Previous Page Next Page 
నీరజ పేజి 13


    "వద్దులే! నువ్వు కూచో! నేను చేసుకోగలను!" మామూలుగా అంది లక్ష్మీదేవి...
    లక్ష్మీదేవిలో తనపట్ల వెనుకటి ఆదరభావంలేదని అర్థమయినా తనే కల్పించుకుని కూడాకూడా తిరుగుతోంది నీరజ___
    "నువ్వే కూర్చో అత్తయ్యా! ఈమాత్రం వంట నేను చెయ్యలేనా?" ఇంచుమించి బలవంతంగా వంటలో జొరబడింది నీరజ. లక్ష్మీదేవి వంటిల్లు వదిలి బయటకు వచ్చేసింది...
    నీరజ వంటంతా చాలా చక్కగా చేసింది. కానీ ఆరోజు లక్ష్మీదేవి అన్నం తినలేదు.
    "వంట్లో ఏదోగా ఉంది. అన్నం తినాలని లేదు" అంది.
    "డాక్టర్ని పిలుచుకురానా?" అంది నీరజ.
    "ఈ మాత్రందానికి డాక్టరెందుకు! కళ్ళుమూసుకు పడుకుంటే అదే తగ్గిపోతుంది..."
    "పోనీ, పాలుతాగు అత్తయ్యా!"
    "తీసుకురా!" విసుగ్గా అంది లక్ష్మీదేవి.
    ఆ మరునాడు అలాగే జరిగింది. ఆరోజు పక్కింటి పిన్నిగారు లక్ష్మీదేవిని చూడటానికి వచ్చింది.
    "అలా ఉన్నావేం? చాలా నీరసంగా..." అంది.
    "రెండు రోజుల్నించీ అన్నం తినటంలేదు!" అని చెప్పింది నీరజ.
    పిన్నిగారు లక్ష్మీదేవి నుదురూ చెంపలూ ముట్టుకుచూసి ముఖం చిట్లించింది.
    "వంట ఎవరు చూస్తున్నారు? నువ్వేనా?" అంది నీరజతో.
    "అవును" అంది నీరజ తెల్లబోతూ.
    పక్కింటి పిన్నిగారు వెంటనే ఇంటికివెళ్ళి ఒక కారియర్ లో భోజనం సర్ది తీసుకొచ్చి లక్ష్మీదేవిని బలవంతపెట్టి దగ్గిరుండి తినిపించింది.
    నీరజకు అప్పటికి అర్థమయింది. నిర్ఘాంతపోయింది.
    ఆ మరునాడు నీరజ తనే లక్ష్మీదేవితో "అత్తయ్యా! వంట నువ్వే చేసుకో! నేను ఏమీ ముట్టుకోను!" అంది.
    లక్ష్మీదేవి ఏమీ మాట్లాడలేదు. వంటింట్లోకి నడిచింది. లక్ష్మీదేవి వంట పూర్తిచేసి ప్రభుకు, చంద్రశేఖరరావుకు వడ్డించి తను పెట్టుకుతిన్నాక నీరజ తినేది.
    ఒకరోజు లక్ష్మీదేవి వంట ఇంకా పూర్తికాకుండానే పొరుగింట్లో ఎవరో సత్యన్నారాయణవ్రతమని తీసికెళ్ళారు. ప్రభుకు ఆఫీస్ కు టైమయిపోయింది.
    "నీరజా! టైమయిపోయింది వడ్డించు" అన్నాడు. ఏదో పుస్తకం చదువుకుంటున్న నీరజ తలెత్తి అమాయకంగా చూసింది.
    "అలోచిస్తావేమిటి? త్వరగా వడ్డించు..." అన్నాడు.
    నీరజ నవ్వటానికి ప్రయత్నిస్తూ "అబ్బా! నేను ఈ పుస్తకం వదలలేను. నువ్వు పెట్టుకు తిందూ!" అంది.
    విస్తుపోయి చూశాడు ప్రభు_నీరజ చేతిలోంచి పుస్తకం లాగి అవతల పారేశాడు.
    "చాల్లే! త్వరగా పెట్టు!"
    "ఏమిటా మొండితనం! ఒక్కరోజు పెట్టుకుతింటే అరిగిపోవులే!"
    "అదేం కుదరదు! పెట్టవలసిందే!"
    "నేను పెట్టను"
    "పెట్టవూ?"
    "ఉహు!"
    "అయితే సరే! నేను అన్నం తినకుండానే వెళ్ళిపోతాను." కోపంగా బూట్లు తొడుక్కుని ప్రయాణమయ్యాడు. ఎప్పటికప్పుడే నీరజ తనను ఆపుచేస్తుందని ఆశతో ఎదురుచూసి నీరజ చలనం లేని బొమ్మలా కూర్చునేసరికి కోపంగా వెళ్ళిపోయాడు.
    తరవాత కంగారుపడుతూ వచ్చింది లక్ష్మీదేవి. నీరజను చూసి "ప్రభు వెళ్ళిపోయాడా?" అంది.
    "వెళ్ళిపోయాడు."
    "అన్నం తినలేదా?"
    "పెట్టమన్నాడు. నేను పెట్టలేదు."
    "నన్ను పిలవకపోయావా?"
    "పూజ జరుగుతున్నచోటికి నేను రావచ్చునా? దేవుడు మైలపడిపోడా?"
    లక్ష్మీదేవి మాట్లాడకుండా వెళ్ళిపోయింది. ఆవిడకూడా అన్నం తినలేదు.
    చేతులలో ముఖం దాచుకుని ఏడుస్తున్న నీరజ తలమీద చెయ్యిపడేసరికి ఉలిక్కిపడి తలెత్తి ప్రభునుచూసి గబగబ కళ్ళు తుడుచుకుంది...
    ఆఫీస్ కు వెళ్ళాడేగాని ప్రభు స్థిమితంగా ఉండలేకపోయాడు. నీరజ అహంకారంతో తనకు వడ్డించలేదని అనుకోలేకపోయాడు. అక్కడ ఉండలేకపోయాడు. అతడు అనుమానించినట్టే నీరజ ఏడుస్తోంది.
    "అన్నం పెట్టకుండా పంపించి తీరిగ్గా ఏడుస్తూ కూచో! బుద్ధిలేకపోతే సరి, ఇప్పుడైనా పెట్టు!" అన్నాడు.
    నీరజ గబగబా కళ్లు తుడుచుకుని "అత్తయ్యా! ప్రభు వచ్చాడు. అన్నం పెట్టండి." అంది.
    అప్పటికి ప్రభుకు అర్థమయింది. "నీరజా..." అన్నాడు ఆశ్చర్యంగా.
    పొంగివచ్చే దుఃఖాన్ని అణచుకుంటూ తల తిప్పుకుంది నీరజ.
    రెండు చేతులూ జాపి ఓదార్పుగా నీరజను తన గుండెలలోకి తీసుకున్నాడు ప్రభు.

                                                                                *    *    *

    సుశీల గర్భవతి అయింది. ఆ గర్భాన్ని కాపాడుకోవటానికి సుశీల చాలా యాతన పడవలసివచ్చింది.
    "నేను మీకొక అపురూపమైన కానుక ఇయ్యబోతున్నాను" అంది సుశీల.
    "నువ్వు కానుక ఇస్తావా?" ఆశ్చర్యంగా అడిగాడు బాలూ.
    "ఏం? మీకు కానుక ఇయ్యగలిగే శక్తిలేని నిర్భాగ్యురాలినని కదూ..."
    "అదికాదు! ఇయ్యగలిగినంతా ఇచ్చావు_ఈ జీవితంలో మరెక్కడా నేను పొందలేని ఆనందాన్ని నీదగ్గిర పొందగలిగాను_అంతకుమించిన కానుక ఈయగలవా?"
    "ఆ! అంతకు మించినదే!"
    "ఏమిటో అది?"
    "అల్లరి అబ్బాయి కావాలా? అందాల పాపాయి కావాలా?"
    "ఏమిటి నువ్వనేది?"
    "ఏం? నా మాటల్లో మీకు నమ్మకం లేదా? ఈ సంతానం మీదేనని అనుకోలేరా?"
    "అదికాదు_లాభంలేదు సుశీలా! ఇది పోయేమార్గం చూడు!"
    సుశీల కన్నీళ్ళతో రోషంగా చూసింది.
    "పోయేమార్గం చూడనా? ఎంత కష్టపడి దానిని నిలుపుకున్నానో, మీరు ఊహించగలరా?"

 Previous Page Next Page