Previous Page Next Page 
గీతోపదేశం కథలు పేజి 9

       
                                            తానొకటి తలచిన..

    కాలింగ్ బెల్ కొట్టిన నిమిషానికే తలుపు తెరచిన యువకుడిని చూసి "బాబూ, నిన్న పేపర్లో ఈ ప్రకటన ఇచ్చింది మీరే కదా"! తన చేతిలో పేపర్ చూపిస్తూ అడిగింది సీతమ్మ.
    "ఆ.. ఆ... అవును, రండి లోపలికి, మాట్లాడుకుందాం" ఆమెని చూడగానే అతని మొహంలో ఒక విధమైన రిలీఫ్ లాంటి భావం కదలాడింది.
    ఆ వీధిలో అనేక అపార్ట్ మెంట్ల మధ్య మిగిలిన ఒకే ఒక మేడ ఇల్లు. చుట్టూ చిన్న తోట. ముందు రకరకాల పూలమొక్కలు, చుట్టూ చూసి లోపలికి నడిచింది సీతమ్మ. అతను తలుపు తెరిచాక చూస్తే లోపల పెద్ద హాలు, పాతకాలం కిటికీలు, గుమ్మాలు, షోకేసుల నిండుగా రకరకాల బొమ్మలు, విక్టోరియన్ టైపు సోఫాలు, సెంటర్ టేబుల్, గోడల మీద రకరకాల ఫొటోలు. డబ్బున్నవారి ఇల్లని చెప్పకనే చెపుతున్నాయి అవన్నీ.
    "అలా కూర్చోండమ్మా, మీ పేరు" తను కూర్చుంటూ అడిగాడతను.
    "సీత... సీతమ్మండి."
    "మీది ఈ ఊరేనా? మీకెవరూ లేరా? ఒంటరివారా? మా ప్రకటన అంతా చదివారా?" ప్రశ్నలన్నీ ఒకేసారి అడిగేశాడు.
    "ఎవరన్నయ్యా వచ్చింది?" లోపల్నించి వస్తూ సీతమ్మవైపు ప్రశ్నార్థకంగా చూసి అడిగింది ఆ యువతి.
    "నిన్న పేపర్లో మన ప్రకటన చూసి వచ్చారు. నా పేరు మాధవ్. ఈమె నా చెల్లెలు మాధురి. మేమే మా అమ్మగారికోసం ఆ ప్రకటన ఇచ్చాం."
    "అన్నయ్యా, అమ్మ గదిలోకి వెళ్లి మాట్లాడదాం. ఆవిడా చూడాలి గదా! అన్ని విషయాలు ఆవిడ ఎదురుగా మాట్లాడితే నయం కదా!" అంటూ "లోపలికి రండి" అని పిలిచింది మాధురి.
    "అవునులే, మళ్లీ మనం చెప్పనక్కరలేకుండా ఆవిడ ఎదురుగా మాట్లాడడమే మంచిది" అంటూ అతను లేచాడు.
    లోపల గదిలో వెండితీగల్లాంటి జుత్తు, కళగా ఉన్న మొహం, పండి మగ్గిన జాంపండు రంగు శరీరఛాయలో పాతకాలం పందిరిమంచం మీద, తలగడలమీద ఆనుకుని కూర్చున్న ఎనభై పైబడిన వయసుగల ఆమెని చూడగానే గౌరవభావం కలిగింది సీతమ్మకి. చేతులు జోడించి నమస్కరించింది.
    "అమ్మా, ఈవిడ సీతమ్మగారని మన ప్రకటన చూసి వచ్చారు" ఆమెతో అన్నాడు మాధవ్.
    ఆమె తల ఊపి "అలా కూర్చోండమ్మా!" అంది కాస్త అస్పష్టంగా.
    "ఈవిడ మా అమ్మ అనసూయమ్మగారు. ఎనభై నాలుగేళ్ల వయసు. ఇన్నాళ్లూ ఆరోగ్యంగానే ఉన్నారు. ఎవరిమీదా ఆధారపడకుండా ఆవిడ పని ఆవిడ చేసుకుంటూ ఒంటరిగా ఇక్కడే గడుపుతోంది. నేను, మా చెల్లెలు మధురి ఇద్దరం అమెరికాలో ఉంటాం. మా నాన్నగారు న్యాయమూర్తిగా పనిచేసి రిటైరయ్యారు. ఆయన పోయి ఎనిమిదేళ్లయింది. అప్పటినుంచీ మా అమ్మ పనివాళ్ల సహాయంతోనే ఇంటిపనులన్నీ చక్కబెట్టుకుంటూ ఇన్నాళ్లూ కాలక్షేపం చేసింది. మా మామయ్య ఇక్కడికి దగ్గరలోనే ఉంటారు. ఆవిడకేదన్నా సహాయం కావలిస్తే వచ్చి చూసి, చేసి పెడతాడు. ఈ ఇల్లు మాదే. పొలాలున్నాయి. మా అమ్మగారికి పెన్షన్ వస్తుంది. డబ్బుకేం లోటు లేదు. తనపాటికి తను స్వతంత్రంగా ఇన్నాళ్లూ గడిపింది. కానీ నెల రోజుల క్రితమే ఆమెకు పక్షపాతం వచ్చింది. దాంతో ఎడమ కాలు, చెయ్యి చచ్చుబడిపోయాయి. ఫిజియోథెరపీ జరుగుతోంది. ఇంతకుముందు కంటే ఇప్పుడు కొంచెం నయమే. కానీ మా అమ్మకు కాలు, చేయి స్వాధీనంలోకి వచ్చేవరకు ఇరవై నాలుగ్గంటలూ ఒక మనిషి తోడు కావాలి. రోజంతా ఆమెను కనిపెట్టుకుని ఉండి, ఆవిడ అవసరాలు చూసే మనిషి కావాలి. మంచాన పడడంవల్ల ఆవిడకు ఈ సమస్య మొదలైంది.
    మా అమ్మ పాతకాలపు మనిషి. తలస్నానం, మడి, పూజ, మహానైవేద్యం పూర్తికానిదే అన్నం తినదు. ఉదయమే పూజ చేసుకోనిదే కాఫీ కూడా తాగదు. ఆవిడ ఉన్నన్ని రోజులూ ఇంట్లో ఆ ఆచారవ్యవహారాలూ దెబ్బతినకుండా పాటించాలనేదే ఆవిడ కోరిక. ఈ ఆఖరి రోజుల్లో ఆవిడ అభిమతానికి అడ్డు రావడం మాకిష్టం లేదు. అంచేత ఏ బాదరబందీలు లేకుండా రోజంతా ఆవిడ అవసరాలు చూస్తూ, వంటావార్పూ చేసి ఆమెని కనిపెట్టుకుని ఉండే మీలాంటి ఆవిడ కోసమే ఈ ప్రకటన ఇచ్చాం.
    ఉదయమే ఆమెని బాత్ రూమ్ లో కూర్చోపెడితే కాలకృత్యాలు తీర్చుకుని బ్రష్ చేసుకుంటారు. తర్వాత ఆవిడ స్నానం చేయడానికి కాస్త సాయం చేసి, నైట్ గౌన్ తొడిగి, జుత్తు దువ్వి ఆమెని తయారుచెయ్యాలి. మనిషి సాయం లేకుండా ఆవిడ ఈ పనులన్నీ చేసుకోలేదు. ఉదయం స్నానం అయ్యాక వీల్ చెయిర్ లో దేవుడి గది గుమ్మం దగ్గర కూర్చోపెట్టండి. కాసేపు స్తోత్రాలు చదువుకున్నాక కాఫీ ఇవ్వండి."
    "అవన్నీ ఆవిడకు నేను చెపుతాలేరా నాయనా! నేను చెప్పి చేయించుకుంటాలే" అనసూయమ్మ నెమ్మదిగా అంది. ఆవిడకి ఇంకా మాట సరిగ్గా రాలేదు.
    "ఉండమ్మా! ఆమె చెయ్యాల్సిన పనులన్నీ ముందే చెప్పాలి గదా! తరువాత ఇది చెప్పలేదు, అది చెప్పలేదని అనుకోకూడదు. నీవింకా సరిగా మాట్లాడలేక పోతున్నావు కదా, ఏం చెప్పగలుగుతావ్?" అన్నాడు మాధవ్.
    "అయ్యో! నాకు తెలుసు బాబూ! ఈ చిన్న పనులకోసమే గదా ఆవిడ దగ్గర ఉండాలి. నేను చూసుకుంటాను బాబూ, ఆవిడకు ఏ సమయంలో ఏది కావాలో ఒకటి రెండు రోజులు చెపితే చాలు."
    "అవును. ఇది మీ ఇల్లనుకోవాలి. ఆవిడ మీ అమ్మగారనుకోండి. ఇల్లు నడపాలి. అంటే సామాన్లు, కూరలు అన్నీ చూసుకోవాలి. ఆవిడకేం కావాలో వండి పెట్టాలి. రాత్రిపూట పిలిస్తే పలికేలాగా, ఆవిడతో ఈ గదిలోనే మీరు కూడా మంచం వేసుకుని పడుకోండి."
    ఇంత వివరంగా ఎందుకు చెపుతున్నానంటే మేం దూరదేశంలో ఉంటాం. ఏడాదికి అతికష్టం మీద ఒకటి రెండుసార్లు మించి రాలేం. మా ఉద్యోగాలు, పిల్లల చదువుల మధ్య సెలవు దొరకదు. అమ్మని మాతో తీసుకెళ్లే పరిస్థితి లేదు. అక్కడ ఇంట్లో రోజంతా ఎవరూ ఉండరు. నర్సుల్ని పెట్టి చేయించుకునే స్తోమత ఉండదు. అక్కడ వైద్యం చాలా ఖరీదు. మా ఆస్తులు చాలవు. ఈ వయసులో ఆవిడ దేశం విడిచి రాదు. అందువల్ల సమయానికి అన్ని సదుపాయాలు సమకూర్చిపెట్టే ఒక మంచి మనిషికి అమ్మను అప్పజెప్పమంటే మాకు కాస్త మనశ్శాంతిగా ఉంటుంది. అందుకే ఇన్ని విధాలుగా మీకు చెపుతున్నాం."
    "అర్థమైంది బాబూ, తల్లి పట్ల మీ ప్రేమాభిమానాలు చూస్తుంటే ముచ్చటగా ఉంది. మీరు నిశ్చింతగా వెళ్లండి. నన్ను నమ్మండి" భరోసా ఇచ్చింది సీతమ్మ.
    "సరే, అమ్మకి మందులు అవీ మామయ్య కొనిస్తాడు. ఇక్కడ ఏ టైములో ఏ మందులు వేయాలో రాసిపెట్టాం. బ్యాండ్ నుంచి డబ్బు తీసుకొచ్చి అమ్మకిస్తారు. ఇంటి ఖర్చుకి అమ్మను అడిగి డబ్బు తీసుకుని లెక్కచెప్పండి. ఏదన్నా అవసరం అయితే మామయ్య నంబరు, డాక్టరు నంబరు, మా ఫోన్ నెంబర్లు అన్నీ రాసిపెట్టాం. మీకు ఎలాంటి ఇబ్బందీ లేకుండా చూసే పూచీ మాది. మీరు అమ్మని చూసుకోండి. మిమ్మల్ని మేం చూసుకుంటాం."

 Previous Page Next Page