Read more!
Next Page 
క్లైమాక్స్ పేజి 1

                                 

 

                                   క్లైమాక్స్

                                                                                         మైనంపాటి భాస్కర్

 

                               

 

అప్పుడే తెలవారుతోంది.

అక్కడంతా కొండలూ , బండలు.

ఆ కొండల మధ్య లోయలా వున్న ప్రదేశంలో ఇరవై గుడారాలు వేసి వున్నాయి. వాటిలో వుంటున్నారు ఒక సినిమా యూనిట్ మెంబర్స్ అందరూ.

గత రెండు రోజులుగా ఒక భారీ చిత్రం తాలూకు అవుట్ డోర్ షూటింగ్ జరుగుతోంది అక్కడ.

తన కోసం వేసిన విశాలమైన టెంటులో కూర్చుని వున్నాడు హీరో హరీన్. అతని పర్సనల్ మేకప్ మన్ అతని మేకప్ కి ఫినిషింగ్ టచెస్ ఇస్తున్నాడు.

హరీన్ పక్కనే కూర్చుని వున్నాడు డైరెక్టర్ విష్ణువర్ధనరావు ఆరోజు షూట్ చెయ్యబోయే సన్నివేశం  తాలూకు వివరాలు చెబుతున్నాయి. అయన చెబుతున్నదంతా జాగ్రత్తగా వింటూ, పాయింట్స్ మనసులోనే నోట్ చేసుకుంటున్నాడు హరీన్.

ఈలోగా , తళతళలాడే తెల్లబట్టలు వేసుకుని, తెల్లటి చెప్పులతో, మెరిసిపోతున్న నిర్మాత లోపలికి అడుగుపెట్టాడు.

అతన్ని చూడగానే నవ్వుతూ అన్నాడు హీరో హరీన్ -

"అవునూ! సినిమావాళ్ళలో చాలామంది తెల్లబట్టలే ఎందుకు వేసుకుంటారు?"

దానికి ఏం జవాబు చెప్పాలో తోచక చిన్నగా నవ్వి వూరుకున్నాడు నిర్మాత.

కానీ హరీన్ వదలలేదు. అతను సరదామనిషి, అతను ఎక్కడ వుంటే అక్కడ సందడి వుంటుంది. "సినిమావాళ్ళేప్పుడూ తెల్లబట్టలే ఎందుకు వేసుకుంటారు? దొంగల డెన్ లో ఎప్పుడూ డబ్బాలూ, డ్రమ్ములు ఎందుకుంటాయి? చివరి రీల్లో హీరో విలన్ ని చావగొట్టి చెవులు ముసేదాకా పోలీసులు ఎందుకు దిగబడరు? ఇవన్నీ జవాబులేని ప్రశ్నలు కదండీ?"

"ఏమిటి సార్! మమ్మల్ని దొంగల్ని ఒకే లిస్టులో కలిపెస్తున్నారే ఇదేం బాగాలేదు!" అన్నాడు నిర్మాత నవ్వుతూ. అందరూ నవ్వేశారు . తర్వాత "ఏం సార్! ఏర్పాట్లు అన్నీ సక్రమంగా వున్నాయా? సౌకర్యంగా వుందా మీకు?" అన్నాడు నిర్మాత.

"భలేవారే! ఈ కొండాకోనల్లో కూడా పంచతార ఏర్పాట్లు చేసి పైగా సౌకర్యంగా వుందా అని అడుగుతారేమిటి?" అన్నాడు హీరో హరీన్.

"పంచదార ఏర్పాట్లా? అవేమిటి?" అన్నాడు నిర్మాత ఆశ్చర్యపోతూ.

"పంచదార కాదు. ......పంచదార - అంటే ఫైవ్ స్టార్ అరేంజ్ మెంట్స్ అన్నమాట!" అని నవ్వాడు హరీన్.

"హీరోగారు చాలా విట్టీగా మాట్లాడతారు! ఇక నుంచి అయన డైలాగులు ఆయనే రాసుకోవచ్చు, నేనెందుకు?" అన్నాడు డైలాగు రైటరు.

మళ్ళీ అందరూ నవ్వారు.

ఇడ్లి, పెసరట్టు, కాఫీతో బ్రేక్ ఫాస్ట్ ముగిసింది.

అప్పటికే బయట అంతా అభిమానులు గుమిగూడి వున్నారు. చుట్టుపక్కల వూళ్ళనుంచి, పల్లెల నుంచి, కాలినడకనా, ఎద్దుబండ్ల మీదా,సైకిళ్ళ మీదా, బస్సులలోను, లారీలమీదా, మోటారు సైకిళ్ళ మీద జనం వచ్చారు. కొంతమంది కార్లలో కూడా వచ్చారు.

అందరికి ఒకే తహతహ!

తమ అభిమానహీరోని, తమ ఆరాధ్యదైవం హరీన్ ని ప్రత్యక్షంగా చూడాలి. అతనితో కరస్పర్శచేసి అతన్ని తాకిచూడాలి. అతనికి దగ్గరగా నిలబడి అతను పీల్చే గాలినే తాము కుడా పీల్చాలి. అతని అటో గ్రాఫ్ తీసుకుని ఆజన్మాంతం దాచి పెట్టుకోవాలి.

అంతమంది ఒకచోట చేరడంతో అక్కడ కార్నివాల్ అల్ మాస్ ఫియర్ చోటు చేసుకుంది. అందరిలో ఆతృత అనందం ఆవేశం -

అరుపులు, కేకలు, ఈలలు, చప్పట్లు!

ఆనందోత్సాహాలు పట్టలేక ఉప్పొంగిపోతున్న ఆ జనసంద్రాన్ని అదుపులో పెట్టలేక తలకిందులై పోతున్నారు అక్కడ డ్యూటీలో వున్న కొద్దిమంది పోలీసులు.

హీరో హరీన్ బయటికి వచ్చాడు.

వెంటనే మిన్నంటే హర్షధ్వనాలు ఆ కొండలో ప్రతిధ్వనించాయి.

ఆ గుంపులోని ఒక కుర్రాడు సంతోషం ఆపుకోలేక చెంగుమని గాల్లోకి ఎగరడం కనబడింది.

చిరునవ్వుతో ఇదంతా చూశాడు హరీన్. అందరికి అభివాదం చేశాడు.

"సూపర్ స్టార్ హరీన్ జిందాబాద్!" అని అరిచాడు ఒకతను.

మిగతావాళ్ళంతా అందుకున్నారు.

ఆ పదాలని తిరుమంత్రంలా జపించడం మొదలెట్టారు జనం.

మాస్ హిస్టీరియా మొదలయింది అక్కడవున్న అందరిలోనూ ఒకే విద్యుత్ ప్రవహిస్తున్నట్లు ఎలక్ర్టిక్ ఫై అయిపొయింది వాతావరణం.

సూపర్ స్టార్ జిందాబాద్! సూపర్ స్టార్ జిందాబాద్! సూపర్ స్టార్ జిందాబాద్!

క్రమక్రమంగా తారాస్థాయికి చేరుకుంటున్నాయి ఆ హర్షధ్వానాలు.

అభిమానుల చప్పట్లే కలాకారుడికి ఆయువుపట్టు!

అందరూ అలా అభిమానం చూపించినన్ని రోజులు తను అజేయుడిగా ఉండగలనని తెలుసు హరీన్ కి. సంతృప్తిగా వుంది అతనికి. అక్కడ వున్న కొండ శిఖరాన్ని ఒక్క అంగతో అందుకోవాలన్నంత ఆత్మవిశ్వాసం కలిగింది.

అవే హర్షాద్వానాలు అక్కడ వున్న ప్రొడ్యూసర్ కి ఒళ్ళు పులకరించేలా చేశాయి. ఇంత పెద్ద ఫాలోయింగ్ వున్న హీరోని పెట్టుకోవడం తను చేసిన తెలివైన పనుల్లో ఒకటని అనుకుని అతను తన భుజం తానే తట్టుకున్నాడు.

ఆ హర్షధ్వానాలు అతనికి లక్ష్మీదేవి కాలి అందియల గలగలలాగా రాసులుగా వచ్చి పడుతున్న కాసుల చప్పుడులాగా వినబడుతున్నాయి.

అవే హర్షాద్వానాలు దర్శకుడు విష్ణువర్ధనరావుకి, ఆ పిక్చరు ఏ ఇంటర్నేషనల్ ఫెస్టివల్ కో వెళితే అక్కడి డెలిగేట్స్ తన ప్రతిభకు మెచ్చి కొట్టిన క్లాప్స్ లా వినబడ్డాయి.

ఆ పిక్చర్ కి బుక్ అయిన విలను ఇండస్ట్రికి కొత్త కుర్రాడు నిన్ననే మొదటిసారిగా కెమెరాని ఫేస్ చేశాడు అతను.

మొదటిసారి కావడం వల్ల కెమెరా స్టార్ట్ అనగానే అతను ఫ్రీజ్ అయిపోయాడు. భయంతో బిగుసుకుపోయారు.

అతనివల్ల మంచి షాట్ చెడిపోయిందని ఎగిరిపడ్డాడు డైరెక్టరు విష్ణువర్ధనరావు. తన క్యాప్ ని గాలిలోకి విసిరి, గర్జించినంత పనిచేశాడు.

అప్పుడు హీరో హరీన్ జోక్యం చేసుకుని, విలన్ శ్రీకాంత్ కి ధైర్యం చెప్పి, భుజం తట్టి మళ్ళీ నెక్స్ ట్ షాట్ కీ రెడీ చేయించాడు.

అదంతా ఒక్కసారిగా ఫ్లాష్ బాక్ లా ఇప్పుడు గుర్తొచ్చింది విలన్ కి. అభిమానులు కొడుతున్న చప్పట్లు అతనికి డైరెక్టరు గారి తిట్లలా వినబడటం మొదలెట్టాయి. అతనికి ఒళ్ళంతా చెమటలు పట్టేసింది.

హీరోయిన్ మధుమతి ఇదంతా మందస్మిత వదనంతో చూస్తోంది. హీరో హరీన్ అంటే మనసు వుంది ఆమెకి. కానీ ఆసంగతి తన మనసులో వుంచుకుంది ఆమె. బయట పెట్టడానికి సరియిన సందర్భం రాలేదు ఇంతవరకూ.

కానీ ఆమె మనసు చెబుతోంది.

ఏనాటికైనా అతను తనవాడు కాకపోడనీ అతను తనని మనువాడక తప్పదనీ!

Next Page