వ్యధగా అన్నాడు ఆయన. "వివాహంచేస్తే నా బాధ్యత తీరుతుంది తరువాత దాని ఇష్టం దాని భర్త ఇష్టం అనుకున్నాను."
"పోనీ అరుణ ఆశయాలని సమర్ధించేవరుని వెతికి పెళ్ళి చెయ్యండి."
"అదంతా సులువా నాయనా: అనుకున్న వెంటనే అన్నీ కుదిరినవాడు దొరకాలి. దొరికినా అరుణ ఆశయాన్ని ఆమోదించగలగాలి. నెరవేరుతుందనితోచదు నాకు." నిట్టూర్చి అన్నారు. "ఏమిటో: అరుణకి హఠాత్తుగా ఇలాంటి బుద్దిపుడుతుందని ఎన్నడూ అనుకోలేదు. దానికోసం స్వసుఖాలనే వదులుకుంటుందని అయినవాళ్ళనే లెక్క చెయ్యదని అనుకోలేదు. ఆమె ఆశయం మంచిదే:కాని, ప్రాక్టికల్ గా అది నెరవేరడం ఎంత కష్టమో చెప్పినా అర్ధం చేసుకోవడం లేదు. నేను ఎన్నివిధాలో చెప్పాను. మీరుమాత్రం ఏం చెయ్యగలరు?"
ప్చ్ కానీ, దానికి ఈ బుద్ది ఎందుకు పుట్టిందో. ఏం జరుగుతుందో ; కానీ..... కానీ....." వేణుగోపాల్ దగ్గరసెలవు తీసుకుని భారంగా బయలుదేరారు రామారావుగారు.
* * *
అరుణ తనేఊరు ఎంచుకుని ప్రాక్టీసు పెట్టాలా అని చాలా ఆలోచించింది అసలు తనకే పల్లెటూళ్ళు తెలియవు: ఆ ఉన్న గ్రామాలలో ఎన్నింటిలో డాక్టర్లు ఉన్నారో అంతకుముందే తెలియదు. ఒక డాక్టరు ఉండగా మళ్ళీ అంత చిన్న చిన్న గ్రామాలలో ఇంకో డాక్టరు ప్రాక్టీసు పెడితే ఏం లాభం ఉండదు. ఈ సమాచారం ఎలా ఎవరినించి సేకరించడం? తనుపబ్లిక్ హెల్త్ పోస్టింగప్పుడు వెళ్ళిన ఊళ్ళన్నీ గుర్తుకు తెచ్చుకుంది. కొన్ని మరీ చిన్నవి: కొన్నింటికి ప్రైమరీ హెల్త్ సెంటర్లు ఉన్నాయి: మరికొన్నింటికి ఓ మాదిరి పెద్ద ఊళ్ళకి ఎవరో డాక్టరున్నట్టే గుర్తు. తోటి హౌస్ సర్జన్స్ ని నలుగురైదుగురిని వాకబు చేసింది. అందరూ తలో పేరు చెప్పారు. కొందరు అదివరకే డాక్టరున్నదీ లేనిదీ సందేహంగా చెప్పారు.
మొత్తానికి ఏదీ నచ్చలేదు అరుణకి. ఊరు చిన్నదయినా ప్రశాంతంగా, అందంగా ఉండాలి కాస్త ప్రకృతి దృశ్యాలయినా తనకి కాలక్షేపం కలిగించేవిగా ఉంటే బాగుంటుంది: మరీ ఈ ఊరిక దగ్గరగా ఉండడం అరుణకి ఇష్టం లేదు. తనకి ఇతర ఆలోచనలు చుట్టుముట్టి తన యత్నానికి భంగం కలిగించకుండా ఉండడానికి వీలు ఉంటుంది. ఇక్కడి నించి దూరంగా వెళ్ళిపోవాలి. ఆలోచనల మధ్య జానకి హఠాత్తుగా గుర్తువచ్చింది. జానకి మృత్యువుకి కారణం వైద్య సహాయం లేకపోవడం: అలాంటిచోటే తనకు కావాలి: ఆ ఊళ్ళోనే తను ప్రాక్టీసు పెట్టవచ్చు. ఆఊరి గురించి జానకి ఎప్పుడో పెళ్ళయిన కొత్తలో ఏదో చెప్పింది. గోదావరి ఒడ్డున అని. కాలువలు తోటలు అది బాగుంటుందని ఏదో చెప్పినట్లు గుర్తు.
ఆ ఆలోచనరాగానే సాయంత్రమే జానకి వాళ్ళింటికి వెళ్ళింది. వాళ్ళవాళ్ళని కలుసుకుంటే అన్ని సంగతులు తేలుస్తాయని. జానకి తల్లి కామాక్షమ్మ కూతుర్ని తలుచుకుని ఓసారి రాగంతీసింది. ఆవిడకి సానుభూతి చెప్పి, తను వచ్చినమాటా పైన పెట్టింది అరుణ, "నీలాగే అందరు డాక్టర్లు ఆలోచిస్తే మా జానకి బ్రతికేదేమోనమ్మా నిన్నెలా అభినందించాలో తెలియడం లేదు." జానకి తండ్రి అవధానిగారు అరుణని మెచ్చుకుంటూ మాట్లాడారు. అరుణ చెప్పింది విని.
"ఆఊరు నేనెప్పుడూ సైర్గా చూడలేదమ్మా ఊరు అందంగా బాగుంటుందని మా జానకి అనేది. గోదావరి ఒడ్డు. కొబ్బరితోటలు...... అవీ బాగుంటాయట. మా అల్లుడికి రాస్తే వివరాలు తేలుస్తాయమ్మా మొన్న వెళ్ళాంగాని, మా దుఃఖంలో మేము ఉన్నాం. ఊరేలా ఉందో ఏం పట్టించుకుంటాం? అన్నారు అవధానిగారు. ఆయన అల్లుడికి రాసి కనుక్కోవడం కంటే తనే జానకిమొగుడికి రాసి వివరాలు తెలుసుకుంటేనే బాగుండేటట్టనిపించింది అరుణకి. అడ్రసు తీసుకుని, ఇంటి కొచ్చి వెంటనే జానకి మొగుడు సుబ్బారావు కి తనకి కావలసిన వివరాలు రాయమని కోరుతూ ఉత్తరం రాసి పడేసింది. అక్కడితో కాస్త నిశ్చింతఅనిపించింది. ఈ మూడు నెలల లోపల ఓ మంచి ఊరే సెలక్టు చేసుకోవాలి. వెళ్ళి అన్ని సదుపాయాలు అమర్చుకోవాలి ప్రాక్టీసు పెట్టడానికి కావలసిన ముఖ్యమైన ఎక్విప్ మెంట్ కొనాలి. డబ్బు తండ్రిని అడగాలి. ఏమంటారో రాత్రింబగళ్ళు ఇదే ధ్యాస అయింది అరుణకి.
* * *
ఎన్నోసార్లు అరుణని వివాహానికి సుముఖంగా మార్చాలని రామారావుగారు చాలా ప్రయత్నించారు. కమలమ్మ ఎన్నో విధాల బోధపరిచింది. బ్రతిమాలింది. అయినా, అరుణ కరగలేదు. తన నిశ్చయం మారదని స్పష్టపరిచింది. కృష్ణమూర్తి చెల్లెలితో తగువు పెట్టుకుని వాదించాడు. బెదిరించారు, ఆఖరికి నచ్చచెప్పబోయాడు. ఎవరి అనునయాలు అధికారాలు అరుణని మార్చలేకపోయాయి. చిన్నప్పటినుంచి అరుణని యెరిగిన అందరికి అరుణ నిశ్చయం మారేది కాదని అర్ధం అయిపోయింది.
రామారావుగారు వేణుని కాక ఇతర సంబంధాలు చూసే ప్రయత్నాలు ప్రారంభించగానే. దానికి అరుణ అడ్డుచెప్పింది ఇప్పట్లో తన వివాహప్రసక్తి తేవద్దని చెప్పేసింది. దానితో పూర్తిగా హతాశులైపోయారు రామారావుగారు. కూతురుతన చెప్పు చేతల్లో లేదని తెలుసుకున్నారు. ఆమె భవిష్యత్తు ఆమెకే వదిలేయడం మినహా తనుచేయ గలిగింది ఏం లేదని అర్ధం అయి నిట్టూర్చి ఊరుకున్నాడు.
* * *
జానకి భర్త సుబ్బారావునించి వారం రోజులలోనే జవాబు వచ్చింది. ఉత్తరం ఆత్రంగా విప్పింది అరుణ. శ్రీ అరుణాదేవికి. మీఉత్తరం చూసి నాకంటే సంతోషించిన వారెవరూ ఉండరు. నిజంగా మిమ్మల్ని ఎలా అభినందించాలో తెలియడం లేదు. మీరు చేయబోయేది నిజంగా సత్కార్యమే! మీ కింత సదుద్దేశం కలిగినందుకు, ఆ అదృష్టానికి మా గ్రామమే నోచుకున్నందుకు నేనే కాదు..... మా గ్రామవాసులందరు మీకు కృతజ్ఞతగా ఉంటాము. మీ గురించి జానకి ఒకటి రెండు సార్లు చెప్పినట్లు గుర్తు:
ఈనాడు జానకే ఉంటే ఎంత సంతోషించేదో: జానకి జానకితోపాటు నేనూ దురదృష్టవంతులం మీ చదువే ఓ సంవత్సరం ముందు అయి ఉంటె మీరు మా ఊళ్ళో డాక్టరుగా ఉండి ఉంటే జానకి ఇలా అకాల మృత్యువువాతపడేది కాదు: జరిగిన దానికి విచారించి ఏం లాభం? జానకికాకపోయినా, జానకిలాంటి చాలా మందికి ప్రాణదానం చెయ్యండి మీరు ఈ వార్త చెప్పగానే మాఊరివారందరూ చాలా సంతోషించారు. పంచాయితీ ప్రెసిడెంటుగారూ, ఇంకా పెద్దలు అందరూ తమరిని తప్పక మా గ్రామంలోనే ప్రాక్టీసు పెట్టమని, అన్నీ విధాలా అందరి సహకారం లభిస్తుందని మాట ఇచ్చారు.
ఇంక మా ఊరి గురించి మీరడిగిన వివరాలు" మా ఊరు గోదావరి ఒడ్డున ఉంది. గోదావరి ఇక్కడ పాయలైంది. ఊరి ఒడ్డున బాగా ఇసక మేటవేసింది. ఈ పాయల మధ్యలంకలు, లంకల్లోతోటలు, ఇళ్ళు ఉన్నాయి, కొబ్బరి తోటలు, నారింజ, పనస, మామిడి, చింత, నిమ్మ తోటలు అంతా బాగుంటుంది. ఏటిగట్టుకి రెండు వైపులా తుమ్మ చెట్లు, సరుగుడు చెట్లు ఇటు పక్క ఓ రోడ్డుమామూలు మట్టిరోడ్డు, కార్ల రాకపోకలకి అంత వీలు ఉండదు.
బస్సు ఊరికి రెండు మైళ్ళదూరంలో రోడ్డు మీద ఆగిపోతుంది. అక్కడనించిబళ్ళలో రావాలి. లేక నడిచి రావలసి ఉంటుంది ఊళ్ళోకి జీపులు రావచ్చు. రైలు స్టేషను పదిమైళ్ళ దూరంలో ఉంది. ఈ ఊరికి రాదలచినవాళ్ళు రైలు దిగి. బస్సెక్కి వూరికి రెండుమైళ్ళు రోడ్డుమీద దిగి ఒంటెద్దు బండిమీద ఊరి లోపలికి రావల్సి ఉంటుంది. మా ఊళ్ళో మొత్తం నాలుగైదు వందల ఇళ్ళు పూరిపాకలతో కలిసి ఉంటాయి. జనాభా రెండువేలు మూడువేల మధ్య ఉంటుంది. ఒకప్పుడు బ్రాహ్మలది పైచెయ్యి అయినా ఇప్పుడు మిగతా వాళ్ళది. ఊరికి ఓ పక్క శివాలయం రెండోపక్క వేణుగోపాల మందిరం ఉన్నాయి. ఊళ్ళో మిడిల్ స్కూల్ ఉంది. మా ఊరికి కరెంటు మొన్నమొన్ననే వచ్చింది. మా ఊళ్ళో డిగ్రీలున్నడాక్టరు ఎవరూ లేరు.
పురుళ్ళు పోయడానికి ఇద్దరు మంత్రసానులు ఉన్నారు. కృష్ణమూర్తి తెలుగువైద్యుడు ఉన్నాడు. సాధారణంగా చిన్నచిన్న వాటికి ఆయన దగ్గరే మందుపుచ్చుకుంటారు. ఇంకా ఓ అనుభవం ఉన్న మంగలి వైద్యుడున్నాడు. కురుపులు, దెబ్బలు, వాపులు..... అన్నింటికి వాడే దిక్కు ఇదివరకు అంటే మూడు నాలుగుఏళ్ల క్రితం ఎల్.ఎమ్.పి. చదివిన రిటైర్ అయిన ఓ ముసలి డాక్టరుండేవారు. ఆయన ఉన్నప్పుడు చిన్న చిన్నవాటికి ఆయనే మందులు ఇచ్చేవాడు. ఆయనపోయిన దగ్గిరనించి రెండేళ్ళుగా డాక్టరు అన్నవారు లేక మేమందరం చాలా ఇబ్బందిపడుతున్నాం.
మాఊరికి అనుకుని ఉన్న ప్రైమరీ హెల్తు సెంటర్ పేరుకి మాత్రమే: దానికి డాక్టరు అన్నవారు ఎవరూలేరు. అదృష్టం బాగున్నవాళ్ళకి ఎప్పుడో డాక్టరు కనిపిస్తారు. వాళ్ళు కనిపిస్తే మందులుండవు అక్కడ మందులున్నప్పుడు మనిషి కనిపించడు అదీ అక్కడి పరిస్థితి మా ఊరి ప్రజలకి ఏ విధంగానూ ఆ సెంటర్ ఉపయోగంలేదు ఏదన్నా సీరియస్ కేసయితే టైముంటే ఇక్కడికి ముఫ్ఫై మైళ్ళున్న తాలూకా ఆస్పత్రికి తీసుకెడతారు. అక్కడికి తీసుకెళ్ళే టైము లేనికేసులది భగవంతునిదే భారం.
మీరడిగిన వివరాలు నా చేతనయినంత వరకు ఇచ్చాను. నేను రాయడంకంటే మీరు స్వయంగా ఓసారివచ్చి చూసుకుంటే బాగుంటుంది.
మీరిక్కడ ప్రాక్టీసు పెట్టడానికి మాఊరి వారందరం చేతనయినంతగాసహకారం ఇస్తారని వాగ్ధానం చేస్తున్నాను. ఈ ఊరేకాక, ఈ వూరి నానుకుని రెండుమూడు మైళ్ళదూరంలో మూడు నాలుగు గ్రామాలున్నాయి. అరుణవూళ్ళ పరిస్థితి మా వూరి కంటే అధ్వాన్నం మీరు వస్తే ఆ వూళ్ళ నించి కూడా రోగులు మీ దగ్గరికే వస్తారని చెప్పగలను.
డాక్టరు లేక ఇబ్బందులుపడే మా గ్రామవాసులమీద దయతలచి భగవంతుడే మీకీ సద్భుద్ది కలిగించిఉంటాడని నా విశ్వాసం మీ నిశ్చయం సడలదని త్వరలో మీ రిక్కడికి వచ్చి పరిస్థితి స్వయంగా చూస్తారని ఆశిస్తాను. మీరు వచ్చే ముందు తెలియపరిస్తే బండి ఏర్పాటు, బస ఏర్పాటు చేయగలను.
ఇట్లు,
.......సుబ్బారావు"