Previous Page Next Page 
ఆత్మజ్యోతి పేజి 13

 

       "ఇప్పటినుంచే ఎందుకులే ఆ నియమాలు? ఆ రోజులూ వస్తాయి."
   
    "చిలకా, ఏమిటి నీ గిరాకీ? అంతా వింతగా వుంది వ్యవహారం."
   
    అతనికి కోపంవచ్చి, ఆమెను ఏడిపించాలని "అబలా! ప్రియతమునితో యిట్టె మాటలాడవచ్చునే" అన్నాడు.
   
    "ఓహో, ఆహా!" అని కళ్ళెగురవేసి "నువ్వన్నం మానేస్తే నేనూ ఎందుకు మానెయ్యాలి? మహచక్కగా తింటాను. నాకేం వచ్చింది? ఇవాళ గోవిందునడిగి నాకిష్టమైనవన్నీ చేయించుకున్నాను కూడా" అంటూ అతని జవాబుకోసం ఎదురు చూడకుండా, గబ గబా క్రిందకు దిగి వెళ్ళిపోయింది.
   
    నిశ్శబ్దంలో అరగంట దొర్లింది. కాసేపు లేచి అటూ ఇటూ తిరిగాడు. ఎందుకో బలహీనంగా వుంది. అట్టేసేపు నిలబడలేక కూర్చున్నాడు. కొంతసేపటికి అలా కూర్చోవటం ఏమీ నచ్చలేదు. పందిరిమంచం దగ్గరకు పోయి-ఊరికినే పడుకున్నాడు.
   
    అప్పుడు అడుగులచప్పుడు అయ్యాయి. గోవిందు పాలు తీసుకు వస్తున్నాడని ఊహించాడు. అడుగులశబ్దం దగ్గరై మరింత దగ్గరై ఆగింది.
   
    "బావా, పాలు."
   
    అతడు తలత్రిప్పి ఆశ్చర్యంగా "సరోజినీ, నువ్వెందుకు తీసుకువచ్చావు?" అన్నాడు నొచ్చుకుంటూ.
   
    "ఏమో తెచ్చాను" అంది ముక్తసరిగా.
   
    "అక్కడ పెట్టి వెళ్ళు."
   
    చెప్పినట్లే చేసి నిష్క్రమించింది. అలకేమో అనుకున్నాడు. ముందుకు వంగి గ్లాసు తీసుకుని పాలు తాగేశాడు. తొమ్మిదైంది. నిద్రపోదామని ప్రయత్నించసాగాడు. స్త్రీ జాతికి అత్యద్భుత శక్తులున్నాయి. లేకపోతే కళ్ళు మూసుకున్నా తెరిచినా సరోజినియే అయి, ఊహకతీతమయిన వివిధ భంగిమలతో విన్యాసం ప్రదర్శిస్తోంది. కవ్వించడం ఆడవారి సొత్తు. నవ్వించడమూ వారిపనే. మరి ఏడిపించటంలో కూడా వారిదే పైచెయ్యి.
   
    నిద్రలానే వుంటుంది, నిద్రకాదు. కలలానే వుంటుంది, కలకాదు. తెలివి గానే వున్నాననుకుంటాడు కానీ అది జాగ్రదావస్థ కానేకాదు. ఓహో! ఇది ఎలాంటి బాధ?
   
    ఇంతలో ఓ విచిత్రమైన భయం ఆవహించింది.
   
    నిద్ర భయంకరమా? తాత్కాలికంగా పరిసరాలకీ, మనుషులకీ దూరం కల్పిస్తుంది. తెలివిలో వున్నవాడిని స్మృతి విహీనుడ్ని చేస్తుంది. ఆలోచిస్తూ ఆలోచ్సితూ వుండగానే ఏదో ఓ క్షణంలో దెయ్యంలా వచ్చి మీదపడి, పూర్తిగా తన ఆధీనంలోకి తీసుకుంటుంది. అంతేకాదు, నిద్రపోబోతూ మానవుడు "రేపులేచి అలా చేయాలి, యిలా చేయాలి" అని ఎన్నో కలలు కంటాడు. మరునాడు లేకుండానే అతగాడిలోని రక్తం స్తంబించిపోతే మాతమాత్రానికైనా తెలియదుగదా! ఇటువంటివాళ్ళనే ప్రపంచం అదృష్టవంతులంటుందే? ఒకవేళ  ఆ వ్యక్తికి లేశమైనా ఈ విషయం చూచాయగా తెలిస్తే ప్రాణం ఎలా గిలగిలా కొట్టుకుపోయేదీ వీళ్ళేం ఊహించగలరూ? హఠాత్తుగా సంభవించేది అదృష్టమైతే కొంతవరకూ భరించవచ్చుగానీ, ప్రమాదమైతే.....అమ్మో!
   
    నెమ్మదిగా కళ్ళు విచ్చుకున్నాయి.
   
    బెడ్ లైట్ అలానే సన్నగా వెలుగుని చిందిస్తోంది. గదిలోని వస్తువులన్నీ మసకమసగ్గా కనిపిస్తున్నాయి. గడియారంవంక చూసేసరికి చప్పున అంకెలు కనిపించలేదు. బద్ధకంగాలేచి, లైటు వెలిగించి టైము చూశాడు.
   
    రెండు!
   
    ఒక్కనిముషం తెల్లబోయి నిల్చున్నాడు. చాలాసేపటి క్రితం చావునూ, నిద్రనూ పోల్చుకుని మధనపడుతూ నిద్రలో పడిపోయాడన్నమాట. వేడి నిట్టూర్పు వెలువడింది. సరోజిని ఏంచేస్తుందో తెలుసుకుందామన్న కుతూహలం బలపడిపోయింది. అతిచిన్నగా అడుగులు వేసుకుంటూ వసారాలోకి వచ్చాడు.
   
    హఠాత్తుగా ఓ దృశ్యం గుర్తుకువచ్చింది.
   
    ఇదేచోటు, ఆ యువతి ఎవరో తనకు తెలియదు. ఆమే, తనూ విచిత్రంగా తారసిల్లారు. చాలాసేపు వింతవింతగా సంభాషించుకున్నారు. ఆమె పేరయినా తెలుసుకోలేక పోయాడు. ఎవరో ఆమె? కానీ సామాన్యవ్యక్తిగా ఊహించి ఆమెను తోసిరాజనలేకుండా వున్నాడు. అది ఒక విచిత్రమైన అనుభవం. ఈమాదిరి అనుభవాలనే మానవులు ఎడతెగకుండా కాంక్షిస్తారు. చప్పున కృష్ణ గుర్తుకువచ్చాడు. ఈమాదిరి అనుభవాలు ఎవరికైనా తారసిల్లినాయంటే అతనిలా ఆరాటపడే ప్రాణి వుండడు.
   
    నెమ్మదిగా, నిశ్శబ్దంగా మెట్లు దిగనారంభించాడు. ఈ సమయంలో దొంగ ఎవరైనా చాటుగా నిల్చుని తనని చూశాడంటే తనని దొంగ అని భ్రమ పడాల్సిందే. ఈనాటి అవస్థ అట్లావుంది. ఏదో తెలియని ఆందోళన వెనుక నుండి తరిమితరిమి కొడుతోంది.
   
    చివరికి సరోజిని అతనికెదురుగా వుంది.
   
    "ఇదేమిటి ఇలా చేశావు?"
   
    ఏమని జవాబు చెప్పాలో తెలియక సిగ్గుతో కుమిలిపోతున్నాడు. పృధ్విలో జవాబులేని ప్రశ్నలలో ఒకటి. ఏమని చెప్పమంటాడు తనను తాను జవాబు? ఒంగి, మధురంగా నిద్రిస్తోన్న సరోజిని వదనంలోకి సూటిగా చూశాడు. అది అపూర్వమయిన చూపు. ఆ క్షణమూ అటువంటిదే. హృదయం మేలుకొలుపు పాడుతోంది. దాని మొర ఆలకించే నాధుడేడీ? ప్రశ్నలు లక్షలుగా, కుప్పలుగా వెలువడుతున్నాయి. జవాబులు యిచ్చేదెవరు? ఓ చెయ్యి తలక్రింద పెట్టుకుని, ఓ ప్రక్కకి ఒత్తిగిలి తియ్యగా నిద్రిస్తోన్న సరోజిని మినహా జగాన ఏదీలేదు. అందం అందం అని ఘోషిస్తారు మానవులు. ఎవరూ నిజమైన అందాన్ని సమీపించలేదన్నమాట. సౌందర్యం అవలోకించినప్పుడు స్వంతం చేసుకోవాలని యిదివరలో ఎవరైనా ఉబలాటపడ్డారా? అది అబద్దం శరీరాలు చాలామందివి పులకరించి వుండవచ్చు. కానీ అతని యీ అనుభూతి వాటినన్నిటినీ తలదన్నింది కాబోలు. అమ్మాయిలు వేసుకునే దుస్తులపేర్లు అతనికి తెలియవు. కానీ అతనికి తట్టింది-యీ ఊదారంగు చీరె, బెడ్ లైట్ పసుపూ కలసి ఓ వింతకాంతితో పరిసరాలని జ్రుంభితపరుస్తున్నాయి. అరికట్టలేని తమకానికి అది దారితీసింది. మరికొంచెం ముందుకు వంగాడు. ఆమే యీ లోకంలో వుంటే తనలాంటి ఓ పిచ్చివాడి చేష్టలుచూసి ముసిముసిగా నవ్వినట్లు, ఆ పెదవులు సిగ్గుతోకూడిన ఓ ప్రియహాస్యాన్ని ప్రదర్శిస్తున్నాయి. మల్లెలు తురిమిన శిగ నలిగి ఒదులుగా, వయ్యారంగా గతి తప్పింది.
   
    చప్పున ఆమె పెదవులు చుంబించబోయాడు.
   
    కానీ ఏవో గొలుసులు వెనక్కు లాగాయి. క్షణంముందు కట్టలుతెగి ప్రవహించిన ఆవేశం-సిగ్గు అనే పరదా చాటునదాగింది. ముఖమంతా కంది ఎర్రబడినట్లుంది. ఉచ్చ్వాస నిశ్వాసాలూ క్షణంపాటు స్తంభించాయి. గిరుక్కున వెనుదిరిగి, తనగదిలోకి చేరి ఈజీచైర్ లో అలసటగా వాలిపోయాడు.
   
    చీకటి నవ్వుతోంది. ఎంత తపస్సు చేస్తేనోగానీ ఈ మాదిరి తమస్సు లభించదుగావున, పదునైన ఈ రాత్రిని తను బండబారజేశాడు. తప్పా తను చేయబోయింది? ఏది మంచి? ఏది చెడు? భగవంతుడు తన విషయంలో కరుణామయుడు కాడు. రవ్వంత కఠినత్వం ఎందుకు యిమడ్చలేదు మరి రూపంలేని ఈ మనసు ఎంత సున్నితమూ? మిగిలేదేమిటి అసంతృప్తా? ఆనందమా? ఏది ఉన్నతమని అంతరంగం ఘూర్ణిల్లుతోంది.
   
    "బావా!"
   
    అదిరిపడి తలెత్తి చూశాడు. అయ్యో! ఈ సమయంలో సరోజిని యిక్కడకు ఎందుకు వచ్చింది? సిగ్గుతో "నువ్వా?" అన్నాడు.
   
    "వచ్చేశావేం అప్పుడే?"
   
    "సరోజినీ!" అంటూ అరిచాడు.
   
    "అది కోపమా? ఎందుకలా జంకావు? ఇది మీ యిల్లు, అడ్డేమీ లేదుగా" అని తలవంచి "పెద్దవాళ్ళు ఎందుకు చెబుతారో నాకర్ధమైంది అయినా అయినవాళ్ళ దగ్గరకూడా యింత అఘాయిత్యం ఎందుకో" అంది కఠినంగా, కంపితస్వరంతో.
   
    "నువ్వు ఎంత తెలివైనదానివి!"
   
    "కాకపోవచ్చు కానీ తనకున్న ఒకేఒక ఆస్థి విషయంలో స్త్రీ ఎలా సంరక్షణ చేసుకుంటుందో తెలుసుకోగలిగిన తెలివి నాకు ఉందని గ్రహించాను" అని అతనికి చేరువగా ఓ కుర్చీని లాక్కుని కూర్చుని "బావా! నిన్నో విషయం అడుగుతాను. కోపం రాదుగదా?"
   
    "అడుగు" అన్నాడు కుమిలిపోతూ.
   
    "ఎందుకలా తొందరపడ్డావు?"
   
    "నువ్వు అంతా చూస్తూనే వున్నావా?"
   
    "ఆహా! రాత్రంతా అసలు నిద్రపట్టలేదు. ఏవో ఊహలు నీగురించేనేమో చాలాసేపు అలానే బాధననుభవిస్తూ మెలకువగానే వున్నాను. ఇంతలో నువ్వు దొంగలా లోపలకు రావటంచూసి చప్పున కళ్ళు మూసుకున్నాను. అబ్బాయిగారి ఉద్దేశం బోధపడింది" అని ఎలాగో నవ్వేసింది.

 Previous Page Next Page