Previous Page Next Page 
జోగబాల పేజి 7


    శ్రీహర్షా, విలాస్ ఒక ప్రక్క నిలబడి ఆశ్చర్యంగా చూస్తున్నారు.


    ఉత్సవం ఓ జాతరలా ఉంది. ఒక ప్రక్క కోలాటం, ఒక ప్రక్క వొళ్ళంతా రంగులు పులుముకొని చిందులు త్రొక్కేవాళ్ళు. యింకోప్రక్క పూనకాలతో ఊగిపోతున్నవాళ్ళు, వికృతంగా ధ్వనిస్తున్న మేళాలు_ఊరేగింపు చెవులు బ్రద్దలయ్యే గోలగా ఉంది.


    వాసంతిని అలంకరించి ఓ బండిమీద కూచోబెట్టారు. ఆమె మెడనిండా రకరకాల పూసల గొలుసులు, తల నిండా ఎర్రని, తెల్లని పువ్వులు. ఆ రోజు ఉత్సవానికి ఆధిపత్యం వహిస్తోన్న ఊరి ప్రముఖులలో ఒకడైన చలమయ్య కొనిచ్చిన కొత్తచీరె, ఆమె చామనచాయ మేనిరంగు ఎర్రని ఎండలో నిగనిగలాడుతోంది. శరీరాన్ని అలుముకొంటున్న చిరు చెమటలు ఎండ కాంతిలో ముత్యాల బిందువుల్లా మెరుస్తున్నాయి. ఆ బండిని కొందరు మనుషులు లాగుతున్నారు.


    ప్రక్కనే పురోహితుడైన పోతరాజు కూర్చొని వున్నాడు. కండలు తిరిగిన నల్లని శరీరంతో బలసిన ఎనుబోతులా ఉన్నాడు. వెనక ఊళ్ళోని పెద్దలూ, ప్రముఖులూ యితరులు అనుసరిస్తున్నారు.


    "మన సైకిలు యాత్ర చాలా వింతలను చూపిస్తోంది. రా_మనం కూడా పోదాం"- అన్నాడు విలాస్ ఉత్సాహంగా.


    శ్రీహర్ష స్నేహితునితోబాటు ఆసక్తిగా ముందుకు కదిలాడు. ఊరేగింపు నెమ్మదిగా సాగుతూ మధ్య మధ్య ప్రదర్శనల కోసమాగుతూ ఊళ్ళోని చిన్న చిన్న సందులన్నీ చుట్టుముడుతూ - ఒక గంట తరువాత ఎల్లమ్మ గుడికి చేరుకుంది.


    చలమయ్యకూడా పెళ్ళికొడుకులా కొత్తబట్టలు కట్టుకున్నాడు. జోగి చెయ్యబడ్డ యువతి ఎల్లమ్మ దేవతతో పెళ్ళి చెయ్యబడుతుంది. అప్పట్నుంచి ఆమె పవిత్రురాలు. జీవితాంతం పునిస్త్రీగా వుండిపోతుంది.


    ఏమి చేసినా ఏ విధమైన మాలిన్యమూ ఆమెకంటదు. అయితే పెళ్లి ఎల్లమ్మ దేవతతో చెయ్యబడినా - ఆ దేవత తరపున ఊరి పెద్దల్లో ఒకడు పెళ్ళికొడుకులా వ్యవహరిస్తాడు. ఈవేళ ఆ బాధ్యత చెలమయ్య నిర్వహిస్తున్నాడు.


    పోతరాజు ఏవేవో మంత్రాలు ఉచ్చరిస్తున్నాడు.


    ఆ తతంగం దాదాపు గంటసేపు జరిగింది. చివరకు చలమయ్య ఎల్లమ్మదేవత తరపున వాసంతి మెళ్ళో తాళి కట్టేశాడు. ఆమె జోగినిగా మారిపోయింది.


    చలమయ్య ఖర్చుతో పెళ్ళికి వచ్చిన వారందరికీ విందు చెయ్యబడింది. విందంటే ముఖ్యంగా కల్లు త్రాగడం. అక్కడ కల్లంటే ప్రతి వాళ్ళూ చాలా ఇష్టపడతారు. వాసంతికి కూడా కల్లు ఇచ్చారు. వాసంతి కాదనలేదు. చెప్పిందల్లా మౌనంగా చేస్తోంది. ఆమెకు కల్లు త్రాగుతుంటే కొత్తనిపించలేదు. శరీరమంతా ఏదో మగత ఆవహిస్తూ మానవత్వం నుంచి దైవత్వంలోకి వెళ్ళిపోతున్నట్టుగా అనిపిస్తోంది.


    ఆమె చుట్టూ దాదాపు ముప్పయిమంది జోగినులు మూగారు. వాళ్ళంతా కూడా క్రింద పడిపోయే స్థితిలోకి చేరుకునే వరకూ త్రాగుతూనే వున్నారు. ఆ కార్యక్రమాలతో సంరంభంతో సాయంత్రందాకా సాగి చివరకు చీకటి పడిపోయింది.


                                *    *    *    *


    ఊళ్ళోని పెద్దలలో ఒకరైన పరంజ్యోతి ఆ రాత్రి ఎనిమిది గంటల వేళ తమ ఇంట్లో ముందు గదిలో కూర్చుని బ్రాందీ తాగుతున్నాడు. బల్లమీద గోలీసోడాలు ఐసు ముక్కలున్న ప్లాస్క్ సరంజామా అంతా వుంది.


    పరంజ్యోతికి నలభయి ఏళ్ల వయసుంటుంది. పంచా, లాల్చీ వేసుకున్నాడు. అతని కెదురుగా అతనికంటే అయిదారేళ్ళ వయసులో చిన్న అయిన మాధవప్రసాద్ కూర్చుని వున్నాడు. అతని చేతిలో కూడా బ్రాందీతో నిండి వున్న గ్లాసు వుంది. అప్పటికిద్దరూ మూడో రౌండ్ లో వున్నారు.


    "నేనో పని చేద్దామను కుంటున్నాను." అన్నాడు మాధవప్రసాద్.


    "ఏమిటి?"


    "వాసంతిని నేను వుంచుకుందామనుకుంటున్నాను."  


    జోగినిగా మారిన స్త్రీని ఎవరయినా ఉంపుడుగత్తేగా అట్టేపెట్టుకోవచ్చు. అలా వుంపుడుగత్తెగా వున్న స్త్రీ వద్దకు ఇతర పురుషులు వెళ్ళకూడదు. కనీసం ఆమె అతని ఆధీనంలో వున్నంతవరకు.


    పరంజ్యోతి నవ్వాడు. "అచ్చం నా మనస్సులో వున్న మాట నువ్వు చెప్పావు."

 Previous Page Next Page