"అంటే?"
"వాసంతిని నేనే వుంచుకోవాలనుకుంటున్నాను."
మాధవప్రసాద్ మొహం ఎర్రబడింది. ఆవేశంతో గ్లాసు పట్టుకున్న చేతి వ్రేళ్ళు వణికాయి.
"వాసంతి మీద ఎప్పట్నుంచో కన్నువేసి ఉంచింది నేను. నాంచారమ్మకు లంచం పెట్టి పూనకం తెప్పించింది నేను. నా పెళ్ళాం చచ్చిపోయి ఒంటరిగా ఉన్నాను. పెర్మినెంట్ గా ఓ ఆడదాని అవసరం నీకన్నా నాకెక్కువ ఉంది."
"పెర్మినెంట్ గా నీకో ఆడది కావాలంటే జోగినులుగా తయారు చేయబడడానికింకా చాలామంది ఆడపిల్లలు సిద్దంగా ఉన్నారు. నీ పెళ్లాం చచ్చిపోవడం కాదు, నువ్వే చంపావని ఓ వదంతి ఉంది."
"పరంజ్యోతి? నువ్వు చాలా దూరం పోతున్నావు. వాసంతి నాకు నచ్చింది. దాన్ని నా ఒక్కడికే సొంతం చేసుకోవాలి."
"అది నాకూ ఎంతో బాగా నచ్చింది. పోనీ ఇద్దరం కలిసి ఉంచుకుందాంలే."
"నాకలాంటి ఉమ్మడి వ్యవహారం నచ్చదు. అందుకే నా పెళ్ళాన్ని..."
"ఆగిపోయావేం చెప్పు"
"మనమిప్పుడు వాసంతి విషయం మాట్లాడుతున్నాం."
"అవునుకదూ, పోనీ ఒక పని చెయ్యి. నేను కొన్నాళ్ళు వాడుకొని వొదిలేక, నీకు అప్పగించేస్తాను, తర్వాత నీ యిష్టం."
"నాకిలాంటి వ్యవహారాలు గిట్టవన్నాను. నాకంతా ఫ్రెష్ గా ఉండాలి."
"సారీ, వాసంతి నా చేతుల్లో పడ్డాక నువ్వు మధనపడి ప్రయోజనం లేదు. దాని తల్లి దండ్రులకు చెప్పి డబ్బు కూడా ముట్టచెప్పి ఉంచాను. నా కోసమే కేటాయించి ఉంచమని."
మాధవప్రసాద్ కళ్ళు మరింతగా ఎర్రబడ్డాయి. చేతిలోని గ్లాసు బలంగా నేలకేసి కొట్టాడు. భళ్ళున పగిలి ముక్కలై చెల్లాచెదురుగా పడిపోయాయి.
"పరంజ్యోతి? జీవితంలో నన్ను చాలాసార్లు దెబ్బతీశావు. ఇద్దరిమధ్య ఈ పోరాటం ఏ రూపం దాలుస్తోందో చివరికి చూస్తావు." అంటూ లేచి నిలబడి విసురుగా బయటకు వెళ్ళిపోయాడు.
"ఏడిశావు." అనుకుంటూ ఖాళీ అయిన గ్లాసులో మరింత బ్రాందీ వొంపుకున్నాడు.
ఓ గంట గడిచాక పరంజ్యోతి భార్య తారకేశ్వరి, ప్రక్కింటి ఉదయమ్మ ఒక దగ్గరకు చేరి మాట్లాడుకుంటున్నారు.
"అక్కా? బావగారు వాసంతి కన్నెరికం పోగొట్టడానికి హరిజనవాడ వెళ్ళారుగా" అని అడిగింది ఉదయం ఉత్సాహంగా.
"ఆయన మొగసిరివున్న మొగవాడు. ఎంతమంది దగ్గరకయినా వెడతాడు. ఆయనకేం తక్కువ?" అంది గర్వంగా తారకేశ్వరి.
"అవునక్కా! చక్కా బావగార్ని చూస్తే ముచ్చటేస్తోంది. మా ఆయనా వున్నారు ఎందుకూ? పరాయి ఆడదాని దగ్గరకు తోసినా పోనంటాడు. అదేం బుద్దో ఏమో? ఆయన్ను చూస్తే సిగ్గుతో చచ్చిన చావవుతుందనుకో. బావగారి పద్ధతులు నాకు నచ్చుతాయి. అందుకే అక్కా నిన్ను చూస్తే అసూయగా ఉంది."
అసలే పెద్దదయిన తారకేశ్వరి గుండెలు మరింతగా ఉప్పొంగినాయి. "అవునవును నిన్ను చూస్తే జాలేస్తోంది. అలాంటి మొగుణ్ణి కట్టుకొని" ... అంది తాను ఎన్నిసార్లు పలకరించడానికి ప్రయత్నించినా తల తిప్పుకొని వెళ్ళిపోయే పర్వతాలరావును తలుచుకొంటూ.
"ఇద్దరు పిల్లలుండబట్టి సరిపోయిందిగానీ లేకపోతే ఆయన గురించి ఇంకా ఏ అనుమానమన్నా వచ్చేది."
"ఊరుకో" ఊరుకో బాధపడకు ఏం చేస్తాం" అంది తారకేశ్వరి ఓదారుస్తూ.
వాసంతి తల్లీ తండ్రీ కల్లు తాగిన మైకంలో నేలమీద పడి దొర్లుతున్నారు. పాక లోపలి భాగంలో తడిక అవతల, వాసంతి పడుకుని వుంది. ప్రక్కనే చిన్న దీపం వెలుగుతోంది.
పరంజ్యోతి చేతిలో చిన్న సంచితో లోపలికి అడుగుపెట్టాడు. అలికిడికి వాసంతి కళ్ళెత్తి చూసింది.
పరంజ్యోతి ఆమె ప్రక్కనే కూర్చుని సంచిలోంచి పువ్వులూ, కొత్తచీరె తీశాడు. ఇంకో చిన్నమెత్తు బంగారం తీసి ఆమె కొంగున కట్టాడు. తరువాత ఆమెమీదకు వ్రాలి చేతుల్లోకి తీసుకున్నాడు. అంతవరకూ ఇద్దరిమధ్యా సంభాషణ ఏమీ జరగలేదు.