"అలా ఎందుకు జరిగిందో నాకు తెలియదు. ఓ ఇంద్రజాలం" అన్నాడతను అమాయకంగా.
అప్పుడు సరోజిని చూసిన చూపు వర్ణించడానికి నాకు భాష చాలదు. ఓ శక్తిస్వరూపిణి చిరునవ్వుతో వదిలిన విశిఖము అతని అంతరాళంలో లోతుగా ఎక్కడనో తీవ్రంగా గుచ్చుకుపోయిందని చెప్పగలను.
సరోజిని నవ్వి "అసలు నువ్వు ఏంచేసినా తమాషాగానే చేస్తుంటావు బావా" అంది.
"ఏమలా?" అన్నాడు తెల్లబోయి.
"అదికాదు రాత్రంతా నేను నిద్రపోకుండా ఈ విషయంగురించి తీవ్రంగా ఆలోచించాను. నువ్వు చాలా గొప్పవాడివి బావా. నువ్వేం చేసినా ఇతరులకు కోపంరాదు. ఒక సంగతి చెబుతాను చూడు, నీమీద నాకు కోపం వచ్చేలా ఎన్నోసార్లు ప్రవర్తించావు. నాకు చాలా కోపంవచ్చింది కూడా. కానీ తమాషా అని ఎందుకన్నానంటే అది కోపంకాదని తరువాత తెలుసుకున్నాను."
మొద్దు అనుకున్న మరదలుగారి ధోరణి ఆకాశవిహారం చేస్తోంది.
"అది ఎక్కడవుందో తెలుసుకోలేకుండా ఉన్నాను ఒట్టి పిరికిధానని బిడియస్తురాలిని. నీతో మాట్లాడేముందు నాకేమీ అనిపించదు. సిగ్గుపడబోయి, ఎలానో ప్రవర్తిస్తున్నాను. కోప్పడబోయి జాలిగా మాట్లాడతాను. అది కేవలం నీ ముందే అందుకే రాత్రి అలా జరిగింది."
"ఏమిటో?"
"కళ్ళు మూసుకున్నా నువ్వేంచేసేదీ ఊహించ గలుగుతున్నాను. నిన్ను గట్టిగా చేతులతో త్రోసివేయాలనుకున్నాను. గట్టిగా అరుద్ద్డామనుకున్నాను. ఏడిపిద్దామనుకున్నాను. కానీ ఏమీ చేయలేకపోయాను. నువ్వు పెంకివేషం వేస్తే అలానే నిద్ర నటించేదాన్ని!"
"సరోజినీ! నేను పురుషుడ్ని అనే మాట మరిచి మాట్లాడుతున్నావా?"
"కానీ నువ్వు నా బావవు."
"అంతకంటే ఏమీ కానా."
"దొంగవు"
"అమ్మో! అటువంటి పెద్దమాటలాడకు, భయమేస్తుంది."
"పెద్ద దొంగవి. రుక్మిణి కృష్ణయ్యని మనినీ చిత్త.....చిత్త చోరుడివంది. అలాంటివాడివి."
"ఈ మాటలు ఎవరైనా వింటే ఏమనుకుంటారు?"
"అనుకోనియ్యి బావా! ఒకళ్ళు అనుకుంటారని నీకు నేను దూరంగా ఉండాలనీ, యిందాక చెప్పానే తోసెయ్యాలనీ ప్రయత్నించను. ఒకళ్ళు అనుకుంటారని నేను సిగ్గుపడను. మరి యింతదూరం ఎందుకు వచ్చాననుకున్నావు? రాకుండా వుండలేకపోయాను."
"సరోజినీ! నువ్వు ప్రేమను నమ్ముతావా?"
"అలాంటి పెద్దమాటలకు నాకు అర్ధం తెలీదుబావా! అంటే ఏమిటో చెప్పు?"
ఈరకం వ్యక్తిని భగవంతుడు సృష్టించి యిచ్చినందుకు అతడదృష్టవంతుడు. చెప్పసాగాడు "నేనంటే నీకు ఇష్టంవుంది. ఒక్కోసారి నీ హృదయంలో పూజిస్తున్నానని కూడా రాశావు. దూరంగా వుంటే బాధగా వుంటుంది. దగ్గర చేరితే భయంవేస్తుంది. ఒకక్షణం తియ్యగా వుంటుంది. ఒకక్షణం భయంకరంగా, బాధాకరంగా, బాధావహంగా వుంటుంది. నీచాన్ని అసహ్యమని అనుకోము. నాకు తెలిసినంతవరకూ ఇదే అర్ధం."
"అవును సుమా! ఇవన్నీ నా అనుభవాలే, నీకు అన్నీ తెలుసే!"
"అలాగా? ఈ క్షణాన ప్రపంచంలో నాకంటే ఘనుడులేడు సరోజినీ. ఇంకా విను! ఇవాళ చాలా గొప్పరోజు అన్న విషయం నువ్వూ ఒప్పుకుంటావను కుంటాను. నేను చాలా విచిత్రవ్యక్తిని. సంతోషంకంటే విషాదాన్ని ఎదురు చూస్తాను. తీరా ఆ విషాదం అనుభవించాక దుఃఖం భరించలేక ఏడుస్తాను. మరి యిటువంటి మనుషులు ఎందుకు పనికివస్తారో నాకు తెలియదు. చూడూ! ఏమీ కారణంలేకుండానే ఒక్కోసారి జీవితమంటే విరక్తి పుడుతుంది. మెడమీదనుంచి దూకి చచ్చిపోవాలనుకుంటాను. ఒక్కోసారి ఈ మనుషుల్లో నాకంటే సమర్ధుడు లేడని ఉప్పొంగిపోతాను. అటువంటి సమయాన ఎంత గర్వంగా, దర్పంగా నడుస్తాననుకున్నావ్? నన్ను చూస్తే నాకే అసూయగా వుంటుంది. ఈ చిత్రలేఖనం, సంగీతం అభ్యసించింది నేను గొప్పవాణ్ణి అవుదామని కాదు, మనశ్శాంతి లభిస్తుందని, నేను వ్యక్తం చేసుకోలేని బాధ ఎవరైనా, నాకు నచ్చిన మనిషి సహృదయంతో ప్రక్కన కూర్చుని ఊ కొడుతూ ఆలకించాలనీ, చివరకు నా కన్నీరు తుడువాలనీ ఓ కోరిక. అప్పుడప్పుడూ ఒంటరితనం భరించలేనిదిగా వుంటుంది. అటువంటప్పుడు ఈ ఆవేదన దుస్సాహంగా వుంటుంది. ప్రేమించబడాలి. నేను అపూర్వంగా ప్రేమించబడాలి. సరోజినీ నీకర్ధం కావటంలేదా?"
"అవుతోంది. కానీ వివరించలేను."
"ఇంకావిను. ఎంత తెలిసినా ఏమీ తెలియదు. ప్రతిక్షణం తప్పటడుగు వేస్తూనే వుంటాను. జీవితాంతం నీడలా నన్నొక వ్యక్తి వెన్నంటి ప్రతిపనిలోనూ చేయూతనివ్వందే ఏదో అఘాతంలో పడిపోతానేమో."
"నాకా శక్తి వుందా?" అని సరోజిని పరాకుగా అంది.
"నీకు తప్ప ఏ స్త్రీకీ ఆ శక్తి లేదు. ఖర్మ కాలి కథ అన్యధా పరిణమిస్తే యీ సత్యం నువ్వు చూస్తావు."
"ఛీ, అవేం మాటలు? అలా ఎందుకనుకోవాలి?"
"చెప్పాగా నా నైజం."
"మరి నీకందులో సుఖం కనిపిస్తోందా-అలా ఊహించడంలో?"
"నామీద నీకంత బొత్తిగా దయలేదేం? అదేం ప్రశ్న?"
"జవాబు చెప్పి తీరాల్సిందే!"
అతను నిశితంగా సరోజిని ముఖ మండలంలోకి చూశాడు. జీవితాన్ని తృణప్రాయంగా ఎంచిన ఓ వింతమానినిలా అతనివంక చూస్తోంది. వాళ్ళ యిద్దరి బ్రతికివున్న చూపులూ, చచ్చి మాట్లాడుతున్న మాటలూ వాతావరణాన్ని పరిశ్రాంత పరుస్తున్నాయి. అంధకారం తన గొయ్యి తానే తవ్వుకుంటున్నట్లుగా వుంది. ఈ సన్నివేశం జన్మజన్మలకూ చెరిగిపోదు.
"ఎందుకు నీకింత పంతం?"
ఆమె ఊపిరి బరువుగా విడిచి 'నేను నీ దగ్గర్నుంచి సమాధానం పొందాలని నిశ్చయించుకున్నాను. అంతే.
"కావచ్చు" యిది అతని సమాధానం.
"ఏమిటి?" కంఠం గాజుపలకలా పగిలిపోయింది.
"అదే భావిలో భయంకరాల విలయ తాండవం."
ఇలా అని గట్టిగా కళ్ళు మూసుకున్నాడు. అది చాలదని భ్రమించి, రెండు చేతుల్తోనూ ముఖాన్ని ఆచ్చాదనం చేసుకున్నాడు. అదీ చాలదని కలతతో తెలియని వస్తువుకోసం అన్వేషణ సాగించాడు. 'కాదు! నువ్వు నావంక చూడాల్సిందే' అని సరోజిని బలవంతముగా అతనిచేతులు ముఖంనుండి విడదియ్యాలని భగీరథ ప్రయత్నం చేస్తోంది. ఆమెకు అందకుండా వుండాలని అతని తాపత్రయం చివరకు స్త్రీ శక్తి జయించింది.
అవిరళంగా నేత్ర యుగళినుండి అశ్రువులు స్రవిస్తున్నాయి. ఆమెవీ అంతే. 'అబ్బ! తెలివిగలవాళ్ళు ఎంత వెర్రివాళ్ళు?' అని ఆమె అతని కన్నీరు తుడిచింది చేత్తో.
4
కృష్ణ ఎప్పుడూ యిలా అడిగేవాడు.
"మన సమాజంలో ఎడాపెడా వివాహాల విషయంలో జరిగే అరాచకాన్ని గురించి ఏమంటారు?"
చంద్రం సిగరెట్ పీలుస్తూ ఎటో చూస్తున్న వాడల్లా యిటుతిరిగి "అరాచకమా? ఏమిటి నీ ఉద్దేశ్యం? మన వివాహాలు జరిగే పద్దతులు అత్యాచారాలు అంటావా?"
"ముమ్మాటికీ! వివాహం అనేది ఓ యాంత్రికమైన కలాపం. చదువుకున్న వారు, చదువుకోనివారుకూడా యుక్తవయస్సు రాగానే ఈ మాయలోకి, ఊబిలోకి దిగబడిపోతున్నారు. అదంతా కపటనాటకం, స్వార్ధపరులు ఆడిస్తున్న తతంగం."
"అలాగా? లోకంలో భార్యాభర్తల సంబంధం నశించిపోవాలని అంటావా ఏమిటి?"
"అనగలను కానీ అనను. ఎందుకంటే యిది కేవలం మన జాతి సాంప్రదాయానికి అంటుకున్న జాడ్యంకాదు. దిగంతమంతా వ్యాపించివుంది. ఈ నా వాదనవల్ల ప్రయోజనంలేదు. కాని మరీ మనదేశంలో పెరిగిపోతున్న ఆగడం, అత్యాచారం నేను ఖండిస్తాను."
"అను....కట్నం ఓ పెద్ద అఘాయిత్యమని.."