సంభాషణ పూర్తిగా ఆంగ్లంలో జరుగుతోంది.
"నువ్వేం చేస్తుంటావ్?" వృద్ధుడు ప్రశ్నించాడు.
"బిజినెస్-" అని తనే వ్యాపారాలు చేసేదీ అన్నీ వివరంగా చెప్పాడు త్రినాధ్.
ఆ వృద్ధుడి ఉబ్బిన కనురెప్పల వెనుక ఏదో ఉద్వేగం... ఉత్తేజం.
మూసుకుపోతున్నట్టున్న ఆ వృద్ధుడి కళ్ళలో ఓ లిప్తపాటు మెరిసిన మెరుపు త్రినాధ్ దృష్టికి రాలేదు.
"జపానెందుకు వచ్చారు?" వృద్ధుడు తిరిగి ప్రశ్నించాడు. అతనిలో క్షణ క్షణానికి ఆసక్తి పెరుగుతున్నట్టు కూడా త్రినాధ్ గమనించలేదు.
"జపాన్ ఎవరు వచ్చినా... కొలాబరేషన్ గురించే కదా...? ప్రపంచ పారిశ్రామిక సామ్రాజ్యానికి జపాన్ పట్టమహిషి లాంటిదని నా అభిప్రాయం."
"మరి హోండా కంపెనీ రాకకు కారణం కూడా అదేనా?"
"అఫ్ కోర్స్" పొడిగా అన్నాడు త్రినాధ్.
ఆ వృద్ధుడు ఎవరన్నది త్రినాధ్, గుప్తాకే కాదు- కేంటిన్ లో వున్న స్టాఫ్ కి కూడా తెలీదు.
అతనే- ప్రపంచ ఆటోమొబైల్ ఇండస్ట్రీపై అపరిమితమైన గ్రిప్ వున్న అసాధారణ వ్యక్తి.
అతనే ప్రపంచంలో టూవీలర్స్ పరిశ్రమకు మకుటంలేని మహారాజు-
అతనే సాయ్ ఛిరో హోండా!
హోండా పరిశ్రమ వ్యవస్థాపకుడు-
కుటీర పరిశ్రమలాంటి హోండా కంపెనీని ప్రపంచంలోనే నెంబర్ ఒన్ గా నిలిపిన అనితరసాధ్యుడైన బిజినెస్ మేగ్నేట్! ఆహార నియమాలలో తన గురువు మాలినిదేవి సూచనను పాటించిన త్రినాధ్... హోండాతో పోల్చుకుంటే సాధారణమైన బిజినెస్ మన్ అయిన త్రినాధ్ ఇప్పుడు ది గ్రేట్ సాయ్ ఛిరో హోండా దృష్టిలో పడ్డాడు.
అదీ సాధారణమైన విషయం కాదు.
మామూలు అదృష్టం కాదు.
"నాకెందుకో ఈ కంపెనీ ఓనర్ హోండా జీవిత చరిత్ర తెలుసు కోవాలని వుంది..." అన్నాడు త్రినాధ్ జిజ్ఞాస నిండిన కళ్ళతో.
ఆ వృద్ధుడు పెదవుల దాటకుండా నవ్వుకున్నాడు.
"పోనీ... నాకు తెలిసినంతవరకు నేను చెప్పనా?" అడిగాడా వృద్ధుడు.
చెప్పమన్నట్టుగా ఆసక్తిగా ముందుకు వంగాడు త్రినాధ్. ఆ వృద్ధుడు ఇంగ్లీషులో చెప్పటం ప్రారంభించాడు.
"సాయ్ ఛిరో హోండా..." అని ఉచ్చరించిన ఆ వృద్ధుడు ఒకింతసేపు మౌనంగా వుండిపోయాడు.
అతను తన అనంత జీవన ప్రవాహపు ఒడిదుడుకుల్ని, ఎత్తుపల్లాల్ని జ్ఞప్తికి తెచ్చుకుంటున్నాడు.
ఇప్పుడాయన వయస్సు 81 సంవత్సరాలు. ఎన్నో ఏళ్ళనాటి జ్ఞాపకాలు వరద ప్రవాహంలా ఆయన్ని ముంచెత్తుతున్నాయి. ఎనభై ఒక్క సంవత్సరాలుగా తన ఆశలకు, ఆశయాలకు, ఆలంబనగా నిలిచి సేవచేసి, సేదతీర్చి తననో అత్యున్నత పీఠం మీద నిలిపిన వృద్ధ శరీరం లీలగా వణుకుతుంటే, ఆయన మెల్లగా పలుకుతుంటే, ఆయన మెల్లగా కనులు తెరిచాడు.
ఆ కనుకొనుకుల్లో తడి... ఆ తడి వెనుక తృప్తి, ఆ తృప్తి వెనుక ఆనందం, ఆ ఆనందం వెనుక ఆత్మవిశ్వాసం...
మల్టీ బిలియనీర్... హోండా...
జపాన్ దేశపు భాగ్యవంతులలో రెండోవాడు.
అతను స్థాపించిన హోండా కంపెనీ ఇప్పుడు ఫార్చ్యూన్ మేగజైన్ లిస్ట్ ప్రకారం అంతర్జాతీయ స్థాయిలో మొదటి ఐదువందల కంపెనీల్లో ఒకటి.
అతను ఆ జ్ఞాపకాల నుంచి తేరుకున్నాడు. "సాయ్ ఛిరో హోండా- హోండా పూర్తి పేరు. అతనో నిరుద్యోగి. సాధారణ మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన ఆశాజీవి. జీవనోపాధికి ఓ ఆటోమొబైల్ షెడ్ లో మెకానిక్ గా కుదిరాడు. అతను ఎలాంటి మోటార్ బైక్ నైనా క్షణాల్లో బాగుచేసేవాడు. అలాంటి యువకుడిలో వున్నట్టుండి ఒక కోరిక మొలకెత్తింది... మోటార్ సైకిల్ రేసింగ్ లో పాల్గొని ప్రపంచంలో అత్యున్నత ట్రోఫీని గెల్చుకోవాలని. అందుకుగాను అతను సొంతంగానే ఒక మోటార్ సైకిల్ ని తయారుచేసుకోవాలనుకున్నాడు..." వృద్ధుడు ఓ క్షణంపాటు ఆగిపోయి వెజిటబుల్ సూప్ ని ఆర్డరిచ్చి ఇలా అన్నాడు.
"వృద్ధుడ్ని కదా- మధ్య మధ్యలో గ్లూకోజ్ వున్న పదార్ధాలు లోపలకు వెళ్ళకపోతే నీరసం ముంచుకొచ్చేస్తుంది."
త్రినాధ్ క్యాంటీన్ కౌంటర్ దగ్గరకు వేగంగా వెళ్ళి మూడు కప్పుల సూప్ తెచ్చి టేబుల్ మీద పెట్టేశాడు. తను చెప్పడం ఆపేయంతో త్రినాధ్ లో అసహనం తొంగిచూడడం వృద్ధుడు స్పష్టంగా గమనించాడు.
My Chidhood dream was to be a champion of motor race with a machine build by myself అని హోండా అనుకుంటుండేవాడు.
అతనిలోని ప్రగాఢమైన వాంఛను, పట్టుదలను చూసిన మిత్రులు అతనికి ఆర్ధికంగా సహాయం చేసేందుకు ముందుకొచ్చారు.
వరల్డ్ ఫేమస్ సర్జన్ కైనా మానవ శరీరంలోని సూక్ష్మమైన భాగాలు తెలియక పోవచ్చేమో కాని హోండాకి టూ వీలర్స్ లోని ప్రతి అంగుళం, ప్రతి పార్ట్ గురించి క్షుణ్నంగా తెలుసు. బహుశా అతను సాధించుకున్న ఆ ప్రావీణ్యాన్ని చూసి అచ్చెరువందే స్నేహితులు సహాయం చేసేందుకు ముందుకు వచ్చి వుండవచ్చు.
1948లో జపాన్ రాజధాని టోక్యోకి 300 కిలోమీటర్ల దూరంలో 'హమామాట్స్' అనే ప్రాంతంలో మోటార్ సైకిళ్ళ తయారీ కంపెనీని ప్రారంభించాడు హోండా.
Four decades ago the first Honda factory was no better than a shed.
అలా ఒక సాధారణమైన రేకుల షెడ్ లో ప్రారంభమైన హోండా కంపెనీ..." మరలా ఆగిపోయాడు వృద్ధుడు.
ప్రపంచంలో టూ వీలర్స్ తయారీలో నెంబర్ వన్ కంపెనీ అధినేతే తనకు తన అనుభవాన్ని విశదపర్చుతున్నాడని త్రినాధ్ ఊహకే అందని అద్భుతం.
అప్పటికే జపాన్ అణుధూళిలో శ్మశాన వాటిక అయింది. అయినా ఆత్మ విశ్వాసంతో ఒళ్ళు విరుచుకుని లేచిన జపాన్ దేశం 1950 నాటికే కొంత పారిశ్రామిక ప్రగతిని సాధించింది. 1950 నాటికే జపాన్ లో 50 దాకా చిన్న మోటార్ సైకిల్ కంపెనీలు పుట్టుకొచ్చాయి.
హోండా వాటిని తట్టుకొని నిలవాలి.
అందుకే ముందు చిన్న వెహికల్స్ నే తయారుచేయాలనుకున్నాడు. అతని ప్రారంభపు పెట్టుబడి కేవలం పదిలక్షల ఎన్ లు.
ప్రారంభంలో లైట్ కమ్యూటర్స్ తో తన ఉత్పత్తి ప్రారంభించాడు హోండా. అంటే మీ దేశంలో ఇప్పుడున్న లూనా, టి.వి.ఎస్. లాగా 50 సి.సి. ఇంజన్ తో. అదే సమయంలో సి.100 అనే కొంచెం పెద్ద బైక్ ని కూడా తయారు చేశాడు.
ఓ ప్రక్క ఉత్పత్తి కార్యకలాపాలలో హోండా మునిగి ఉన్నా- అతని చిరకాల వాంఛ అతన్ని వీడలేదు... ఎప్పటికైనా తన కంపెనీ మోటార్ బైక్ మీదే రేస్ లో పాల్గొనాలి.
అది 1950వ సంవత్సరపు చివరి నెల. అప్పటికే హోండా పరిశోధనా సమాధిలోకి వెళ్ళి ఆరునెలలయింది.
నిరంతరం ఇనుపముక్కల మధ్యే తింటూ, వాటిమధ్యే విశ్రమిస్తూ, వాటితోనే సహజీవనం చేస్తూ, వాటికి ప్రాణం పోసే దీక్షతో ఒక మునిలా మారిపోయాడు.
మొత్తానికి ఓరోజు ఓ కొత్త డిజైన్ తో సరికొత్త మోటార్ సైకిల్ కి రూపకల్పన చేశాడు. 500 వార్ పల్సరస్ ఇంజన్ తో తయారైన ఆ కొత్త నమూనా మార్కెట్ లోకి వచ్చింది.
హోండా కలలు నిజమయ్యాయి.
కంపెనీ ప్రారంభించిన రెండు సంవత్సరాలకు ఫుల్ ప్లెజ్జెడ్ మోటార్ సైకిల్ ని తీసుకువచ్చి తన కలలకు జీవం పోసుకున్నాడు హోండా..." వృద్ధుడు ఒకింతసేపు ఆగి ఆయాసం తీర్చుకుని సూప్ ని మెల్లగా చప్పరించడం ప్రారంభించాడు.
త్రినాధ్ లోని జిజ్ఞాస నిద్రలేచింది.
వృద్ధుడు సూప్ త్రాగడం పూర్తయ్యేదాకా ఏమీ చెప్పడని త్రినాధ్ గ్రహించాడు.
"కేవలం రెండు సంవత్సరాలలో ది గ్రేట్ హోండా- వ్యాపార ప్రపంచ పితామహుడు అంత అభివృద్ధిని ఎలా సాధించగలిగాడు...?"
త్రినాధ్ ప్రశ్నకు ఆ వృద్ధుడు తలెత్తి ఆప్యాయంగా చూశాడు.
The ability to conserve and reinvest, the single minded pursuit of subordi- nate goals and an irrevocable employer-employee consensus are some of the
in-gredients of his sucess-" అని మరలా-
సూప్ త్రాగడంలో నిమగ్నమయ్యాడా వృద్ధుడు.
అప్పుడు త్రినాధ్ గుప్తా వైపు చూస్తూ పెట్టుబడి పెట్టు... దానిమీద వచ్చిన లాభాన్ని తిరిగి పెట్టుబడిగా పెట్టు... దాని మీద వచ్చే లాభాన్ని కూడా మరలా పెట్టుబడిగా పెట్టు... వడ్డీకి చక్రవడ్డీలా మన వ్యాపారాలు అంచెలంచెలుగా ఎదిగిపోతాయి... అంతేకదా గుప్తాజీ...?" గుప్తా చిరునవ్వుతో మౌనంగా తలూపాడు.
గుప్తాకి తెలుసు... ఇప్పుడిక త్రినాధ్ ప్రక్కన బాంబుపడినా చలించడని.
దాహం... తీరని దాహం... ఎప్పటికి... ఎన్నటికి తీరని దాహం. ఇంకా... ఇంకా తెల్సుకోవాలనే విజ్ఞాన దాహం... ప్రపంచ వ్యాపార సరిహద్దుల్ని సయితం అవలీలగా అధిగమించాలనే తపన... తృష్ణ... గుప్తా ఆశ్చర్యంగా త్రినాధ్ కేసే చూస్తున్నాడు.
వృద్ధుడు సూప్ త్రాగడం పూర్తి చేశాడు.
"ఐదు సంవత్సరాలలో హోండా తన పెట్టుబడిని పదిలక్షల యెన్ ల నుంచి 450 మిలియన్ యెన్ లకు అభివృద్ధి చేశాడు."
త్రినాధ్ లో అప్పుడు కలిగిన ఎక్సైట్ మెంట్ అతనికి గతంలో ఎప్పుడూ అనుభవంలోకి రాలేదు. అంటే నాలుగు సంవత్సరాలలో సుదర్శన్ రావు ఆస్తికి డబుల్ సంపాదిస్తానని పందెం కాయడం అసాధ్యమేం కాదు...
ఉత్సాహంగా ముందుకు వంగాడు త్రినాధ్.
వృద్ధుడు తిరిగి చెప్పేందుకు సిద్ధపడుతూ ఓ క్షణం నలువేపులా పరికించి చూశాడు.
"ఆ 450 మిలియన్ యెన్స్ యంత్ర పరికరాలకు వెచ్చించాడు. ఆ సరికొత్త యంత్ర పరికరాలతో ప్రొడక్షన్ లో మరింత నాణ్యత, అందం తెచ్చేందుకే ఆ డబ్బు మొత్తాన్ని వినియోగించాడు.
ఎప్పుడైతే కొత్త యంత్రాలు సమకూర్చుకున్నాడో తన పరిశోధనా ఫలితాలకు సరికొత్త రూపు ఇవ్వడం ప్రారంభించాడు హోండా. తద్వారా కొత్త మోడల్స్ ని మార్కెట్ లోకి దింపాడు.
బెన్లీ (Benly) డ్రీమ్ 6ఇ (Dream 6E) జునోబెన్లీ జె.ఎ. (Juno Benly J.A.) డ్రీమ్ ఎన్.బి. డ్రీమ్.ఎస్.ఎ. బెన్లీ. జె.పి. అనే కొత్త మోడల్స్ ఉత్పత్తి భారీయెత్తున ప్రారంభమైంది.
అది 1954వ సంవత్సరం.
హోండా తన చిన్ననాటి కలల్ని పండించుకున్న శుభసంవత్సరం. పోటీల్లో పాల్గొనడానికి ఐదు సంవత్సరాలపాటు నిద్రాహారాలు మాని సుదీర్ఘంగా శ్రమించాడు హోండా. అప్పటికిగాని అతనికి సంతృప్తినిచ్చే ఇంజన్ తయారుకాలేదు. అప్పుడు అతనిలో రెండు కోర్కెలు వున్నాయి. ఒకటి మోటార్ రేస్ లో పాల్గొని తన చిరకాల వాంఛ నెరవేర్చుకోవడం, రెండు తన కంపెనీ మోటార్ సైకిల్ తన సుప్రిమసీని ప్రపంచపు రెండు చక్రాల వ్యూహంలో చొచ్చుకుపోయి పేరు ప్రఖ్యాతులు గడించడం.
1954 ది ఫస్ట్ ఇన్ లే ఆఫ్ మేన్ టూరిస్ట్ ట్రోఫీ రేస్ కి సిద్ధపడ్డాడు హోండా.
తన కలలు, తనతో శ్రమించే వేలాది శ్రమజీవుల కలలు, ఆశలు, జీవితాలు ఆ పోటీమీద పణంగా పెట్టబడ్డాయి. అందులో విజయం సాధించకపోతే హోండా పడిన శ్రమ వృధా- చేసిన కృషి వృధా.
తన మేధస్సు మెరికల్స్ సృష్టించాలి - తప్పదు.
అలా ఆ పోటీకి వెళ్ళిన హోండా ఘనవిజయం సాధించి ఆటోమోబైల్ ప్రపంచంలో ఆధిపత్యం సాధించాడు.
అప్పుడే పలుచోట్ల పలుదేశాల్లో ఎవరీ హోండా? అనే ఆసక్తి రేగింది. ఆ ఆసక్తిని తన వ్యాపారానికి అనుగుణంగా మలుచుకోవడంలో తిరిగి దీక్షలో కెళ్ళిపోయాడు హోండా. మనిషిని నమ్ముకున్న మనిషి నాశనం కావచ్చేమో కాని, యంత్రాన్ని నమ్ముకున్న మనిషి నాశనం కాడు.