Previous Page Next Page 
మహాప్రస్థానం పేజి 8


                                  అవతారం

యముని మహిషపు లోహ ఘంటలు
మబ్బు చాటున
ఖణేల్మన్నాయి!
నరకలోకపు జాగిలమ్మలు
గొలుసు త్రెంచుకు
ఉరికిపడ్డాయి!
ఉదయ సూర్యుని సప్తహయములు
నురుగులెత్తే
పరుగు పెట్టేయి!
కనకదుర్గా చండ సింహం
జూలు దులిపీ,
ఆవులించింది!
ఇంద్రదేవుని మదపు టేనుగు
ఘీంకరిస్తూ,
సవాల్ చేసింది!
నందికేశుడు రంకె వేస్తూ,
గంగడోలును
కదిపి గెంతేడు!
ఆదిసూకర వేద వేద్యుడు
ఘుర్ఘరిస్తూ,
కోర సాచాడు!
పుడమి తల్లికి
పురుటి నొప్పులు
కొత్త సృష్టిని స్ఫురింపించాయి!

                                                                            14-4-1934

                                                     *  *  *

 Previous Page Next Page