"అసలెందుకు తెచ్చుకుందిటా అంత చాతకానిది?" అన్నాడు మాధవరావు. జానకి మనసులో ఆలోచన రూపం ఏర్పరచుకుంది క్షణాల్లో.
"అదే నేనూ అన్నాను.....నీకు ఒక పిల్లాడున్నాడు. పైగా- ఇప్పుడు నువ్వు గర్భవతివి కూడా..! పిల్లల తల్లివై యుండి, ఇంకో పిల్లని పెంచాలనుకోవడమే పొరపాటు అన్నాను."
"బాగా చెప్పావు - బుద్దివచ్చి వుంటుంది"
"అవునండీ - ఏదో గొప్ప ఘనకార్యం చేస్తున్నట్టు నాటకం ఆడింది!" అంది జానకి.
మాధవరావు ఫక్కున నవ్వాడు, జానకికి అర్ధం కాలేదు.
"ఆ పిల్లని మనం తెచ్చుకు పెంచుకుందామా?" -మాధవరావు ఆ మాట అనగానే వేయి దీపాలు వెలిగాయి జానకి ముఖంలో.
"అంతకన్నా నాకదృష్టముందా?" అంది భర్త భుజంపై వాలుతూ.
మళ్ళీ నవ్వాడు మాధవరావు. ఈమాటు ఎందుకు నవ్వాడో అర్ధం కాలేదు జానకికి.
కారు తిన్నగా ఇంటిముందు ఆగింది.
మాధవరావు కారు పోర్టికోలో పెట్టి మేడమీదికెళ్ళాడు.
పిట్టగోడ నానుకుని నిలబడ్డాడు... తనెందుకంత మొండిగా వుంటున్నాడూ?... అని వితర్కించుకున్నాడు. తనని అందరూ హెచ్చరిస్తున్నారు. 'ఓ పిల్లనో, పిల్లాడినో పెంచుకో - పెద్దాళ్ళయ్యాక మిమ్మల్ని ఎవరు చూస్తారూ?' అని!
"ఆ... వృద్దాశ్రమాలు లేవా?" అన్నాడొకసారి.
"మరొకసారి ఒక పుణ్యకార్యం చేసినట్టు కాదా?" అన్నారు.
"ఆ... పుణ్యం, పాపం అనేవి నమ్మను నేను" అన్నాడు.
కానీ, అతని కళ్ళముందు జానకి నిలిచినట్టే అనిపించింది. తనని నమ్మి ఇంట్లోంచి వచ్చేసింది. అవును, ఆమెని తనేమైనా మోసం చేసాడా- ఆ పెంకుటింట్లో గడిపిన జానకి ఇవాళ ఎలా, ఎంత వైభవంగా జీవిస్తోందీ! -ఆమె మాటను, ఆమె ఇష్టాన్ని తనేనాడూ కాదనలేదు. కానీ, ఈ పెంచుకోడాలూ తనకి నచ్చవు. పిల్లలు లేని వాళ్ళు లోకంలో లేరా!
అయినా- ఆరోజు మాధవరావు ఆలోచనలన్నీ జానకివైపే మరలాయి. పోన్లే, ఆడవాళ్ళకి మాతృత్వం కన్నా గొప్పదేదీ - ఆమె దురదృష్టం... అది ఆమెకి లేదు. పోనీ, ఓ పసిపాపకి తన ఒడిలో చోటిస్తానంటే, వద్దని ఆమె మనసుని బాధిస్తున్నాడు తను. మాధవరావుకి ఆ నిమిషం అనిపించింది. సరే రానీ చూద్దాం -
మాధవరావు గబగబా మేడ దిగాడు... జానకి మౌనంగా వుంది, ఏం చెప్తుంది తను రాజీవ్ కి - అక్కడ ఎంతో ఉత్సాహంగా మాట్లాడింది. ఇప్పుడు నీరసించిపోతే ఎలా అయినా భర్తని మళ్ళీ ఒప్పించే ప్రయత్నం చేయాలంటే - ఆ పసిగుడ్డును ఇంట్లోకి తేవాలంతే!!
జానకి గుమ్మంలోకి చూస్తోంది. మేడమీదినుంచి మాధవరావు కిందకి దిగటం చూడకపోలేదు. ఎందుకో మనసు చాలా చిరాగ్గా వుంది...
దగ్గరగా వచ్చి నిలబడ్డ మాధవరావుని చూసి ఒక్కసారి ఉలిక్కిపడింది.
"అదేమిటీ..?" అన్నాడు వెంటనే.
"ఏమిటో..!" అంది జానకి నెమ్మదిగా.
ఇద్దరూ పడగ్గదిలోకి నడిచారు.
"కూచో..." అన్నాడు మాధవరావు.
"నీవు నమ్మలేనిమాట చెప్తున్నా!" అన్నాడు జానకి కళ్ళలోకి చూస్తూ.
"ఏముందీ మన టెండరు ఓపెన్ అయింది - అంతేనా?"
"కాదు"
"ఆ బిల్డింగ్ కాంట్రాక్టు మీకీ వచ్చింది - అంతేనా?"
"కాదు"
"మీ ముద్దుల చెల్లెలు అమెరికానుంచి వస్తోంది - అంతేనా?"
"కాదు"
"నాకు తెలియదు, నన్ను విసిగించకండీ ప్లీజ్!" అంది జానకి అటుతిరిగి పడుకుంటూ.
మాధవరావు ఆమెని గుండెలకి హత్తుకుంటూ, "నీ కోరిక తీరింది" అన్నాడు రహస్యంగా చెవిలో.
"అంటే..?"
"అంటే- నీ ఒడిలో పసిపాప!"
మాధవరావు మాటలు ఉక్కిరిబిక్కిరి చేసాయి జానకిని. తన భర్త మనసు మరిపోయిందా, తనమీద ప్రేమ పొంగిపొర్లిందా, తన మీద జాలి వర్షించిందా- ఏదన్నా కానీ.... తన కలలు ఫిలించాయి యిన్నాళ్ళకి! "అమ్మా...." అని పిలిచే ఓ పసిగుడ్డు తనింటికొస్తోంది.
జానకి గబగబా కేలండర్ తెచ్చింది..... మాధవరావు ఫక్కున నవ్వాడు.
"మంచి రోజు చూసుకోవద్దూ..... రేపు బావుంది దశమి, బుధవారం!" అంది ఎంతో ఉత్సాహంతో జానకి.
"నీ యిష్టం....ఎప్పుడెళ్ళి తెచ్చుకుంటావో తెచ్చుకో!" అన్నాడు.
ఆ మాటకి జానకి మనసుపై పన్నీరు జల్లినట్లే అయింది. 'ఎప్పుడెప్పుడు తెల్లారుతుందా...' అనుకుంటూ ఆ మెత్తని పరుపుపై అటు ఇటు ఒత్తిగిల్లింది జానకి. మాధవరావు గుర్రుపెట్టి నిద్రపోతున్నాడు.
తెల్లారింది.
సూర్యకిరణాలు కిటికీలోంచి పడుతున్నాయి. పనిమనిషి రాములమ్మ వచ్చి గుమ్మంలో ముగ్గేసింది.
జానకి నిద్ర లేవలేదు. మాధవరావు లేచి స్నానం చేశాడు. వంట మనిషి టిఫిన్ పెట్టాడు. తిని లేచాడు మాధవరావు. జానకి లేవలేదు.
"లే, ఏమిటా మొద్దు నిద్ర - టైము చూడు ఎంతయిందో!" అన్నాడు జానకితో మాధవరావు.
"నేను లేచి రెండు గంటలయింది - ఇలా కూచోండి. మీరు మనస్ఫూర్తిగా అంటున్నారా పిల్లని తెచ్చుకోమని! మరొక్కసారి చెప్పండి" అంది ఎంతో ఆవేదనతో.
"అంటే, నా కర్ధంకావటం లేదు. అవును.... మళ్ళీ చెప్తున్నా పిల్లని రాజీవ్ ఇంటి నుంచి తెచ్చుకో" చిరాగ్గా ముఖంపెట్టి టై సరిచేసుకున్నాడు.
మాధవరావు కారు స్టార్ట్ చేసాడు. జానకి లేచి బయటకొచ్చింది. కదలిపోతున్న కారుకేసి చూస్తూ నిలుచుంది.
గడియారం గంటలు కొట్టింది.....గబగబా తయారయింది.....
"హలో రాజీవ్, నేనే, వస్తున్నా"-
"ఏమిటి జానకీ..... రెండు రోజులన్నావుగా!"
"ఈరోజు బావుంది" జానకి ఫోన్ పెట్టేసింది.
రాజీవ్ చేతులొణికాయి- పసిదానికి పాలసీసా నోటికందిస్తుంటే...! దాని చిన్న బుట్ట. దాని బొమ్మల బాగ్, గౌన్ల బాగ్ పక్కన పెట్టాడు.
జానకి లోపలికి రాగానే గబుక్కున పిల్లనెత్తుకుంది.
"మీ వారేరీ...!" అన్నాడు రాజీవ్.
"ఆయన పనిమీద వెళ్ళిపోయారు. మీకెందుకు భయం- ఆయన అంగీకారంతోనే తీసుకెడుతున్నా. పైగా....మావారు అన్నారు-ఇదే ఏ అనాధాశ్రమంనుంచో అయితే ఎంతో తతంగం వుండేది- ఇప్పుడయితే మీ ఫ్రెండ్ రాజీవ్ దగ్గర్నుంచి తెచ్చుకుంటున్నావు కదా అని..! రాజీవ్- మావారు ఏమీ అనుకోరు- నీ పిల్లని నేను పెంచుకున్నాననుకో - దాన్ని పువ్వుల్లో పెట్టి పెంచుతా - కాలుకింద పెట్టనీయకుండా కార్లలో తిప్పుతా - చూస్తావుగా దాని భాగ్యం ఏమిటో!" - అంది గలగలా జానకి.
దీర్ఘంగా నిట్టూర్చాడు రాజీవ్. "జానకీ... ఒక్కమాట విను. నా భార్య సుమతి మనసు మారుతుందనే నా నమ్మకం! ఎన్నేళ్ళన్నా కానీ, ఇప్పుడు వీణ దగ్గర నుంచి తెచ్చేసినట్టే, నీ దగ్గర నుంచీ తెచ్చేసుకుంటా- అది మరచిపోకు-" అన్నాడు గంభీరంగా.
"అలాగే అలాగే..!" అంటూ గబగబా కార్లో కూచింది జానకి మమతతో. ఇంకా కాసేపుంటే రాజీవ్ మనసు మారిపోవచ్చనే భయంతో!
వీధి గుమ్మం పక్కన ఎవరో కదిలినట్లనిపించింది రాజీవ్ కి ఆ క్షణంలో...
"ఎవరూ..?" అన్నాడు. గబగబా ఓ ఆకారం పక్కసందులో కెళ్ళిపోయింది.
"బిచ్చానికి సమయం, సందర్భం లేదులా వుంది" అనుకుంటూ తలుపేసి లోపలకొచ్చాడు రాజీవ్.
* * *
చంద్రయ్యని చూడగానే లీల ఏడుపు కట్టలు తెంచుకుంది....
"బాబాయ్, 'నా పిల్లని ఎవరో కార్లో ఎత్తుకుపోయారు" అంది వెక్కివెక్కి ఏడుస్తూ.
చంద్రయ్య ఆ మాటలేవీ పట్టించుకోలేదు. ప్రస్తుతం అతని ఆలోచనంతా తులసమ్మ ఆరోగ్యంపైనే. పదిహేను రోజులుగా జ్వరం! ఏదో దగ్గర డాక్టరుకి చూపించుకుంటోంది తులసమ్మ.
ఈ తులసమ్మ మంచాన పడితే చూసేందుకు దిక్కు ఈ లీల వుంది- కానీ, ఆ ఇల్లు అమ్మేస్తానంది. కొంత డబ్బు లీలపేర బాంక్ లో వేయాలంది. సుధాకర్ కి తక్కింది యియ్యాలంది. ఆవిడ చెప్పినట్టు అన్నీ జరగక్కర్లేదు-కానీ, ముందు ఇల్లు ఆమెకి తెలిసున్న వాళ్ళకి ఎంత తొందరగా అమ్మగలిగితే అంత మంచిది! -ఇదే చంద్రయ్య హడావిడి, ఆలోచనా!
"తులసమ్మా, ఇలా మంచానికి అతుక్కుపోయావు. ఏదో వైద్యం అంటే ఎలాగ, లే...నిన్ను ఈ దగ్గర్లో నర్సింగ్ హోమ్ లో చేర్పిస్తా - అక్కడ మంచి ఆడ డాక్టరమ్మవుంది... హస్తవాసి మంచిది. ఒక్కరోజులో లేచి కూచుంటావు" అన్నాడు.