శారద తలపట్టుకుకూర్చుంది. ఇది పెద్ద సమస్య.....చేతిలో టెలిగ్రాం కదులుతోంది. తండ్రి రమ్మని కబురు - వెళ్ళాలి - కానీ - శారదకి నిజంగా భయమేసింది వెళ్ళాలంటే - తనలో వస్తున్న విపరీతపు దోరణులను అర్ధంచేసుకొనేవారు లేరక్కడ. ఎక్కడా లేరు - ఆ ఊరికి వెళ్ళగానే ఎవరెవరు ఏమేమీ ప్రశ్నిస్తారో - ఎందరికి సమాధానాలు చెప్పాలో పోనీ, వెళ్ళటం మానేస్తే ఏమవుతుంది? ఎలాగైనా వెళ్ళితీరాలి - నిశ్చయించుకుంది. తనను కన్నతండ్రి - వెళ్ళాలి!
శారద కళ్ళముందు ఒక్కసారిగా తన కుటుంబమంతా నిలిచింది. తనకి ముగ్గురక్కలు ఇద్దరన్నలు - తన వాళ్ళందరినీ చూసి ఎన్నో ఏళ్ళయినట్లే అనిపించింది. ఉద్యోగం కోసం తను హైదరాబాదులో వుంది. రిజిస్టరు మారేజి చేసుకుంది. తనవాళ్ళెవర్నీ కలవలేదు - ఎన్నో ఊహించరాని విషయాలు జీవితంలో ప్రవేశించాయి - శారదకి కళ్ళలో నీళ్ళుతిరిగాయి ఒక్కసారి.
తండ్రి రాజారావుది చిన్న పెంకుటిల్లు. దొడ్లో నాలుగు కొబ్బరి చెట్లున్నాయి. ఆ నాలుగు చెట్లు కొంత ఆదాయం యిచ్చేవి కుటుంబానికి. శారద తండ్రి రాజారావు చేసే వుద్యోగం టైపిస్టు ఉద్యోగమేకాని డబ్బుకి ఇబ్బంది లేదు. ఎందుకంటే రాజారావు తండ్రి చాలా ఆస్తి సంపాదించి కొడుక్కిచ్చాడు. ఆస్తి పెంచకపోయినా పాడు చేయలేడు. అయితే ఆడపిల్లల పెళ్ళిళ్ళకి అప్పులు చేయటం, పంటమీద వచ్చే డబ్బుతో అప్పులు తీర్చటం అలవాటయిపోయిన రాజారావు ఆడపిల్లల పెళ్ళిళ్ళకీ భయపడలేదు. రాజారావు పెద్దల్లుడు గవర్నమెంటు ఉద్యోగం చేస్తున్నాడు. పెద్ద కూతురు రాజ్యం ఎంతో పొదుపుగా, లక్షణంగా కాపురం చేసుకుంటోంది. ముగ్గురాడపిల్లల తల్లి రాజ్యం. భర్త సంపాదనలో అంతోయింతో దాస్తూ, ఆడపిల్లకని అప్పుడూ అప్పుడూ కొద్ది కొద్దిగా బంగారం కొని దాచిపెడుతూ వుంటుంది. రెండు జతల గాజులు, గొలుసు, చెవులకి జుంకాలు అయినా వుండద్దా అంటుంది రాజ్యం. ఆ సంసారంలో మునిగి తేలుతూ మహాలక్ష్మిలా నవ్వుతూ కనిపిస్తుంది రాజ్యం. రాజ్యాన్ని చూస్తే రాజారావు శాంతమ్మ కూడా ఎంతోతృప్తి ఆ పిల్ల పుట్టినప్పుట్నుంచీ తల్లితండ్రులను ఎలాంటి ఇబ్బంది పెట్టకుండా పెరిగింది. రాజ్యం భర్త సూర్యనారాయణ ముక్కుకు సూటి మనిషి రాజారావు రెండోకూతురు సీతమ్మ - పెళ్ళయి అత్తవారింట్లో కాపురం చేస్తోంది. ఇద్దరు మగపిల్లలు - అయితే, సీతమ్మ అత్తింటి కాపురంలోకి ప్రసిద్దమయి పోయింది. ప్రతి నాలుగు నెలలకి ఏదో వంకతో పుట్టింటికి పంపేస్తారు. అత్తగారు. "ఏం మీనాన్నకి అంత కొబ్బరితోటవుంది - నరసాపురం కొబ్బరి తోటలు ఎంత విలువైనవీ - మనుమడికి బంగారు మొలతాడు చేయించమని చెప్పు" అని చెప్పి పంపిస్తుంది. సీతమ్మ తలొంచుకుని పిల్లలిద్దర్నీ వెంట పెట్టుకుని పుట్టింటికి వచ్చేస్తుంది. రెండు నెలలు వుండిపోతుంది. కానీ అత్తగారు చెప్పిన విషయం నెమ్మదిగా తల్లికి అందజేస్తుంది. రాజారావు ఆ విషయం విని మండిపడిపోతాడు. నువ్వు ఇద్దరు పిల్లల తల్లివి. రెండు పురుళ్ళు పోసాం. ఇంకా మమ్మల్ని కాల్చుకుతింటే ఎలాగ. మీ అత్తగారికి చెప్పుమావాళ్ళకి చాలా డబ్బు ఇబ్బందులున్నాయి -బంగారు మొలతాడు చేయించలేరు అని"-
సీతమ్మ మాట్లాడదు. ఇంకోనెల గడుస్తుంది.
'అమ్మకి ఒంట్లో బాగాలేదు - నిన్ను రమ్మంది. అమ్మా చెప్పిన విషయం గుర్తుందా' అంటూ భర్త దగ్గర నుంచి వచ్చిన ఉత్తరం అందుకుని, తల్లికి చూపిస్తుంది రహస్యంగా శాంతమ్మ భర్తని బతిమాలుతుంది. ఆడపిల్ల ఏడుస్తే మనకే అశుభం" అంది శాంతమ్మ.
'ఎందుకేడువాలి ఆడపిల్లా మా వాళ్ళు ఇక పెట్టలేరని చెప్పమను నోరు మూసుకోమని రాయి' - కాలేజిలో చదువుకొనే శారద అంది ఓనాడు. సీతమ్మ ముక్కుతుడుచుకుంది. శాంతమ్మ మెడలోవున్న ఆరువరుసల పలకసరులలో రెండువరసలు తీసి, పిల్లాడికి బంగారు మొలతాడు చేసి, పిల్లలిద్దరినీ, సీతమ్మని తునిలో దింపి రావడం జరిగింది. సీతమ్మ మొగడు అతని తల్లి గీసిన గీతదాటడు. రాజారావు మూడోకూతురు విజయ. పిల్లలందరిలో తెలివైనది. అందమైనది. చక్కగా సంగీతం పాడుతుంది. పిల్ల రూపాన్ని పాటని చూసి మురిసిపోయింది సుగుణమ్మగారు. ఓ పెళ్ళిలో చూసింది. విజయని. తన కొడుకు ఇంజనీరింగ్ చదువుతున్నాడు. కావాలని అడిగి పెళ్ళిచేసింది. ఐతే విజయ కాపురం మున్నాళ్ళముచ్చటయింది. అత్తవారింట్లో అడుగుపెట్టిన నెలరోజుల నుంచీ, ముందు ప్రేమగా వున్న అత్తగారు నెమ్మదిగా సాధించటం మొదలుపెట్టింది. పిల్లబావుందని అడిగి చేసుకున్నందుకు మేము లోకువయిపోయాము. మావాడికి ఓ అచ్చటాలేదు ముచ్చటాలేదు. వడి స్నేహితులందరూ లక్షల లక్షల కట్నాలు తీసుకుంటుంటే, ఏమిటో నేనే తొందరపడి పెళ్ళికి సిద్దపడ్డాను. అంతగతిలేని వాళ్ళు ఆడపిల్ల పెళ్ళి చేయకూడదు" సుగుణమ్మ ఒకసారి అరిచింది కోడలు విజయపైన. వీధి గుమ్మంలో వుండి వింటున్నది శారద.
"ఇంకా నయం అత్తయ్యగారూ ఆడపిల్లని కనకూడదు అనలేదు అది కోపంగా శారద.
'ఏం అంటాను. ఆడపిల్లనికంటే సరా. పెళ్ళిచేసి పంపిస్తే సరా ఎన్ని చూడాలి. చేతకాకపోతే నీ అక్కని నీతో తీసుకెళ్ళు అంది సుగుణమ్మ.
విజయ గజగజవణికిపోయింది. "ఊరుకోవే శారదా - ఊరుకో" బతిమాలింది.
"నువ్వు చేసుకోవమ్మా. కట్నాలు కానుకలు లేకుండా ఎవడైనా వస్తే -- అమ్మా శారదా - నువ్వు చదువుకున్నదానివిగా. కట్నం లేకుండా, వీలయితే, నాలాంటి అత్త కూడా లేకుండా చూసి చేసుకో హేళనగా అంది సుగుణమ్మ.
ఆ తర్వాత అత్తగారి సాధింపు మరీ ఎక్కువయిపోయింది విజయకి "నీ చెల్లెలు మాటలు తలకెక్కించుకోకు - ఆ పిల్ల అసలు పెళ్ళి చేసుకుని కాపురం చేసేదానిలా లేదు' - మూతితిప్పుకుంది సుగుణమ్మ.
విజయని తల్లి ఏమన్నా పట్టించుకోడు సుధాకర్. అతను ఎప్పుడూ క్లబ్బులో కాలక్షేపం చేస్తూ, ఏదో పేరుకి బిజినెస్ చేస్తూ కాలం గడుపుతున్నాడు. సుధాకర్. "నిన్ను పెళ్ళి చేసుకున్నదే అమ్మకి సేవ చేయడానికి. అందుకే మా అమ్మేకదా నిన్ను సెలక్టు చేసుకుంది. ఆవిడని ఆనందపరచడమే నా ధ్యేయం. మా నాన్న లేడు. మా అమ్మ ఏ విధంగా మనసు కష్టపెట్టాలనుకున్నా నేను సహించను" ఖచ్చితంగా చెప్పేశాడు సుధాకర్. పెళ్ళయిన కొత్తల్లోనే, అప్పుడప్పుడు విజయకి అనిపించేది భర్త తనని పట్టించుకోడు. అత్తగారి గోల, ఇదే తన సంసారమైతే ఇక తన జీవితంలో మిగిలిందేమిటి - పైగా అత్తగారు ఈమధ్య కొత్తగా మరోమాట అంటోంది. మీ నాన్న దగ్గరనుంచి ఏభైవేలుపట్టుకురా.....బిజినెస్ లో పెట్టాలి అని ఏభైవేలు - తండ్రి ఎలాయిస్తాడు, ఆ.....అమ్మమను- కొబ్బరితోట - నరసాపురం కొబ్బరి తోటలు పెట్టుకుని మీనాన్న బీద అరుపులు అరుస్తున్నాడంతే" అత్త మాటలకి ఏమీ సమాధానం చెప్పలేదు విజయ కానీ రోజు రోజుకీ బాధలు ఎక్కువయిపోయాయి విజయకి. ఇవేకాక విజయ పదోతరగతి పాసుకాలేదు. సంఘంలో ఎలా జీవిస్తుందీ ? ఆలోచనకి అంతుదొరకలేదు. అత్తపెట్టే ఆరళ్ళు తట్టుకోలేక పోయింది విజయ. తను బతకటానికి కూడా సంపాదించుకోలేదుతను!
ఆరోజు పుట్టింటి కొచ్చింది విజయ. 'మీ ఆయన కూడా రాకపోయాడు.' తండ్రి గుమ్మంలోనే అడిగాడు.
"ఆయన చాలా బిజీగావున్నారు నాన్నా. ఎల్లుండి వస్తారుట" విజయ ఎటోచూస్తూ అంది.
ఆ రాత్రి ఇంట్లో అందరూ కలసి భోం చేశారు.
'ఏమమ్మా. మీ అత్తగారు నిన్ను సాధించటం మానదా. పైగా ఇంకా ఒక ఆడపిల్లకి పెళ్ళి చేయాలి కదా మేము. మమ్మల్నే పీడించుకుతింటే ఎలా" - తల్లి అంది.