Previous Page Next Page 
వైరం పేజి 9


    "అభిరాం-అబ్రహాం-ఒక సెయిలర్-ఇంకో ఇద్దరు కూలీల కొడుకు-ఒకరాజు!" అని, మళ్ళీ నవ్వాడు అభిరాం.
    పైకి నవ్వుతున్నాకూడా - అతని నర నరాల్లోనూ జీర్ణించుకుపోయిన ఆశా-ఆశయం-రాజు కావాలనే!
    "సెయిలర్...అంటే?" అంది సునయన సందిగ్ధంగా.
    నావికుడినేగానీ అదే కాస్త ఘనంగా చెప్పుకోవాలంటే సునయనా - అదిగో ఆ దూరతీరాల అలలలో తేలియాడుతూ కనబడుతోందే - 'ఈస్టిండియా' అనే షిప్పు. దానికి నేనే కెప్టెన్ ని."
    "కెప్టెన్! రియల్లీ? ఓహ్! హౌ గ్లామరస్!" అంది సునయన ఎగ్జయిటెడ్ గా.  
    ఆమెకి విమానాల పైలట్లు తెలుసు.
    కానీ- ఒక షిప్పుకి కెప్టెన్ తో పరిచయం ఇదే ప్రధమం!
    అభిరాం అనుకున్నాడు.
    ఇవాళ ఒక కెప్టెన్ - రేపు ఒక రాజు!
    అతని కణకణంలోనూ కణకణలాడుతున్న ఆశా అదే!
    రాజు కావాలనే!
    ఇద్దరు కూలీలకి కొడుకు అయిన తను ఒక షిప్పుకి కెప్టెన్ కాగా లేనిది -
    ఒక దేశానికి రాజు కావడం మాత్రం అసంభవమా!
    పోనీ - ఇవి రాజులకు రోజులు కావనుకుంటే - కొన్ని దేశాలలో లాగా ఒక మిలిటరీ డిక్టేటరు! లేదా ఛెయిర్మన్ -
    అదీ కాకపోతే ప్రెసిడెంటు - ప్రైమ్ మినిస్టర్! రాజ్యాధికారం చలాయించడానికి ఏ పేరైతే ఏమిటి?
    సునయన వైపు చూశాడు అభిరాం.
    అతని పక్కనే ఇసకలో పడుకుని ఉన్న ఆమె అప్రయత్నంగానే అతనికి ఇంకాస్త దగ్గరగా జరిగి కళ్ళు మూసుకుంది.
    పాము పడగలో సేద దీరుతున్నట్లు!

                                     *    *    *    *

    "నాకోసం అరుణని త్యాగం చేసేస్తున్నావు కదూ!" అంటూ తన భుజాలు పట్టుకుని కుదిపేస్తున్న సూరజ్ చేతులని అసహనంగా నెట్టేశాడు యదునందన్.
    ఆ తర్వాత చులకనగా సూరజ్ వైపు చూస్తూ అపహాస్యంగా అన్నాడు.
    "త్యాగమా నా మొహమా! శరత్ బాబు నవల ఏదైనా చదివి వస్తున్నావా ఏంట్రా? లేకపోతే సెంటిమెంట్ల సినిమా ఏదన్నా చూసి వస్తున్నావా? తాగకుండానే మత్తెక్కిందా ఏం? త్యాగమేంది బే! మళ్ళీ చెప్తున్నా... ఇది సిన్మాకాదు బేటా... సెన్స్ లోకి రా!"
    "అదికాదు యదూ..." అని ఇంకేదో చెప్పబోయాడు సూరజ్.
    పట్టలేనంత కోపం వచ్చింది యదునందన్ కి. విసురుగా లేచి, చేతిలో వున్న గ్లాసులోని విస్కీ, సూరజ్ మొహం మీద చిమ్మాడు. అతని గొంతు అదుపు తప్పింది.
    నీకు పిచ్చి ముదిరింది బిడ్డా! ఇంక బతుకు బండలే!" అన్నాడు ఆగ్రహంగా.
    ఆ కోపంలో స్నేహితుడి పట్ల అభిమానం కూడా వుంది.
    సరిగ్గా అదే క్షణంలో హోటల్ లాబీలోకి అడుగుపెట్టారు అభిరాం, సునయనా. సూరజ్ గనక అప్పుడు ఆమెని ఒక్కసారి సరిగ్గా చూస్తే, చాలా ఆసక్తికరమైన ఒక విషయం గమనించి ఉండేవాడు.
    కానీ-సూరజ్ మాత్రం ఎవరినీ దేనినీ గమనించే స్థితిలో లేడు.
    అక్కడేదో గొడవ జరుగుతున్న విషయం గ్రహించిన సునయన, అభిరాంకి బై చెప్పేసి, త్వరత్వరగా లిప్టువైపు నడిచింది.
    తాగి ఉన్నప్పుడు కొందరికి తిక్క చేష్టలు అలవాటే అని ఆమెకి తెలుసు.
    అభిరాం మాత్రం కుతూహలంగా సూరజ్ వైపు చూశాడు.
    సూరజ్ మొహంలో కోపం కనబడటం లేదు. మౌనంగా కర్చీఫ్ తీసి మొహం తుడుచుకున్నాడు - అంతే!
    సూరజ్, యదునందన్ లు కూర్చుని ఉన్న టేబుల్ కి దగ్గరగా ఉన్న మరో టేబుల్ దగ్గర సెటిలయ్యాడు అభిరాం.
    సూరజ్ పక్కనుంచి వస్తున్నప్పుడే యధాలాపంగా తగిలినట్టు అతన్ని తగిలాడు అభిరాం. అతి లాఘవంగా తన చేతిలోని మినియేచర్ మైక్రోఫోన్ ని సూరజ్ జేబులోకి ట్రాన్స్ ఫర్ చేసేశాడు.
    - కన్నుమూసి తెరిచేలోగా!
    నవ్వుకున్నాడు అభిరాం.
    కాసేపు సత్కాలక్షేపం!
    ఎవరైనా గొడవ పడుతూ ఉంటే కనడం వినడం తనకు ఇష్టం!
    ఇతరుల గొడవల్లో తలదూర్చడం తన హాబీ!
    గొడవలు లేనిచోట గొడవలు సృష్టించడం తన వ్యాపకం!
    అయితే ఒకటి.
    తన సొంత గొడవల్లో ఎవరైనా తలదూరిస్తే మాత్రం తల తీసెయ్యడమే! అంతకు తక్కువ లేదు!
    'గొడవలు' అనుకోగానే చటుక్కున అతనికి ఇందాక బీచ్ లో జరిగిన సంఘటన గుర్తొచ్చింది.
    తక్షణం సెల్ ఫోన్ తీసి ఒక నెంబరుకి కాల్ చేశాడు.
    "హై వరదన్!"
    "హై అభీ!"
    "సౌఖ్యమా?"
    "నువ్వెట్లా ఉన్నావ్?"
    "మీ పోలీసుల్లో ద్రోహులు కొందరున్నట్లున్నారే!"
    "అంటే?" అన్నాడు వరదరాజన్ అనుమానంగా.
    "డబ్బు తినికూడా పనిచేసిపెట్టని మోసగాళ్ళు" అని ఆగి, "బహుశా దేశభక్తులనుకుంటాను" అన్నాడు పరిహాసంగా.
    "ఎవరు?"
    "జరిగినదంతా చెబుతా! మూడునెలల క్రితం - ఇ ముసలమ్మ సాయంతో ఓ ముద్దుగుమ్మని హడల గొట్టేశాం మనం- గుర్తుందా?"
    "లేకేం? సునయన కదా పేరు? పాపం, ఏ పాపం ఎరగని ఆ అమ్మాయి చేత తను డ్రగ్స్ తీసుకెళ్తున్నట్లు కన్ ఫెషన్ కూడా కక్కించాం గదా!"
    "నాకోసం ఆ డర్టీవర్క్ అంతా చేసి పెట్టినందుకు థాంక్స్ వరదన్!"
    "థాంక్స్ ఎందుకూ? డాలర్లు కావాలి గానీ!" అని నవ్వాడు వరదన్.
    "ఇవాళ ఆ పిల్లని వెంటాడుతూ మెరీనాకి వెళ్ళాను. అక్కడ ఇద్దరు రిఫ్ రాఫ్ గాళ్ళు నాటకాలాడి ఆమె దగ్గరనుంచి డబ్బు గుంజబోయారు. వాళ్ళ పీక పిసికేయాలన్నంత కోపం వచ్చింది నాకు."
    "పిసికేయకపోయావా?"
    "ఆ పని మేమే చేసిపెడతామని చెప్పి మీ కానిస్టేబుళ్ళు ఇద్దరు చెరో వెయ్యి డాలర్లూ తీసుకున్నారు."
    "అంటే, ఆ కానిస్టేబుల్స్ వాళ్ళిద్దరినీ వదిలేశారంటావా?"
    "చంపేసినట్లు గొప్పగా నటించారులే. వరదన్! నేను మృత్యుదేవతలాంటి వాడిని. నా కళ్ళు కప్పడం యముడికైనా తరమా?"
    నవ్వాడు వరదరాజన్.
    ఇంకా చెప్పాడు అభిరాం.
    "బహుశా ఆ దేశభక్తులిద్దరూ...ఎవరో ఒక తెల్లవాడు..." అంటూ "నామీద ఇప్పటికే ఒక రిపోర్టు పంపే ఉండాలే!"
    "అది నాకే అందింది. ఇప్పుడే!"
    "వాళ్ళు ఓవరాక్షన్ కి నీ రియాక్షన్ ఏమిటి?"
    "వాళ్ళిద్దరినీ ఫినిష్!"
    "వాళ్ళిద్దరేకాదు. ఆ రౌడీగాళ్ళని కూడా - ఇద్దరూ ప్లస్ ఇద్దరూ. మొత్తం నలుగురూ- గుర్తుంటుందా?"
    "ఉండకేం! శతృశేషం ఉండకూడదని ఎప్పుడూ చెబుతూ ఉంటావుగా"
    "క్విక్!"
    "డన్!"
    ఆ తర్వాత, నవ్వుతూ అడిగాడు వరదరాజన్.
    "ఇంతకీ, మనం కన్ ఫెషన్ కక్కించిన ఆ పిల్లని... పేరు సునయన కదా -
    ఆ టేపు అడ్డం పెట్టుకుని టాపులేపేశావా లేదా?"
    "ఆఫ్టరాల్- ఒక ఫిమేల్ ని బ్లాక్ మెయిల్ చేయడం మొగతనం కాదు. పిట్ట ఇష్టంగా వచ్చి వలలో పడడంలో ఉన్న మజా మనసు కష్టపెట్టుకుని రావడంలో ఎక్కడుంటుంది వరదన్? సామ దాన భేద దండోపాయాలలో, దండోపాయం అనేది చిట్టచివరిదని ఇండియన్ వి అయిన నీకు బాగా తెలిసి వుండాలే!"
    "మా ఇండియా గురించి మాకన్నా నీకే ఎక్కువ తెలుసని నాకు తెలుసు" అని మళ్ళీ నవ్వాడు వరదరాజన్.
    "అది అట్లాంటిట్లాంటి ఆడపిల్ల కాదు. మిస్ యూనివర్స్! మన చదరంగంలో ఒక పావు. టేపు వినిపించి మన మాట వినేలా చేసుకోవడం అనేది ఆఖరి అణ్వస్త్రం!" అన్నాడు అభిరాం.

 Previous Page Next Page