Previous Page Next Page 
మైదానం పేజి 8


    చిన్నప్పుడు మా యింట్లో శాస్తుర్లు భాగోతం చదువుతోంటే విన్న సంగతులు జ్ఞాపకం వొచ్చాయి. విష్ణు భక్తుడికి సర్వ ప్రపంచమూ లీలగా, అసత్యంగా తోస్తుందిట. ఈ భూమీ, ప్రాణులూ, వాళ్ళ సుఖదుఃఖాలూ, సర్వమూ మాయగా, అశాశ్వతంగా తోస్తుందనీ, ఒక్క విష్ణుభక్తి మాత్రమే నిత్యమయినదీ, అర్థవంతమయినదీ, తనకి సంబంధించిందిగా కనబడుతుందని చెప్పేవాడు. నా మనోస్థితి సరిగా విష్ణుభక్తుడిలాగు వుంది? నా యిల్లూ, బంధువులూ, యీ వూళ్ళో ప్రజలూ వాళ్ళ అభిప్రాయాలూ, అన్నీ మాయ. నా పూర్వ జీవితమంతా ఒక దుష్ట స్వప్నం. శాశ్వతమూ, సత్యమూ అయినది నేనూ, నా అమీర్. నిత్య నిరంతరానందదాయకమయినది, మా నిశ్చల ప్రేమ సంబంధం. ఆ కొండలూ, ఆకాశమూ, నదీ, బయలూ, స్వచ్చ మారుతమూ, మేము మా లీలకోసం సంకల్పించుకున్న రంగస్థలము-అంతే. ఇంక తక్కిన ప్రపంచమంతా మాయ. మేమే యీ సృష్టీ, దాని వుద్దేశ్యమూ, మమ్మల్నీ, మా ప్రేమనీ సృజించడానికే ఈశ్వరుడు ఈ లోకాలన్నిటినీ యేర్పరిచాడు.

                                                  3

    కాలం ఆగిపోయింది మాకు. తొరగానూ కాదు. ఆలస్యంగానూ కాదు.
    వారాలు తెలీవు. నెలలూ తెలీవు. మామయ్య వొచ్చి చెప్పిందాకా. సాయంత్రం మేము భోజనం వొండుతూ వుండగా వూళ్ళోనుంచి ఓ కుర్రాణ్ణి వెంటబెట్టుకుని తన మామూలు పచ్చ రూలు సంచీ, తానూ-మామయ్య తయారైనాడు. అతన్ని చూడగానే అమీర్ తురకంలో 'పో, పో ఇక్కణ్ణించి' అన్నాడు. మామయ్య భయంతో నా వంక చూశాడు. నేను బిగ్గిరిగా నవ్వి.
    "నా మామయ్య అమీర్, పొమ్మనకు మరి" అన్నాను.
    నాకెందుకో అతన్ని చూసి భయం వెయ్యలేదు. అమీర్ మొహంలో మాత్రం యిబ్బంది కనబడ్డది నాకు.
    "మామయ్యా! ఏమిటి? మీ మామయ్యా? ఎట్లా వొచ్చాడు? ఎందుకొచ్చాడు?"
    "...కనుక్కుందాము కూచోనీ .... కూచో మామయ్యా! రాకరాక వొచ్చావు."
    అని మళ్ళీ గొంతుమార్చి "బాగానే వుంది. మా పుట్టింటి బంధువులు వొస్తే, యిదేనా మర్యాద!" అన్నాను.
    "ఎప్పుడు రావటాలు! వివేషాలేమిటి? అందరూ బావున్నారా!" అని అడిగాను మర్యాదగా.
    "ఎవరు యామైతే నీకేం? నువ్వు సుఖంగా వున్నావుగా!" అంటూ చుట్టూ చూశాడు.
    "మామయ్యా! ఆ ధోరణికేంగానీ తొరగా బైట పడెయ్యి. ఎందుకు వొచ్చావో?"
    నా మాటల ధోరణీ నా కొత్త ధైర్యమూ ఆశ్చర్యపడి చూశాడు.
    "ఎట్లా మారిపోయినావో?" అన్నాడు మెల్లిగా.
    "మరణంలోంచి జీవనంలో పడ్డాను. మరి మారిపోనూ!"
    "తురక కూడులో పడ్డావు."
    మామయ్యకి మాటల దగ్గిర యెన్నడూ మొహమాటం లేదు.
    "మా యింటికి వొచ్చి తురకవాళ్ళని యేమన్నా అంటే, తురక తడాఖా తగుల్తుంది. మర్యాదని యింటి దగ్గిర వొదిలి వచ్చావా" అన్నాడు అమీర్. మామయ్య తృణీకారంగా మాట్లాడకుండా వూరుకున్నాడు.
    మెల్లిగా కళ్ళనీళ్లు పెట్టుకున్న నావంక యెగాదిగా చూశాడు. నాకు రెవిక లేదు. జుట్టు దువ్వక రేగివుంది. ముతక చీరె. అన్నంకుండ పొయ్యి మీద. చేతిలో కొయ్యతెడ్డు.
    "ఇదిగో! ఏడుపులూ, గోలలూ సాగించి క్షోభపెట్టి నిన్ను లాక్కెల్లాలని వొచ్చాడు. వీడివెనక తక్కిన మనుషులు వొస్తారు. ఆమూట భుజాన యెత్తుకుని వెంటనే నడవమను" అన్నాడు తురకంలో అమీర్.
    "ఏమీ భయంలేదు. ఎవరొస్తే నన్నేం చేస్తారు? మావాళ్ళ విషయం నాకు వొదిలెయ్యి. నువ్వు కొంచెం అట్టా తిరిగిరా. నువ్వుంటే సంగతి చెప్పడు."
    "నువ్వు కొంచెం తొరగా కానీ. ఆకలేస్తోంది" అని అమీర్ వెళ్ళాడు.
    "నేనిక్కడ వున్నానని నీకెట్లా తెలిసింది?"
    "ఎలాగో వోలాగు. కాని నీ సంగతి చెప్పు."
    "నా సంగతి ఏముంది? హాయిగా, మహారాజులా వున్నాను."
    "అంతేనా!" అని కళ్లు వురిమి చూశాడు. నేను జంకకపోవడం చూసి కళ్ళు 'స్విచ్ ఆఫ్' చేసి,
    "ఎంతదానవైనావే....! పోనీ అమ్మ సంగతి తలుచుకున్నావా! నీ సుఖం నువ్వు చూసుకున్నావుగాని! ఇలాంటి పని చేస్తే మా అందరికీ యెంత సిగ్గు కలుగుతుందో...."
    "నా మామయ్యని, నువ్వు ఇలా ఆ పిలక వేళ్ళాడేసుకొని, ఆ పాతరైలు సంచీ చంకనెత్తుకుని ఒస్తే నాకెంత సిగ్గుగా వుంది! అమీర్ తో నా మామయ్య నువ్వని యెలా చెప్పుకోను? నీ సుఖమూ, నీ అందమే నువ్వు చూసుకున్నావు గాని, ఆ పాడు మొహం...."
    "ఏమిటి! నీకు పిచ్చి పట్టలేదు కద!"
    "కాదు, మామయ్యా మీ అందరూ మన బంధువులలో ఎవరికి ఏమి కష్టం కలుగుతుందో అని ఆలోచించి చేస్తున్నారా మీ పనులన్నీ? చిన్నప్పణ్ణుంచి నువ్వు మీ అమ్మని యెన్నివిధాలా ఏడిపించావో నీకు జ్ఞాపకం లేనేలేదా!"
    "దానికీ దీనికీ సాటి ఏమిటి? మేము యామన్నా తురకాళ్ళతో."
    "నాకు తెలుసు మామయ్యా! ఆ యేడిపించడాలు లోకం ఒప్పుకున్నవీ, మర్యాదైనవీ. ఇది కానిదీ! అంతే భేదం. అవన్నీ యెందుకుగాని యిప్పుడు నువ్వు వచ్చిన పనేమిటో చెప్పు తొరగా. మళ్ళీ అమీర్ వస్తాడు. నన్ను ఒదిలి నాలుగు నిమిషాలు విడిగా నిలవలేడు."

 Previous Page Next Page