Next Page 
వెన్నెల మెట్లు పేజి 1

                                 

 

                                   వెన్నెలమెట్లు
    
                                                            ---మైనంపాటి భాస్కర్
    
                                  
  

    "ఒక్క నిమిషం ఇలా వస్తావా?" అంది శృతి.
    
    పేషెంటుకి బాండేజి కట్టడం ముగించిన ప్రతిమ, వాష్ బేసిన్ దగ్గర చేతులు కడుక్కుని వచ్చింది.
    
    "ఏమిటి?"
    
    "కాఫీ తాగి వద్దామా?"
    
    వాచ్ చూసుకుంది ప్రతిమ.
    
    "ఇప్పుడేం కాఫీ? ఇంకో అరగంటలో ఇంటికెళ్ళిపోతాం కదా?"
    
    శృతి జవాబు చెప్పకుండా నవ్వింది. ఇద్దరూ హాస్పిటల్ కాంటీన్ వైపు నడిచారు.
    
    వాళ్ళు లోపలికి అడుగుపెట్టగానే, స్మార్ట్ గా డ్రెస్ చేసుకొని ఉన్న ఒకతను చనువుగా నవ్వుతూ లేచి నిలబడ్డాడు.
    
    అప్రయత్నంగా నుదురు చిట్లించింది ప్రతిమ.
    
    అతనెవరో గానీ వారం రోజులనుంచీ తనని ఫాలో అవుతున్నాడు. రోజూ స్కూటరేసుకుని తన బస్టాప్ కి కొంచెం దూరంలో నిలబడతాడు.
    
    మామూలుగా అయితే మగవాళ్ళని అంతగా గమనించదు తను ఆ మాటకొస్తే ఆడవాళ్ళని కూడా గమనించదు తను. ఎప్పుడూ సీరియస్ గా ఆలోచనల్లో మునిగిపోయి ఉంటుందనీ, ముక్తసరిగా మాట్లాడుతుందనీ టీజ్ చేస్తూ ఉంటుంది శృతి.
    
    కానీ అతను తన దృష్టిలో పడటానికి పెద్ద ప్రయత్నమే చేశాడు.
    
    "మీట్ మై కజిన్, శ్రీరాం!" అంటోంది శృతి.
    
    "ఇది ప్రతిమ! మారుపేరు మవుని! బాపూ బొమ్మలా అందంగా ఉండటం, రాతి బొమ్మలా మౌనంగా ఉండటం దీని హాబీలు!" ఇంకొంచెం చెప్పింది శృతి.
    
    "ఇటీజ్ ఎ ప్లెజర్ టు మీట్ యూ, మిస్ ప్రతిమా! రియల్లీ సో!" అన్నాడతను, గొంతులో బోలెడంత నిజాయితీ పలికిస్తూ.
    
    మొహమాటంగా తల పంకించి, "హలో!" అంది ప్రతిమ.
    
    ఇతను శృతి కజినా? ఎందుకు వచ్చాడు ఇక్కడికి?
    
    ముగ్గురికీ కాఫీ ఆర్డర్ చేసిన తర్వాత చెప్పింది శృతి. "శ్రీరాం ఎమ్.బి.ఎ. చేశాడు. టీవీ, ఎలెక్ట్రికల్ అప్లయాన్సెస్ ఏజెన్సీ ఉంది. మంచి రోరింగ్ బిజినెస్."
    
    తనతో ఎందుకు చెబుతోంది ఇదంతా? ఎందుకు చెబుతోందో చూచాయగా అర్ధమైపోతూనే ఉంది.
    
    "వీళ్ళ మదర్, అంటే మా సరస్వతి పిన్ని, చాలా మంచి మనిషి శ్రీరాం ఒక్కడే వంశోద్దారకుడు వాళ్ళకి." అంది శృతి నవ్వుతూ.  

 

    శ్రీరాం కూడా నవ్వాడు.
    
    "ఆల్ రైట్! ఆల్ రైట్! మరీ పొడుగుపాటి ఉపోద్ఘాతం వద్దు మిస్! వివరాలు శృతి చెప్పింది కాబట్టి నేను అసలు విషయంలోకి దూకేస్తాను. నేను మిమ్మల్ని మ్యారేజి చేసుకోవాలనుకుంటున్నాను. ఐ వాంట్ టు మేరీ యూ - మీరు ఒప్పుకుంటే - మీరు సరేనంటే పెద్దవాళ్ళతో..."
    
    అంత నిస్సంకోచంగా అతను మాట్లాడతాడని వూహించని ప్రతిమ శృతి వైపు చూసింది.
    
    శృతి పెదవులమీద చిరునవ్వు!
    
    "శ్రీరాం చిన్నప్పటినుంచీ అంతే! అన్నీ సూపర్ ఫాస్టు! దోగాడకుండా పరిగెత్తడం మొదలెట్టాడుట!" అంది.
    
    ప్రతిమ నుదుటి మీద పాదరసం బిందువుల్లా స్వేదం పట్టింది. అది గమనించాడు శ్రీరాం.
    
    "సారీ మిస్ ప్రతిమా! మీరు చాలా అసౌకర్యంగా ఫీలవుతున్నట్లున్నారు. నేను వెళ్ళిపోతాను మీరు నిదానంగా ఆలోచించుకుని రెండ్రోజుల లోపల మీ నిర్ణయం శృతికి చెప్పండి. ఈ రెండు రోజులూ అంటే నలభై ఎనిమిది గంటలపాటు చాలా ఆదుర్దాగా మీ అంగీకారం కోసం ఎదురు చూస్తుంటాను."
    
    అతను మాట్లాడుతున్నంతసేపూ అతని వైపు చూడకుండా శృతినే చూస్తోంది ప్రతిమ. కానీ అతని ప్రతి మాటా, ప్రతి అక్షరం జాగ్రత్తగా వింటోంది.
    
    కాఫీ తాగడం పూర్తయింది.
    
    లేచి నిలబడ్డాడు శ్రీరాం.
    
    "వోకే దెన్! సీ యూ శృతీ! సోలాంగ్, మిస్ ప్రతిమా!"
    
    ప్రతిమ అస్పష్టంగా పెదిమలు కదిలించింది.
    
    "కార్లో వచ్చావా?" అంది శృతి.
    
    "ఊహుఁ! స్కూటర్ తెచ్చాను. కారయితే బోరు! చిన్న చిన్న సందుల్లోంచీ పోలేం న్యూసెన్స్ యార్!" అంటూ చిరునవ్వు నవ్వి, చేయి వూపి, కౌబాయ్ పిక్చర్స్ లో ఫ్రాంకోనీరో లాగా హుందాగా, వెన్ను విరిచి నడుస్తూ వెళ్ళిపోయాడు శ్రీరాం.
    
    ఇదంతా కలలోలాగా, అసహజంగా ఉంది ప్రతిమకి!
    
    "వెరీ ఇంటరెస్టింగ్! కదూ?" అంది శృతి, పెదిమల క్రింద చిరునవ్వు తొక్కిపట్టి.
    
    "చిన్నప్పుడు కథల్లో చదువుకునేవాళ్ళం చూడు - ఒక రాకుమారుడు మెరిసిపోయే దుస్తుల్లో పంచకల్యాణి గుర్రం మీద వచ్చి రాకుమారిని చూసి మోహించి..."
    
    "చాల్లే! వచ్చింది అతనని ఒక్కమాట ముందే చెప్పకూడదా? ఎంత డెలికేట్ గా ఫీలయ్యానో తెలుసా?" అంది ప్రతిమ.
    
    "ముందరే చెప్పేస్తే మజా ఏముంది? అతను మొహమాటం లేకుండా మాట్లాడతాడని తెలుసు నాకు. అప్పుడు నీ మొహం బంగారపు రంగులో నుంచి కుంకుమ రంగులోకి మారే ఎఫెక్టు చూస్తే బీచ్ లో సూర్యోదయం చూస్తున్నంత థ్రిల్లింగ్ గా ఉంటుందనీ!"
    
    శృతి పద్దతి తనకి నచ్చనట్లు నుదురు చిట్లించింది ప్రతిమ.
    
    "వూఁ! చెప్పు! నచ్చాడా?" అంది శృతి.
    
    ప్రతిమ మౌనంగా ఉండిపోయింది.
    
    "మాట్లాడవేం?"
    
    "నేను ఆలోచించుకోవాలి."
    
    "తీరిగ్గా ఆలోచించుకో కనీ ప్రాక్టికల్ గా ఆలోచించు! హౌస్ సర్జెన్సీ పూర్తయ్యాక ఎలాగూ పెళ్ళి చేసుకుంటావు కదా? ఇతనూ తీసెయ్యదగ్గవాడేం కాడు. బాగానే ఉంటాడు. ఆస్తి ఉంది, బిజినెస్ ఉంది. మంచి కుటుంబం."
    
    "నన్ను ఆలోచించుకోనీ!" అని మెల్లిగా చెప్పి దూరంగా వెళ్ళిపోయింది ప్రతిమ.
    
                                                              * * * * * *

Next Page