చాలాకాలం క్రితం 'తాళాలు' అని వుండేవట. వాటిని ముందు తలుపుకు వేసుకుని జనం నిర్భయంగా బైటికి వెళ్ళేవారట. మెటల్ ఫోటో వచ్చాక దొంగలు కెమేరాతో తాళాన్ని ఫోటో తీసి, దానికి సరిపోయే తాళం చెవిని క్షణాలమీద అక్కడికక్కడే తయారుచేసి, ఆ ఇంటి గృహస్థులకన్నా ధీమాగా లోపల ప్రవేశించి తాపీగా ఇల్లంతా దోచుకోవటం మొదలుపెట్టారు. దాంతో తాళం కప్పలు తయారుచేసే ఫ్యాక్టరీలు మూతపడ్డాయి. ఇది జరిగిన రెండు సంవత్సరాలకి కెమేరా ఫిల్మ్ కి అందని రసాయనాన్ని కనిపెట్టాక మళ్ళీ చెవి అవసరం లేని తాళం కప్పలు, నెంబరింగ్ సిస్టమ్ వున్నవి మార్కెట్ లోకి వచ్చాయి. వెంటనే వాటిని కరిగించడానికి వీలయ్యే 'ఆసిడ్'ని దొంగలు కనిపెట్టారు. దాన్ని నిరోధించడానికి 'హీట్ షీల్డ్' మార్కెట్ లోకి వచ్చింది. సైన్స్ నేరాల్ని నిరోధించడానికి ఎంత సాయపడుతూందో, పెంచడానికి కూడా అంతే సాయపడుతూంది. ఇప్పుడు హీట్ షీల్డ్ ని కాల్చగలిగేదాన్ని (అది కిరణమా? మంటా?) కూడా కనుక్కున్నారన్నమాట.
గదిలో వేడి మరింత ఎక్కువైంది. తలుపు ఏ క్షణమయినా వూడిపోయేటట్టు వుంది.
ఏదో ఆలోచన స్ఫురించినట్లు అతడు ఫోన్ దగ్గిరకు పరుగెత్తాడు. చకచకా నెంబర్లు నొక్కి, "హల్లో....పోలీస్ స్టేషన్?" అన్నాడు.
అవతల్నుంచి చిన్న నవ్వు వినిపించి ఆ తర్వాత నిశ్శబ్దంగా వుండిపోయింది.
నిస్సహాయంగా ఫోన్ పెట్టేశాడు. తన కంఠం గమ్యానికి చేరకుండా రిమోట్ కంట్రోల్ ద్వారా వాళ్ళు అక్కడే ఆపుచేశారు. పూర్వంలాగా వైర్లు వున్నా ఫోన్లయితే బాగుండేదేమో (ఉహూ! కాదు. అప్పుడు ఫోన్ వైర్లు కత్తిరించేవారట)
అతడు ఇంటి వెనుక భాగానికి వెళ్ళి అరుద్దామనుకున్నాడు. కానీ ఎవ్వరూ బయటకు రారని తెలుసు. ఇంటిముందు వున్నది చచ్చిన శవమైనా, మరీ వాసనొస్తే తప్ప పట్టించుకోరీ జనం! ఆ మాటకొస్తే పక్కఫ్లాట్ లో ఎవరున్నారో తనకింతవరకూ తెలీదు.
అంతలో వెనకనుంచి భుజంమీద చెయ్యిపడింది. అతడు త్రుళ్ళిపడి వెనుదిరిగి చూశాడు.
వెనుక అతడి కొడుకు వున్నాడు.
జరుగుతున్నదంతా అతడికి తెలిసినట్టుంది.
తండ్రీకొడుకులు ఒకర్నొకరు నిశ్శబ్దంగా చూసుకుంటూ నిలబడ్డారు.
"నేను... నేను బయటికి వెళ్తాను" అన్నాడు కొడుకు.
భరద్వాజ ఉలిక్కిపడ్డాడు.
"అవును ఫాదర్! నేను వెళ్ళకపోతే వాళ్ళు ఎలానూ లోపలికి వచ్చేస్తారు. జరిగిన హత్యాకాండకి సాక్షులుగా మిమ్మల్నీ మిగల్చరు. వాళ్ళ సంగతి తెలియని దేముంది? నేను వెళితే కనీసం ఒకరి ప్రాణాల్తో సరిపెట్టుకుంటారు. మామూలు విద్యార్దుల వెనుక ఇంత గ్యాంగ్ వున్నదన్న విషయం గుర్తించనప్పుడే నేను తప్పుచేశాను."
భరద్వాజ ఏదో చెప్పబోయాడు. అంతలో లోపలి గుమ్మం దగ్గర చప్పుడయింది. అతడి భార్యా, కూతురూ నిలబడ్డారు. వాళ్ళ మొహాల్లో భయాందోళనలు కొట్టొచ్చినట్టు కనబడుతున్నాయి. మొత్తం కుటుంబ సభ్యులంతా ఒకర్నొకరు చూసుకున్నారు.
కొడుకు కదిలి గుమ్మంవైపు వెళ్ళబోయాడు.
"నో...." అంటూ అతడిని ఆపాడు భరద్వాజ. "ఏమయితే అది అయింది. నువ్వు లోపలే వుండు."
"లాజికల్ గా ఆలోచించు డాడీ! ఈ సెంటిమెంట్స్ వల్ల అందరం ఛస్తాం. మీరు ఇరవయ్యవ శతాబ్దపు మనిషిలా ఆలోచించకండి."
"నువ్వు ఏమంటావ్?" అన్నట్లు భార్యవైపు చూశాడు. ఆమె భయంతో నోటమాట రానట్లు స్థంభంలా నిలబడిపోయింది.
కొడుకు చచ్చిపోవటం ఎలానూ ఖాయమైనప్పుడు కొడుకుతోపాటూ ఇంటిల్లిపాదీ బలిపెట్టాలా? సెంటిమెంటల్ గా ఆలోచించకుండా కాస్త లా.....జి....క....ల్.....గా ఆలోచించి, తాము లోపలే వుండి బలిపశువును బయటకు పంపాలా?
అతడికి పరిస్థితి ఇరకాటంగానూ, తన మీద తనకే అసహ్యం కలిగించేదిగానూ వుంది. రేప్రొద్దున్న తమ శవాల్ని చూసి జనం నవ్వుకుంటారు. ఒకరు బయటకెళ్ళి ఛస్తే పోయేదానికి, మొత్తం కుటుంబం అంతా మూర్ఖుల్లా లోపలే వుండిపోయారట అని నవ్వుకుంటారు. ఇంత లాజికల్ గా కూడా ఆలోచించలేదేమిటా అని గుసగుసలాడుకుంటారు. లాజిక్.... లా... జి...క్.....!ది హెల్ విత్ లాజిక్.
అతడి మనసు అట్టడుగునుంచి ఒక బలీయమైన నిర్ణయం ఈ వాదోపవాదాల్ని అధిగమిస్తూ బయటకొచ్చింది. కొడుకుని దగ్గిరకు తీసుకుని "ఛస్తే అందరం చద్దాం" అన్నాడు. అతడి యీ నిర్ణయంతో కొడుకు మొహంలో వర్ణణాతీతమైన ఆనందపు వీచిక ఒకటి క్షణకాలం ప్రతిబింబించటం అతడు గమనించాడు. అది కూడా లాజిక్ కి అందనిదే.
ఆడవాళ్ళని వెనుకనుంచి బయటకు వెళ్ళటానికి ఏమైనా మార్గాలు వున్నాయేమో చూడమని చెప్పి తండ్రీ కొడుకులిద్దరూ ముందు గదిలోకి వచ్చారు. అప్పటికే ఆ గది చాలా వేడెక్కిపోయి వుంది. బయట శత్రువులు చాలా తాపీగా, లోపలివాళ్ళు తమ సంగతి తెలిసినా ఏమీ చెయ్యలేరన్నంత ధీమాగా తమ పని తాము చేసుకుపోతున్నారు. బోనులో చిక్కుకున్న జంతువు దగ్గరకు వచ్చినట్టు వస్తున్నారు.
చిన్న చప్పుడవడంతో భరద్వాజ తలెత్తి చూశాడు. తలుపు గడియ కాల్తూ వూడి క్రిందపడింది. అంత నిశ్శబ్దంలో ఆ చిన్న చప్పుడే ఎంతో బిగ్గరగా ప్రతిధ్వనించింది.
ఆయుధాన్ని పట్టుకున్న భరద్వాజ చెయ్యి సన్నగా వణికింది. ఇంతలో తలుపు నెమ్మదిగా తెరుచుకుంది. మిషన్ గన్ ఆకారంలో వున్న ఒక ఆయుధం తలుపులు తోసుకుంటూ లోపలికి వచ్చింది.
10
అహల్యతో మాట్లాడిన తర్వాత యాజీ సెక్రటరీ అహం దెబ్బతిన్నది. ఆమె ఎవరికి ఫోన్ చేసినా అవతలివాళ్ళు యాజీనుంచి ఫోన్ అనగానే కంగారుపడి వినమ్రతతో జవాబు యివ్వడం మాత్రమే ఆమెకు తెలుసు.
అహల్య విషయంలో ఆమె అంచనా తారుమారైంది. భరద్వాజ సెక్రటరీగానే కాకుండా, వ్యక్తిగతంగా కూడా అహల్య ఆత్మగౌరవం వున్న మనిషి.
యాజీ సెక్రటరీ రాత్రి పదకొండింటికీ ఆఫీస్ కట్టేసి వెళ్ళిపోతూ యాజీ రూమ్ లోకి వెళ్ళింది.
"భరద్వాజ విషయం ఏమైంది?" అని అడిగాడు.
"అతడితో అపాయింట్ మెంట్ కష్టమనుకుంటాను సార్" అంది.
"ఏం? అంత గొప్పవాడా అతడు?"
ఈ ప్రశ్నలో ఆమె మనసులో ఏ మూలో వున్న ప్రతీకార వాంఛ కొద్దిగా తొంగిచూసింది.
"చాలా గర్వంగా సమాధానం చెప్పారు. కలుసుకోవటానికి వీలుపడదన్నారు" అంది సంభాషణకి కొద్దిగా రంగు పులుముతూ.
"ఎందుకు అతడికి అంత గర్వం?"
ఆమె దానికి సమాధానం చెప్పలేదు.
"సరే! నేను చూసుకుంటాలే" అన్నాడు. ఆమెకి సంతోషం వేసింది. యాజీతో శతృత్వం అంటే మాటలు కాదు. ఈ దెబ్బతో ఆ భరద్వాజ పని ఫినిష్ అనుకుంది. దాన్నే శాడిజమే అంటారేమో. "రెండో రచయిత కోసం చూద్దామంటారా?" అని అడిగింది.
"ఇంత రాత్రి ఇంకెందుకు? రేపు చూద్దాంలే."
ఆమె గుడ్ ఈవెనింగ్ చెప్పి వెళ్ళిపోయింది. ఆమె పెదాలమీద చిరునవ్వు కదలాడ్తూ వుంది.
కానీ ఆమెకి తెలియని విషయం ఒకటుంది.
యాజీ ఆఫీసులో పనిచేసే వారందరి ఫోన్లూ టేప్ చేయబడతాయి. అందరూ వెళ్ళిపోయాక అతడొక్కడే కూర్చుని వాటిని వింటాడు. కోట్ల మీద వ్యాపారం చేసేటప్పుడు మాత్రం మెలకువగా వుండటం తప్పదు. అందులోనూ అతడికి శత్రువులు జాస్తి.
చాలాసేపటివరకూ అతడు తన మిగతా పన్లు చూసుకున్నాడు.
సోలార్ శాటిలైట్ కి ఇంకా పూర్తి అలవాటుపడని జనం, పదకొండింటికే నిద్ర కుపక్రమిస్తున్నారు. యాజీ లాంటివాళ్ళు మాత్రమే పూర్తిగా తమ దినచర్యని మార్చుకున్నారు.
పన్నెండవుతూ వుండగా అతడు తన పనులు ముగించుకుని చివరి అంశంగా టేప్ ఆన్ చేశాడు. ఆ రోజు పొద్దున్నుంచీ తన ఆఫీసువాళ్ళు బయటవాళ్ళతో మాట్లాడిన మాటలు, బయటనుండి వచ్చిన కాల్స్ లో ముఖ్యమైనవి వరుసగా వినసాగాడు. చివర్లో ఇక కట్టెయ్యబోతూ వుంటే తన సెక్రటరీ, భరద్వాజ సెక్రటరీ అయిన అహల్యతో మాట్లాడిన సంభాషణ వినవచ్చింది.
అది వింటున్నప్పుడు అతడి మొహం ప్రశాంతంగా వుంది. చివర్లో మాత్రం నుదుటిమీద గీత అడ్డంగా ఏర్పడింది. ఆ గీత రేప్రొద్దున్న సెక్రటరీ నుదుటి గీతని తేలుస్తుంది.
అతడు టేప్ ఆఫ్ చేశాడు.
లేచి క్రిందకు వచ్చాడు. కార్లో కూర్చొని భరద్వాజ ఇంటివైపు పోనిమ్మన్నాడు.
రోడ్డు నిర్మానుష్యంగా వుంది.
భరద్వాజ ఇంటివైపుకు తిప్పబోతూ డ్రైవర్ చటుక్కున కారు ఆపుచేశాడు.
అతడు మనసు అపాయాన్ని శంకించింది.