సద్ది తిని పైకిలేచాడు.
అతను లేచాడో లేదో ఇల్లంతా శుభ్రం చేస్తున్న శారద పరుగున అక్కడికి వచ్చింది.
ఆమె ఆంజనేయులు చిన్న చెల్లెలు పందొమ్మిదేళ్ళు. ఇప్పుడిప్పుడే యవ్వనం విరబూస్తోంది.
కంచం చుట్టూ వున్న మెతుకులన్నిటినీ ఏరి అందులో వేసింది. కంచం అక్కడి నుంచి తీసింది. చేతిలోకి కొన్ని నీళ్ళు ఒంపుకుని అక్కడ చల్లింది.
ఆమె పరిశుభ్రతకు మారుపేరు. ఇరవై నాలుగు గంటలూ ఇంటిని శుభ్రం చేస్తుంటుంది. ఏసామాను ఎక్కడ వుండాలో అక్కడే వుండాలి మిస్ ప్లేస్ చేస్తే వూరుకోదు. అలా చేసిన వాళ్ళను తిడుతుంది. కోపం చేసుకుంటుంది. శుభ్రత పాటించకపోతే నొచ్చుకుంటుంది.
తనుకూడా ఎప్పుడూ కడిగిన ముత్యంలా వుంటుంది. నిద్ర లేచీ లేవగానే మొదట ఆమెకు గుర్తుకొచ్చేది శుభ్రతే. పడక మీద నుంచి లేవగానే చీపురు అందుకుంటుంది ఎంతో ఓపిగ్గా ఇల్లంతా చిమ్ముతుంది. రాత్రి ఎవరైనా ఏసామానైనా మిస్ ప్లేస్ చేసుంటే వాటిని సర్దుతుంది.
ఆ తరువాత స్నానం చేస్తుంది. స్నానం అంటే గంట కార్యక్రమమన్న మాట. ఒంటికి మూడుసార్లు సబ్బు పట్టిస్తుంది. ఓ నాలుగుసార్లు ముఖానికి రాసుకుంటుంది. చక్కగా ఉతికిన బట్టలు కట్టుకుంటుంది.
ఇక తీరిగ్గా అద్దం ముందు కూర్చుంటుంది. ముఖంలో ఏవైనా బ్లాక్ హెడ్స్ వున్నాయేమోనని పరిశీలిస్తుంది. ఎక్కడైనా వుంటే వాటిని గిల్లేస్తుంది. లైతుగా పౌడర్ రాసుకుంటుంది. కాటుక పెట్టుకుంటుంది. కాస్తంత పెద్దబొట్టు దిద్దుకుంటుంది.
ఇక అద్దం ముందు నుంచి లేచి మళ్ళీ ఇల్లంతా కలయతిరుగుతుంది. ఎక్కడైనా ఓకాగితం ముక్క కనిపిస్తే దాన్ని తీసుకెళ్ళి దూరంగా పారేస్తుంది.
శారద విషయం తెలిస్తే ఎవరూ దేన్నీ కిందరాల్చడానికి సాహసించరు.
ఆమె ఈ పరిశుభ్రత ఆంజనేయులకు కృత్రిమంగా కనిపిస్తుంది శుభ్రత వుండాల్సిందేగానీ ఇది మరీ మోతాదుకు మించిన వ్యవహారంలా అనిపిస్తుంది. అలాగని ఎప్పుడూ చెల్లెల్ని మందలించడు. ఏదో తనిష్టం తనది అనుకుని వూరుకుండిపోతాడు.
ఆమెకు ఈ పరిశుభ్రత పిచ్చే కాకుండా మరో వింతలక్షణం కూడా వుంది. అది సిగ్గు -ఓవర్ హైనెస్. ఇంట్లో వాళ్ళ ముందు కూడా సిగ్గు పడుతుంటుంది. ఎవరైనా పరాయిమగాడు -అతను పండు ముసలిఅయినా సరే ఎదురెళ్ళి మాట్లాడటానికి సాహసించదు. కడకు ఇంటికి కొత్తగా ఆడవాళ్ళు వచ్చినా అంతే. సిగ్గుల కుప్ప అయి ఓ మూల కూర్చుండి పోతుంది. ఇక ఆ గెస్ట్ లు వెళ్ళిపోయాకే మూలనుంచి లేచి వచ్చేది.
ఆమెకున్న ఈ రెండు లక్షణాలంటే ఆంజనేయులకు విపరీతమయిన కోపం. కానీ పేదవాడికి కోపం ప్రకటించే హక్కుగానీ, అవకాశంగానీ లేదని చిన్నప్పట్నుంచే గ్రహించాడు గనుక మౌనం వహిస్తాడు.
అదీగాక ఆమె అలా తయారవడానికి తన అశక్తతే కారణమని అంతరాత్మకు తెలియడం కూడా రెండో కారణం. వయస్సులో వున్న ఆ పిల్ల ముచ్చట్లు సరదాలు ఎలా వుంటాయో తెలిసినా వాటిని తీర్చలేకపోయాడు. శారద మంచిబట్టలు కట్టుకొని కొన్నేళ్ళయింది. ఎప్పట్నుంచో పట్టుపావడా జాకెట్ కొనాలని కోరుకుంటోంది. కానీ ఆ కోరిక ముసల్ది అయిపోతూవుంది గానీ పట్టుబట్టలు తెచ్చివ్వలేకపోయాడు.
నిదానంగా దొడ్లోకి నడుచుకుంటూ వెళ్ళి చేయి కడుకున్నాడు ఆంజనేయులు.
బయటకు రావడంతోనే తండ్రి దగ్గు స్వాగతం పలికింది అక్కడ కూర్చుని ఆయన బాధ చూడలేక అలా వూర్లోకి బయలుదేరాడు అతను వెళ్ళేటప్పటికే వి ఎల్. డబ్ల్యూ క్వార్టర్స్ దగ్గర చాలామంది యువకులే వున్నారు.
ఆ వూరికంతా అది సెంటర్. ఆక్వార్టర్స్ లో ఎవరూ కాపురం వుండడంలేదు అందులో వుండాల్సిన విలేజ్ డెవలప్ మెంట్ ఆఫీసర్ టౌన్ లో వుంటున్నాడు అందువల్ల దాని తాళాలు యువకులు తీసుకొని యూత్ క్లబ్ నడుపుతున్నారు. క్లబ్ అంటే ఏమీ లేదు. మాట్లాడుకోవడానికి నాలుగు కుర్చీలు తప్ప.
ఆంజనేయులు మౌనంగా వెళ్ళి ఓ మూల కూర్చున్నాడు.
అందరి వంకా ఓ మారు చూశాడు. వాళ్ళూ ఒకసారి అతని వైపు చూసి మాటల్లో మునిగిపోయారు. ఎవరూ తనను పలకరించక పోయేసరికి ఆంజనేయులు బాధపడ్డాడు.
తను ఇక్కడికి అందువల్లేరాడు. ఎవరూ తననుచూసి ఆనందంతో గ్రీట్ చేయరు అభిమానంతో ఆహ్వానించరు. తనకు ఎవరూ మిత్రులు లేరు. తనకు ఎవరితోనూ స్నేహంచేసే టైంగానీ అంత వెసులుబాటుగానీ లేదు. ఎప్పుడూ ఏదో అర్ధంలేని కాంప్లెక్సులతో కుమిలిపోతూ తన చేతకానితనాన్ని తిట్టుకుంటూ వుంటాడు. కుటుంబ సమస్యలనుంచి విముక్తి దొరకని తను ఎవరి స్నేహాన్నీ పొందలేకపోయాడు. తను ఎవరిని ఆకర్షించలేకపోయాడు. ఎదుటి వ్యక్తి మానసికస్థితిని గమనిస్తూ మాట్లాడటం తనకు తెలియదు. అందుకే తనకు ఎవరూ స్నేహితులులేరు.
ప్రసిడెంట్ గారబ్బాయి జగదీష్ ఏదో లెక్చర్ దంచుతుంటే చుట్టూ చేరిన అబ్బాయిలంతా శ్రద్దగా వింటున్నారు. మధ్య మధ్య తమ కామెంట్స్ పాస్ చేస్తున్నారు.
డబ్బు మహత్యం అది. అతను ఏం చెప్పినా అది వినడానికి ఎగ్జయిట్ మెంట్ గా వుంటుంది. డబ్బు స్నేహితుల్ని సంపాదించి పెడుతుంది.
టెరికాటన్ పంచె మీద సిల్క్ జుబ్బా వేసుకున్నాడతను. ఎంతో అందంగా దర్జాగా వున్నాడతను.
అతనిలా తను ఎప్పటికీ వుండలేననిపించింది ఆంజనేయులకు.
జగదీష్ ఏదో జోక్ చేస్తే అందరూ విరగబడినవ్వుతున్నారు.
డబ్బుకు అధికారానికి వున్న విలువే అంత. అది ఎదుటి వాళ్ళను నవ్విస్తుంది. లేదంటే ఏడిపిస్తుంది. అందుకే ఆ రెండింటికోసం మనిషి ఏదైనా చేస్తాడు.
స్నేహం ప్రపంచంలోకెల్లా తియ్యనిదని, ప్రేమ పరమాత్మ స్వరూపమని అంటారుగానీ అదంతా ట్రాష్. ఈ సంఘంలో ఏ విలువా దానికదే ఎగ్జిస్ట్ కాదు మరో దానితో ముడిపడి వుంటుంది. దేనికదే సంపూర్ణంగా వుండదు. నైతిక విలువలన్నీ కూడా ఇంతే. అందుకే మగవాడికో నీతి. ఆడదానికో నీతి పేదవాడికో న్యాయం, ధనవంతుడికో న్యాయం.
జన్మతహా మనుషులందరూ జగదీష్ కే ఎక్కువ గౌరవ మర్యాదలున్నాయి. ఇంతమంది వున్నా ఎప్పుడూ అతనె డామినేట్ చేస్తుంటాడు. మిగిలిన వాళ్ళు అతన్ని అనుసరించి పోతుంటారు.
ఇక్కడున్న వాళ్ళల్లో తను మరీ పేదవాడు కనుక తనను ఎవరూ పట్టించుకోరు. తన మాటలను ఎవరూ ఖండించకుండా వినరు. తను ఏం చెప్పినా 'పోవోయ్ నీకేం తెలుసు?' అంటారు. అదే జగదీష్ అయితే ఏం చెప్పినా ఆర్గ్యుమెంట్స్ లేకుండా ఒప్పేసుకుంటారు.
"విజిటర్స్ ఛాయిస్ అనే టీపొడి వుంది. రెండు వందల గ్రాముల టీ పొడిధర ఎంతో తెలుసా? ఏడువందల ఎనభయి రూపాయలు. దీంతో చేసిన టీ కేవలం స్టార్ హోటళ్ళలో మాత్రమే దొరుకుతుంది." అని జగదీష్ చెబుతుంటే మిగిలిన వాళ్ళు ఔనా అన్నట్టు విస్మయంతో చూస్తుంటారు.
అదీ నిజమే ఇలాంటి విషయాలు జగదీష్ లాంటి వాడికే తెలుస్తాయి. తనలాంటివాడికి ఎలా తెలుస్తాయ్."