Previous Page Next Page 
సృష్టి పేజి 13


    జయరాజ్ కి, వాళ్ళ అన్నకి మొదటినుంచీ ఆస్తి వ్యవహరాల్లో తగువులుండేవి. నాలుగైదుసార్లు వాళ్ళిద్దరూ  పొలాల్లో తగువులు పడ్డారు. ఒకర్నొకరు చంపుకుంటామని ప్రతిజ్ఞలు కూడా చేసుకున్నారు. జయరాజ్ అన్నదమ్ములిద్దరూ మొండివాళ్ళు. పంతంకోసం, పట్టుదలకోసం ఏమైనా చెయ్యగలిగే సమర్థులు. తాన్ పంతంలో భాగంగా జయరాజ్  ఒకరోజు రాత్రి తన అన్న పంట పొలాలమీద దాడి చేసి పంటను పూర్తిగా దగ్ధం చేయించాడట.

 

    అది జరిగిన సరిగ్గా అయిదు రోజుల తర్వాత.....

 

    రాత్రి పదిగంటల సమయంలో....

 

    పల్లెటూరు కావడం వల్ల అందరూ నిద్రలోకి జారుకున్న సమయంలో, ఊరు మధ్యలో వున్న టూరింగ్ టాకీస్  లో జానపద  సినిమా జోరుగా నడుస్తోంది. తండ్రికి చెప్పకుండా రెండ్రోజులకొకసారి రాత్రివేళల్లో సినిమాలకు పారిపోవడం పుష్పరాజ్ కి చిన్నప్పటినుంచీ అలవాటు.

 

    ఆ రోజు కూడా అలాగే వెళ్ళిపోయాడు.

 

    సరిగ్గా......

 

    పది గంటల ఇరవై అయిదు నిమిషాలకు హాల్లోంచి జనం బయటకు పరిగెడుతుంటే వాళ్ళతో పాటు తనూ పరుగెత్తాడు పుష్పరాజ్.

 

    "ఒరేయ్ పుష్పా! మీ ఇల్లు తగలబడిపోతోందిరా" ఎవరో వేసిన కేకకు శక్తినంతా కూడదీసుకుని ఇరవై గజాల దూరంలో వున్న ఇంటి కొచ్చాడు పుష్పరాజ్.

 

    అప్పటికే ఇల్లు భగభగమని మండిపోతోంది.

 

    ఇంట్లోంచి రాబోతున్న తండ్రిని సవతి తల్లిని ఎవరో అటకాయించి నిప్పుల్లోకి నెడుతున్న దృశ్యం కళ్ళారా చూశాడు అతను.

 

    నిప్పుల్లోంచి తప్పించుకోలేక పుష్పరాజు పినతల్లీ, తండ్రి నిలువునా మాడి మసైపోయిన ఆ ఘోరమైన దృశ్యాన్ని కళ్ళారా చూశాడు పుష్పరాజ్.

 

    అదే సమయంలో పుష్పరాజ్ దృష్టి.....

 

    ఒక వ్యక్తి చేతిలో గిలగిలలాడుతున్న చెల్లెలు మీద పడింది.

 

    చెల్లెలు కోసం, తను ప్రాణానికి ప్రాణంగా ప్రేమించే చెల్లెలికోసం ముందుకెళ్ళబోయిన.....

 

    పుష్పరాజుకి కాళ్ళకేదో రాయి తగులుకొని కిందపడిపోతూ కళ్ళెత్తి చూశాడు.

 

    ఆ వ్యక్తి తమ కుటుంబంమీద కక్ష పెంచుకున్న పెదతండ్రి పంపిన  కిరాయి గుండా.

 

    అతను నాలుగేళ్ళ చెల్లిని, రెండు చేతుల్తో ఎత్తి విహ్వలంగా భయంకరంగా , భయానకంగా.....

 

    ఎగురుతున్న జ్వాలల్లోకి విసిరేయడం పుష్పరాజు కళ్ళారా చూశాడు.

 

    చూసిన మరుక్షణం  స్పహ తప్పిపోయాడతను. అప్పటికే ఊరిజనం చుట్టుముట్టడంతో దుండగులు పారిపోయారు" తను సేకరించిన ఇన్ఫర్మేషన్ ని చెప్పి హరిహరన్ కళ్ళల్లోకి చూశాడు మేఘమలై.

 

    "తర్వాత?" ఎగ్జయిటింగ్ గా అడిగాడు ఆయన.

 

    "తర్వాత పుష్పరాజ్ పదిహేను రోజులపాటు పీలేరు గవర్నమెంటు హాస్పిటల్లో వున్నాడు. దేహానికి తగిలిన గాయాలు మానిపోయాయి. కానీ అతని మనసుకి తగిలిన గాయం మానలేదు" చెప్పి ఆగాడు మేఘమలై.

 

    "అంటే?"

 

    "ఫైర్ ఫోబియా. ఆ రోజు నుంచీ అతనికి నిప్పంటే భయం. రాత్రిపూట అగ్గిపుల్ల మంటను చూసినా అతను భయపడేవాడట. హాస్పిటల్లో ఉండగానే ఓ రోజు అతని గదిలోకి వచ్చిన నర్స్


 సడన్ గా లైటు వెయ్యడంతో వెలిగిన బల్బు వేపు భయం భయంగా చూసి పిచ్చిగా వైల్డ్ గా రియాక్టయ్యి ఆ  నర్స్ ని కత్తెరతో పొడిచేశాడట. ఎక్కువసేపు చీకట్లో గడపడం పుష్పరాజుకి ఇష్టమట."

 

    మేఘమలై చెపుతున్న విషయాల్ని చాలా ఆసక్తిగా వింటున్నాడు ఆయన.

 

    "ఇంకో ఇంపార్టెంట్ విషయం సర్! పుష్పరాజు పీలేరు నుంచి పారిపోయింది భోగిపండుగరోజు. ఆ రోజు అతని మేనత్త మామూలు గానే  అతనికీ స్నానం చేయించి కొత్తబట్టలు  తొడిగింది. పావుగంట తర్వాత ఎవరో  ఫ్రెండ్స్ బలవంతంగా అతన్ని భోగిమంట  దగ్గరకు సరదాగా లాక్కెళ్ళారట. అంత పెద్ద ఎత్తున  ఎగిసిన మంటల్ని చూసి భయంకరంగా అరిచి వైల్డ్ గా  రియాక్టయి ఆ ఫ్రెండ్స్ లో  ఇద్దర్ని గాయపరిచి పారిపోయాడట. ఆ రోజు అలా పారిపోయిన పుష్పరాజ్  ఈ రోజుకి కూడా ఆ వూరు  రాలేదట."

 

    హరిహరన్  అయిదు  నిమిషాల వేపు మాట్లాడలేదు.

 

    "ఫైర్ ఫోబియా!" ఆ విషయం గురించి చాలాసేపు ఆలోచించాడాయన.

 

    "ప్రస్తుతం ఆ వూళ్ళో పుష్పరాజ్ బంధువులెవరైనా వున్నారా?" అడిగాడాయన.

 

    "లేరు సార్! అందరూ చనిపోయారు" చెప్పాడు మేఘమలై.

 

    హరిహరన్ కళ్ళలో ఒకింత వెలుగు. పరిశోధన ముందుకు కదులుతుందన్న నమ్మకం ఆయనలో ఏర్పడింది ఆ క్షణాన.

 

    "పుష్పరాజ్ ను పట్టుకోవాలంటే అతని వీక్ నెస్ తో అతన్ని వెంటాడాలన్న మాట" మూడు నిమిషాల తర్వాత అన్నాడు హరిహరన్.

 

    మేఘమలై ఏం మాట్లాడలేదు...

 

    
                                            *    *    *

 

    రెండు గంటల తర్వాత......

 

    మద్రాసులోని ఫేమస్ సైక్రియాటిస్ట్- అరుణ సుందరం నర్సింగ్ హోంలో అరుణ సుందరం ఎదుట వున్నాడు హరిహరన్.

 

    హరిహరన్ చెప్పిందంతా విన్నాడు అరుణ సుందరం. ఆ తర్వాత చెప్పడం ప్రారంభించాడు-

 

    "నేరస్తులకు, ఫోబియాలకు చాలా దగ్గర సంబంధం వుంది. మీకు తెల్పే వుంటుంది.- ఆరేళ్ళ క్రితం ఇక్కడే వెల్లివాకంలో మాస్ మార్డర్స్ చేసిన  ఒక క్రిమినల్ కి ఫ్యాన్స్ ఫోబియా - పైన గిరగిరా తిరిగే ఫ్యాన్ తన మీద  పడిపోతుందని, ఆ ఫ్యాన్ తన మీద పడి తను చనిపోతానని భయం. అందుకే  ఇంట్లో  ఎవ్వరికీ  తెలియకుండా  అన్ని రూమ్స్ లోనూ ఉన్న ఫ్యాన్స్ ని  తీసేసి  స్టోర్ రూమ్ లో దాచేసేవాడు.

 

    రాత్రికి రాత్రి ఫ్యాన్లు మాయం కావడంతో ఇంట్లో అనుమానం మొదలైంది. వాళ్ళ అన్నయ్య స్టోర్ రూమ్ లో ఉన్న ఫ్యాన్లను తీసికొచ్చి యథాప్రకారం తగిలించేవాడు.

 

    ఆ సంఘటనతో ఆ క్రిమినల్ తన అన్నయ్య మీద, వదిన మీద, అన్నయ్య పిల్లలమీద కక్ష పెంచుకున్నాడు. ఒక రోజు రాత్రి తనే స్వయంగా వాళ్ళందర్నీ మర్డర్ చేసిపారిపోయాడు."

 

    అరుణసుందరం చెప్పిందాన్ని ఆసక్తిగా వింటున్నాడు హరిహరన్.

 

    "మీరు ఆశ్చర్యపోయే అతి చిన్న విషయం చెప్తాను. ఇరవై ఏళ్ళ క్రితం నా దగ్గరికి ఓకే పేషెంటును వాళ్ళ బంధువులు తీసికొచ్చారు. ఆ పేషెంటుకి షర్ట్ కి బటన్స్ కుట్టించుకోవడం భయం. ఆ బటన్స్  గుండె నరాలకు నిద్రలో నొక్కుకుపోటు తనెక్కడ చనిపోతానో అని జీవితాంతము అతను తన షర్టులకు గుండీలు కుట్టించుకోలేదు. ఇదో రకమైన ఫోబియా. క్రిమినల్  సైకాలజీలో ఈ ఫోబియాల వెనక చాలా హిస్టరీ  వుంది.

 

 Previous Page Next Page