Previous Page Next Page 
కాంతి రేఖలు పేజి 11


    "ఉన్నాయి కాని, కండక్ట్ సర్టిఫికెట్టు కోసం వచ్చాను. ఇప్పట్లో ఫ్యాక్టరీవాళ్ళు ఉద్యోగం ఇస్తారట."

    "మీరు ఉద్యోగం చేస్తారా!"

    "అవును రాధికా! నాకు తండ్రిలేడు. ఉన్నా, ఇంతకంటే చదివించలేడు." అన్నాడు.

    ఆమె జవాబుకు తడుముకున్నది. 

    "బండి తొమ్మిది గంటలకే ఏం చేస్తావ్?"

    "మీరు వస్తానంటే బస్సులో వెళదాం"

    "అలాగే పదండి" ఇద్దరూ బయటికి వచ్చి. మదీనా బిల్డింగ్స్కు వెళ్ళే బస్ ఎక్కేరు.
 
    అది జూలాజికల్ పార్క్ ముందుకు రాగానే ఆగిపోయింది. బస్ కేదో ట్రబులట.

    "బావుంది అడ్వెంచర్" ఇద్దరూ దిగారు..

    "కాసేపు పార్క్ లో కూర్చుందామా రాధికా!"

    "అలాగేనండీ......" ఇద్దరూ వెళ్ళారు. అతనే టికెట్లుకొన్నాడు కాసేపు తిరిగారు. రంగు రంగుల పూలు. తోటను చూస్తూ మైమరిచి పోయింది. 

    "ఇక్కడ కూర్చుందాం శ్రీనివాస్ గారూ! నేను చాలాసార్లు కోతుల్ని, పాముల్ని చూచాను." అన్నది.
 
    "అలాగే......" ఇద్దరు కూర్చున్నారు.
    
    "ఇక్కడ కూల్ డ్రింక్స్ అయిస్ క్రీమ్స్ అమ్ముతారుగాని, కొనిచ్చే తాహతు నాకు లేదు." అన్నాడు.
 
    "నేను కొనాలా!"

    "డబ్బులుంటే కొనండి"

    ఇద్దరూ అయిస్ క్రీం, చిప్స్ తిన్నారు.

    "మీ అన్నయ్య ఎక్కడున్నారు?"

    "మద్రాసులో........." అన్నది.

    ఇద్దరు లేచారు. అంతకంటే సంభాషణ సాగలేదు. ఇద్దరూ బయటికి వచ్చారు. మరో బస్సు వచ్చి, ఫుల్ గా వెళ్ళిపోయింది.

    "ఏం చేద్దాం?"

    "ఆటోలో వెళ్దాం. అమ్మ కంగారు పడుతుంది" అన్నది రాధిక.

    అతను ఆటో పిల్చాడు. ఇద్దరూ కూర్చున్నారు. కుదుపులకు అతనిపై తూలి పడింది.

    ఇద్దరి ముఖాలలో నెత్తురు పొంగి వచ్చినట్టయింది. చెరోమూలకు ఒదిగి కూర్చున్నారు.
 
    మరో కుదుపుకు మళ్లీ దగ్గరయ్యారు.

    దారిలోనే శ్రీనివాస్ ఉండే ఇల్లు. అకను ఊపు తేపహానే ఆటోరిక్షా ఆపించి, దిగాడు.

    "చెప్పండి భయమంటే ఇంటివరకు వస్తాను."

    "అక్కరలేదు." అన్నది.

    ఆ తరువాత సిటీలో చాలాసార్లు కలుసుకున్నారు. ఆమె ఇంటర్ లో చేరింది అతను టైప్ క్లాసులలో చేరాడు. ఏదో పార్ట్ టైమ్ పనికూడా చేస్తున్నాడు.

    "అబ్బ రాధా నిన్న రాలేదేం?" ఒక్కరోజు కనిపించకపోతే అడిగేవాడు.

    "ఏయ్ శ్రీనూ! నేను పిలుస్తున్నా వెళ్ళిపోయావేం?" అని రాధిక నిలsవేసేది.
 
    "జీ హుజూర్ అనాలా"

    "అనటమే కాదు. సలామ్ పెట్టాలి" అనేది.
 
    "ఒహో! అవును గొప్పవారి అమ్మాయి" అని ఉడికించేవాడు.

    "అవును........ ఈ పుస్తకాలు మోసుకురా."

    "మంచిది........" అతను నమ్మిన బంటులా వచ్చేవాడు.

    రాధిక కిల, కిల నవ్వేది.

    "సినిమాకెళదాం శ్రీనూ." అన్నదోనాడు.

    "ఇలా సినిమాలకు షికార్లకు తిరిగితే, మనల్ని చూచినవారేమనుకుంటారు!" ఒకసారి శ్రీను అడిగాడు.
 
    "ఏమనుకుంటారు!"

    "మనము బరితెగించి తిరుగుతున్నా మనుకుంటారు."

 Previous Page Next Page