"అబ్బ. ఏదో అయింది. దాన్నే పట్టుకుని సాగదీస్తావెందుకు? అయినా నీకు మరీ ముక్కుమీదే వుంటుంది కోపం. హాస్యానికన్నాను."
"హాస్యం - పెళ్ళయిన మూడో రోజున పెళ్ళాన్ని చెప్పుతో కొడతాననడం హాస్యం. మీ చెల్లెలు కుక్కపిల్ల లతో పెళ్ళాన్ని పోలుస్తుంటే అదో హాస్యం. మీరంతా చదువు సంస్కారం వున్నవాళ్ళు-గొప్పవాళ్ళు. మీ హాస్యాలింత సున్నితంగా వుంటాయని నాకు తెలీదు." మనసులోని అక్కసు వెళ్ళగక్కాను కోపంగా. తెచ్చిపెట్టుకున్న నవ్వు, సరసం ఆయన మొహంలోంచి మాయమయి అసలు స్వరూపం వెంటనే వచ్చింది.
"ఏమిటి అస్తమాను ప్రతిదానికి యింత గొడవ చేస్తావు-అంత పౌరుషం వున్నదానివి పెళ్ళెందుకు చేసుకొన్నావు?" తీక్షణంగా అన్నారు.
"పెళ్ళి చేసుకొంటే అతహ్మగౌరవం, ఆత్మాభిమానం యింతలా బలిపెట్టుకుని బతకాలని నాకు తెలీదు. భార్య అంటే బానిస అన్న భావం యీనాడు మగవాళ్ళకి లేదని భ్రమపడ్డాను."
"చాలించు నీ ఉపన్యాసాలు-చూస్తూంటే నీ వ్యవహరం ముదురుతూంది. పెళ్ళయిన రోజునించీ ఎదురు జవాబులు చెపుతున్నావు. మా అమ్మ అన్నట్టు నిన్ను మొక్క గానే పంచాలి." కసిగా పళ్ళు బిగించారు. "అంత ఇష్టం లేకపోతే వెళ్ళిపో. అంతేగాని, ప్రతిసారి మీరు, మీవాళ్ళు ఇలా అలా అంటే సహించేదిలేదు." మొహం ఎర్రబడగా అన్నారు.
వెళ్ళిపోయి ఎంత సులువుగా ఒక్కమాటలో అన్నారు. అంత సులువుగా వెళ్ళలేనని తెలిసేగా అంత తేలిగ్గా అనగలిగారు. కట్టుకున్న భర్త మూడోరోజే భార్యని 'పోతే పో' అనగలిగాడంటే ఆ కాపురం ఎంత చక్కగా సాగుతుందో భవిష్యత్తు కళ్ళముందు కన్పించి నా ఆశలు, కలలు కూడా పోయినట్టు హతాశురాలినైపోయాను.
జవాబు చెప్పలేని నా నిస్సహాయత నా మొహంలో చూసి విజయగర్వంతో తళుక్కుమన్నాయి ఆయన కళ్ళు.
* * *
ఆయన శలవు అయిపోయింది. ఆ రోజు మేము ప్రయాణం అవాల్సిన రోజు.
ఉదయం కాఫీలు తాగుతుండగా మా అత్తగారు "ఏమిరా శివా, యిప్పుడు మీ ఆవిడ్ని తీసుకెళ్ళి ఏంచేసావు. ఇంట్లో సామానులు ఏం లేనట్లున్నాయి. ఉట్టి చేతులతో వచ్చింది. యిప్పుడు తీసిపెడితే యిబ్బందిగాదూ! ఏం చేద్దాం వాళ్ళవాళ్ళకి లేకపోయినా మేం అలా ఎలా వూరుకుంటాం. నీవు ముందెళ్ళి యింటికి కావల్సినవి నాలుగూ కొని తర్వాత తీసికెళ్ళు" అంటూ సాగదీసింది ఆవిడ.
జవాబు చెప్పాలనిపించినా నేనే మాట అన్నా విపరీతార్దాలు తీస్తారని, ఆయన యేం అంటారో చూడాలని వూరుకున్నాను.
ఆయన నావంక ఒకసారి చూసి "ఫరవాలేదులే. రెండురోజులు ఏదో హోటల్లో తింటాం. సామాను కొనడం ఎంతసేపు" అన్నారు.
అమ్మయ్య బతికించారు అని సంతోషించాను.
ఆవిడ మా యిద్దరివంక మార్చి మార్చి చూసింది. మేం యిద్దరం కూడబలుక్కున్నాం అని గ్రహించినట్టు చుట చుర చూస్తూ, "సరే, అయితే మీ యిష్టం" అందావిడ ముభావంగా.
"అమ్మా, నాన్నని ఓ వెయ్యో రెండువేలో అడిగి యిస్తావా. నా ఎకౌంట్ ఫిక్స్ డ్ డిపాజిట్ లో వుంది. తీస్తే అనవసరంగా నష్టం. సామానులు కొనాలిగదా!" అన్నారాయన.
"బావుందిరా నాయనా, మీ నాన్నదగ్గర మాత్రం రాసులు పోసివున్నాయా? మొన్న పిల్ల పెళ్ళిచేశాం. పాతిక వేలయింది. ఇంటి ఖర్చులు చూస్తూనే వున్నావు. అడిగితే కేకలు వేస్తారో, ఏమిటో. అసలంత ఆయన దగ్గరమాత్రం వుండొద్దూ?" ఆవిడ నుదురు చిట్లించి అన్నారు.
"అయినా యిదేం విడ్డూరం. అటు ఆడపిల్లల కాపురాలు దిద్దాలి. ఇటు మగపిల్లలకీ మేమే ఇవ్వాలి. ఎక్కడా కని విని ఎరగం. మీ అత్తవారు నిమ్మకినీ రెత్తినట్టు వూరుకుని పిల్లని గడుసుగా పంపేశారు. మధ్య మాకా యీ నష్టం అంతా." ఆవిడ ధోరణి సాగుతూంది.
"అంత నష్టపోవడానికి ఏముంది, మీ రెందుకు యియ్యడం. మా నాన్నగారిచ్చిన కట్నంలో యివ్వాలని పిస్తే యివ్వండి. లేదంటే మా అవస్థలు మేము పడతాము." స్థిరంగా, శాంతంగా అన్నాను. ఆ మాటకూడా అనకపోయేదాన్ని గాని, ఎలాగో అపుడే వచ్చిన చెడ్డపేరు రానే వచ్చింది. యింకా యింకా మా వాళ్ళని తీసిపారేస్తూంటే సహించలేక యేమయితే అయిందని అనేశాను.
అంతే. ఆ మాటకి మొహం గంటుపెట్టుకుని "కట్నం మహాయిచ్చారులే ముష్టి ఎనిమిదివేలు. మేం ఏమీ మూటకట్టి దాచుకోలేదు. పెళ్ళి ఖర్చు, నీకు పెట్టిన గొలుసు, చీరలు, ప్రయాణం ఖర్చులు అన్నీ ఎక్కడనుంచి వచ్చాయనుకున్నావు. ఇంకా మా చేతిది రెండువేలు వదిలింది." గయ్ మంది ఆవిడ.
వాళ్ళు నాకుపెట్టిన గొలుసు, చీరలు, ఖర్చులు అన్నీ కలిపినా నాలుగైదు వేలు మించకు అని ఖచ్చితంగా నాకు తెలుసు. అయినా యింక అనడానికి యేముంది. నోరు మూసుకున్నాను.
"అయినా ఒరే అబ్బాయి. ఇలా మీ ఆవిడ పెద్ద, చిన్న మర్యాదలేక ఏ మాట పడితే ఆ మాట అనడం బాగోలేదు. నీవు దాన్ని ఎలా కట్టుదిట్టంలో పెడతావో, మరో సారి యిలా అంటే సహించేదిలేదు. నీ కట్నం తాలూకు మీ నాన్నని ఎకౌంటు రాసి యిమ్మంటాను" ఆవిడ విసురుగా లేచి వెళ్ళిపోయింది.