ఏమిటీ ప్రపంచం! ఈ మనుష్యులూ.
ఓరోజు సాయంత్రం చలపతిరావుగారింటికి నేనూ, మా అమ్మా వెళ్ళాం. నన్ను చూసి దంపతులిద్దరూ ఆశ్చర్యపోయారు.
"ఏమిటిలా అయిపోయావు? ఇంతలా చిక్కిపోయావేమిటి? ఒంట్లో బాగులేదా?" అని అడిగారు.
"ఒంటికేం....బాగానే వుంది. మనస్సే బాగులేదు. మరికొద్దిరోజులు పోతే పిచ్చేక్కేటట్టు వుంది. ఏదీ తెగించి ఒక నిశ్చయనికి రాలేకపోతున్నాను" అన్నాను.
"దీనికంత వర్రీ ఎందుకు? ఇదేమైనా తప్పనిసరా! ఎవరైనా నవ్వుతారు. నువ్వొస్తేకానీ వీలులేదని శ్రీశ్రీ ఏమైనా అన్నారా? లేక మే మెవరైనా అతనిదగ్గరే పనిచెయ్యాలని ఇబ్బంది పెడుతున్నామా! దీనికంతగా ఒక్కర్తినీ సతమతమైపోయి మనసు పాడుచేసుకోవటం దేనికి? ఎవరైనా విన్నా కూడా నవ్విపోతారు. రా! భోం చేసి తర్వాత ఆలోచిద్దాం" అన్నారు చలపతిరావుగారు.
"నా కిప్పుడు కావాల్సింది తిండి కాదన్నయ్యా! నా నిర్ణయం ముందుగా మీతోటే చెప్పాలని వచ్చాను" -అని కాసేపాగి ఇలా చెప్పాను. "ఇది పాడు ప్రపంచం. ఎవర్నీ మంచిగా బ్రతకనివ్వదు. నిజానిజాలు దేవుడికే తెలియాలి. శ్రీశ్రీగారు మహానుభావులు, గొప్పవారు అంటూనే ఆయనని ఆడిపోస్తున్నారంతా అదే నా కర్ధం కాలేదు.
అన్న వాళ్లెవరైనా ఆయనకి నచ్చచెప్పటానికి ప్రయత్నిస్తున్నారా? ఒక్కరైనా అండగా నిల్చున్నారా - అంటే అదీ లేదు.
నాకు కలిగిన మూడు అవకాశాల్లో నేను శ్రీశ్రీదగ్గరే పనిచెయ్యాలని నిశ్చయించుకున్నాను. అందరూ నిర్ణయం నాకే వదిలేశారు కనుక, ఆ మంచి చెడ్డలు, జయాపజయాలు నావే!
శ్రీశ్రీగారు మహాకవిగా ఎప్పుడో కీర్తి సంపాదించారు. నేను వచ్చి కొత్తగా వారికి తేవాల్సిన పేరేమిలేదు.
పైగా ఆయనని 'దరిద్రుడ'ని కూడా నోరారా హాయిగా అంటున్నారు. ఇలాంటి మనుషుల్ని ఏమనాలో అర్ధంకాలేదు. దరిద్రుడనే వాళ్ళంతా ఆయనని ధనవంతుడ్ని చేయొచ్చుగా!
ఇక అవన్నీ అనవసరం.
ఇది పందెం అన్నయ్యా! శ్రీశ్రీగారిని బాగుచెయ్యడానికి ప్రయత్నిస్తాను. వ్యసనాలనుండి మళ్ళిస్తాను. 'ఇది శ్రీశ్రీ అడ్రస్' అని ముద్రకొట్టిస్తాను. బాగుపడితే మేమిద్దరం బాగుపడతాం! చెడిపోతే ఇద్దరం చెడిపోతాం! ఇది నిజం. నా నిశ్చయంకూడా -" అన్నాను.
చలపతిరావుగారు ఒక్క నిమిషం ఏమీ మాట్లాడలేదు.
"ఆలోచించుకుంటే ఈ మాటలంటున్నావా సరోజా" అని అన్నపూర్ణమ్మగారడిగారు.
"అవునొదినా! బ్రతకాలి. అందుకు పనిచేయాలి. కష్టపడి చేసేపని ఎవరి దగ్గరైతేనేం? నేను శ్రీశ్రీగారి దగ్గరే పనిచేస్తాను. నా నిర్ణయంలో ఇక మార్పేలేదు. ఇది సవాల్ గానే అనుకుంటున్నాను" అన్నాను దృఢంగా.
వెంటనే చలపతన్నయ్య "వెరీగుడ్ నా కోపరేషన్ నీకెప్పుడూ వుంటుంది. నాకు చాలా సంతోషంగా వుంది. జీవితాన్ని శాక్రిఫైస్ చేస్తున్నట్టే లెక్క ప్రొసీడ్ - గుడ్ లక్" అన్నారు.
"థాంక్సన్నయ్యా!"
"ఎప్పుడు ప్రయాణం?"
"నాకేం తెలుసు? ఆలోచించుకో, మళ్ళీ వస్తానని కదూ చెప్పి వెళ్ళారు. చూద్దాం. ఆయన ఎప్పుడొస్తే అప్పుడే. నేను నిర్ణయం తీసుకుని సిద్దంగా వున్నాను కదా! ఇక ఎప్పుడొచ్చినా ఫరవాలేదు" అన్నాను.
అప్పటికే పొద్దుపోయింది. రాత్రి ఏడుగంటలైంది. ఇంటికి వచ్చేశాం. ఇంకా ఇంట్లో అడుగు పెట్టలేదు. నాన్నగారు ఎదురొచ్చి "ఎక్కడికయినా వెళితే త్వరగా వచ్చేపనేలేదా మీ తల్లీకూతుళ్ళకి ఎంతసేపయి ఎదురు చూస్తున్నాను?
శ్రీశ్రీగారు అయిదుగంటలకి వచ్చారు. ఇదిగో వందరూపాయలిచ్చారు. ఈ రోజే రాత్రి 10 గంటలకి బెంగుళూర్ మెయిల్లో ఆయన బయలుదేరుతున్నారట. నిన్నూ, మీ అమ్మనీ స్టేషన్ కి వచ్చేయమన్నారు. తను ఫస్ట్ క్లాస్ కంపార్ట్ మెంట్ లో వుంటారట!" అని చెప్పారు.
నాన్నగారి అభిప్రాయం తెలుసుకోడానికి ఇదే అవకాశమని, "అయితే ఏమంటారు నాన్న గారూ అని అడిగా.
"నీ యిష్టం అమ్మా ఆ రోజే చెప్పానుగా నీకెలా తోస్తే అలా చెయ్యి" అన్నారు.
"నేను శ్రీశ్రీగారి దగ్గరే పని చేయటానికి నిశ్చయించుకున్నాను. కాబట్టి నేను వెళతాన"న్నా.
"అయితే బయలుదేరండి. ఎనిమిది గంటలయిపోయింద"న్నారు.
నాన్నగారి మాటల్లో నేను శ్రీశ్రీగారి దగ్గర పనిచేయటం ఆయన కిష్టమనే ధోరణి స్పష్టమయ్యింది. దాంతో నాకు ఏనుగంత బలం వచ్చేసింది. నాన్న గారి మాట నాకు వేదవాక్కు.
తిండి లేదు - తిప్పల్లేవు! గబగబా చిన్న పెట్టెలో తల్లీకూతుళ్ళం బట్టలు సర్దేసుకున్నాం.
నాన్నగారు టాక్సీ తీసుకొచ్చారు. ఆయనను స్టేషన్ కి రావద్దని చెప్పి అమ్మతో నేను బయలుదేరిపోయాను.
టాక్సీ వెళుతున్నంతసేపూ, నా గుండె దడదడ కొట్టుకుంటూనే వుంది. ఏదో తెలియని భయం!
'నేను తీసుకున్న నిర్ణయంలో పొరపాటేమైనా వుందా? తొందరపడ్డానా?" అని ఒక్కసారి ఆలోచించాను.
ఈ హడావుడి ప్రయాణానికి మా అమ్మ ఆశ్చర్యపోయింది. ఆవిడ వొళ్ళు మండిపోయిందో ఏమో - తిట్టడం ప్రారంభించింది.
"మీ తండ్రీ కూతుళ్ళకి ఎంతతోస్తే అంతే ఉన్నచోట ఉండనివ్వకుండా నా ప్రాణం తీస్తున్నారే సరోజా! నీ మొండి పట్టుదలతో చస్తున్నాం. ఒకరు చెప్పటం, వినడం నీ జన్మలో లేదు. ఇద్దరం ఆడవాళ్ళం - వెళ్ళేది ఏమీ తెలియని కొత్త ప్రదేశానికి! ఆయన గురించి అందరూ అంటున్న మాటల్ని వింటూనే వున్నాం. అలాంటి ఆయన్ని నమ్ముకొని బయల్దేరాం. ఉన్న వూళ్ళో కూడా కాదు. ఆ మైసూరు ఎక్కడుందో -ఏంటో మీ తండ్రీ కూతుళ్ళ మధ్య నా కొచ్చిందిచావు" - అని అక్షింతలు వేస్తూనే వుంది.
నిజమే, ఆవిడ భయం ఆవిడిది.
అంతా నాలాంటి మొండిచచ్చినవాళ్ళే వుంటారేమిటి?
గొప్పకాదుకానీ-ఇక్కడ నా గురించి రెండు మాటలు రాయాలి.
నా స్వభావం చాలా గమ్మత్తుగా వుంటుంది.
కోపం వస్తుంది-కానీ మనసులో ఏమీ వుండదు. నాకు చిన్నప్పటినుండీ పెంకితనం, ధైర్యం, పట్టుదల, మొండితనం కూడా ఎక్కువే.
నేననుకున్న పని అయిపోవాల్సిందే. సాధించే వరకూ నిద్రపోను. చేసే పనిలో వచ్చే మంచి చెడ్డలూ, కష్టసుఖాలూ....ఏమైనా సరే ఎదుర్కోవటానికే సిద్దపడే ఆ పని చేస్తాను. అనుకున్న మాట నిర్మొహమాటంగా ఖచ్చితంగా ముఖంమీదనే అనేస్తాను. అదీ నా స్వభావం.
* * *
శ్రీశ్రీతో నా మొదటి ప్రయాణం
సెంట్రల్ స్టేషన్ లో టాక్సీ ఆగింది.
బెంగుళూర్ కి రెండు సెకండ్ క్లాస్ టిక్కెట్లు కొనుక్కున్నాం. మేం తెచ్చుకున్నది చిన్న పెట్టె కదా-చేతిలో పట్టేసుకున్నాం.
గబగబా ఫాట్ ఫారం మీద కొచ్చేసైర్కి బండి సిద్దంగా వుంది. లేడీస్ కంపార్ట్ మెంట్ చూసుకుని కిటికీ దగ్గర తల్లీకూతుళ్ళం కూర్చున్నాం.
ఇంకా అరగంట టైముంది.
"శ్రీశ్రీగారు వచ్చారేమో చూస్తానుండమ్మా" చెప్పి బండి దిగాను. మా కంపార్ట్ మెంట్ దగ్గరే తచ్చాడుతూ అటూ ఇటూ చూస్తున్నాను. ముందు వెనకలకి వెళ్ళిచూద్దామంటే బండి వెళ్ళిపోతుందేమోనని భయం మా కంపార్ట్ మెంట్ పక్కనే ఉన్న ఫస్ట్ క్లాస్ కంపార్ట్ మెంట్ వైపు వెళ్ళి చూశాను. దాన్లో శ్రీశ్రీగారు లేరు.
ఇంకా పది నిముషాలు టైం వుంది.
మా కంపార్ట్ మెంట్ లోకి వెళ్ళి కూర్చున్నాను. భయం! అంతా కొత్త శ్రీశ్రీగారు కనిపించరేమిటి? 'మేం వచ్చామా? లేదా? అని చూసే పనే లేదా? ఆయన్ని ఎలా ఈ స్టేషన్ లో పట్టడం? బెంగుళూరులో ఎలా దిగడం? ఆయన కనబడకపోతే మన గతేమిటి? ఇలా ఆలోచిస్తూంటే తల తిరిగుతోంది. పైకి గట్టిగా అంటే మా అమ్మ మళ్ళీ అష్టోత్తరాలు ప్ర్రారంభిస్తుందేమోనని భయం.
'పోనీ - ఇంటికి వెళ్ళిపోదామా' అని కూడా అనిపించింది.
"సర్లే బెంగుళూరులో దిగి మైసూరు బండి గురించి అడిగి, మైసూరులో దిగుదాం. తర్వాత అడ్రస్ వుండనే వుందికదా. ఆ రోజుల్లో మహాత్మాపిక్చర్స్ -శంకర్ సింగ్ అంటే తెలియని వాళ్ళులేరని విన్నాను. చూద్దాం నిండా మునిగితే చలేలేదు'- అని మొండికేసి ఫ్లాట్ ఫాం వైపే చూస్తూ కూర్చున్నాను.
మా కంపార్ట్ మెంట్ ముందునుండే సిగరెట్ చేతితో శ్రీశ్రీగారు చకచకా వెళ్ళిపోతున్నారు.
"అమ్మా అదిగో శ్రీశ్రీగారు......వుండు ఇప్పుడేవచ్చేస్తాను"-అని ఒక్క పరుగులో ఆయన వెంటపడ్డాను.
"సార్ సార్" అని అరుస్తున్నాను.
తనని కాదన్నట్టు వెళ్ళిపోతున్నారాయన.
"నమస్కారమండీ...అన్నాను.