ఆ క్షణంనుంచి చిచ్చుకి కూడా భయం పట్టుకుంది. ఇదివరకులా ఇళతో స్వేచ్చగా మాట్లాడడానికి కుదరటంలేదు. ఉసిరిచెట్టు కిందకి ఇళ రాకుండా చాలా జాగ్రత్తలు తీసుకుంటోంది అచ్యుతమ్మ. చిచ్చు ఆలోచించి ఒక ప్లాన్ తయారు చేసుకున్నాడు. ప్రమధపురిలో ఉన్న కనకదుర్గ దేవాలయానికి ప్రతి శుక్రవారమూ ఇళని తీసుకెళ్తుంది అచ్యుతమ్మ. ఆరోజు దేవాలయానికి చాలామంది భక్తులు వస్తారు. కనుక ఎట్టి పరిస్థితుల్లోనైనా ఇళ చేత పూజ చేయించటం మానదు.
ఆరోజు శుక్రవారం! చిచ్చు నామాలయ్య ఇంటికెళ్ళాడు. నూతిలోంచి నీళ్ళు తోటల్లోకి తోడుతున్నాడు పాలేరు తాతయ్య. అతడి దగ్గరకెళ్ళి "అమ్మగారు అర్జంటుగా అచ్యుతమ్మగారిని తీసుకురమ్మంటున్నారు. తొందరగా వెళ్ళు" అని తొందరపెట్టాడు. లంకపొగాకు చుట్ట చేతిలో పెట్టాడు. పని మానేసి ఊళ్ళో తిరగటం కంటే, తాతయ్యకి కావలసింది లేదు. అందులోనూ లంకపొగాకు చుట్ట లంచం! అమ్మగారి ఆజ్ఞ. ఉత్సాహంగా వెళ్ళాడు. కబురందుకోగానే భక్తుల కానుకలతో కొనుక్కున్న పట్టుచీర కట్టుకుని నామాలయ్య ఇంటికి బయలుదేరింది అచ్యుతమ్మ. "జాగ్రత్తగా పూజచేసుకుని ఇంటికిరా" అని కూతుర్ని హెచ్చరించింది. చిచ్చు గుడిదగ్గర ఎదురుచూస్తున్నాడు. ఇళ ఒంటరిగా కనిపించేసరికి అతడి ప్రాణం లేచొచ్చింది.
"ఇళా! నీతో మాట్లాడాలి!" అన్నాడు గుడిలోకి వెళ్ళబోతున్న ఇళతో!
"ఇప్పుడు కాదు! పూజ అయ్యాక మాట్లాడుకుందాం!" చెప్పింది ఇళ.
"అప్పటికి మీ అమ్మ వచ్చేస్తుంది. మాట్లాడనియ్యదు."
"ఫరవాలేదు! నేను మాట్లాడతాను?"
"పోనీ పూజ తరువాత చేసుకోకూడదూ?"
"ఊహు ముందే పూజ!"
గుళ్ళోకి వెళ్ళిపోయింది. అప్పటికే అక్కడ ఊళ్ళో ఆడవాళ్ళు చాలామంది చేరారు. అందరూ ఇళ పూజకోసమే ఎదురుచూస్తున్నారు. ఆ అమ్మాయి అర్చనతో కలిసి తమ అర్చన జరిపించుకోవాలని! పూజా కలాపం అంతా పూర్తయ్యాక బయటికి వచ్చింది ఇళ. "చెరువు గట్టుకి పోదాం రా!" అని ఇళ చెయ్యి పట్టుకుని దగ్గిర్లోనే ఉన్న చెరువు దగ్గరకు పరుగుతీశాడు చిచ్చు. దార్లో ఇళ "వదులు!" అన్నా చెయ్యి వదలలేదు. చెరువుకట్ట చేరుకునేసరికి, ఇళ శరీరం నిండా చెమటలు. మాట్లాడడానికి కూడా శక్తిలేక కూలబడిపోయింది.
"అరె! ఏమయింది? ఎందుకలా అయిపోయావ్?" అడిగాడు చిచ్చు. వెంటనే సమాధానం చెప్పలేకపోయింది ఇళ. ఆ అమ్మాయికి ఊపిరితియ్యటమే కష్టంగా ఉంది. చటుక్కున ఆమె పక్కన కూచుని వెన్ను రాసాడు. కొంత సేపటికి స్థిమితపడింది.
"ఎందుకంత తొందరగా పరుగెట్టావ్? నేను పరిగెట్టలేకపోయాను. పైగా చెయ్యి వదలమంటే వదలవు." నిష్టూరంగా అంది. అప్పటికీ తగ్గని అలసటతో ఆమె కళ్ళలో నీళ్ళు తిరిగాయి. నొచ్చుకున్నాడు చిచ్చు.
"సారీ! నాకు మీ అమ్మ వస్తుందేమోనని భయం."
నవ్వింది ఇళ.
"నామాలయ్య ఇంటికెళ్తే అమ్మ తొందరగా రమ్మన్నా రాదు. నామాలయ్య భార్య కొత్తగా కొనుక్కున్న పట్టుచీరెలూ, చేయించుకున్న నగలూ అన్నీ చూశాకే వస్తుంది."
"హమ్మయ్య!" అన్నాడు చిచ్చు. "కానీ ఇవాళ నిజంగా నామాలయ్య భార్య రమ్మన్నలేదు." చెప్పాడు.
"అదేమిటి! తాతయ్య వచ్చి చెప్పాడే?"
"అది నేను చెప్పించాను." జరిగింది చెప్పాడు చిచ్చు.
"ఏం చెయ్యను మరి? మీ అమ్మ నిన్ను ఉసిరి చెట్టు కిందకి రానియ్యటంలేదు!" అన్నాడు, చేసిన పనికి సంజాయిషీ ఇచ్చుకుంటున్నట్లు.
ఈ అల్లరి ఇళకి నచ్చింది. తలుచుకుని తలుచుకుని నవ్వింది ఎంతోసేపు. ఆ నవ్వుల మధ్య చిచ్చు తనని ఎందుకు పిలిచాడో అడగడం మరిచిపోయింది. ఇప్పటికీ చాలా పల్లెటూళ్ళలో ఉండే అన్ని చెరువులలాగే ఉంది ప్రమధపురిలో చెరువు. కొందరు గొడ్లని కడుగుతున్నారు. కొందరు మురికి గుడ్డలు ఉతుక్కుంటున్నారు. కొందరు చెరువు కవతలవైపు చెట్ల చాటున మల విసర్జన చేసి చెరువులోనే కడుక్కుంటున్నారు. కొందరు బ్రాహ్మణ కుటుంబాల్లో ఆడవాళ్ళు ఆ చెరువులో నీళ్ళతోనే మడిగా స్నానం చేసి మంచి నీళ్ళు పట్టుకుంటున్నారు.
"ఇళా! నువ్వు కుంట్లోపల్లి కొండజాతులవాళ్ళకి నీళ్ళు పడే స్థలం చూపించావా?"
"అవును!"
"ఛా! ఎందుకలా చేశావ్? మోసం కదూ!"
"ఇందులో మోసం ఏముందీ?"
"మోసం కాక! వాళ్ళు మీ నాన్న కిచ్చిన అయిదు రూపాయలు ఎంత కష్టపడి సంపాదిస్తారో. నీకు తెలుసా? నీళ్ళు ఎక్కడ పడతాయో నీకెలా తెలుసు? పైగా మెరకదిబ్బ చూపించావుట! నీళ్ళు పడకపోతే వాళ్ళ శ్రమ వృథా అయితే వాళ్ళు ఎంత బాధపడతారో ఊహించావా!"
"అక్కడ నీళ్ళు తప్పకుండా పడతాయి. నా మనసులో ఎవరో చెప్తున్నారు ఆ మాట" నిశ్చయంగా చెప్పింది ఇళ.
"ఇలాగే అంటూ ఉండు! ముందు ముందు నీళ్ళు పడకపోతే వాళ్ళంతా నీ భారతం పడతారు."
"నన్నెవరూ ఏమీ చెయ్యలేరు!"
"ఏం? ఎందుకని?"
"కనకదుర్గ నన్ను కాపాడుతుంది."
"పిచ్చి!"
"నువ్వే పిచ్చి!"
"పోనీ మీ నాన్నతో ఇంక కానుకలు తీసుకోవద్దని చెప్పు. వాళ్ళు పాపం బీదవాళ్ళు. అదీగాక కానుకలు తీసుకోకపోతే నీళ్ళు పడ్డా పడకపోయినా అంతగా కోపం రాకపోవచ్చు!"
ఇది నచ్చింది ఇళకి. "సరే!" అంది.
ఇళ ఇంటికి వచ్చేసరికి తల్లి రాలేదు. తండ్రిని బతిమాలి కుంట్లోపల్లి సరిహద్దుల్లో నుయ్యి తవ్వుతున్న చోటికి వెళ్ళింది, తండ్రితో కలిసి! "వాళ్ళు చాలా బీదవాళ్ళు" చిచ్చు మాటల్లో నిజం ప్రత్యక్షంగా చూడగలిగింది. ఇంచుమించుగా ఇళ వయసులో ఉన్న ఆడపిల్లలకి సహితం గోచీ తప్ప వంటిమీద బట్టలేదు. మొగవాళ్ళలో అందరికీ గోచీలో పసిపిల్లలకి సహితం నూకల గంజి పట్టిస్తున్నారు. పాలు కొనలేక చింతగింజల పొడితో కాచిన అంబలి తాగుతున్నారు. పెద్దవాళ్ళు ఆ నూకలు సహితం కొనలేక, ఆ మరునాటినుంచీ భక్తులు సమర్పించే ప్రసాదాలు ఇంట్లోంచి తెచ్చి అందరికీ పంచసాగింది. కొబ్బరిచిప్పలు కాస్త చవగ్గా అమ్ముకోవటం మరిగిన యోగనాథశాస్త్రికి ఇది నచ్చలేదు మొదట. కానీ కూతురికి చెప్పలేకపోయాడు. అదీగాక ఇలా ఆ కొండవాళ్ళని మంచిచేసుకుంటే నీళ్ళు పడకపోయినా వాళ్ళు రెచ్చిపోక పోవచ్చు. అక్కడ నీళ్ళు పడతాయని యోగనాథశాస్త్రికి నమ్మకం కలగటంలేదు. ప్రతిరోజూ కొబ్బరిచిప్పలూ, పులిహోరా మొదలైన ప్రసాదాలు పంచిపెట్టే ఇళ కొండజాతి వాళ్ళకు సాక్షాత్తూ దేవతలాగే కనిపిస్తోంది.