Read more!
Next Page 
మానవత పేజి 1

                                 

 

                                                  మానవత
        
                                                                      డా. దాశరధి రంగాచార్య

 

                                  

        ప్రళయం వచ్చేటట్లుంది - జల ప్రళయం! ఆకాశం కారుమబ్బుల్తో నిండివుంది. మబ్బులు మదవతుల్లా కదుల్తున్నాయి. ఒకటే ఉరుములు! భూమిని వణికిస్తున్నాయి! క్షణక్షణానికి మెరుపులు, మబ్బులు వికటాట్టహాసం చేస్తున్నట్టుంది. జల్లుతో మొదలై వానగా మారింది. ఆకాశంనుంచి భూమిపై పడుతున్న ధారలు ఆకాశానికి, నేలకు ముడిపెట్టినట్లున్నాయి. నిరంతరం ధారలు, ఎడతెరిపి లేని వాన పట్టపగలే చీకట్లు కమ్ముకుంటున్నాయి.
    వాన! ఏనోట విన్నా వాన, వారం రోజులుగా కురుస్తూంది, ఊరు జలమయం అయింది. ఊరికి ప్రాణం ఉన్న జాడ కనిపించడం లేదు. ఒక్క జీవీ బయటికి రావడం లేదు. మనుషులు ఇళ్ళనుంచి, పశువులు కొట్టాల్నుంచి కదలడం లేదు.
    ఏరు నిండి పొంగులు వారుతూ పారుతూంది. గట్లను తెంపేటట్లుంది. ఏటి వరద గంట గంటకూ పెరుగుతూంది. హోరు ఎక్కువయింది. ఏరు మరికొంత పొంగితే ఊళ్ళోకి వస్తుంది. ఇహ ఊరుండదు.  ఆ విషయం అందరికీ తెలుసు. అయినా ఎవరూ కదలడం లేదు. వాన ఎవరినీ కదలనివ్వడం లేదు. ఏరు ఎవరినీ ఉండనిచ్చేలా లేదు.
    ముకుందం గారి స్థితి అయోమయంగా ఉంది. కాలు కాలిన పిల్లిలా బయటికి, లోపలకు తిరుగుతున్నారు. వాన తగ్గే సూచన లేదు. ఇంటిముందు పారే వరద కనిపిస్తూంది. ఏరు ఎప్పుడు కట్టలు తెంచుకుంటుందో తెలియదు. ఆయనకు చప్పున ఏదో స్ఫురించింది. దేవుని గదిలోకి ఉరికాడు. చీకటిగా ఉంది.
    అంధకారంలో ఏం కనిపిస్తుంది? దేవుడూ కనిపించడు.
    'జానకీ', ముకుందంగారు పిలిచారు. అది ఆర్తనాదంలా ఉంది. "జానకీ! అగ్గిపెట్టె తేమ్మా!"
    జానకి పిడికిట అగ్గిపెట్టెతో ఉరకలేక వచ్చింది. ఆ అగ్గిపెట్టెలోనే వెలుగంతా దాగినట్లుంది. పిడికిలి తెరిస్తే వెలుగు పారిపోతుందేమోనని ఆమె భయం! దేవుని గది ముందు వచ్చింది. గుమ్మం ముందు నుంచుంది. అగ్గిపుల్ల గీసింది.
    వెలుగులో వారిద్దరికీ సీతారామ లక్ష్మణల విగ్రహాలు కనిపించాయి! అవి మసక మసగ్గా ఉన్నాయి. అగ్గిపుల్ల కాలిపోయింది. ఆరిపోయింది. మళ్ళీ చీకటి. అంధకారం. మనిషికీ మనిషికీ మధ్య చీకట్ల తెరలు.
    "అమ్మా, జానకీ! ప్రమిష ముట్టించమ్మా! ఈ ప్రళయం నుంచి రక్షించమని రాముణ్ణి ప్రార్దింతాం" ముకుందంగారి ధ్వని బరువుగా ఉంది. రానున్న ప్రళయపు భారం వారి మీద కనిపిస్తూంది.
    జానకి అగ్గిపుల్ల గీసి ప్రమిష వెలిగించింది. ముకుందంగారు చేతులు జోడించి ప్రార్దించారు.
    "రామా! జగద్రక్షకా! నువ్వు జగద్రక్షకుడవు స్వామీ! భక్షకుడవు కావు. ఎందుకలా చిరునవ్వు నవ్వుతావు! ప్రళయం వస్తున్నది చూడ్డంలేదా? ఏరు పొంగుతున్నది. ఊరిని మింగేట్లున్నది. నీ బాణంతో సముద్రున్ని వణికించావు. అది నీ పని అనా?.....చూడు, జనం చేతుల్లో ప్రాణాలు పెట్టుకుని ఉన్నారు. వారం నుంచి బయటకు అడుగిడలేదు. ఎందుకు నాయనా నీకీ ఆగ్రహం? నీ బిడ్డలపైనా కోపం? శాంతించు, ప్రజలను రక్షించు."
    ఏరు హోరు వినిపిస్తూంది, వాన చప్పుడు వినిపిస్తూంది.
    "అమ్మా! జానకీ! నువ్వు ప్రార్దించమ్మా! సీతమ్మను వేడుకోమ్మా! ఆమె దయామయి. తనను వేధించిన రక్కసులను సయితం మన్నించిన క్షమామూర్తి."
    జానకి కీర్తన అందుకుంది.
    
                                                              2
    
    ఫాదర్ జాన్ కు స్థిమితం లేదు. ఇటునుంచి అటు, అటునుంచి ఇటు చిరాగ్గాపచార్లు చేస్తున్నాడు. ఆయనకు ఎటూ తోచడంలేదు. గబగబా వచ్చి గుమ్మంలో నుంచున్నాడు. వానను చూస్తున్నాడు; నది హోరు వింటున్నాడు. రెండు అరచేతులూ రాసుకుంటున్నాడు. వెనక్కు వెళ్ళిపోతున్నాడు; మళ్ళీ ముందుకు వస్తున్నాడు. అతని ముఖంలో ఈ ప్రళయం మానవాళిని ముంచేస్తుందేమోననే భయం కనిపిస్తూంది.
    "ప్రభూ! ఈ లోకాన్ని మింగేస్తావా? ఎందుకీ వాన? ఏమిటీ వరద? అమాయకుల్ని రక్షించవా?" అనుకోకుండా వచ్చిన మాటలివి!
    ఏదో ఆలోచన స్ఫురించినట్లయింది.
    "మైసన్ పాల్! బాబూ! పాల్" పిలిచాడు.
    జవాబు లేదు. బిగ్గరగా పిలిచాడు.
    పాల్ బయటికి వచ్చాడు. చేతిలో పుస్తకం ఉంది. అధ్యయనం చేస్తున్నట్టున్నాడు. ముఖంలో అలసట ఉంది.
    "ఎస్ ఫాదర్?"
    "చూచావా వాన?"
    పాల్ వానను చూచాడు. హోరు విన్నాడు. "ఇంకా తగ్గలేదా వాన?" ఆశ్చర్యంగా అడిగాడు.
    "ఎక్కడ తగ్గేట్లుంది! లోకాన్ని ముంచేట్లుంది. దేవుని బిడ్డల్ని కాపాడాలి."
    "ఫాదర్! ఎలా ఇంత వాన? ఏం చేద్దాం?"
    "ప్రేయర్ - ప్రార్ధన-ప్రభువును ప్రార్దించాలి. ఆయన బిడ్డల్ని రక్షించుకోవలసిందని వేడుకోవాలి. వస్తావా చర్చికి? వంటరిగా పోలేకున్నాను."
    "పదండి ఫాదర్" అని పుస్తకం లోనపెట్టి గొడుగు, టార్చి తీసుకొని బయల్దేరాడు. వానలో చర్చికి చేరారు.
    "ప్రభూ! పాపులను రక్షించుటకు వచ్చిన దేవదూతా! రక్షించు, నీ బిడ్డలు తల్లడిల్లుతున్నారు. ఈ ప్రళయం వారిని మింగేట్లుంది. నీ బిడ్డలు నిన్ను నమ్ముకున్నారు. ఏరు పొంగితే ఊరు మునుగుతుంది. వరదను అడ్డు, వానను ఆపు. ఏసుప్రభూ! నీవే మాకు రక్షా. నీ బిడ్డల్ని కాపాడు. రక్షించు, కాపాడు. రక్షించు."
    
                                                                3
    
    వాన తగ్గింది. ఎండ వారం తరువాత కనిపించింది. జనానికి విముక్తి లభించినట్లయింది.
    వీధులంతా బురద బురద. చల్లటి చలిగాలి. సాధారణంగా ఈ వాతావరణంలో జనం బయటికి రారు.
    వారం తరవాత ఎండ వచ్చింది. జనం బురదను లెక్క చేయడం లేదు. చలిగాలికి వెరవటం లేదు. కర్ఫ్యూ తరవాతలా జనం బయట పడ్డారు. తుపాకీ దెబ్బకు కాకుల్లా ఎగిరి వచ్చేశారు. వీధుల నిండా జనం. ఏనోట విన్నా వరద మాటలే; వాన మాటలే. పశువులు కొట్టాల్లోంచి బయట పడ్డాయి. జైల్లో నుంచి విముక్తి లభించినట్లుంది వాటికి. స్వేచ్చ విలువ బానిసత్వం తరువాత గాని తెలియదు. వెలుగు ప్రభావం చీకటి తరవాత గాని తెలియదు. కష్టాల తరవాత సుఖం తెలీదు.
    జనం ఏటివైపు బయల్దేరారు. పోరు పెట్టిన ఏరుని చూడ్డానికి బయల్దేరారు. ముకుందంగారు కండవా వేసుకున్నారు. వంకె కర్ర అందుకున్నారు. వాకిటి తలుపు వేశారు. జానకిని జాగ్రత్తగా ఉండమని చెప్పారు. ఆయనా ఏరు దగ్గరికి చేరారు.
    ఏరు నంగనాచిలా ఉంది. అతి వినయంగా పారుతూంది. ఎన్నడూ పొంగనట్లు సాగుతూంది.
    ముకుందంగారు ఏటిని  చూశారు ___ఆశ్చర్యపడ్డారు. నిన్న పొంగింది- పొర్లింది - మిడిసిపడ్డది. ఊరినే మింగుతానన్నది. ఇవాళ కుంగింది. వంగింది. అణగిపోయింది. ఆ రాముడు లేకుంటే-తాను ప్రార్దించకుంటే ఈ ఏరు ఊరిని మింగేదే! ఇది రాముని ప్రభావం. అతడు సముద్రున్నే గడగడ లాడించాడు, ఈ ఏరు ఒక లెక్కా! తన ప్రార్ధన-తన వినతి-తన విన్నపం - పని చేశాయి; ప్రభావం చూపాయి. తాను ప్రార్దించకుంటే ఈ ఊరు ఉండేది కాదు. ఇప్పటికే ఊరు జలమయం అయి ఉండేది. తనలో శక్తి ఉంది. తన ప్రార్ధనలో బలం వుంది.

Next Page