విజయ ఏమీ అనలేదు.
'అత్తగారి సంగతి వదిలిపెట్టు. మొగుడిగారి సంగతి ఏమిటీ నేనయితేనా ఇలాంటి చేతకాని దద్దమ్మతో ఒక్కరోజు కాపురం చేయను" - శారద ఆవేశంతో అంది. "అలాగే చూస్తాగా" తల్లి అన్నం వడ్డిస్తూ అంది.
భోజనాలు చేసాక ఎన్నెన్నో కబుర్లు చెప్పుకున్నారంతా.
తెల్లారిన తర్వాత స్నానం చేసి పూజ చేసుకుంది విజయ. భోజనాలు అయ్యాక బయల్దేరి అత్తవారింటికెళ్ళి పోయింది.
"రేపు వస్తాడుగా బావ - నిలదీసి అడుగులే. మీకు మా నాన్న స్కూటరు కొనియ్యాలా. ఎందుకు - ఆడపిల్లనిచ్చి పెళ్ళిచేసినందుకు అది బతికున్నంతకాలం మిమ్మల్ని చూసి భయపడుతూ, మిమ్మల్ని సంతోషపరుస్తూ వుండాలా. రానీ, రేపు చెప్తా - శారద చాలా కోపంగా అంది.
ఆడపిల్లని కన్నందుకు తప్పదు ఇవన్నీ. నువ్వేమీ అనకు అతన్ని - బాగుండదు - తల్లి పక్కన కూరతరుగుతూ అంది.
ఎవరిపనులలో వారు మునిగివున్నారు. వంటింట్లో తల్లి, వీధి, గదిలో తండ్రి, కాలేజికి వెళ్ళే హడావిడిలో శారద వున్నారు.
"మీయింట్లోనే వుంచుకుంటారా. మా ఇంటికి" పంపరా సుగుణమ్మ అంటూ లోపల కొచ్చింది.
'రండి వదిన గారూ' శాంతమ్మ లోపాలకి తీసుకొచ్చింది. 'ఏదీ మాకోడలు'
'మీ కోడలా, నిన్న పొద్దున్నే వెళ్ళిపోయింది - అదేమిటీ ఖంగారుగా అంది తల్లి.
"ఏదీ రాందే ఇంటికి" - సుగుణమ్మ ఖంగారు పడింది.
'ఇంటికి రాలేదా - ఎక్కడికెళ్ళినట్టు - అలా చెప్పకుండా ఎక్కడికీ వెళ్ళదే - శారదా అక్క ఆ ఇంటికి వెళ్ళలేదటమ్మా' తల్లి, గొంతులో గాద్గద్యం.
ఇంట్లో అందరూ తలోదిక్కూ వెళ్ళారు. ఎక్కడకి వెతకగలరు - అందరిముఖాల్లోనూ నిరాశే సుగుణమ్మ సుధాకర్ భయపడిపోయారు. ఏమో, కలి కాలం పిల్లలు - ఏ అఘాయిత్యం చేసిందో - సుగుణమ్మ నసిగింది.
తెల్లారే సరికి సమస్య తేలిపోయింది. ఎర్రజాకెట్టు, పసుపురంగు చీర కట్టుకున్న, ఎర్రనిగాజు లేసుకున్న విజయ టాంకుబండ్ లో శవమైతేలింది. అమ్మనాన్న, అత్త, మొగుడు ఎవరేమనుకున్నా తనకేవీ సబంధం లేని దూరతీరాలకు వెళ్ళిపోయింది విజయ!.
మనసు ముక్కముక్కలయింది శారదకి !
ఆడపిల్లయిపుట్టకూడదనే మాట నిజమేనా !
- నిజమేనేమో !
శారదకి అన్నలిద్దరు. ఇద్దరూ గవర్నమెంటు ఉద్యోగస్థులే రిటైరయ్యాక ఎలాగా అని ఆలోచించాల్సిన పనిలేదు. పెన్షన్లు వస్తాయి ఇద్దరికీ పంగగలకి పిల్లల్ని వెంటబెట్టుకుని భార్యలతోకలసి అన్నలిద్దరూ వస్తారు ఊరికి. అదేం చిత్రమో ఊరినించి వెళ్ళేప్పుడు ఎప్పుడూ తండ్రి దగ్గర డబ్బు అప్పుతీసుకెళతారు. పంపిస్తామంటారు. ఇద్దరూ పంపరు. వీళ్ళవ్యవహారం కోపం తెప్పిస్తుంది శారదకి.
"ఏమిటిరా - అన్నయ్య. బుజ్జికి స్కూలు ఫీజు కట్టుకోలేవా - పుస్తకాలు కొనటం చాలా కష్టమా - అందుకు నాన్నగారు నీకు సహాయం చేయాలా - నాన్నగారూ ఎలాటి సహాయం చేయరు - పోండి" అంది.
ఆరోజు ఇంట్లో పెద్ద గొడవ జరిగింది.
అసలు ఆవిడెవరో ఇవ్వద్దనటానికి ముందు అడగండి - పెద్దకోడలు కొడుకును మోచేత్తోపొడిచింది.
'నీకెందుకూ అనవసర విషయాలు. వెళ్ళుకాలేజికి అన్నాడు అన్నయ్య.
'అవును నాన్నగారు ఎన్నేళ్ళు మీకుటుంబాలకి సహాయం చేస్తారు ఆయన వృద్దాప్యానికి దాచుకోవద్దా అంది శారద మళ్ళీ.
"మా పిల్లలకి నాలుగొందలు యిచ్చినంతమాత్రాన మీనాన్న డబ్బంతా అయిపోతుందా అంత జాగ్రత్త తెలిసిన దానివయితే, చీరలకి, గోళ్ళరంగులకీ, సినిమాలకి ఖర్చచేయటంమానేయి. మాకు బుద్దులు చెప్పక్కర్లేదు నువ్వు - ఓ పెద్దా లేదు చిన్నా లేదు - మర్యాదా లేదు - వదినకసిరింది.
'లక్షల లక్షలు ఖర్చు చేసి నిన్ను ఒక ఇంటి దాన్ని చేయాలిగా - అప్పుడెక్కడ నుంచి వస్తాయి డబ్బులూ - అయినా ఆడపిల్లవి అన్నమీద పెత్తనం చేస్తున్నవా - చిన్నవదిన అరిచింది.
తల్లితండ్రి వింటూ వూరుకున్నారు - వాళ్ళెందుకు అలా ఊరుకుంటారో శారదకి ఎప్పుడూ తెలియదు అయినా తనేం తప్పుమాట అందీ. శారద తల్లివంకచూసింది. - "నోరుమూసుకోవే - ఏదో నాలుగు రోజులుండి వెళ్ళిపోయే వాళ్ళతో ఏమిటీ గొడవ - బాగుండదు 'తల్లీ తనమీదే అరిచింది' ఆడపిల్ల అమ్మకి నాన్నకి కూడా లోకువేనా అనుకుంది శారద. ఇంట్లో ఆడపిల్లకి, మగపిల్లాడికి ఎప్పుడూ, అన్నిట్లోనూ ఎందుకు తేడా చూపిస్తారో ఎంత తలబద్దలుకొట్టుకున్నా అర్ధంకాలేదు శారదకి.
అన్నలకి వదినలని చూసి అమ్మనాన్న ఎందుకింత భయపడుతున్నారో అర్ధంకాలేదు శారదకి. ఏ బాధ్యతవహించని కొడుకులంటే గౌరవం, భయం - అర్ధంకాలేదు శారదకి.
'రేపు మాకుకొరివి పెట్టాల్సింది వాళ్ళేకదా, అందుకు' రాజారావు మెల్లగా అన్నాడు.
మీకు కొరివి నేను పెట్టకూడదా - శారదమనసులో అనుకుంది. 'సరే, మీ యిష్టం, బాంకునుంచి ఎంత తీసుకురాను' అంది.
'నువ్వుతెచ్చేదేమిటీ - ఆ చెక్ బుక్ ఇటియ్యీ' పెద్దన్నయ్య అరిచాడు.
ఈ మధ్య రాజారావుకి మోకాలు నొప్పులు మొదలయ్యాయి అందుకని బయటపనులన్నీ శారదే చూస్తోంది.
'నాన్నగారూ - దాని పెళ్ళి విషయం మరేం ఆలోచించటంలేదా - ఈ ఏడాదితో చదువయిపోతుందిగా' - చిన్నబ్బాయి అన్నాడు.
'ఎందుకు ఆలోచించనూ. చూస్తున్నాను. టైమురావాలిగా రాజారావు గొంతుసవరించుకున్నాడు.
'టైమానాన్నా. మూడున్నర. ఇప్పుడు టీ టైము నవ్వింది శారద.
'నీ పెళ్ళిగురించే నాన్నగారు చాలా వర్రీ అయిపోతున్నారు. 'పెద్దన్నయ్య అన్నాడు 'నా పెళ్ళి గురించి ఎవరూ ఆలోచించనక్కర్లేదు' - శారద జడముందుకేసుకుంటూ అంది.
'ఎవరినైనా చూసుకుందేమోనుమరి' పెద్దవదిన దీర్ఘంతీసింది.
'నేనసలు పెళ్ళి చేసుకోను'
అక్కడున్న అందరూ ఫక్కున నవ్వారు.
'ఇదిగో శారదా, నీలాటి దే ఒకమ్మాయి పెళ్ళిచేసుకోను ఈ మగాళ్ళంతా చెడ్డవాళ్ళు. స్త్రీలను పైకి రానీయకుండా అణచివేయాలని చూస్తుంటారు - పురుషాహంకారాన్ని ఎదిరించాలి అని ఒకటే మాటలు చెప్పేదట. అమ్మాయి పెళ్ళిచేసుకోదనీ, అందరి ఆడాళ్ళలాటి దీకాదనీ అనుకునే వారట - చివరికి ఏం చేసిందో తెలుసుగా అమ్మాయి..... పక్కింటి పిల్లల్ని స్కూలుకి తీసుకెళ్ళే రిక్షావాడితో లేచిపోయింది - అదీ కథ " చిన్నవదిన గలగలా నవ్వింది.