Previous Page Next Page 
ఆనందోబ్రహ్మ పేజి 15

                        

                    మీ సేవలో మేము
   
    "ఇక మీరు ఏ విషయంలోనూ దిగులు చెందనక్కర్లేదు. మీ దినచర్య తాలూకు బాధ్యత మేము తీసుకుంటాము. మరుసటిరోజు మీ పన్లన్నీ మా కంప్యూటర్ నిర్ణయిస్తుంది. ప్రొద్దున్న ఎన్నింటికి లేపాలో దానికి తెలుసు. రాత్రి మీరు పక్కమీద అటూ యిటూ దొర్లుతూ కలత నిద్రపోయి వుంటే మా బెడ్ మోషన్ సెన్సార్ దాన్ని గుర్తించి ఒక ఇరవై నిమిషాలపాటు ఎక్కువ నిద్రపోనిస్తుంది కూడా! ఆ రోజు చెయ్యవలసిన పన్లని బట్టి, కావలసిన శక్తికోసం పొద్దున్న ఎన్ని కాలరీల టిఫిన్ తినాలో అది చెబుతుంది. మీకు జ్యోతిష్యం మీద నమ్మకం వుంటే మరుసటిరోజు రాహు కాలాన్ని, వర్జ్యాన్ని కూడా లెక్కలోకి తీసుకొని మరీ దినచర్య ప్లాన్ చేస్తుంది. మీరు ఆ రోజు చేయవలసిన పనులనిబట్టి ప్రొద్దున లేవగానే ఆ మూడ్ కి సరిపోయే మ్యూజిక్ వినిపించటంతో దాని పని మొదలవుతుంది. బయట టెంపరేచర్ బట్టి ఎంత వేడినీళ్ళతో మీరు స్నానంచేస్తే బావుంటుందో అది తయారుచేసే ఉంచుతుంది. మీరు వెళ్ళబోయే ప్రదేశాన్ని, మీరు కలవబోయే మనుషుల్ని దృష్టిలో వుంచుకొని మీ దుస్తుల్ని అదే సెలక్టు చేసి పెడుతుంది. బయట చలిగావున్నా, వర్షం వచ్చే సూచనలున్నా దాన్ని గ్రహించి మీకు కోటు వేసుకొమ్మని సలహా ఇస్తుంది. మీ ఇంట్లో చిన్న ఎలక్ట్రానిక్ రోడ్డు ఏర్పాటు చేసుకొంటే, (అది కూడా మేమే అమర్చిపెడతాం) ఇక లేవగానే బెడ్ కాఫీ, పేస్టు అమర్చిన బ్రష్షూ అన్నీ మీ పడక దగ్గరకే వస్తాయి. ఇక భోజనం విషయానికి వస్తే మీ భార్య కూడా గుర్తుంచుకోలేని విధంగా గత వారంరోజులుగా మీరేం తిన్నారో గుర్తుంచుకొని మళ్ళీ అదే కూర ఆ రోజు రాకుండా జాగ్రత్త తీసుకుంటుంది. మా కంప్యూటర్లో 'వెయిట్ సెన్సింగ్ స్కేల్' బరువునిబట్టి మీ అభిరుచుల్ని కనుగొంటుంది. ఉదాహరణకి గత రెండు నెలలుగా నత్తల కూర వండిన రోజు మీరు ఎక్కువ ఆహరం వదిలిపెడుతూ వుంటే దాని మెమరీలో అది రికార్డయి తర్వాత భవిష్యత్తులో ఆ కూరని మీకు వడ్డించదు. మీరు సాయంత్రం రాగానే అలసిపోయి నిస్త్రాణగా పక్కమీద వాలిపోతే టీ ఇస్తుంది. లేదూ హుషారుగా కుర్చీలో కూర్చుంటే 'డ్రింక్' ఇస్తుంది.
   
    మీతోపాటే వుంటుంది.
   
    మీ భార్యకన్నా ఎక్కువగా మిమ్మల్ని అర్ధం చేసుకుంటుంది.

   
    నేడే మీ ఇంటిని కంప్యూటరైజ్ చేసుకోండి. సర్వత్రా మేము మీ సేవకి సిద్దం."
   
    భరద్వాజ చదివి తలెత్తి "బానే వుందే" అన్నాడు.
   
    "అదీ అలా చెప్పండి" అంది భార్య.
   
    "బావుందా" కోపంగా అన్నాడు కొడుకు. "ఇక మనం మనంగా బ్రతకటం ఎందుకు? మనం ఎం చేయాలో అదే చెబుతుంది. భార్యని ఎప్పుడు కలవాలో అదే నిర్ణయిస్తుంది. మనకాక్* ఎంతసేపు పెనిట్రేట్ అవ్వాలో అది సూచిస్తుంది. మరికొంచెం స్వాతంత్ర్యం ఇస్తే 'నువ్వు అలసిపోయావు నీ పనికూడా నేను చేస్తాను' అని పక్కకి తోసేస్తుంది. ఇప్పటికే మనం మర మనుషుల మయిపోయాం. ఈ కంప్యూటర్స్ ఇంట్లో పెట్టుకుంటే ఇక లేచి తిరగటం ఎందుకు? లోపలి బయటికీ రెండు గొట్టాలు పెట్టుకొని జీవితమంతా పక్కమీద గడిపెయ్యొచ్చు. దీన్ని నేను పూర్తిగా వ్యతిరేకిస్తున్నాను."
   
    భరద్వాజ వినటంలేదు. కొడుకులో ఒక కొత్త కోణాన్ని చూస్తున్నాడు. భార్యకీ, తనకూ, తమ తరానికి అందని ఒక కొత్త రూపాన్ని గమనిస్తున్నాడు.

    అతడిలో ఎక్కడో ఏదో కదులుతూంది.
   
    ఆ రాత్రి కూతురితో జరిగిన సంభాషణతో అది క్లయిమాక్స్ కి వచ్చింది.
   
    ........
   
                                14
   
    ఎందుకో
అతడికి మెలకువ వచ్చింది. లేచి, తెర తొలగించుకుని పక్క గదిలోకి వెళ్ళాడు. పక్కమీద కూతురు ఏడుస్తూ కనపడింది.
   
    అతడు ఆశ్చర్యంతో "ఏమైంది?" అనడిగాడు.
   
    ఆమె వెంటనే జవాబు చెప్పలేదు. కొద్దిగా రెట్టించి అడిగిన తర్వ్గాత అన్నది "రేపే కదా నాన్నా అబార్షను."
   
    "అవును."

_________________________________________________________________________________________________

* తల్లిదండ్రుల దగ్గర పిల్లలు సెక్స్ గురించి భవిష్యత్తులో ఏ విధమైన తటపటాయింపూ లేకుండా మాట్లాడుకుంటారని అంచనా.- రచయిత
_________________________________________________________________________________________________
   
    "కొద్ది కొద్దిగా ప్రాణాల్ని కూడగట్టుకొని నెమ్మది నెమ్మదిగా కదలటానికి ప్రయత్నించే ఒక చిన్న జీవిని కత్తులతో చిన్నాభిన్నం చేసేది రేపే కదూ?"
   
    అతడు షాక్ తగిలినట్టు అలాగే వుండిపోయాడు. ఆమె అన్నది. "మేము చేసిన పాపానికి ఆ పాపని ఖండ ఖండాలుగా కోసి డ్రైనేజిలోకి తోసేది రేపే కదూ?"
   
    అతను మందలిస్తున్నట్టు "మరీ అంత సెంటిమెంటల్ అవకు" అన్నాడు.

    "సెం.....టి....మెం....ట.....ల్. హూ! సెంటిమెంటల్! ఆ పదానికి అర్ధం కూడా తెలుసా నాన్నా మనకి" అంది.
   
    అతడికి కొద్దిగా కోపం వచ్చింది. "మరి ఆలాంటప్పుడు బాధపడటం దేనికి?" అన్నాడు.
   
    "ఒక జీవిని నిష్కారణంగా చంపుతున్నందుకు."
   
    అతడు ఆమె దగ్గరగా  వెళ్ళాడు. "పోనీ ఆ ఎంబ్రియోని ట్యూబ్ లో పెంచుదామా? దానికైతే ఇంకో నెల ఆగాలి. కానీ తర్వాత మళ్ళీ  ఆ పాప ఎక్కడవుందో అని నీ మనసు పీకుతే అది నీ వైవాహిక జీవితాన్నే దెబ్బతీస్తుందమ్మా" అని అన్నాడు లాలనగా.
   
    "అబ్బ! ఎంత మెకానికల్ ఈజీ సొల్యూషన్ చెప్పావు నాన్నా! పిండాన్ని తీసి ట్యూబ్ లో పెంచితే 'కన్నకడుపు' అనటానికి వీలుండదనా?" అంది వ్యంగ్యంగా. అతడికీసారి నిజంగా కోపం వచ్చింది.
   
    "మరి అప్పుడు అంతగా కళ్ళు మూసుకు ప్రవర్తించి ఇప్పుడు తీరిగ్గా బాధపడటం దేనికి?" అన్నాడు.
   
    "కళ్ళు మూసుకునా? నేనా....? హూఁ....లేదు నాన్నా. సెక్స్ ఎక్కువై నేనీ పని చేయలేదు. కొద్దిగా ప్రేమకోసం తపించే తరుణంలో ఆ కుర్రవాడు ఆప్యాయతని చూపించాడు. ప్రేమతోపాటూ సెక్సూ కన్నుమూసి తెరచేటంతలో అయిపోయిందంతే. నీకు తెలుసా నాన్నా? నా యీ ఇరవై రెండేళ్ళ వయసులో నన్ను 'అమ్మా' అని మొదటిసారి నువ్వు పిలిచింది ఇప్పుడే.... క్షణం క్రితమే."
   
    ఒక బలమైన కెరటం వచ్చి ముఖానికి తగిలినట్టూ అతడు కంపించి పోయి కష్టంమీద సర్దుకుని, "అతడెవరో చెప్పు వివాహానికి ప్రయత్నిద్దాం" అన్నాడు.
   
    ఆమె కళ్ళనీళ్ళతో నవ్వింది.
   
    "ఒక కూతురు 'నేను కాలు జారానన్న' వెంటనే తండ్రి అడగవలసిన మొదటి ప్రశ్న నాన్నా ఇది! ఇన్నాళ్ళకి ఇప్పుడు అడిగావు. నీకు జ్ఞాపకం వుందా - అప్పుడు నువ్వేం అన్నావో? 'ఆస్పత్రుల విషయం నీకు అంతగా లేదు. నేను చూసుకుంటాంలే' అని. ఇంకో ప్రశ్నకూడా అడిగావు -'ఎందుకంత బాధ్యతారహితంగా ప్రవర్తించావ్' అని....నేనేమీ బాధ్యతారహితంగా ప్రవర్తించలేదు నాన్నా - కాస్త ప్రేమకోసం నేను చెల్లించిన "ధర" అది నేనే కాదు నాన్నా.... నీ పెద్ద కొడుకూ రెండో కొడుకూ......ఈ తరం మొత్తం ప్రేమకోసం తపించిపోతోంది. నీ పెద్దకొడుకు చచ్చిపోతే 'నా హత్యకి హంతకుడు' అన్న సూపర్ హిట్ నవల వ్రాశావేతప్ప దాని వెనుక వున్నా కారణం గ్రహించలేకపోయావు. అంతమంది యువతీ యువకులు వరుసగా ఆత్మహత్య చేసుకోవటానికి కారణం మీరు అనుకున్న దేదీకాదు నాన్నా. ప్రేమ రాహిత్యం. అవును ప్రేమ రాహిత్యం నీ చిన్న కొడుక్కు కావల్సింది అలసిపోతే మంచి మ్యూజిక్ వినిపించే కంప్యూటర్ కాదు నాన్నా, స్వయంగా కాఫీ పట్టుకొచ్చే తల్లి! ఏ క్షణం ఏ బాంబు పేలుతుందో, ఏ మూలనుంచి ఎవరు వచ్చి దోపిడీ చేస్తారో, మనం ముసలివాళ్ళం అయితే మన కొడుకులు తమతో పాటూ మనని వుంచుకుంటారో లేక 'హోం ఫర్ ది ఏజ్డ్'లో చేర్పిస్తారో అన్న భయంతో ఈ తరం వణికిపోతూంది. చివరికి మనం చచ్చిపోతే, మన బూడిదని తీసుకుంటారో లేదో కూడా మనకి అనుమానమే. మనల్నెవరు రక్షిస్తారు? ఎవరు? ఎవరు?"
   
    గాఢమైన నిశ్శబ్దంలోంచి చాలాసేపటికి తేరుకుని అతడు నెమ్మదిగా కదిలి కూతురు తలమీద చెయ్యి వేశాడు. "నీ సమస్యని నేను పరిష్కరిస్తానమ్మా! అది చాలా చిన్న సమస్య ఒక కుర్రవాడిని ఒప్పించటం ఎంతసేపు? కానీ నువ్వు నాకు చేసిన సయం మాత్రం గొప్పది! ఎంతో పెద్ద సమస్యలోపడి కొట్టుమిట్టాడుతున్న నాకు పరిష్కారం దొరికింది" అని అక్కన్నుంచి కదిలాడు.
   
    మరుసటిరోజు ప్రొద్దున్నే అతడు యాజీని కలుసుకుని "మీ కథని మళ్ళీ నేను వ్రాయబోతున్నాను" అని చెప్పాడు.
   
    ఊహించని విధంగా భరద్వాజ వచ్చి అలా మాట్లాడినా కూడా యాజీలో మార్పేమీ కనపడలేదు. "ఎందుకు మీ నిర్ణయం మార్చుకుంటున్నారు?" అని మాత్రం అడిగాడు.

 Previous Page Next Page