రవి ఒక్క క్షణమాలోచించాడు....
ఈ పిల్ల ఎవరు, ఎక్కడ నుంచి తెచ్చారు మొదలైన ప్రశ్నలన్నీ అందరూ అడుగుతూనే వుంటారు కనుక - అది ఒక నిజం!
ఇంకోటి- వీణకి మాత్రం ఎందుకింత బరువు? సుమతి వద్దని వదిలించుకున్న బరువు తన భార్య నెత్తిన వేసుకోవటం దేనికీ? - ఆ రోజు ఆ ఆవేశంలో, ఆ నిస్సహాయ స్థితిలో వున్న రాజీవ్ పై ప్రేమతో, గౌరవంతో తను అంగీకరించాడు. ఇప్పుడు మంచి అవకాశం యిది- రాజీవ్ పిల్లని తీసుకెళ్ళి ఎవరికిస్తే తనకేం? - వీణకి తను నచ్చచెప్పగలడు- ఈ పిల్లని రాజీవ్ కి అప్పగించేయడమే తమకి క్షేమం.
రవిలో వున్న నిజమైన వ్యక్తి బయటకొచ్చాడిప్పుడు-
... కులం, గోత్రం తెలియని పిల్ల నా కొద్దని అతని భార్య వదిలేస్తే తను తెచ్చి పెంచుకోవటమేమిటీ- తనకీ వద్దు. ఎందుకో ... రవికి రాజీవ్, సుమతిలపై అనుకోకుండా కోపం వచ్చింది - రాజీవ్ భార్యకి అంత స్వార్ధమైతే, తన భార్యకెందుకూ అంత సేవాధర్మం వీణేమీ గొడ్రాలు కాదు- అన్నీ మన మంచికే అని తన మనసులో అట్టడుగున దాగున్న భావం పొంగుకొచ్చింది బయటికి.
"సరే, రేపొచ్చి తీసుకెళ్ళు, రేపు సాయంత్రం మేము రైలుకి వెళ్ళి పోతున్నాం కదా!" అన్నాడు గంభీరంగా.
రాజీవ్ ఆ రాత్రి ఇంటికి వెళ్ళి విశ్రాంతిగా నిద్రపోయాడు.
ఆ రాత్రి రవి తీసుకున్న నిర్ణయానికి వీణ వెక్కి వెక్కి ఏడ్చింది.
వీణ ఏడుపు గమనించాడు రవి, ఓ అరగంట దాటింది.
"ఇవాళ మీ అన్నయ్య పిల్లనిచ్చేయమన్నాడని బాధ పడుతున్నావే కానీ, మీ అన్నయ్య ఆ జానకి మాటలు నమ్మి పిల్లని తీసుకెడుతున్నందుకు తర్వాత బాధపడాలి. ఆ జానకి భర్త వద్దంటున్నాడు పెంపకానికి..! లేని బంధాలు పెంచుకోవద్దని అతని సిద్దాంతం. అది తప్పుకాదు. మీ వదిన తీసుకున్న నిర్ణయమే ఒకవిధంగా మంచిది. నిజమే- ఎందుకీ బంధాలు? మనకున్నవి చాలవా - లే - మనసు పాడు చేసుకోకు" బుజ్జగించాడు భార్యని రవి.
"రేపు జానకి తీసికెళ్ళనంటే, సుమతి లోపాలకి రానివ్వనంటే ఆ పసిదాని బతుకు ఏమవుతుందీ, అంతేకాదు- దాన్ని ఏ పనిమనిషిగానో, పడుపుగత్తెగానో చూసి భరించగలమా? - మానవత్వం వుండద్దా..?"
వీణ కళ్ళనిండా నీళ్ళు.
"వీణా మరచిపో, ఈ పిల్ల మీ అన్నయ్య తీసికెడతాడు. నీ బాధ్యత నుంచి నిన్ను విడుదల చేస్తున్నానంటున్నాడుగా! చెల్లెలిగా నీ మీద ప్రేమతోనే చెప్తున్నాడుగా.... ఈమాట- తరవాత ఆ పిల్ల ఎక్కడ పెరగాలని భగవంతుడు రాస్తే అక్కడ పెరుగుతుంది"
రవికి కూడా నిజానికి ఆ అనాధ పిల్లని వదిలించుకోవాలనే మనసులో వుంది. అనుకోని ఈ అవకాశం జారవిడుచుకోదలచుకోలేదు. -అవును, ఎవరి పిల్లనో పెంచే బాధ్యత మనకేమిటీ..? అనిమనసుకి నచ్చచెప్పుకున్నాడు రవి. అదే ధోరణిలో భార్య మనుసును ఒప్పించాడు చివరకి.
* * *
ఇంటికొచ్చేశాక అంది లీల- "ఆ ఇంట్లో కనిపించాడే... ఆయనే ఆరోజున ఇంట్లోకి వెడుతుంటే చూసాను" అని.
"అంటే..?"
"అదే... ఆయనే నా పిల్లని దాచివుంటాడు. పోనీ.... ఆవిడ నీకు తెలుసనుకుంటున్నావుగా, మళ్ళీ రెండు రోజులాగి వెడదామా?" అంది లీల.
చటుక్కున తులసమ్మకి ఆనాటి విషయం గుర్తొచ్చింది. నిజమే... ఆరోజు సుమతి వచ్చి ఏడ్చింది. వరదలొచ్చినపుడు గుమ్మంలో పడుకోపెట్టిన పిల్లని భర్త ఇంట్లోనే తనని పాలిచ్చి పెంచమన్నాడని చెప్పుకు ఏడ్చింది. అదీ ఇదీ ఒకటేగా... తులసమ్మ ముఖంలో చిరునవ్వు తాండవించింది.
"లీలమ్మా-నువ్వు ఏడుపు ఆపు. ఏ సమస్య సాధించటానికైనా ఆనందం, ఆలోచన ముఖ్యం - ఏడుపు కాదు" అంది.
"నీ పిల్లని నీకిప్పిస్తాగా!" అంది ధైర్యంగా.
లీల ముఖంలో వంద చందమామలు ఒక్కసారి వెలిగాయి. గబగబా లోపలకెళ్ళి ముఖం కడుక్కుంది. తల దువ్వుకుంది. పొడుగాటి జడ అందంగా అల్లుకుంది.
"నిజంగా పిన్నీ, నువ్వు చెప్పింది నిజం- ఏడుపుతో ఏం చేయగలుగుతున్నానూ? ఇక నించి ఏడవను, నవ్వుతోనే సాధిస్తా. నువ్వే అమ్మవి, నువ్వే తల్లివి, తండ్రివి, గురుడవు నీవే- మరిచిపోయాను పిన్నీ!" అంది లీల నవ్వుతూ.
ఎంతకాలమైందో లీల నవ్వి! తులసమ్మకి ఎంతో సంతోషంగా వుంది ఆ సాయంత్రం.
తులసమ్మ గట్టిగా నిశ్చయించుకుంది - ఎలాగైనా సుమతిని నాలుగు రోజుల్లో వెళ్ళి కలవాలని. ఆ పిల్లని ఎక్కడ దాచారో చెప్పించాలి. పిల్లని, తల్లిని ఏకం చేయాలి....సుమతి తనని 'పిన్నీ....' అని ఆప్యాయంగా పిలుస్తుంది. లీల కచ్చితంగా చెప్తోంది- ఈ ఇంటి గుమ్మంలోనే వదిలానని..... ఆ విషయం తెలిసి తను ఊరుకుంటే పాపం రాదూ?! పిల్లని ఇవ్వకపోతే పోలీసులకి చెప్పి, ఆ సుమతి భర్తని నాలుగు తన్నించైనా తీసుకొస్తా - అంతెందుకు..... చంద్రయ్యకి ఒక్క మాట చెప్తే చాలు- గట్టి ప్రయత్నం చేయగలడు.
ఎవరో తాపులు తడుతున్నారు... లీల గబగబా లేచి తలుపు తీసింది.
"నీకు నూరేళ్ళు చంద్రయ్యా..!" అంది తులసమ్మ.
"అబ్బ ఇంత దీవెనే!" అన్నాడు చంద్రయ్య లోపలికొస్తూ.
"ఇదిగోనమ్మా. నీ డబ్బు! -నాకు రావలసిన బాకీలు వసూలయ్యాయి. అందుకే ముందు నీకు కొంత యిచ్చేసి..." నసిగాడు చంద్రయ్య.
"అంతా యిచ్చేయి" అంది తులసమ్మ.
"రెండు నెలలాగు" అన్నాడు.
తులసమ్మ చంద్రయ్యని కూచోపెట్టి నెమ్మదిగా విషయం చెప్పింది.
'ఏమిటీ, ఆ ఇల్లు తెలుసా, ఇంకేం నాకొదిలెయ్ ఆ పని. నువ్వు దైర్యంగా వుండు తులసమ్మా!" అన్నాడు స్కూటర్ స్టార్ట్ చేస్తూ చంద్రయ్య.
రవి, వీణా విశాఖపట్నం వెళ్ళిపోయారు.
రవి మనసులో చాలా ఆనందంగా వుంది- ఆ పిల్ల బాధ్యత రాజీవ్ తీసుకున్నందుకు. వీణకి అప్పుడప్పుడు అలాగే అనిపించినా- ఆరోజు ఆ పిల్లని అంత ఆవేశంగా తీసుకురాకుండా వుండాల్సింది. పెంచిన మమకారం అంటే ఇదే! అయినా ఇంత కొద్ది కాలానికే మమకారం పెంచుకుంటే పాపం. ఆ కన్నతల్లి మనసేమిటీ - వీణ మనసు మెల్ల మెల్లగా సర్దుకుంటుంది. తను తల్లి. తల్లికాని జానకికి పిల్లని యిచ్చేయడానికి ఎందుకు ఒప్పుకోదు?
తనూ ఇదేనేమో... అన్నీ తనకే కావాలనే అంతరంగంలో వుండే కోరిక రూపం వీణ ఇలా అనుకుంటూ వుండగానే ఎందుకో.... తను చేసింది తప్పనిపించింది. అన్నయ్యతో పోట్లాడి పిల్లని ఇవ్వకుండా వుండాల్సింది. ఆ వదిన సుమతి ఎలాగూ ఇంట్లోకి రానీయదు. ఒకవేళ జానకి భర్త కూడా ఈ పిల్లనొద్దంటే, ఏం చేస్తాడయ్యా? అనాధాశ్రమమా! రవి మనసు పొరల్లో స్వార్ధం గూడుకట్టుకుందా, లేకపోతే ఆరోజు అంత ఉత్సాహంగా తెచ్చినవాడు ఈరోజు హాయిగా మరచిపోయాడే..?!
వీణకి రవిమీద పీకలదాకా కోపం వచ్చింది-
"రెడీ కా! బీచ్ కెడదాం - అక్కడకి మా స్నేహితుడు భార్యా వస్తారు. నీకు పరిచయం చేస్తాం ఆవిడ మంచి సోషల్ వర్కర్-" ఇంకా ఏదో చెప్పబోయాడు రవి.
వీణ పెద్దగా పోట్లాటకి దిగింది-
"సోషల్ వర్కరా -అంటే సంఘసేవ చేస్తుందా? - అవును మీలాగే - మీరు ఎంత స్వార్ధపరులో నాకు ఇప్పుడేగా తెలిసింది" అంది బుసలుకొడుతూ.
"ఏమిటి వీణ, ఏమైంది నీకూ..?" అన్నాడు కంగారుగా రవి.
"అవునండీ, ఆ పిల్లని తెచ్చినప్పుడే నిర్మొహమాటంగా, మా వదిన సుమతిలా చెప్పి పారేయాలి. అంతేకానీ, ముందు చాలా గొప్ప దయాత్ములు మీరనేట్లుగా ఆ పిల్లని గబగబా తెచ్చుకుని ఏదో వంక దొరగ్గానే వదిలించుకోటం మీకే సాధ్యం - ఛీ!"
వీణ కోపానికి నవ్వొచ్చింది రవికి. ఎందుకు తనని నిందిస్తోందో అర్ధమైంది కానీ, తనేం తప్పు చేసాడూ..?!
"వీణా... ఏమిటా అరుపు! అవును- నేను స్వార్ధపరుణ్ణి. ఎవడి పిల్లనో కులం, గోత్రం తెలియనిదాన్ని పెంచి పెద్దచేసే ఖర్మ నాకేం పట్టలేదు. ఆరోజు కూడా నిన్ను వారించాను..... పెద్ద బాధ్యత నెత్తికెత్తుకుంటున్నావ్. ఆలోచించమని! అయినా, మీ అన్నయ్య కావాలని తీసికెడితే, నీ ఏడుపేమిటి మధ్య? నీ పిల్లల్ని నువ్వు చూసుకో చాలు, లోకాన్ని ఉద్దరించినంత!" రవి కోపంగా తలుపేసి లోపల కూచున్నాడు.
"పోన్లెండి. నాకు మాత్రమేమిటీ... అనాధ పిల్లల్ని పెంచే ఖర్మ! నేనూ హాయిగా క్లబ్బులకి, బీచిలకు మీతో వస్తూ, నేనూ చేస్తాను సోషల్ సర్వీస్, దానికేముంది?" అంటూ వీణ గబగబా తయారైంది.
ఈమధ్య వీణ తన అలంకరణ విషయంలో శ్రద్ద తీసుకోవడం లేదు- మనసులో వున్న సంఘర్షణకి స్వస్తి చెప్పేయాలని నిర్ణయించుకుంది.
* * *
కార్లో కూచున్నాక- మాధవరావు భార్య జానకి భుజంమీద చెయ్యేస్తూ-
"ఏమంటుంది నీ ఫ్రెండు వీణ?" అన్నాడు.
జానకి ఆ ప్రశ్నకి ముఖం విప్పారింది." అదే మీకు చెప్పాకదా. ఆ పసిగుడ్డుని పెంచలేక నానా గొడవ పడుతోందిట. అంతేకాక, వాళ్ళాయన కూడా ఈ పిల్లని అనాధాశ్రమంలో వదిలెయమంటున్నాడట! పాపం, ఆ పిల్ల గతి చూడండి ఎట్లా వుందో!" అంది నెమ్మదిగా.