వెనక్కి తిరిగి నన్ను చూసి, "ఎవరూ?" అన్నారు.
అంతే...కత్తి వాటుకి నెత్తురు చుక్కలేదు నా ముఖంలో!
"అదేమిటండీ నా పేరు సరోజ. అసిస్టెంట్ పనికి రమ్మని పిలిచారుకదా! ఈ రోజు మా ఇంటికివచ్చి వంద రూపాయలు కూడా ఇచ్చి మమ్మల్ని స్టేషన్ కి వచ్చేయమని చెప్పారుటకదా?
"ఆ ఆ అవును కదూ! మీ అమ్మ కూడా వచ్చారా?"
"వచ్చారండీ"
"ఎక్కడ కూర్చున్నారు"
"అదిగో ఆ కంపార్ట్ మెంట్ లోనండి" అన్నాను.
"పద పద టైమయిపోతోంది" అని, తను కూడా వచ్చి, మా కంపార్ట్ మెంట్ చూసి "వెరీగుడ్ ఈ పక్క కంపార్ట్ మెంట్ లోనే నేనుంటాను. బెంగుళూరు స్టేషనులో కలుద్దాం. వెళ్ళికూర్చో" అని చెప్పేసి తను ఫస్ట్ క్లాస్ కంపార్ట్ మెంట్ లోకి వెళ్ళిపోయారు. నాకు నవ్వాలో, ఏడవాలో అర్ధంకాలేదు. ఏ మాటా మా అమ్మతో చెప్పడానికే భయంగా వుంది.
బండి కదిలిపోయింది. నా మనసు ఆలోచనలతో, భయంతో వాయు వేగమనోవేగాలతో ప్రయాణిస్తోంది.
శ్రీశ్రీగారి తత్వం నాకే అర్ధంకాలేదు.
'సార్' అని పలకరిస్తే 'ఎవరూ?' అంటారేమిటి? చచ్చేం. ఈయనతో ఇదేవరసా? నిజంగా జ్ఞాపకంలేదా? కావాలని చేస్తున్నారా?
ఛ ఛ మనిషిని చూస్తే అలా అనిపించడంలేదు.
ఇదో కొత్త కేసు! అయోమయలోకం!
ఎక్కడా మొదలూ చివరాకూడా కనిపించడంలేదు.
'బెంగుళూరు లో ఆయనే వచ్చి కలుస్తారని నమ్ముకుని కూర్చున్నామో మన పని గోవిందా!' అనుకున్నా.
మంచీచెడ్డా రెండు మాటలైనా అడగలేదు. పైగా తెలియనివాళ్ళని చూసినట్లు చూశారు.
'ఈ విచిత్రవ్యక్తి విషయంలో తొందరపడ్డానేమో?' అని ఆ రోజుబండిలో నిజంగానే కొంతసేపు బాధపడ్డాను.
'ఏం చేస్తాను? దైవాధీనం....
రాత్రంతా నిద్రపడితే ఒట్టు.
మా అమ్మగారు కూర్చునే కునికిపాట్లు పడుతోంది.
'అదృష్టవంతురాలనిపించింది. 'కోరితెచ్చుకున్న తద్దినం నాది' అనుకున్నాను. తెల్లవారుఝామున నాలుగున్నర గంటలైంది.
నాలుగుగంటల ఏభై నిమిషాలకి బండి బెంగుళూరు చేరుతుందని టి.టి.ఆర్ ని అడిగి తెలుసుకున్నాను.
అమ్మని లేపేశాను....."అమ్మా! బెంగుళూరు వచ్చేస్తోంది. శ్రీశ్రీగారిని నమ్ముకుంటే లాభంలేదు. బండి ఆగడమేమిటీ, ఆయన వెనకాల పడాల్సిందే పద. తలుపుదగ్గరే కూర్చుందాం" అన్నాను.
బండి ఆగీ ఆగడంతో గభాలున దిగేశాను.
పక్క కంపార్ట్ మెంట్ కి వెళదాం అనుకున్నాను.
ఇంతలో శ్రీశ్రీగారే మా ముందునుండి చకచకా నడుచుకువెళ్ళిపోతున్నారు. ఏవిటా వేగం!
అమ్మ గబగబా నడవలేదు.
అతి సుకుమారం, కటిక దరిద్రం అన్న బాపతు నాది.
ఓ చేతిలో పెట్టె, అమ్మనొక చేత్తో పట్టుకొని వెళ్ళేసరికి టిక్కెట్ల గేటు దగ్గరికి వెళ్ళిపోయారాయన.
"అమ్మా అక్కడికి వచ్చేయమ్మా" అని నేను పరుగెత్తాను.
అదృష్టం బాగుండీ, జనం ఎక్కువమంది వుండటంతో గేటు దాటలేదాయన.
"ఏవండీ శ్రీశ్రీగారూ సార్ - సార్" అని పరుగెత్తి దగ్గర కెళ్ళాను.
"ఆ...వచ్చేశారా రండి టిక్కేట్లేవి? జాగ్రత్తగా వుంచారా?" అన్నారు. నిజంగా నాకు వొళ్ళుమండిపోయింది.
చెడామడా తిట్టెయ్యాలనిపించింది. 'మీకేమైనా బుద్దివుందా' అని అడగాలనిపించింది. 'అసలు ఈయన మనిషేనా అనిపించింది.
వస్తున్న ఏడుపుతోపాటూ నా ఆవేశాన్ని కూడా కంట్రోల్ చేసుకున్నాను. గేటు దాటాం.
అవతల ఫ్లాట్ ఫాం మీద మైసూరు బండి సిద్దంగా వుంది. పక్క పక్క కంపార్ట్ మెంట్లలో ఎక్కిపోయాం. ఆయన మళ్ళీ ఒక్కమాటయినా అడిగితే ఒట్టు నా మీద నాకే చిరాకు, అసహ్యం కలిగింది. పైకి మేకపోతు గాంభీర్యం చూపుతున్నా, లోలోన 'ఏమవుతుందా' అన్న బెంగతో చస్తున్నాను.
"ఏం బాధలొచ్చాయే" -అని అమ్మ నాకు శాపనార్ధాలు పెడుతూనేవుంది. ఏమైనా, మైసూరులో లాడ్జికో ఇంటికో ఎక్కడికో వాళ్ళు మాకిచ్చేచోటుకి చేరుకునే వరకు శ్రమపడక తప్పదనుకున్నాను.
"ఏమే సరోజా" అని అమ్మ ఏదో అనబోయింది.
"ఉండమ్మా నువ్వు వేరే నన్నుగాభరా పెట్టకు" అన్నాను.
కానీ అమ్మ మీద జాలేసింది. అమ్మని కూడా అవస్థ పెడుతున్నానే అని బాధపడ్డాను.
అమ్మకి దగ్గరగా వెళ్ళాను. "అమ్మా మైసూరు వచ్చేస్తోంది. శ్రీశ్రీగారి మీదే మన నిఘా అంతా వుండాలి. లేకుంటే మనకిక అతీగతీ వుండదు. జాగ్రత్త"
"ఏం పడతావో పడు. నాతో చెప్పకు" అని విసుక్కుంది.
అమ్మ బాధపడటంలో అర్ధం లేకపోలేదు. లేకుంటే ఏమిటీ మనిషి తత్వం? ఎన్నిసార్లు చూసినా కొత్త వాళ్ళని చూసినట్టు ఆ పలకరింపు ఏమిటి?
ఎలాగో వచ్చేశాం కనుక ఆయనవెంట మనం పడాల్సిందే! వేరేదారి లేదు. మమ్మల్ని తానే పిల్చానని, కానీ ఆయనతో మేం వస్తున్నామని కానీ ఆయనకి గుర్తుంటుందన్న నమ్మకం నాకులేదు. తన గోలేదో తనదే!
పరాకుగా ఉన్నట్టు కనిపిస్తారు.
అన్నిసార్లు చూసిన నన్నే 'ఎవరూ?' అని అడిగినప్పుడే ఆయన జాతకం తెలిసిపోయింది.
"సరోజా" అన్న అమ్మ పిలుపుతో మళ్ళీ ఆలోచనలనుండి తేరుకుని, "ఏవిటమ్మా" అన్నాను.
"ఈ మతిమరుపు మనిషితో వచ్చామే ఎలా వుంటామో ఈ పిక్చరెప్పుడు అవుతుందో? ఈవూర్లో ఎన్నాళ్ళుండాలో? నాలుగుగోడల మధ్యా గంజో కడుగో తాగి వుండకుండా ఈ పాట్లన్నీ ఎందుకే" అంది.
"మళ్ళీ ప్రారంభించేవూ?" అన్నాను.
కడుపులో ఎలుకలు పరుగెత్తుతున్నాయి. రాత్రంతా నిద్రలేదు.
ఈ బాధలకన్నా శ్రీశ్రీగారి బాదే ఎక్కువనిపించింది.
అందరూ మూటాముల్లే సర్దుకుంటున్నారు.
మైసూరు వచ్చేస్తోంది కాబోలనుకున్నాను.
శ్రీశ్రీగారు వచ్చి తీసుకువెళతారన్న ఆశలేదు. మనమే బండి ఆగీ ఆగడంతో ఆయన వెనక పరుగెత్తాలి.
* * *
శ్రీశ్రీతో బస
బండి ఆగడంతో గబుక్కున దిగిపోయి కవిగారి వెంటపడాలి. మద్రాసు నుండి మైసూరుకు సురక్షితంగా చేరుకున్నాం. ఇప్పుడు వీరిని మిస్ అయ్యామో, అడ్రస్ వున్నా, కొత్త వూరు - భాష వేరు కనుక మా పాట్లు కుక్కలు పడవని నాకు తెలుసు. ఇది మరీ ప్రమాదమైన సంగతి బండి ఆగింది.
మేం ఎంత త్వరగా దిగామో అంత త్వరగా మా ముందు నుండి శ్రీశ్రీగారు వెళ్ళిపోతున్నారు. నిజంగా ఈయన మతిమరుపు మనిషే అనిపించింది.
అమ్మని అక్కడే ఆగమని చెప్పి పరిగెత్తాను.
"ఏవండీ శ్రీశ్రీగారూ శ్రీశ్రీగారూ" అని గట్టిగా అరిచాను.
వెనక్కి చూసి "వచ్చేశారా? రండి" - అన్నారు.
"మేం వస్తున్నట్టు మీకు తెలియదా?"
"తెలుసే" అన్నారాయన.
"అయితే మమ్మల్ని వదిలేసి మీ మానాన మీరు వెళ్ళిపోతే ఎలాగండీ. ఈ వూరు కొత్త. మన భాష కాదు" అని కోపంగా అడిగాను.
అమ్మకూడా మెల్లగా నడుచుకుంటూ మేమున్నచోటికి వచ్చేసింది.
"ఏమయిపోతారు? వచ్చేశారుగా నాకూ కొత్తే నేనూ ఇదే మొదటిసారి రావడం" అన్నారు.
స్టేషన్ నుంచి బయటపడడానికి, శ్రీశ్రీగారు నడిచే వేగానికి మేం పరుగెత్తాల్సి వచ్చింది.
ఓసారి వెనక్కి చూసి "వస్తున్నారా రండి రండి" అన్నారు. 'ధన్యోస్మి' అనుకున్నా.
స్టేషన్ కి దగ్గర్లోనే 'గాయత్రి హోటల్' అనే బోర్డు కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది.
"అదిగో, అదే మనం దిగాల్సిన హోటల్" అన్నారు.
ఆయన మాట్లాడిన ఆ రెండు మాటలకే నేను పొంగిపోయాను.
జట్కా బండి రెండు రూపాయలకి మాట్లాడారు.