చెప్పండి...!' ఆశ్చర్యంతో ప్రశ్నించింది.
'నన్ను శివం అంటారు....'
వయస్సు....?'
'ఇరవై అయిదు సంవత్సరాలు.'
ఇక ప్రశ్నించకుండా ఆ చార్టును వివరాలతో నింపి యధాస్థానం లో ఉంచింది. ధర్మామీటరు నానోటిలో ఉంచి తన చేతి గడియారాన్ని చూసుకోసాగింది. ధర్మామీటరును నా నోటి కందించి నప్పుడు ఆమెను అతి దగ్గరగా చూశాను...నిర్ఘాంత పోయాను కళ్ళు బైర్లు కమ్మాయి.... భయం వల్ల.... ఆందోళన వల్ల ముఖమంతా చెమటలు పట్టింది.... ఎవరీ నర్సు? అవే పోలికలు.... కాదనడానికి వీలులేదు. చివరకు తన వారికి దూరమై తన జీవితాన్ని యిలా సాగిస్తూ ఉందా? దురదృష్ట వంతుణ్ణి ....అహంభావంతో మణిని కాలదన్ని మసి బొగ్గు కు ఆశ్రయ మిచ్చాను..
'రాధా....! ఇతనికేలా ఉంది?'
'టెంపరేచరు బాగానే ఉంది. నీరసంగా మూలుగుతున్నాడు. ఏదో పరధ్యానంగా కూడా ఉన్నాడు. రెండు...మూడు సార్లు ప్రశ్నించి గాని అతని పేరు చార్టు మీద వ్రాయలేక పోయాను.'
'అమ్మా రాధా....! ఎలా ఉన్నాడు?'
ఆ వచ్చిన వారెవరో చూచాయగా ఊహించగలిగాను. వారు ఈ నర్శింగ్ హోం యజమానులు. రాధ....అవును....సందేహం లేదు. ఆమె....నా అన్యాయానికి బలియై; ఈ విధంగా అజ్ఞాత వాసం చేస్తూ ఉంది. పైగా నాకన్న ధైర్య వంతురాలు. నన్ను నిరుత్సాహం ...నిస్సత్తువ ఆవహించాయి. కాని రాధ జీవితాన్ని ధైర్యంగా ఎదుర్కొంది. ఇతరులకు సేవ జేస్తూ తన జీవితాన్ని సార్ధకం చేసుకుంటూ ఉంది. ఆమె తల్లిదండ్రులు ఎంతగా కుమిలి పోతున్నారో....? నన్ను తమ పాలిటి యమునిగా దూషించారు.... ఒక్కగా నొక్క కుమార్తె కు ద్రోహం చేశానని....నేనీస్తితికి దిగజారినప్పుడు వారి హృదయం చల్లబడి ఉండవచ్చు.. గ్రామం లో మా వంశానికి మాయని మచ్చగా తయారయ్యాను--
'త్వరగానే కోలుకోవచ్చు ....అయినా యితనికి అంతకు ముందే వేరే కంప్లైంట్స్ ఉన్నట్లు అనుమానంగా ఉండండి నాన్నారూ' చార్టును జాగ్రత్తగా పరిశీలిస్తూ అన్నారు డాక్టరమ్మ గారు.
'అవునమ్మా ...చక్కగా ఊహించావు. సిఫిలిసు ఫస్టు స్టేజిలో ఉంది-- జాగ్రత్తగా చూస్తె త్వరగానే కోలుకుంటాడు. ఇతడు రోగం తోటే కాకుండా మనో వ్యాధి తో కూడా బాధపడుతున్నాడు. అమ్మా...రాధా! ఇతనికి మనమిచ్చే మందుల కంటే మనసుకు కలిగించే ఊరట రోగాన్ని త్వరగా నయం చేస్తుంది. ఆ చార్టు యిలా యివ్వు ట్రీటు మెంటు వ్రాస్తాను....' చార్టు తీసుకొని వ్రాయడమారంభించారు. పూర్తీ చేసి రాధ చేతికిస్తూ,
'రాదా....! నే చెప్పింది గుర్తుంచుకో.... ఇతనికి మనః స్థిమితం లేదు.. కాస్త జాగ్రత్తగా ఉండాలి.' డాక్టరు గారు...అయన కుమార్తె అ గది నుండి వెళ్ళిపోయారు. నాకెంతో ఆశ్చర్యం కలిగింది. ఆ ప్రభుత్వ ఆసుపత్రి కి , ఈ ఆస్పత్రికి ఎంత తేడా ఉంది? అక్కడి అ వాతావరణం చూసిన నాకు డాక్టర్లు ....నర్సుల మీద ఉండే సదభిప్రాయం దురభిప్రాయంగా మారింది. కాని మళ్ళీ నా అభిప్రాయాన్ని మార్చు కోక తప్పదు. వ్యక్తీ యొక్క ప్రవర్తన ఆ పరిసర ప్రాంతాల శాంతి, వాతావరణం మీద ఆధారపడి ఉంటుంది.... కాదనలేను.... అందుకు తార్కాణం.... లోగా నేను విడిచి వచ్చిన ఆస్పత్రి. మంచైనా చెడు ఐనా అక్కడ కలకాలం ఉండేవారేవ్వరూ? రోగాలు నయమైనా కాకున్నా వారి జీతాలు ఆగవు....బాధ్యతా రహితం.... నిర్లక్ష్యం....కాని అదెలా అన్వక్కయిస్తుందిక్కడ....? అన్వయించదు.... పేరు...ప్రతిష్ట ....మంచి ..చెడూ ఎల్లకాలం కావలసింది.... వచ్చేది యిక్కడే....! ఏమైనా నాది అని చేసేపనికి.... నాకేం? అని చేసే పనికి ఎంతో తేడా ఉంటుంది. ఆ తేడాయే యిప్పటి ఈ రెండు ఆస్పత్రుల మధ్య ఉంది....ఆలోచనలు నన్ను యింకా బలహీన పరుస్తున్నాయి. ఇక ఆలోచించకూడదనుకుంటూనే ఏదో ఒకటి అలోచిసున్నాను.
రాధ వారితో వెళ్లి మళ్ళీ తిరిగి వచ్చింది. 'డాక్టరు గారు చెప్పిన మాటలు విన్నారుగా! మీకేం భయం లేదు. పూర్తిగా ఆరోగ్యవంతులౌతారు త్వరలోనే....! మీరు ఏ ఆలోచనలూ పెంచుకోకుండా మీ ఆరోగ్య బాధ్యతలు మామీద వేసి నిశ్చింతగా ఉండండి. ఏం ...? ఏమంటారు?'
'అలాగే! మీ అందరి మాటలు నాకు జీవితం పై కొత్త ఆశలను రేకిత్తిస్తున్నాయి. ఇక నిశ్చింతగా ఉంటాను.' సాధ్యమైనంతవరకు నా గొంతు మారుస్తూ అన్నాను.
నా కళ్ళు అశ్రుపూరితాలయ్యాయి. ఎంత ఆదరణ....? ఎంత ఆప్యాయత...? రాధ చూడకుండా కళ్ళు తుడుచుకున్నాను. ఏమిటీ విధి వైపరీత్యం ? ఈమెకు జీవితంలో విష పాత్ర నందించిన వాణ్ణి నేనే! ఆమె నుండి అమృతాన్ని ఆశిస్తున్నావాడను నేనే! సిగ్గుతో నా శరీరం కుంచిందుకు పోయింది. ఆమెకు విష పాత్రను అందించిన వాడను నేనే నని తెలుసుకున్నప్పుడు నన్నెంతగా అసహ్యించుకుంటుందో....? అవును....ఈ సందేహం నాకిప్పుడిప్పుడే కలుగుతూ ఉంది. నన్ను గుర్తు పట్టలేదు గద....? లేదు....గుర్తు పట్టే స్థితిలో లేను నేను. హమ్మయ్య ... మనసుకు కొంత శాంతి, వచ్చినప్పటి నుండీ గమనిస్తూనే ఉన్నాను....ఆ చిరునవ్వు....ముఖంలో తేజస్సు...నిర్మలమైన ముఖ కవళికలు...గతాన్ని జ్ఞప్తికి తెచ్చాయి.... అమృత ఘడియలు ఒక విష బిందు ప్రవేశంతో చిన్నాభిన్న మైపోయాయి. ఇక వోపిక లేదు. గతం ఊహించ లేనంత భయంకరమైనది. ఆ తలంపుతో నా మెదడుకు అలసట పెంచుకోతలచలేదు. విశ్రాంతి గా మంచం మీద వెనకకు వాలాను. కొంత ప్రశాంతత....జీవితం మీది ఆశ....ఆ ఆశ నా రోగాన్ని కొన్ని క్షణాలు అణిచి పెట్టగలిగింది.
ఒకవారం రోజులు గడిచాయి. నా జబ్బు యొక్క ఉద్రేక పరిస్థితి చాలావరకు తగ్గింది. ఇప్పుడు నరాలు అంతగా బాధపెట్టడం లేదు. కళ్ళల్లో...ముఖంలో కొద్ది మార్పు వచ్చింది. ఈ విషయమే ఉమ -- రాధ వీరిద్దరూ అనుకుంటూ ఉండగా విన్నాను. అద్దంలో ముఖం చూసుకున్నప్పుడు గుర్తించగలిగాను కూడా! గడ్డం పెరుగుతూ ఉంది.అదీ ఒకందుకు మంచిదే! రాధ గుర్తు పట్టకుండా ఉంటుంది. ఆ విధంగా రెండు వారాలు గడిచాయి. శరీరంలో పూర్తీ ఆరోగ్యం చేకూరింది.
ఒకరోజు ఉదయం సుమారు ఎనిమిది గంటలకు నా గదిలోపలికి వచ్చింది రాధ .
'శివం గారూ! మీరు పూర్తిగా ఆరోగ్య వంతులయ్యారని మీరిక యింటికి వెళ్ళిపోవచ్చని డాక్టరు గారు మీతో చెప్పమన్నారు.... రేపు మీరు మీ యింటికి వెళ్ళి పోవచ్చు.'
'చూడండి రాధాదేవి గారూ...డాక్టర్ గారితో వంటరిగా మాట్లాడాలి...ఎప్పుడు వీలౌతుంది?'
'ఇక్కడ వీలుపడదు...వారు వచ్చినప్పటి నుండీ వెళ్ళి పోయేంతవరకూ వారిని ఒక్క క్షణం విశ్రాంతి గా ఉండనివ్వరు రోగులు.... యింటి దగ్గర మాట్లాడండి అడ్రసు చెబుతాను.'
అడ్రసు ను ఒకటి రెండు సార్లు జాగ్రత్త గా మనసులో మననం చేసుకున్నాను. మధ్యాహ్నం సుమారు మూడు గంటలకు వారి యింటికి బయలుదేరాను.
అప్పుడే నిద్ర లేచి బాత్ రూంకు వెళ్ళారని చెప్పాడు నౌకరు. వారు తిరిగి హాలు లోపలికి వచ్చేంత వరకు బయట గుమ్మం లో వారి కోసం ఎదురు చూశాను. తిరిగి వచ్చి టీ త్రాగుతూ పత్రికేదో చదువుతున్నారని నౌకరు చెప్పాడు. ఒక్క ఐదు నిముషాలు ఆగి లోపలికి వెళ్ళాను. వారు టీ త్రాగడం పూర్తీ చేశారు.