తన కంప్యూటర్ ని చూపించడం భరద్వాజకి ఇష్టం లేదు. కొన్నాళ్ళ క్రితం కీర్తికి '....రహస్య గది' అని చెప్పింది ఈ కంప్యూటర్ రూమ్ గురించే.
కానీ అతడి కంఠంలో కనబడుతూన్న అనుమానాన్ని చూసి కాదనలేక లేచి నిలబడి "దానికేముంది పదండి" అన్నాడు.
పది నిమిషాల్లో ఇద్దరూ భరద్వాజ ఆఫీసుకు చేరుకున్నారు.
కార్లోనే అతడు యాజీకి తమ కంప్యూటర్ గురించి అంతా వివరించి చెప్పాడు. అక్కడికి వెళ్ళాక తను వ్రాసిన ప్రతిలోని కథని దానికి ఫీడ్ చేయటం జరిగింది. అయిదు నిమిషాలపాటు ఈ ఫీడింగ్ జరిగాక తెరమీద రిజల్టు పడింది. IT WILL CLICK....SMASHING SUCCESS..... GO AHEAD.
'చూశారా నేను చెప్పాను' అన్నట్టూ భరద్వాజ గర్వంగా యాజీ వైపు చూశాడు. యాజీ మోహంలో మాత్రం ఎప్పటిలాగే ఏ భావమూ లేదు. తాపీగా "నేను మీ కంప్యూటర్ ని కొన్ని ప్రశ్నలు అడుగుదామని అనుకుంటున్నాను" అన్నాడు. కొద్దిగా ఆశ్చర్యపోయి, వెంటనే సర్దుకుని, "తప్పకుండా" అన్నాడు భరద్వాజ.
"మీ కంప్యూటర్ చరిత్రని కూడా చెపుతుంది కదూ?"
"సాహిత్యానికి సంబంధించిన దేన్నైనా సరే"
"ఒక హీరో..... అతడికి కానీ, అతడి కుటుంబానికిగాని అన్యాయం జరుగుతుంది. హీరో భార్యని విలన్ ఎత్తుకుపోతాడు. హీరో విలన్ ని వెతుక్కుంటూ బయలుదేరి ఎన్నో కష్టాలు పడి, చివరికి అతడిని చంపడంతో కథ సుఖాంతం అవుతుంది.....ఇలాంటి కథాంశంతో ఇప్పటివరకూ వచ్చిన గొప్ప రచన ఏది" అని అడిగాడు.
భరద్వాజకి నవ్వొచ్చింది. ఈ టైప్ లో కొన్నివేల రచనలు వచ్చాయి. ఏదీ నిలబడలేదు చరిత్రలో అయినా తన మనసులో భావాలు లోపలే దాచుకుని ఎలక్ట్రానిక్ నిపుణుడివైపు తిరిగి "పగ-కిడ్నాప్-ద్వేషం-సుఖాంతం" అంటూ మరికొన్ని సూచనలు యిచ్చాడు. నిపుణుడు చకచకా కంప్యూటర్ కి ఈ వివరాలన్నీ ఫీడ్ చేశాడు. రెండు నిమిషాలపాటూ తెర మీద రకరకాల రంగుల గీతలూ ఏర్పడి తరువాత అన్నీ క్లియర్ అయి, తెల్లటి తెరమీద ఒక పేరు వచ్చి అగింది.
"రామాయణం"
అని.
భరద్వాజకి పొలమారింది. ఉక్కిరిబిక్కిరి అయ్యాడు. యాజీ ఇదేమీ పట్టనట్టూ కంప్యూటర్ ని ఇంకో ప్రశ్న అడిగాడు.
"రొమాన్సు పదిశాతం - పగ యాభై శాతం - కరుణ అయిదుశాతం - బీభత్సం ముప్పై అయిదు శాతం"
ఈసారి కంప్యూటర్ లో వెంటనే సమాధానం చెప్పింది.
"భారతం"
12
ఆ గదిలో ఎవరూ చాలాసేపటివరకూ మాట్లాడలేదు. ముందు తేరుకున్నది భరద్వాజే.
అతడు యాజీవైపు తిరిగి "మీరెందుకు అడిగారివన్నీ" అన్నాడు.
అప్పటివరకూ స్తబ్దంగా వున్న నీరు ఒక్కసారి ఆనకట్ట తెగగానే దూకినట్టూ యాజీ బరస్ట్ అయ్యాడు.
"నా అనుభవాల లేలేత పూలని మాలగా గుచ్ఛమని పదిలంగా మీకిస్తే, దాన్ని మీరెంత చచ్చుగా, చౌకబారు రచనగా చేసి నాకిచ్చారో చెప్పటానికి! ఎంత వూహించాను మీ కలంనుంచి! మీరు చేసిందేమిటి? ఒక చావు, ఒక హత్య, అబ్బాయికీ, అమ్మాయికీ మధ్య శృంగారపు సెక్సుతో కూడిన రాత్రి తాలూకు పది పేజీల వర్ణనా.....ఇదా మీకు నేను చెప్పింది? అసలు నాదే తప్పు! అవును నాదే తప్పు! "నా భార్యా ప్రియుడు' లాంటి రచన్లను చేసే మీలాంటిరచయితలను ఈ పనికి ఎన్నుకోవటమే నేను చేసిన తప్పు. ప్రవహించే గంగాఝరి చక్కలిగిలికి పులకరించే హిమగిరిలా పాఠకలోకం ఈ రసరమ్య కవితా హేలలో డోలలూగుతుంది అనుకున్నాను. అవును. ఏ కథనైనా అద్భుతంగా, చరిత్రలో నిలబడిపోయేలా వ్రాయొచ్చు అని నా అభిప్రాయం. బహుశా నా అభిప్రాయం తప్పనీ, కంప్యూటరే కరెక్టేమో అనుకుంటే అది కూడా నా పక్షమే పలికింది. మనిషి రసాస్వాదనా, రసస్ఫూర్తీ సర్వకాల సర్వావస్థల్లోనూ ఒకటే అని రామాయణ భారతాల ఎంపిక ద్వారా తెలిపింది. తప్పు దానిది కాదు. మీది! సాహిత్యాన్ని లెక్కల్లోకి, గ్రూపుల్లోకి మార్చిన మీది. ఇంకెందుకీ రచన" అన్నాడు ఆవేశంతో అతని కంఠం వణికింది. చేతిలో కాగితాలు నలిపి చింపి వేయసాగాడు.
"ఏమిటి? ఎం చేస్తున్నారు మీరు?" అని అడిగాడు భరద్వాజ. ఆవేశంతో అతడి మొహంలోకి రక్తం జిమ్మి ఎర్రగా మారింది. అతడు ఆ స్క్రిప్టుకి ఎంతో సమయం వెచ్చించాడు. అది అలా నలిగిపోతోంటే ఆవేశంతో అరుస్తున్నాడు.
యాజీ అతడి అరుపుల్ని పట్టించుకోలేదు.
డెబ్బై అయిదు వేలిచ్చి కొనుక్కున్న స్క్రిప్టు అతడు అంటించిన మెకనైజ్డు అగ్గిపుల్ల వెలుగులో అంటుకుని చివరివరకూ కాలి మసి అవుతోంది.
* * * *
భరద్వాజ మనసు కుతకుతా ఉడుకుతూంది. రెండు రోజులపాటూ ఏ పనీ సరిగ్గా చెయ్యలేకపోయాడు. మాటిమాటికీ యాజీయే గుర్తు రాసాగేడు. అతడి జీవితకాలంలో రచయితగా ఎప్పుడూ ఇంత అవమానాన్ని పొందలేదు.
రకరకాల ఆలోచనలు చుట్టుముట్టేవి. యాజీ ఆఫీసుకు వెళ్లి అందరూ చూస్తుండగా చెక్కు అతడి మొహాన కొట్టాలనీ-వగైరా! కనీ అతడి మనసులో ఏ మూలో పెరుగుతున్న 'తనదే తప్పు' అన్న భావం అతడిని ఆ పని చెయ్యనివ్వలేదు. ఆ భావనకి నిర్దిష్టమైన రూపం లేదు.
వారం రోజులపాటూ అతడు ఏం చెయ్యాలా అని కొట్టుమిట్టులాడాడు. చివరకు యాజీకి పోస్టుద్వారా చెక్కు పంపించేసి గుడ్ బై చెప్పటమే మంచి పద్దతి అన్న నిర్ణయానికి వచ్చాడు.
అతడలా చేసేవాడే-
ఆ వారం రోజుల్లో జరిగిన ఒకటి రెండు విషయాలు అతడి మనసుని తీవ్రాలోచనకి గురిచేసిన తరువాత మరొక సంఘటన అతడి నిర్ణయాన్ని పూర్తిగా మార్చివేసి వుండకపోతే -
13
ఆఫీసుకు వెళ్ళాడేగానీ భరద్వాజ ఆలోచన్లన్నీ కీర్తి మాటలచుట్టూ తిరుగుతున్నాయి.
ఆ మరుసటిరోజే కూతురి అబార్షన్ ఏర్పాటు చెయ్యవలసి వుంది.
నర్సింగ్ హోంలో అతడు చెక్కు వ్రాస్తూ వుంటే, లేడీ డాక్టర్ "అమ్మాయి పేరుమీదే రూము వుంచమంటారా? పేరు మార్చుకుంటారా?" అని అడిగింది.
"అదేమిటి డాక్టర్, ఇది సామాన్యమైన విషయం కదా! ఇందులో రహస్యం ఏముంది?" అని అడిగాడు.
"అది మన రోజుల్లో పూర్వపు రోజుల్లో అయితే చాలా మామూలుగా గర్ల్ ఫ్రెండ్ కో, సిస్టర్ కో అబార్షన్ చేయించాలోయ్ అని చెప్పుకునేవాళ్ళం. ఈ కాలంలో చాలామంది దీన్ని చాలా సిగ్గుపడే అవమానకరమైన విషయంగా భావిస్తున్నారు."
తను రచనా వ్యాసంగంలో పడి వాస్తవిక ప్రపంచానికి ఎంత దూరంగా వుంటున్నాడో భరద్వాజకి అర్ధమైంది.
ఆ రోజు రాత్రి డైనింగ్ టేబుల్ దగ్గిర భార్యకీ కూతురికీ మరుసటి రోజు ఆస్పత్రికి వెళ్ళటం గురించి చెప్పాడు. దాని గురించి వాళ్ళు పెద్ద ఉత్సాహం చూపించకుండా, మరో సంభాషణలో మునిగిపోయారు. భరద్వాజ కొడుకు కూడా అక్కడ వున్నాడు.
కూతురి అబార్షన్ కన్నా ముఖ్యమైన చర్చ అక్కడ మరొకటి జరుగుతూంది.
ఇంటికి కంప్యూటర్ సర్వీస్ ఏర్పాటు చెయ్యాలా వద్దా అన్న చర్చ అది. అసలు విషయం ఏమిటంటే కూతురు పనిచేసే ఎలక్ట్రానిక్ కంపెనీ ఒక కొత్తరకం 'బట్లర్' ని సృష్టించింది. దాని అమ్మకాలు పెంపొందించే పథకం క్రింద తమ ఉద్యోగస్తులకి సగం ధరకే ఇస్తూంది! తెమ్మని తల్లి - వద్దని కూతురు.
"నీ ఓటు ఎవరికి నాన్నా?" కూతురు అడిగింది.
"అది కొంటే ఇంట్లో సగం పని తగ్గిపోతుంది" అన్నాడు భరద్వాజ. భర్త మాటలకి తల్లి కూతురువైపు సగర్వంగా చూసింది. కూతురు నిస్సహాయంగా అన్నవైపు తిరిగి "నువ్వు?" అంది.
భోజనం ముగించి లేస్తూ "మీరొక అనవసరమైన వ్యర్ధమైన విషయం గురించి ఇంతసేపు చర్చించుకుంటున్నారని నా వుద్దేశ్యం" అన్నాడు కొడుకు.
"అంటే" అంది తల్లి కోపంగా.
"ఎయిర్ కండిషనింగ్ చేసినట్టూ మనింటిని పూర్తిగా కంప్యూటరైజ్ చేసే ప్రసక్తే లేదు."
"ఎందుకు?"
"ఎందుకా" అంటూ అతడు విసురుగా వెనక్కి తిరిగాడు. "ఇదిగో ఇది చదువు నాన్నా! ఇందుకు" అంటూ ఒక కాయితం తండ్రికి ఇచ్చాడు. కంపెనీ వాళ్ళు ఇచ్చిన అడ్వర్ టైజ్ మెంట్ తాలూకు కాగితం అది.