Previous Page Next Page 
నిర్భయ్ నగర్ కాలనీ పేజి 9


    "నేనే డాక్టర్ని! మా ఫాదర్ కాదు! ఇంతకూ పేషెంట్ ఎక్కడ!"
    "బయట రిక్షాలో ఉంది!"
    అతను మాతోపాటు బయటికొచ్చాడు.
    చంద్రకాంత్ భార్య అపస్మారక స్థితిలో ఉండటం చూసేసరికే అతనికి కళ్ళు తిరిగినట్లు అనిపించి కళ్ళు మూసుకున్నాడు.
    "అదేమిటి సార్ పేషెంట్ ని చూడండి" చెప్పాడు రంగారెడ్డి.
    అతను అతికష్టం మీద కళ్ళు తెరచి స్టెతస్కోప్ మెడకు తగిలించుకుని ఆమె దగ్గరకు వెళ్ళి స్టెతస్కోప్ మెడకింద పెట్టబోయాడు.
    హఠాత్తుగా అతనికి మెడకింద గాయం నుంచి రక్తం కారటం కనిపించింది. అంతే! దభేల్ మని కిందపడ్డాడు.
    అతని నోటి నుంచి "రక్తం అమ్మో రక్తం రక్తం" అంటూ నాలుగయిదుసార్లు వినిపించాక అతని మాట పడిపోయింది. ఆ తరువాత చూపులు కూడా తేలేశాడు. లోపల్నుంచి వాళ్ళమ్మ కాబోలు పరుగుతో శోకాలూ పెడుతూ వచ్చింది.
    "ఓర్నాయనో! బంగారం లాంటి నా కొడుకుని చంపేశారు దేవుడో ఇంత లేత కుర్రాడికి ఎవరయినా రక్తం చూపిస్తారా? అసలు వీడికి డాక్టర్ కోర్స్ చెప్పించొద్దండీ వాడు తట్టుకోలేడు అంటే వినకుండా డాక్టర్ కోర్సులో చేర్పించిన వీడి తండ్రిననాలి"
    "మేమేం చేయలేదమ్మా! మా పేషెంట్ ని చూపించడానికి తీసుకొచ్చాం!"
    "మీరింక పొండిరా నాయనా! మావాడికి మొదటి పేషెంట్ నే ఇలాంటి రక్తం కనిపించేట్లు తీసుకొస్తారా? మీకేమయినా బుద్ధుందీ? జ్ఞానం ఉందీ!" అంటూ పరుగుతో లోపలికెళ్ళి మరో డాక్టర్ కి ఫోన్ చేయసాగింది.
    ఇంక లాభం లేదని మేము పేషెంట్ తోపాటు ఇంకో డాక్టర్ కోసం బయల్దేరాము.
    రిక్షావాడు మావైపు ఆనందంగా చూశాడు.
    "ఇంకో డాక్టర్ దగ్గరకా సార్?"
    "అవును!"
    "ఏం ఫర్లేద్సార్! తోలుకెల్తా! ఇంకో పదహార్రూపాయలివ్వండి సార్ చాలు!"
    యాదగిరికి కోపం ఆగలేదు.
    "ఏయ్! ఆమె చావు బ్రతుకుల మధ్యనుంటే మధ్యల పైసలకిరికిరేంబే! నకరాల్జేస్తున్నావ్?" అన్నాడు వాడిమీదకెళుతూ.
    "ఇగో- గిట్ల రువాజ్ చేసిన్రంటే మంచి గుండద్సార్! నేను వాపస్ బోతా!" అన్నాడు వాడు రిక్షా వెనక్కు తిప్పుతూ.
    అందరం అమాంతం వాడి దగ్గరకు వెళ్ళి గడ్డం పట్టుకుని బ్రతిమాలాం.
    "ఇదిగో...చూడవోయ్ రిక్షా! మా వాడేదో తొందరపడి..."
    "నా పేరు రిక్షా కాదు" కోపంగా అన్నాడు.
    మేము నాలిక్కరుచుకున్నాం.
    "అబ్బే- నీ పేరు రిక్షా అని కాదు. పేరు తెలీక..."
    "తెల్వకపోతే అడగాల్సార్! నేనేం ఆల్తూ ఫాల్తూగాడ్ననుకుంటున్రా ఏం? ఈ రిక్షా నా సొంతం! ఎరికనా!"
    నేను రంగారెడ్డికి కన్ను కొట్టాను. ఇలాంటి సందర్భాల్లో రంగారెడ్డి చాలా అద్భుతంగా పరిస్థితిని అదుపులోకి తీసుకొస్తాడ న్న విషయం నాకు తెలుసు.
    "ఇగో- గిది- గిట్ల ఇజ్జత్ తోటి మాట్లాడాలె! ఆయనేమి సార్- గట్ల వరుల్తాడు?"
    రిక్షా మళ్ళీ బయల్దేరింది.
    ఫర్లాంగ్ దూరంలోనే నర్శింగ్ హోమ్ కనిపించేసరికి మాకు ప్రాణం వచ్చినట్లయింది. అందరం లోపలకు పరుగెత్తుకెళ్ళి స్ట్రెచర్ తీసుకుని ఆమెను లోపలకు చేర్చాం. అప్పటికప్పుడే నలుగురు నర్సులు చుట్టుముట్టారు.
    "ఏమయింది?" ఒకామె మావంక చూస్తూ అడిగింది.
    "ముందు డాక్టర్ ని పిలవండి! అర్జెంట్! ఆమె ఆన్ కాంషస్ అయ్యింది" చెప్పాడు రంగారెడ్డి.
    వాళ్ళు మొఖాలు చూసుకున్నారు.
    "ఎలా అయ్యింది?" ఒకామె అడిగింది.
    రంగారెడ్డి పళ్ళు కొరుక్కుని బయటకుమాత్రం చిరునవ్వు నవ్వుతూ మాట్లాడాడు.
    "అదంతా డాక్టర్ కి చెపుతాంలేమ్మా! ముందు డాక్టర్ ని పిల్చుకురండి!"
    ఆమె తాబేలులా నడుస్తూ లోపలకెళుతుంటే మాకు వళ్ళు మండిపోయింది.
    "నీయవ్వ- ప్రాణాలంటే జర్రగూడ ఖదర్ లేదు" అన్నాడు యాదగిరి కోపం అణచుకుంటూ.
    మా పక్కనే నిలబడ్డ మరో నర్స్ కోపంగా చూసింది మా యాదగిరివేపు.
    "అవ్! ఒక్కసారి సర్కార్ దవఖానాకు వెళితే తెలుస్తది. ఎవళ్ళకు ఖదరుంటదో" అందామె.
    మేము సైలెంట్ అయిపోయాం.
    ఎందుకంటే నిజంగానే మాకు గవర్నమెంట్ హాస్పిటల్ గుర్తుకొచ్చింది.
    మరో అయిదునిమిషాల తర్వాత డాక్టర్ మరో తాబేలు బండిమీద వచ్చినట్లు వచ్చింది. వస్తూనే మా మొఖాలవేపు పేషెంట్ ముఖంవేపు చూసింది.
    "వాట్ హాపెన్డ్?" అంది మళయాళీ ఇంగ్లీషులో.
    "ఆమెకు దెబ్బలు తగిలాయండీ" చెప్పాడు రంగారెడ్డి.
    "ఓవ్" అందామె పేషెంటువేపు అనుమానంగా చూస్తూ.
    "ఈజిట్ లారీ యాక్సిడెంట్ ఓర్ స్కూటర్ యాక్సిడెంట్?" అడిగింది నావైపు చూసి. నాకామె మాటలేమాత్రం అర్ధం కాలేదు గానీ రంగారెడ్డి ఠక్కున అర్థం చేసుకున్నాడు.
    "లారీ యాక్సిడెంట్ కాదు డాక్టర్! స్కూటర్ యాక్సిడెంట్" అన్నాడు తనూ మళయాళ ఇంగ్లీషులోకి దిగిపోతూ.
    "ఓవ్!" అందామె ఇంకో అడుగు వెనక్కు వేస్తూ.
    "తలక్కూడా పెద్ద దెబ్బలేమీ తగలలేదుగానీ ఎందుకో స్పృహ తప్పిందండి" చెప్పాడు చంద్రకాంత్.
    "హు ఈజ్ డ్రైవింగ్ ద స్కూటర్?" తిరిగి అడిగిందామె మా అందరివంక హంతకులను చూసినట్లు చూస్తూ.
    "దిస్ బోయ్! దిస్ బోయ్" అన్నాడు రంగారెడ్డి చంద్రకాంత్ వైపు చూపుతూ.
    "ఓవ్! దిస్ బోయ్? ఆమెకు ఇతను ఏమి రిలేషన్ ఉంది?"
    "ఆమె నా భార్యేనండి" చెప్పాడు చంద్రకాంత్.
    "ఓవ్!" అందామె ఇంకో అడుగు వెనక్కు వేస్తూ.
    ఈలోగా ఓనర్స్ బాండేజీళు, కాటన్ అన్నీ ఓట్రేలో తీసుకొచ్చారక్కడికి.
    "బాండేజ్ వెయ్యమంటారా డాక్టర్!" అడిగిందామె.
    "ఓవ్! నోనోనో! డోంట్ టచ్ హర్" అంది భయంగా మావేపు చూస్తూ.
    మేము అదిరిపడ్డాం.
    "వాట్ హాపెన్డ్ డాక్టర్?" అడిగాడు రంగారెడ్డి ఆతృతగా.
    "డేంజర్!" అందామె రహస్యంగా "అది మెడిగో లీగల్ కేస్."
    మాకు ఆమె మాటలు ఏమాత్రం అర్థం కాలేదు.
    ఆ మాట వింటూనే నర్సులు కూడా ఓ అడుగు వెనక్కేసారు.
    "ఏమిటంటున్నారు?" అయోమయంగా అడిగాడు రంగారెడ్డి.
    "ఇఇద్ మెడికో లీగల్ కేస్ అంటోందామె" అన్నాడు గోపాలరావు.
    "అంటే ఏమిటి?"
    "అంటే ఇది పోలీస్ కేస్ అన్నమాట."
    మాకు మరీ అగమ్యగోచరంగా ఉందీ గొడవ.
    "ఇంతకూ ఇప్పుడు మీరేమంటారు డాక్టర్?" అడిగాడు జనార్ధన్ మా వెనుకనుంచీ మమ్మల్నందరినీ పక్కకుతోసి సినిమా హీరోలా ముందుకొస్తూ.

 Previous Page Next Page