Previous Page Next Page 
నిర్భయ్ నగర్ కాలనీ పేజి 10

                                 


    "యూ హావ్ టు టేక్ హర్ టు గవర్నమెంట్ హాస్పిటల్"
    అందరం ఉలిక్కిపడ్డాం.
    చంద్రకాంత్ ముఖం పాలిపోయింది.
    "గవర్నమెంట్ హాస్పిటల్ కా?" వణుకుతున్న గొంతుతో అడిగాడతను.
    "ఎస్!"
    "అక్కడికి ఎందుకు వెళ్ళటం? మీరు ఎందుకు ట్రీట్ చెయ్యరు?"
    "బికాజ్ ఇటీజ్ మెడిగో లీగల్ కేస్"
    "మెడికో లీగల్ కేస్ అయితే మాత్రం? ప్రాణాప్రాయంలో ఉన్న పేషెంట్ ను ట్రీట్ చేయనంటారేమిటి?" ఎదురు తిరిగాడు గోపాలరావు.
    "ఓవ్! వుయ్ డోంట్ డూ ఇట్" నిర్లక్ష్యంగా అందామె.
    "ఎందుకు చేయరని అడుగుతున్నా! ఒక డాక్టరుగా ఏ పేషెంట్ నయినా వెంటనే ట్రీట్ చేయాల్సిన అబ్లిగేషన్ మీకుంది."
    "అఫ్ కోర్స్! ఆ ఓబ్లిగేషన్ ఓన్ లీ జనరల్ కేసెస్ కి! నాట్ ఫర్ మెడిగో లీగల్ కేస్"
    "దిసీజ్ టూ మచ్" అన్నాడు రంగారెడ్డి.
    "యుకెన్ గో" అందామె లోపలి కెళ్ళిపోతూ.
    యాదగిరికి మండిపోయినట్లుంది. పరుగుతో వెళ్ళి ఆమెకు అడ్డం నిలబడ్డాడు.
    "ఇగో డాక్టరమ్మా మంచిగ చెపుతున్నా! ముందామెకి వైద్యం గిట్ట జేస్తవా చెయ్యవా?" రెండుచేతులూ హీరోలా నడుము మీద పెట్టి దౌర్జన్యంగా అడిగాడు.  
    "నో! మెడిగో లీగల్ కేసులు గవర్నమెంట్ హాస్పిటల్ కే తీసుకుపోవాలి!" తనూ మొండిగా అంది డాక్టరు.
    గోపాల్రావ్ కల్పించుకున్నాడు మధ్యలో.
    "ఇదిగో మనం ఇప్పుడు వాదనలు పెట్టుకుని లాభం లేదు కానీ ఇంకో నర్శింగ్ హోమ్ కోటీలో వుంది పదండి అక్కడికి పోదాం" అన్నాడతను.
    ఆ మాట నిజమేననిపించింది మాకు.
    ఆ గొడవల్లో తల దూర్చడం కంటే ముందు ఆమెకు వైద్యం జరగటం ముఖ్యం.
    వెంటనే అందరం ఆమెను తీసుకుని మళ్ళీ రిక్షాలో వేసుకుని కోటీ వైపు బయలుదేరాం.
    ఆ నర్శింగ్ హోమ్ చాలా బిజీగా వుంది.
    పావుగంట వెయిట్ చేశాక ఓ డాక్టరు బయటికొచ్చాడు.
    "ఏమయింది?" అడిగాడు పేషెంట్ ని పరీక్షిస్తూ.
    "నా స్కూటర్ మీద నుంచి స్లిప్ అయి పడిపోయిందండీ!"
    స్కూటరు యాక్సిడెంటా?" పరీక్షించడం ఆపేసి అడిగాడు.
    "అవును సార్! చాలా మైనరు యాక్సిడెంట్" తేలిగ్గా అన్నాడు రంగారెడ్డి.
    "అయితే ఇది మెడికో లీగల్ కేస్"
    మేము ఏమీ తెలీనట్లు ఆ పదాలు అంతకు ముందెప్పుడూ విననట్లు నటించాం.
    "అంటే ఏమిటి డాక్టర్?"
    "అంటే పోలీస్ కేసు అన్నమాట! ఇలాంటివన్నీ గవర్నమెంట్ హాస్పిటల్స్ కెళ్ళాలి!"
    "అంటే పేషెంట్ ప్రాణం పోతున్నా గానీ మీరు చూడరా" కోపం అణుచుకుంటూ అడిగాడు జనార్ధన్.
    "ఎలా చూస్తాం! మెడికో లీగల్ కేస్ కదా ఇది!"
    యాదగిరికి చటుక్కున ఓ అయిడియా వచ్చింది.
    "అవ్ సార్! మెడికో లీగల్ కేసేగానీ, జర ఇప్పటికయితే ట్రీట్ మెంటు ఇయ్యండి! ఇంకొకసారి గిట్టా యాక్సిడెంట్ అయితే గవర్నమెంట్ హాస్పిటల్ కెళతాం"

                  
    "కుదరదండీ! త్వరగా తీసుకెళ్ళండి. ఆలస్యం చేయకూడ దిలాంటివి"
    "పోనీ మీరు ఫస్టు ఎయిర్ లాంటిది చేయండి! ఆ తర్వాత గవర్నమెంట్ హాస్పిటల్ కెళ్తాం"
    డాక్టరు చిరాకుపడ్డాడు.
    "అరె! మేము చేయగూడదంటే వినరేమయ్యా! ఇదంతా మాకు లేనిపోని కిరికిరి అవుతుంది."
    "బాబ్బాబు అలా అనకండి! ఆమె ఇంకెవరయినా అయితే గవర్నమెంటు హాస్పిటల్ కే తీసుకెళ్ళేవాళ్ళమే గానీ ఆమె మావాడి భార్యండి! పైగా వాడికి ఆమె అంటే చాలా ప్రేమ! అందుకని దయచేసి మీరే ట్రీట్ మెంట్ ఇస్తే"
    డాక్టర్ కి కోపం వచ్చేసింది.
    "ఇక్కడ ట్రీట్ మెంట్ ఇవ్వరని చెప్పాను కదా! గవర్నమెంట్ హాస్పిటల్ కెళ్ళండి" అనేసి లోపలికి వెళ్ళిపోయాడు.
    "ఛలో భాయ్- గవర్నమెంట్ దవాఖానాకే పోదాం పదండ్రి! ఈ హౌలా గాళ్ళందర్నీ బ్రతిమిలాడేదేందీ?" అన్నాడు యాదగిరి డాక్టర్ వెళ్ళినవేపే చూసి గట్టిగా అరుస్తూ.
    అందరం ఆమెను తీసుకుని గవర్నమెంట్ హాస్పిటల్ చేరుకున్నాం. అరగంట నిలబడ్డాక కేన్ షీట్ రాసిచ్చాడు క్లర్క్. అది తీసుకుని డాక్టర్ దగ్గర కెళ్ళేసరికి ఇంకో అరగంట పట్టింది.
    "ఈమెకెట్లా తగిలాయి దెబ్బలు" అడిగాడు డాక్టర్.
    "స్కూటర్ మీద నుంచి కింద పడిపోయిందండి?"
    "ఓ! మెడికో లీగల్ కేసా?"
    "అవునండీ!" భయంగా జవాబిచ్చాం! గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా మెడికో లీగల్ కేసులు చూడరేమో అన్న అనుమానం పట్టుకుందందరికీ!
    "చాలా సీరియస్ కేస్ కదా" అన్నాడు ఆలోచనలో పడుతూ.
    "అవునండీ! అందుకే ముందు ద్తీట్ మెంట్ స్టార్ట్ చేస్తే బాగుంటుందని" వినయంగా చెప్పాడు రంగారెడ్డి.
    "ఆ! అవును- అన్ కాంషస్ అన్నారు కదా! ఓకే ఓకే" అంటూ ఎడ్మిట్ అని రాశాడు కేన్ షీట్ మీద. మామూలుగానే స్ట్రెచర్ మీద తీసుకెళ్ళే బాయ్ కీ, వార్డు బాయ్స్ కీ, గేటు దగ్గర వాచ్ మెన్ కీ అందరికీ ఎవరి ఫీజు వాళ్ళకు కట్టాక వార్డ్ లోకి అనుమతించారు వాళ్ళు.
    గంటసేపటి తర్వాత ఓ డాక్టర్ వచ్చి ఆమెను చూసి కేన్ పేపర్ మీద ఏమేమో రాసి వెళ్ళిపోయాడు.
    నర్స్ ఇంజెక్షన్ తెచ్చి మా చేతికిచ్చింది.
    "ఇందులో రాసి వున్న ఇంజెక్షన్లు కొడుక్కురండి!" అంది చాలా మామూలుగా.
    "మేము కొనుక్కురావటం ఎందుకు? మీ హాస్పిటల్లో వుండవా" కోపంగా అడిగాడు శాయిరామ్.
    "వుంటాయ్ గాని మా గాంధీ హాస్పిటల్ మందుల గురించి మొన్ననే పేపర్లో న్యూస్ వచ్చింది చదివారా"
    "ఓ! చదివాను" ఉత్సాహంగా చెప్పాడు యాదగిరి. "అవన్నీ డూప్లికేట్ మందులని పేపర్లో రాసిన్రులే!" అన్నాడు మాతో.
    "ఇలాంటి పరిస్థితుల్లో మా ఇంజెక్షన్ లు వాడితే ఇంకేమయినా వుందా? కావాలంటే అదే చేసేస్తాను! నాదేం పోయింది!"
    అందరం వద్దని ఆవిడని బ్రతిమాలి ఇంజెక్షన్ కొనుక్కొచ్చాం.
    ఆ ఇంజెక్షన్ ఇచ్చిన తర్వాత కాసేపటికే ఆమె స్పృహలో కొచ్చింది.
    వస్తూనే ఓసారి చుట్టూ చూసి, తర్వాత మా అందరి ముఖాలూ చూసి నవ్వింది.
    "ఏమిటి? ఈ కాస్త దెబ్బలకే నన్ను హాస్పిటల్లో చేర్చేశారా?" అంది ఆశ్చర్యపోతూ.
    "ప్రైవేట్ నర్సింగ్ హోమ్ లో రెండుమూడుగంటలుంచితే ఇంటికి తీసుకెళ్లి పోవచ్చనుకున్నాం. కానీ వాళ్ళేమో వైద్యం మేము చేయం అంటే మేము చేయం అని బయటకు గెంటేస్తున్నారు. గత్యంతరం లేక గవర్నమెంట్ హాస్పిటల్ కి తీసుకురావాల్సి వచ్చింది" చెప్పాడు చంద్రకాంత్.

 Previous Page Next Page