Previous Page Next Page 
మనసు పొరల్లో పేజి 14

 

    "టేక్ .........కేర్.......ఆఫ్........యువర్ సెల్ఫ్" అంది కౌసల్యని కౌగాలించుకుంటూ భార్గవి.
    "ఓ హాప్ టూ సి......యూ అగైన్" అంది చెయ్యూపుతూ మైధిలి కళ్ళు వర్షిస్తుంటే , హృదయం బద్దలయ్యేలా బరువెక్కి ఊగిపోతూ వుంటే ఈ జన్మకివే ఆఖరి చూపులా? మీరు మళ్ళీ నన్ను చూడ్డానికి రారు కదా?
    ఒకవేళ నేను చచ్చిపోతే పానకాలు మీద మీకెంత అసహ్యం వున్నా కోపం ఉన్న అన్నీ మర్చిపోయి కనీసం నా శవాన్ని చూడ్డానికి రండి. మీరు రాల్చే ఆ కన్నీటి బొట్లు, నా ఒంటి మీద పడకపోతే నా ఆవేదన చల్లారదు. నాకు మనశ్శాంతి వుండదు.' అంది రాధికని పట్టుకుని కౌగలించుకుని వెక్కి వెక్కి ఏడుస్తూ కౌసల్య.
    "కౌసల్య ఏమిటా పిచ్చి మాటలు? నీ ఇష్టం లేకపోతే అతడితో సంసారం చెయ్యడం మానెయ్యి! విడాకులిచ్చేసేయ్! అంతేకానీ ఏమిటా పిచ్చి పిచ్చి ఆలోచనలు? కౌసల్యా! చదువుకున్నదానివి నువ్వే ఇలా మాట్లాడితే ఎలా? సమస్యకి పరిష్కారం చావు కాదు. తెలివిగా సమస్యలో నుంచి బయటపడి, జీవితాన్ని దిద్దుకోవాలి. అంతేకానీ చదువు లేనిదానిలాగా పాత కాలపు మనిషిలాగా ఏమిటీ మాటలు? విడాకులిచ్చేయ్! ఏమ్ .ఏ పూర్తీ చెయ్యి! నీ కాళ్ళ మీద నువ్వు నిలబడు! ఈ పెళ్ళి , గిళ్ళీ అంతా ఒక పీడకల అనుకో! కొత్త జీవితం ఆలోచించుకో. అంతే కానీ చావూ గీవూ అనేది అవివేకులూ, బలహీనులూ చేసేపని! ఏదీ నాకు మాటివ్వూ ఇంకెప్పుడూ ఇలా అలోచించనూ, ఇలా మాట్లాడనూ అని!" అంటూ చేతిలో చెయ్యి వేయించుకుంది రాధిక.
    అందరి మనస్సులో ఆవేదన! అందరి గుండాల్లో ఆరాటం! ఎంత చక్కగా గడుపుదామని వచ్చారో అంత బాధని మూట గట్టుకు పోయారు. రాధికా, భార్గవి, మైధిలి, వీణా , ఎంత సాంబరపడిపోయిందో స్నేహితులను చూసి కౌసల్య. అంత కుంగిపోయింది వారు వెళ్ళిపోతూ ఉంటే.
    ఒదలలేక ఒదలలేక వీడ్కోలు చెప్పి వెళ్ళిపోయారు స్నేహితులు అందరూ.
    ఇల్లంతా నిశ్శబ్దం !
    మనసు నిండా చీకటి!
    మంచం మీద కెళ్ళి దిండులో తలదాచుకుని వెక్కి వెక్కి ఏడ్చింది కౌసల్య.
    గంటల కొద్ద్రీ ఏడవడం వల్లా, మనసు నిండా బాధ చీకటిలా అలుముకోవడం వల్లా, జ్వరం వొచ్చినట్టయింది కౌసల్యకి. తల బద్దలైపోతూ ఉంటే అతి కష్టం మీద లేచి వెళ్ళి కాఫీ కలుపుకుని తాగింది. తల తిరుగుతున్నట్టుగా ఉంటే వెళ్ళి మంచం మీద పడుకుంది. చీకటి పడుతున్న సమయానికి మెల్లగా చేతులుపు కుంటూ వొచ్చాడు పానకాలు. "ఏమే పడుకున్నావు? జ్వరం వొచ్చిందా?" అడిగాడు అతి సాధారణంగా. ఆ అడగడంలో ఆప్యాయత  లేదు! అభిమానం లేదు! ఆదరణ అంతకంటే లేదు! ఒక రకమైన వ్యంగ్యం ఉంది! కౌసల్య మాట్లాడలేదు.
    "ఏయ్ నిన్నే......" అంటూ దగ్గరికొచ్చాడు.
    కౌసల్య అతనికి దూరంగా జరిగి మరోవైపు తిరిగి పడుకుంది.
    "ఓ.....అలక పాన్పు వేశావా?" అన్నాడు బుగ్గ మీద గిచ్చుతూ.
    ప్రేమతో బుగ్గ గిచ్చితే ఆ నొప్పి కూడా ఎంతో ఆనందంగా అనిపిస్తుంది. హాయిగా అనిపిస్తుంది. దాన్ని 'స్వీట్ పెయిన్' అనొచ్చు. కానీ ఇలా హేళనగా గిచ్చేతే నొప్పికి అసహ్యం జోడింపై , మరీ బాధనిపిస్తుంది.
    'అమ్మా!" అంది మూలుగులాగా.
    "లే!,,నాకు కాఫీ కావాలి. అన్నాడు పానకాలు. ఆ గొంతులో అభ్యర్ధన లేదు. అజ్ఞాపిస్తున్నట్టుగా ఉంది. వెంటనే లేవలేకపోయింది కాస్సేపాగి తప్పదన్నట్టు లేచి కాఫీ చేసి ఇచ్చింది. "మరీ ఇంత తియ్యగా తగలేశావెం కాఫీ? చెయ్యడం ఇష్టం లేకపోతే మానెయ్యి. నీ మొహం ఈడ్చా! ఇంత తియ్యగా ఎవరైనా తాగుతారా?" అంటూ తాగగా కప్పులో కాస్త మిగిలిన కాఫీని ఆమె మొహాన పోశాడు పానకాలు.
    కౌసల్యకి ఒళ్ళు మండిపోయింది. కాఫీ మొహం మీదా, బట్టల మీదా పడి మరకలు కట్టింది. శరీరం చిల్లులు పడి , నరాలు చిట్లిపోతున్నంత బాధ కలిగింది. కోపంతో కళ్ళు చింత నిప్పులయ్యాయి.
    "ఎంగిలి కాఫీ మొహాన పొయ్యడానికి మీకు సిగ్గు లేదూ?" అక్షర అక్షరం నొక్కి నొక్కి అంది, అనుకోని ఆ చర్యకి ఉలిక్కిపడ్డ కౌసల్య కోపంతో ఉరుముతూ అతని కేసి చూసి!
    సినిమా డైలాగులాగా "కోపంలో కూడా నీ రూపం ఎంత బాగుందో!" అంటూ దగ్గరకు వెళ్ళిన పానకాలుని ఒక్క తోపుతోసి దూరంగా జరిగి వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళి బేసిన్ దగ్గర సబ్బుతో మొహం కడుక్కు వొచ్చింది కౌసల్య. ఎప్పుడొచ్చాడో వెనక నుంచోచ్చి గట్టిగా పెనవేసుకుని, బుగ్గని గట్టిగా కోరికేశాడు పానకాలు. అతని చేతుల్లోంచి విడిపించుకోవడానికి పెనుగులాడింది కౌసల్య. ఆ పెనుగులాటలో డైనింగ్ టేబుల్ కొన కడుపులో గుచ్చుకుంది. బాధతో మెలికలు తిరుగుతూ కుర్చీలో కూర్చుండిపోయింది. కళ్ళ నుండి నీళ్ళు ప్రవాహంలా కారాయి.
    "కౌసల్యా! నీ తెల్లటి బుగ్గ మీద, నీలంగా ఎలా ముద్రపడిందో చూడు. అదీ ముద్దంటే! అలా ఉండాలి. కౌసల్యా! ఆ మచ్చ ఎలా ఉందొ తెలుసా? చందమామలో ఉన్న మచ్చ లాగా ఉంది. వెళ్ళి అద్దం చూసుకో! నీ బుగ్గకి పెద్ద దిష్టి చుక్క లాగా ఉంది" అంటూ నవ్వాడు పానకాలు. కడుపుకి తగిలిన దెబ్బ నొప్పికన్నా , బుగ్గ మీద కొరకడం వల్ల కలిగే మంట కన్నా,గుండెలో రగిలే జ్వాలలు ఆమెని దహించేస్తున్నాయి. మతి భ్రమణం కలిగిన దానిలా "యూ .....ఆర్ ...ఎ.....బ్రూట్!" అంటూ అరిచింది భూమి దద్దరిల్లేలా.
    'అవును నేను బ్రూట్ నే! అయితే బ్రూట్ ని పెళ్ళాడిన నువ్వూ ఒక బ్రూట్ వే!" అంటూ ఆమె కేసి చూసి నవ్వుతూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. తన బాధతో అతని కేమాత్రం నిమిత్తం లేనట్టు నవ్వుతూ అతనలా వెళ్ళిపోవడం కోసల్య ఆగ్రహాన్ని రెట్టింపు చేసింది. అతని మీద అసహ్యం వంద రెట్లు పెరిగింది. కన్నీళ్ళు ధారగా చెంపల మీదుగా కారి, చీరని తడిపేశాయి. ఆవేశం బుసలు కొట్టి, రోషం పడగ విప్పిన పాములా పైకొచ్చింది. అతని మొహం ఈ జన్మలో చూడ కూడదనుకుంది.
    స్నేహితులు మాటలు గుర్తుకొచ్చాయ్. 'చస్తాననుకోవడమేమిటే ఫూలిష్ గా! కలిసి కాపురం చెయ్యడం ఇష్టం లేకపోతే విడాకులిచ్చేసేయ్' అని! వెంటనే కళ్ళు తుడుచుకుని బాత్ రూంలో కెళ్ళి మొహం కడుక్కుని, బట్టలు మార్చుకుని గబాగబా బట్టలన్నీ సూట్ కేస్ లోకి సర్దేసింది. బొట్టు పెట్టుకుందామని అద్దంలో మొహం చూసుకుంది. బుగ్గ మీద నల్లగా కమిలిపోయిన మచ్చ మళ్ళీ జరిగినదంతా గుర్తు చేసింది. కళ్ళల్లో సుళ్ళు తిరుగుతున్న కన్నీళ్లను , చేతి రుమాలుకోసలతో నెమ్మదిగా తుడిచేసింది. దాచాలని ఎంత కాటుక పెట్టుకున్నా, ఏడ్చి ఏడ్చి ఎర్రబడ్డ కళ్ళు ఎర్రగా మందార మొగ్గల్లా ఉన్నాయి.

 Previous Page Next Page