Previous Page Next Page 
ఇట్లు....నీ చిలక పేజి 14

    చీరా జాకెట్టు కలిసి కుట్రపన్ని కొంతభాగాన్ని అతనికిచ్చేసినట్టు వీపు పై భాగాన్ని తుడుముకున్నాడు ఓ చేత్తో.

    ఏదో మత్తు కొన్ని అవయవాల్లో గూడుకట్టుకున్నట్లు భారంగా తోస్తోంది ఇందుమతికి.

    కొత్త రుచులకోసం శరీరం యాగీచేస్తున్నట్టు ఎగిరెగిరి పడుతోంది.

    అతని ఎడమచేయి మరింత కిందకు దిగుతుంటే కుడిచేయి ఆమె ఎద అందాలకి స్వేచ్ఛను కల్పించడానికి ప్రయత్నిస్తున్నాయి.

    మరి కాసేపు అలానే వుంటే ఏం జరుగుతుందో చప్పున స్ఫురణకు వచ్చింది.

    భయంలాంటిది శరీరం మీద పులిలా దూకితే జింకపిల్లలా అందంగా గెంతుతున్న శృంగారం పారిపోయింది. వాస్తవం కళ్ళల్లో పేరుకున్న కోరికపై దోసెడు నీళ్ళను కుమ్మరించింది. మనసు మేల్కొని జాగ్రత్తలు చెప్పింది.

    ఆమె ఒక్క ఉదుటున అతని నుంచి విడిపోయింది.

    "అందనవే కాదు అందినట్టే అంది అందని ద్రాక్షపళ్ళే పుల్లన" అన్నాడు ఆమె వైపు నిష్టూరంగా చూస్తూ.

    "ఈ సామెత తప్పు! అందని ద్రాక్షపళ్లే తీయన" అని సవరించింది.

    "ఎందుకలా తోసేశావ్?" అతను చిన్నబుచ్చుకుంటూ అడిగాడు.

    "మరి-- నువ్వు అడిగినవన్నీ ఇప్పుడే ఇచ్చేస్తే మొదటి రాత్రికి ఏం మిగులుతుంది?"

    "అదికాదు నీ భయం"

    "మరేది?"

    "ఇది -- ఆ సమస్య లేకుండా వుండడానికి సాయంకాలం నెల్లూరు నుంచి తెప్పించాను." అని చొక్కా జేబులోంచి తీసి గుప్పెట్లో దాచాడు.

    "ఏమిటది?" దాన్ని చూడడానికి ఆమె బలవంతంగా అతని గుప్పెట తెరిచింది.

    పసుపురంగులోని ఎర్రటి త్రికోణం మసక వెలుతుర్లో చేమంతిపూల మధ్యన పొరబాటుగ వచ్చిన కనకాంబరపు పూవులా వుంది.

    అదేమిటో ఆమెకి తెలిసింది.

    'ఛీఛీ'

    "ఇది కన్నెపిల్లల భయాన్ని పోగెట్టే మంత్రం. ఛీఛీ అనకు - శెహభాష్ అను"

    "ముందు ఇక్కణ్ణుంచి వెళ్ళు భరణీ" కాస్తంత కోపాన్ని బుజ్జగింపులో కూరినట్టు చెప్పింది.

    "అంతేనా?"

    అంతే-" అని తలుపు వేసేసింది ఇందుమతి.

    ఇదంతా చూసి చిక్కటి చీకటి ఫక్కుమని నవ్వుతున్నట్టు దూరంగా వున్న వీధి దీపం వెలుగుతూ ఆరుతూ వుంది.

    అతను నిరుత్సాహంతో శరీరాన్ని లాక్కెళుతున్నట్లు అక్కణ్ణుంచి కదిలాడు.

    ఆ సంఘటనంతా కళ్ళముందు కదిలి చిరునవ్వు పెదవులమీద మెదిలింది ఇందుమతికి.

    "చలిలో ఎందుకు పడుకున్నావే - జలుబు చేయదూ" ఇంట్లోంచి అరుస్తోంది అనసూయమ్మ.

    "ఓ పది నిముషాలు - వచ్చేస్తాలే" అంది అదే పిచ్ లో ఇందుమతి విసుగ్గా.

    అమ్మమ్మని అలా విసుక్కోడం తప్పని అనిపించింది ఆమెకి. కానీ ప్రతిసారీ బాధపడుతుందేగానీ విసుక్కోవడం మాత్రం మానదు. బహుశా మా ఇద్దరి 'ఏజ్ గేప్ ని' విసుగే కాబోలు కలుపుతున్నది అని అప్పుడప్పుడు అనుకుంటూ వుంటుంది ఇందుమతి.

    అమ్మమ్మకి తనంటే పంచప్రాణాలు. రేపు ఏదో ఒక సమయంలో తను లేచిపోయిన సంగతి తెలుస్తుంది. అమ్మమ్మ రియాక్షన్ ఎంత దీనంగా వుంటుందో ఆలోచించడానిక్కూడా మనసు ఒప్పుకోవడం లేదు.

    తను కనబడడంలేదని ఏ అర్ధరాత్రో ఊరంతా ఉలిక్కిపడి లేస్తుంది. అమ్మమ్మ కూడా ఊరుతోపాటే బలవంతంగా పడకమీద నుంచి దిగుతుంది. ఏమైందో తెలుసుకోవడానికి అమ్మ కోసం, తన కోసం చూస్తుంది.

    అప్పటికే తను ఈ ఊరొదిలి, ఈ కుళ్ళు మనుషుల్ని వదిలి వసంతం చిటికెనవేలు పట్టుకుని వెళుతున్న గ్రీష్మంలా భరణితో కలిసి నడుస్తుంటుంది. అందువల్ల తను వుండదు.

    ఎక్కడికెళ్ళానో వెదకడానికి అమ్మ రామదాసు లాంటివాళ్ళ సహాయం అడగటానికి వెళ్ళుంటుంది.

    దాంతో అమ్మమ్మ బయటికి వస్తుంది. చలి శరీరంలో మిగిలిన ఆ నాలుగు ఎముకుల్ని కొరికి తినేస్తుంటుంది. అయినా తప్పదనిపించి నడుచుకుంటా గుడి దగ్గరకి వస్తుంది. జనం గుంపులు గుంపులుగా కబుర్లను కదంబం మాలగా గుచ్చుతున్న తీరులో నిలబడి మాట్లాడుకుంటూ వుంటారు.

 Previous Page Next Page