Previous Page Next Page 
ఎ.కె.47 పేజి 10


    అప్పటి వరకు ప్రాణాపాయంలో వుండి, మత్తు మందు బారి నుంచి తాత్కాలికంగా తనను తాను కాపాడుకున్నాడు విక్రమ్.

    ఇప్పుడు మత్తు కలిపిన డ్రింక్ అతని శరీరంపై పని చేయనారంభించింది.

    అతను మెల్లిగా నిద్రలోకి జారుకున్నాడు....


                          *    *    *


    నవీన్ వైర్లెస్ సెట్ ఆన్ చేసి సిగ్నల్ ఇచ్చాడు.

    "మిస్టర్ నవీన్! మీ ప్రయత్నాలన్నీ వృధాయే! ఇప్పటికైనా మీ ఇన్వెస్టిగేషన్ ను నిలిపివేసి నాకు సహకరించండి. లేదా అంతా దిక్కులేని చావు చస్తారు!" అజ్ఞాత వ్యక్తి మరొకసారి హెచ్చరించాడు.

    "మిస్టర్ కమాండర్! సి.ఎం. తో పెట్టుకుని కోరి కస్టాలు తెచ్చుకోవద్దు. మీకేం కావాలో సూటిగా అడగండి...."

    "వెల్ మిస్టర్ నవీన్! సి.ఎం. రూపంలో వున్న మిగిలిన ఇద్దరిలో డూప్ ఎవరు? సి.ఎం. ఎవరు? చెప్పండి! మీరు సమాధానం చెప్పేవరకు నా డిమాండ్స్ చెప్పను. బై ది బై _ ప్రస్తుతం కాలం చాలా విలువైంది సుమా! ట్రెయిన్ లోను, వి.వి.ఐ.పి. కారులోను టైమ్ బాంబ్స్ వున్నాయని నేను మరొకసారి గుర్తు చేయనవసరం లేదనుకుంటాను." హేళన ధ్వనించింది అతని స్వరంలో.

    ప్రస్తుత పరిస్థితులలో సి.ఎం.తో పాటు సిబ్బందిని, ప్రయాణీకులను కూడా కాపాడవలసిన బాధ్యత తన మీద వుంది.

    ఈ ప్రమాదం నుంచి అందరినీ ఎలా తప్పించాలో ఆలోచిస్తున్నాడు నవీన్. స్థిరంగా ఆలోచించి చివరకు ఒక నిర్ణయం తీసుకున్నాడు.

    "మిస్టర్ కమాండర్! కాన్వాయ్ లో వున్న వ్యక్తి సి.ఎం. కాదు, సి.ఎం.కి డూప్ మాత్రమే. వాళ్ళకు ఏ హానీ తలపెట్టకుండా వెంటనే విడుదలచేయమని మీ సిబ్బందికి తెలియజేయండి...." ఈసారి కూడ తన ఓటమిని అంగీకరిస్తున్నట్టు విషయం తేల్చేశాడు నవీన్."

    "థాంక్స్ మిస్టర్ పోలీస్ ఆఫీసర్! డూప్స్ తో మాకు పని లేదు!"

    వైర్ లెస్ సెట్ లో వాళ్ళ సంభాషణ విన్న కిడ్నాపర్లు సి.ఎం.పోలికలో వున్న ముఖానికి వున్న మాస్క్ ను లాగివేశారు.

    అప్పటివరకు తమకు శ్రమ పెట్టినందుకు కక్షగా కారు డోర్స్ లాక్ చేసి టైమ్ బాంబు మరి అయిదు నిమిషాలలో పేలేట్టుగా సెట్ చేసి కిడ్నాపర్లు అడవిలోకి పారిపోయారు.

    కాలం యధావిధిగా గడచిపోతున్నది.

    రిజర్వు ఫారెస్టు పొదల మధ్యన వున్న కారును ఎవరైనా గుర్తించకపోతారా అనే ఒకే ఒక్క ఆశ ఆబందీ లిద్దరినీ బతికిస్తూ, చావు సమీపానికి తీసుకు వెళుతున్నది....


                           *    *    *


    ముఖ్యమంత్రికి వున్న డూప్స్ ఇద్దరూ బయటపడడంతో సి.ఎం. సూపర్ ఫాస్ట్ రైలులోనే వున్నట్టు కమాండరు నిర్ధారించాడు.

    అప్పటివరకు ఆడిన చదరంగంలో అతనిదే పైచేయిగా వుంది.

    అసలు వాళ్ళ డిమాండ్లు ఏమిటో ఇంతవరకూ ఎవ్వరికి తెలియదు. వాళ్ళు చెప్పేవరకు ఓపికతో వేచి వుండవలసిందే!

    కాని, కాలాతీతం అయిపోతున్నది. అనేక వందల మంది ప్రయాణీకులు ట్రెయిన్ లో వున్నారు.

    వి.వి.ఐ.పి. సెక్యూరిటీ అంటూ తను ప్రయోగాలు మొదలుపెట్టడం వల్లనే ఇంతా జరిగిందా? తను అనవసరంగా లేనిపోని సమస్యలను సృష్టించడం లేదు కదా!_ఆలోచనలతో నవీన్ సతమతమవుతున్నాడు.

    "మిస్టర్ నవీన్! వైర్ లెస్ లో మీ సి.ఎం.ను మాట్టాడమనండి. మా డిమాండ్లు చెబుతాను" అసాధారణ సూచన చేసిన అజ్ఞాత వ్యక్తి స్వరంలో కమాండ్ వుంది.

    "మిస్టర్ కమాండర్! నాకు కొన్ని పరిధులు వున్నాయి. వాటిని మరచిపోతే ఎట్లా? మీరేమైనా చెప్పదలచుకుంటే ముందుగా నాకు తెలియజేయండి, తరువాత సి.ఎం. గారికి నేను వివరంగా చెబుతాను." తన బాధ్యతను తెలియజెప్పాడు నవీన్.

    "నో మిస్టర్ నవీన్! కాలయాపన చేస్తే మీరే నష్టపోతారు...." విసుగ్గా అన్నాడు కమాండరు.

    నవీన్ క్షణం నిట్టూర్చి సి.ఎం. కూపే దగ్గరకు వచ్చి మెల్లిగా తలుపు తట్టాడు.

    సి.ఎం. డోర్ తెరచి అతనిని లోనికి ఆహ్వానించాడు.

    అప్పటి వరకు టేప్ చేసిన అజ్ఞాత వ్యక్తి సంభాషణ అంతా సి.ఎం.కు వినిపించాడు నవీన్. 
       
    సి.ఎం. ఛానల్ మార్చి కమాండరును కాంటాక్ట్ చేశాడు.

    "మిస్టర్ సి.ఎం.! సూపర్ ఫాస్ట్ రైలు విజయవాడ చేరేలోగా మా డిమాండ్స్ అన్నీ అమలుపరచాలి. మీరందుకు ఒప్పుకుంటే డిమాండ్స్ చెబుతాను." జవాబు కోసం క్షణం ఆగాడు కమాండరు.

    ముఖ్యమంత్రి భ్రుకుటి ముడిపడింది.

    మరొక ఛానల్ లో ముఖ్యమంత్రిని డి.ఐ.జి. కాంటాక్ట్ చేస్తున్నారు.

    నవీన్ రెండవ వైర్ లెస్ సెట్ ను సి.ఎం.కు అందించాడు. 
 

 Previous Page Next Page