Previous Page Next Page 
దాశరథి రంగాచార్య రచనలు -7 పేజి 8


    అక్కడున్నవాళ్ళలో చిన్న కుర్రాడు అనవసరంగా కనిపించాడతనికి. లాగి రెండు గుద్దులు గుద్దాడు. పిల్లవాడు తల్లడిల్లాడు. ఏడవలేదు. వెంటనే కుర్రాడి కాళ్ళు పట్టుకొని లోనికి విసిరేశాడు.
    పాదాలు గడగడలాడాయి. కదిలిపోయాయి.
    "ఈ వెధవను చూస్తే నా వళ్లు మండుతుంది" అని మావైపు చూచి చిరునవ్వు నవ్వాడు. వాడు నాకు కసాయిలా కనిపించాడు. నా గుండెలో మంటలు రగిలాయి.
    "మీరూ మా అన్న దోస్తులేనా?" ఒకరకం పోజుపెట్టి మాదరికి చేరి కూర్చున్నాడు. వాడి చూపులు వృద్ధుని చేతిలో పిచ్చుకలా ముడుచుకున్న నోట్ల మీద ఉన్నాయి. లోపలినుంచి కుర్రాడి ఎక్కిళ్లు వినిపిస్తున్నాయి. ఇప్పటిదాకా పాదాలు కదలాడిన చోట వెలుగులు కనిపిస్తున్నాయి.
    "కాదండీ నేను మహమూద్ గారితో యూనివర్శిటీలో చదువుతున్నాను"
    "అయితే మీ ఆనందాలకు అంతేమి?" మరికాస్త దగ్గరికి జరిగాడు.
    "ఏదో కాలం గడుపుతున్నాం"
    "ఢిల్లీలో మా అన్న కూడా హాయిగా... ..." అతని చూపులో ఈర్ష్య గోచరించింది. గోడమీద తన అన్నకు సంబంధించిన కలర్ ఫిలిం చూడసాగాడు.
    నాకూ గోడమీద రంగులు వ్యాపిస్తూ కనిపించాయి. వెలుగు చిమ్మింది. రంగు గాజు బుడ్లు ఒలికాయి. రంగులు, రంగులు, అనేక రంగులు. రంగురంగుల వలయాలు. రంగులు ముడుచుకున్నాయి. ఒకేరంగు ఎరుపు-అరుణిమ- అంతటా కనిపిస్తూంది. గోడ ఎరుపు. బట్టలు ఎరుపు. గోడమీద పెన్సిలు బొమ్మలు ఎరుపు. పెద్దమనిషి గడ్డం ఎరుపు. నడియాడిన పాదాలు ఎరుపు. పాదాలనంటిన చీర అంచు ఎరుపు. ఆ ఎరుపు అందమైన పాదాలను కాటు వేస్తున్నట్లున్నది.
    ముసుగులో దాగిన ముఖం, తెరచాటున కదలాడిన పాదాలు నా మతి పోగొడ్తున్నాయి.
    "నా కొడుకు కడుపు కట్టుకొని డబ్బు కూడబెడ్తున్నాడు" పెద్దమనిషి బలం పుంజుకొని అన్నాడు.
    "మురాద్ బిజినెస్ చేస్తున్నాడా? ఉద్యోగమా? వేలు సంపాదిస్తుండవచ్చు." నామీద ప్రభావం వేయడానికి కాక, పెద్దమనిషిని ఓదార్చడానికి అన్నాడు మహమూద్.
    "మహమూద్ మియా, ఏంలేదు మురాద్ ది మంకు, చప్పున బోలెడు సంపాదించి తెస్తానంటాడు." వేల సంపాదనకు సాక్ష్యం చూపలేక అన్నట్లు అన్నాడు.
    "బావుంది. అలా అనుకుంటే మీకు కష్టం కాదూ!" ఏదో అనాలని అన్నాను.
    "ఏమిటా వాగుడు" ముసలాయన నన్ను కొట్టేంత పనిచేసి "మేం మంది సంపాదన మీద బతుకుతామనుకున్నావా? నీకేం తెలుసు మేం ఎలా బతికామో! ఈ డబ్బు మాకో లెక్కా? కాల తన్నేవాళ్ళం" అని నోట్లను నేలక్కొట్టాడు. వెంటనే పవిత్ర గ్రంధాన్ని పడేసినట్లు అందుకున్నాడు.
    తెరలో భూకంపంలాంటివి వస్తున్నాయి. గాజుల గలగలలు నిట్టూర్పులుగా మారాయి. ఆ పాదాలు కూడా అవతారం మార్చాయి. అవి నల్లగా ఉన్నాయి. ముడతలు పడ్డాయి. కాళ్లు పగిలాయి. వేళ్ళు వంగిపోయాయి. గోళ్లకు రంగులేదు. నల్లగా ఉన్నాయి. అవి పారాణి పులిమిన పాదాలు కావు-దెబ్బలు తిని గాయాలయిన పాదాలు, విశాలమయిన ఎడారిలో ఎండకు నడిచీ నడిచీ అలసి, సొలసిన పాదాలు!
    ఆనాటి నుంచి అక్కడికే భోజనానికి వస్తున్నాను. భోజనం చేయడం నేనొక్కణ్ణేనా? నావెంట పిల్ల కుర్షీద్, షహజాదా, ముడుచుకున్న బాబాయి, తెరలోపల జీవితంలో ఓడిపోయిన వికారపాదాలు, ఆవేదనలో తిరుగాడే అందమైన పాదాలూ అన్నీ ఉంటాయి. అందరూ నాతోపాటు నోరు తెరుస్తారు-మూస్తారు. ఊహా భోజనం చేస్తారు. ఆ కళ్ల గుంపులో కూర్చుని వంటరిగా వాళ్ల ఎముకలు కొరుకుతున్నాను. ఈ రొట్టెల్లో బాబాయి కన్నీరు, వదిన నిట్టూర్పు, కుర్షీద్ షహజాదా ప్రేగుల అరుపులు కలిసివున్నాయి. ముప్పై రూపాయలిచ్చి ఈ రొట్టెలు తినే హక్కు సాధించాను. ఇప్పుడిహ ఈ ముప్పై రూపాయల ఆశను ముక్కలు చేయడమూ అనర్థమే. వీటితోనే ఈ ఇంటివాళ్లలో ఇంకా ప్రాణాలున్నాయి. పోట్లాడుకునే శక్తి నిలిచి ఉంది. అందుకోసమన్నా నేను రెండుసార్లు రావాలి. నా పరిస్థితి ఉరిశిక్ష వినిపించడానికి రోజూ తీసుకొనివచ్చే ఖైదీలా ఉంది.
    నేను రాగానే ఇంట్లో గడబిడ మొదలవుతుంది. కోడలు సోమరితనాన్ని గురించి బాబాయి తిట్లు, సాపెనలు మొదలవుతాయి. జవాబుగా లోన గాజుల గలగలలు వినిపిస్తాయి. పాట పాడేముందు తల ఆడించే హీరాబాయి కూనిరాగాలు వినిపిస్తాయి. నా నిరీక్షణ పాటకోసం. వాస్తవంగా నాకు ఈ ఇంట్లో ఎవరిమీదా సానుభూతి లేదు. ఆ కూనిరాగం వినడానికే ముప్పై రూపాయలు ఇస్తున్నాను. లోన గిన్నెల చప్పుడుతోపాటు షహజాదా పాట ప్రారంభిస్తాడు. 'వెధవల్లారా! నాకూ మిగల్చండి.'
    "అంత గట్టిగా అనకు చిన్నన్నా, బయటినుంచి మిగిలివచ్చింది తినండి" ఖుర్షీద్ ధ్వని తగ్గించి మెల్లగా అంటాడు.
    ఖుర్షీద్ నాకు స్నేహితుడయినాడు. ఇంట్లో అతనిది విచిత్ర స్థితి. వారికి కోపం వస్తే వీణ్ణి బాదేవారు. వరుసగా ఉపవాసాలు, అనంతం అయిన దరిద్రం ఏడేళ్ళపిల్లవాడికి పదిహేడేళ్ళ అనుభవమూ జాగ్రత్తా కలిగించాయి. సన్న గొంతు పసితనపు నవ్వు తప్ప బాల్యపు లక్షణాలేమీ కనిపించవు. అణా కోసం పొరిగిందలకు సామానులు తెచ్చిపెడ్తాడు. ఒక టీచర్ పాపను ఎత్తుకున్నందుకు రోజూ బేడ ఇచ్చేది. అదే ఆ ఇంటికి ఆశ. అదే రాబడి. పాపను ఎత్తుకొనీ, ఎత్తుకొనీ నడుం ఒకవైపుకు వంగిపోయింది. బరువు మోస్తే ఆయాసం వస్తుంది. నొసటి నరాలు పొంగాయి. ముక్కు కొనకు చెమట చుక్కలు నిలుస్తాయి. ఇంట్లో అందరినీ మించిన బాధ్యత అతనిదే. వస్తువులు కుదవపెట్టడం, ఇంటి గౌరవాన్ని కాపాడ్డం అన్నీ అతడే చేసేవాడు.  
    అతనికి కథలు వినడం బహు ఇష్టం. అరేబియన్ నైట్స్ కథలన్నీ నోటికివచ్చు. అతడు ఎవరినైనా అసహ్యించుకుంటే అలావుద్దీన్ అద్భుతదీపం కథలో మాంత్రికునితో పోల్చేవాడు. గోడమీద ఆ మాంత్రికుని బొమ్మ వేస్తాడు. అతడు తనకు కలిసిన కొత్తవాళ్లను సాధారణంగా ఒక ప్రశ్న అడుగుతాడు.
    'అన్నా, మీకో పైసా దొరికిందనుకోండి, ఇల్లు సాంతం నిండేంత వస్తువు కొనాలనుకున్నారు. అది ఏది?'
    'ఏమిటి?' నాకర్థంకాక తల గోక్కున్నాను.
    'మీరు చెప్పండి'
    'కాదు మీరే'
    'సరే నేనే చెపుతాను గాలి కొనితెస్తాను' అని పెద్దగా నవ్వాడు. నవ్వీ నవ్వీ అతని ముఖం కందగడ్డ అయింది. నవ్వుతూనే తండ్రితో 'అబ్బా! అబ్బా అన్నకు తెలీదు పైసకు కొనే గొప్ప వస్తువేదో' అన్నాడు.
    ఆ నవ్వు విని ఉలిక్కిపడ్డ తండ్రి వాణ్ణి ఒక తన్ను తన్నాడు. 'దీపం ఎందుకు తేలేదు?' అని అడిగాడు.
    'అవును మరచాను' అని తలవంచుకున్నాడు.
    'మీకు ముగ్గురు రాజకుమారుల కథ తెలుసా?" అని ఆ కథ చెప్పడం ప్రారంభించాడు. బాబాయి బారి నుండి బయటపడాలంటే వారి కథ చెప్పేవాడు. తిండి...తిండి...తిండి...తినడానికే వారు లోకంలో అవతరించారు. తండ్రి తాతల కొంప తినేశారు. పొలాలు నమిలి మింగేశారు. పిన్ని నగలు పిండికొట్టి బుక్కేశారు. వారికి వందల రకాల నోరూరించు రుచులు తెలుసు. వందల వంటల పుస్తకాలు చిరిగి నా చాపకింద దాచి ఉంచారు, కాస్త డబ్బు చేతికి వస్తే ఆ వంటలు చేయించాలని.
    బాబాయి నోరు కడపక నిశ్శబ్దంగా ఉంటే నాకో ఆలోచన వచ్చేది. వారేవో ఊహాలోకాల్లో విహరిస్తున్నారని. ఎండురొట్టెల కోసం వేచివేచి కవాబుల కోసం ఎవరెస్టు శిఖరం అధిరోహిస్తారు. పాల సముద్రంలో ఈదులాడుతారు. మిరాయీల ద్వీపాలు ఎక్కుతారు. రకరకాల వంటకాల్లో కూరుకుపోతారు.
    ఈ ఇంట్లో రొట్టెలు లెక్కించి ఇస్తారు. కూరలతో నాలుక చెడింది. ఇక్కడ తినడం ఇష్టంలేదు. అయినా ఆ అందమైన పాదాలు-అవి నన్ను వదలడం లేదు. ప్రతిరోజూ నా రాక తెలిసి ఆ పాదాలు తెర దగ్గరికి చేరుకుంటాయి. ఆ అడుగుల సవ్వడి నాకు తప్ప మరెవ్వరికీ వినరాదు. ఖుర్షీద్ మాత్రం అప్పుడప్పుడూ నన్ను చూస్తాడు. కదిలే కాళ్ళను చూస్తాడు. పిల్లలతో ఆటలో పడిపోతాడు.
    పిన్ని కర్ర ట్రేలో నాలుగు రొట్టెలు, అసహ్యంగా కనిపించే కూరా తెస్తుంది. "బిడ్డా! రొట్టెలు ఎక్కువ తేలేదు అనుకోవద్దు. ఎంగిలి పడ్తాయని తేలేదు. అవసరం అయితే అడుగు."

 Previous Page Next Page