Previous Page Next Page 
నీరజ పేజి 12


    కారు డ్రైవర్ సడెన్ బ్రేక్ వెయ్యటంవల్ల ప్రభు ప్రాణాలకు ప్రమాదం లేకపోయింది కాని దెబ్బలు మాత్రం బాగానే తగిలాయి. కారులో ఉన్నవ్యక్తి నీరజకు సహకరించి ప్రభును హాస్పిటల్ లో చేర్పించాడు.
    డాక్టర్ రౌండ్స్ కి వచ్చినప్పుడు ప్రభును ఎప్పుడు డిశ్చార్జ్ చేస్తారని నీరజ అడిగింది...
    "రెండు మూడు రోజులలో వెళ్ళిపోవచ్చు. కానీ, ఈయనకు గుండె దగ్గర బలమైన దెబ్బ తగిలింది. ఆ కారణంగా ముందుముందు ఎప్పుడైనా గుండెనొప్పి రావచ్చును. కొంచెం జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి!"
    డాక్టర్ వెళ్ళిపోయాక నీరజతో అన్నాడు ప్రభు. "విన్నావుగా! నాకు గుండెనొప్పి రావచ్చుట! నన్ను విడిచిపెట్టి వెళ్ళవుగా..."
    కన్నీళ్ళు ఆపుకుంటూ "వెళ్ళను" అన్నట్లు తల ఆడించింది నీరజ.

                                        *    *    *

    లక్ష్మీదేవి ఏది జరగకూడదని వెయ్యిదేవుళ్ళకు మొక్కుకుంటుందో, అదే జరిగింది. ప్రభు నీరజతో కలిసి ఇంటికి వచ్చాడు. చలనంలేని బొమ్మలా నిలబడిపోయింది.
    "అమ్మా! నీరజ కనిపించింది. రానంటే రానంది_మన నీరజ మన దగ్గరికి రాక ఏమయిపోతుందమ్మా! నేను బలవంతంగా..."
    పేలవమైన నవ్వుతో సంజాయిషీ ఇచ్చుకొంటున్నట్లు, నచ్చజెప్పుతున్నట్లు ఏదో అనబోతున్న ప్రభు మాటలు, లక్ష్మీదేవి గిర్రున తిరిగి లోపలికి వెళ్ళిపోవటంతో ఆగిపోయాయి...దిగులుగా తనను చూసే నీరజ చెయ్యి గట్టిగా పట్టుకొని లోపలకి నడిపించుకుని వెళ్ళాడు ప్రభు...
    క్షణాలలో నీరజ అక్కడికి వచ్చిన వార్త చుట్టుపక్కల ఇళ్ళకు వ్యాపించింది. అందరూ చేస్తున్న పనులు లాగే వదిలేసి లక్ష్మీదేవి ఇంటికి చేరుకున్నారు. నీరజ గదిలోకి పారిపోయి తలుపు గట్టిగా బిగించుకుంది. అమ్మలక్కలకు లక్ష్మీదేవి మాత్రమే దొరికింది.
    "ఇదేమిటి లక్ష్మీదేవీ! ఇంత బ్రతుకు బ్రతికి దాన్ని కోడలిగా తెచ్చుకుంటున్నావా? ఇంక ఈ ఇంటి పరువుప్రతిష్ఠలు..."
    "పరువు ప్రతిష్టల సంగతి సరేలే! ముందు ప్రాణమానాల సంగతి ఆలోచించుకోండి! దానికోసం ఆ గూండాలు ఇంటిమీదకూడా పడితే మీగతేమిటి?"
    "ఎందుకైనా మంచిది! దాన్ని నీ కొడుకు గదిలోకి రానియ్యకు!"
    "ఇంకా నయం! ఇప్పుడది ఉన్నది ఎక్కడనుకుంటున్నావు?"
    "ఏమిటి? ఇంకా పెళ్ళికాకుండానే ఇద్దరూ ఒక్క గదిలో ఉంటున్నారా?"
    "సరేలే! దానికి పెళ్ళి, కార్యం, ఈ తతంగాలన్నీ తక్కువయ్యాయా?"
    అన్నీ వింటూ శిలలా కూర్చుంది లక్ష్మీదేవి_వచ్చినవాళ్ళకెవరికీ సమాధానంగా లేదు.
    "అయ్యో! లక్ష్మీదేవీ! నీ బ్రతుకు ఇంతకు దిగాజారిందే తల్లీ!" అంటూ లక్ష్మీదేవిని కౌగిలించుకుని బావురుమంది ఒకావిడ ... లక్ష్మీదేవి అతిప్రయత్నంమీద ఆ కౌగిలి వదిలించుకుని కాస్త దూరంగా జరిగికూర్చుంది.
    "పర్వాలేదులే! ఇప్పుడేదో మోజులో దాన్ని తీసుకొచ్చాడేగాని ఈ మోజు నిలుస్తుందా, పాడా? నాలుగురోజులు పోతే తనుచేసిన దానికి తనే పశ్చాత్తాపపడి దాని దారిన దాన్ని పంపించేస్తాడు. అప్పుడు లక్షణంగా మరో సంబంధం చూసి పెళ్ళిచెయ్యొచ్చు..."
    ఆశాభావం వ్యక్తంచేస్తూ ఓదార్పుగా అంది మరొక వ్యక్తి...
    లక్ష్మీదేవి దగ్గరినుంచి తగినంత ప్రోత్సాహం రాకపోవటంతో విసిగి వెళ్ళిపోయారు అమ్మలక్కలు...
    నీరజ ఆపుచేస్తోంటే బలవంతాన నిగ్రహించుకుంటూ లోపల కూర్చున్న ప్రభు విసురుగా బయటకు వచ్చాడు...
    తల్లిముఖం చూడగానే అతని విసురంతా ఎక్కడిదక్కడ ఎగిరిపోయింది. ఎంతగానో కుమిలిపోతూ దానిని అణచుకునే ప్రయత్నం లక్ష్మీదేవి ముఖంలో స్పష్టంగా కనిపిస్తోంది. ఎన్నెన్నో అందామని వచ్చిన ప్రభు కొంతసేపటివరకు మాట్లాడలేకపోయాడు.
    "వాళ్ళందరినీ పొమ్మనకపోయావా అమ్మా!" అన్నాడు.
    "పొమ్మన్నను_నీకు పుణ్యం ఉంటుంది నువ్వూ పొమ్మని అనకు"
    "అలా వాగుతుంటే..."
    "పర్వాలేదు! ఎన్ని సాధింపులైనా భరిస్తూ సమాజంలో ఉండటమే సుఖం! సమాజానికి వెలివడి బ్రతకలేము. నువ్వు చేసే పనుల ఫలితాన్ని నీముందు తరంలో తల్లిదండ్రులూ, నీ తరువాతి తరంలో సంతానము అనుభవించక తప్పదు..."
    లక్ష్మీదేవి అంత శాంతంగా దృఢంగా మాట్లాడుతోంటే ప్రభు మనసులో ఏదో అవ్యక్తమైన భయం కలిగింది కొంచెంసేపు.
    అప్పుడే పేకాటలోంచి వచ్చాడు చంద్రశేఖరరావు.
    "ఏరా ప్రభూ! నీరజను తీసుకొచ్చావా? వీల్లేదు! ఆ చెడిపోయినదాన్ని మన ఇంట్లో ఉంచటానికి వీల్లేదు!" అన్నాడు గట్టిగా అరుస్తూ.
    ఏనాడూ ఇంటి బాధ్యత పట్టించుకోకుండా, తను చెమటోడ్చి సంసారం నడుపుతోంటే విలాసాల్లో, మునిగితేలుతూ ఈనాడు ఇలా ఆజ్ఞాపిస్తున్న తండ్రిని చూస్తోంటే జుగుప్స కలిగింది ప్రభుకు.
    "ఈ ఇంటికోడలు! ఈ ఇంట్లో ఉండక ఎక్కడికి వెళ్తుంది?" అన్నాడు.
    "ఈ ఇంటికోడలా? దాన్ని పెళ్ళిచేసుకుంటావా? అలా జరగటానికి వీల్లేదు."
    "నేను తప్పకుండా నీరజను పెళ్ళిచేసుకుతీరతాను."
    "ఇడియట్! కని పెంచి ఇంతవాణ్ని చేసినందుకు ఇదా నువ్వు చూపించే కృతజ్ఞత?"
    ప్రభులో సహనం నశించిపోయింది...
    "మీరు కనబోయేముందు నన్ను అడిగి ఉండవలసింది ... కన్నంత మాత్రాన ఎదిగాక కూడా వ్యక్తిత్వం పెంచుకోకుండా మీకు బానిసలా పడిఉండలేననీ... నన్ను కనవద్దనీ... చెప్పి ఉండేవాణ్ని!"
    వెటకారంగా అన్నాడు ప్రభు. బిత్తరపోయి చూసాడు చంద్రశేఖరరావు. లక్ష్మీదేవి సహించలేకపోయింది...
    "అవును ప్రభూ! పెద్దవాడివయ్యావు_నిన్ను శాసించే అధికారం మాకులేదు_బయటకుపోయి మా బ్రతుకులు మేము బ్రతకగలిగే సామర్థ్యమూ లేదు. దయతలిచి గుప్పెడు మెతుకులు పడేస్తున్నావు. తిని పడిఉండక నీకు బుద్ధులు చెప్పటంకూడానా? క్షమించు!..."
    భర్త చెయ్యిపట్టుకుని లోపలకు లాక్కుపోయింది. ప్రభుకు తల తిరిగినట్లయింది? నీరజకు పిచ్చెక్కినట్లే అవుతోంది!
    "నేను వెళ్ళిపోతాను ప్రభు!" అంది బ్రతిమాలితున్నట్లుగా...
    నీరజ రెండుచేతులూ గట్టిగా పట్టుకున్నాడు.
    "వద్దు! ఆ మాటమాత్రం అనకు! ఈ బాధలన్నీ నీతోకలిసి సుఖంగా అనుభవించగలను. నువ్వు వెళ్ళిపోతే మాత్రం నరకమే నాకు!"
    లక్ష్మీదేవికి వంటపనుల్లో సాయం చెయ్యటం మొదటినుంచీ అలవాటే నీరజకు_ఎప్పటిలా వంటలో సాయం చెయ్యబోయింది.

 Previous Page Next Page