Previous Page Next Page 
హ్యూమరాలజీ - 3 పేజి 8

                                 


                                   ఆహా! మన ట్రాన్స్ పోర్ట్


              


    మెదక్ లోని బబ్రిపూర్ వద్ద లారీలో ప్రయాణం చేస్తున్న పాతికమంది ప్రయాణీకులు లారీ ప్రమాదంలో మరణించిన విషయం న్యూస్ పేపర్స్ లో చదివిన క్షణం నుంచీ మా కాలనీలో అందరం విషాదంలో మునిగిపోయాం.

 

    ఆ వార్తవిని రాష్ట్ర ముఖ్యమంత్రి 'దిగ్భ్రాంతి' వ్యక్తం చేసిన విషయం కూడా మేము న్యూస్ పేపర్లో చదివాం. మా కాలనీ వాళ్ళందరం కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన విషయం గురించి న్యూస్ పేపర్లో రాయమని మా గోపాల్రావ్ ని అడిగాం గానీ గోపాల్రావ్ వప్పుకోలేదు.

 

    దిగ్భ్రాంతి అనేది కేవలం గొప్పాళ్ళకే గానీ లేదా గొప్ప పదవుల్లో ఉన్నవారికి మాత్రమే కలుగుతుందనీ, సామాన్య ప్రజలకు కలగదనీ, అంచేత న్యూస్ పేపర్లు ఆ విషయం రాయరనీ చెప్పాడు.

 

    మాకు ఆ మాట వినేసరికి ఆశ్చర్యం కలిగింది.

 

    "కేవలం గొప్పాళ్ళకూ, పెద్ద పదవుల్లో ఉన్నవారికే అది కలిగేట్లయితే మరి మాకెందుకు కలిగినట్టు?" గోపాల్రావ్ ని అడిగాడు శాయిరామ్.

 

    "ఇంకా తెలీనట్లు అడుగుతారేంటి? మన కాలనీలో కూడా గొప్పాళ్ళయిపోయారన్న మాట చాలామంది! అందుకే అది కలిగింది" అన్నాడతను.

 

    "మేం గొప్పాళ్ళయినప్పుడు మా 'దిగ్ర్భాంతిని పేపర్లో వేయవచ్చు కదా!" లా పాయింట్ తీశాడు రంగారెడ్డి.

 

    గోపాల్రావ్ నవ్వాడు.

 

    "మీరు గొప్పాళ్ళయిన విషయం మీకూ నాకూ తెలుసుగానీ బయటి ప్రపంచానికి తెలీదుకదా! తెలిసే వరకూ ఆగండి" అన్నాడతను.

 

    మర్నాడే న్యూస్ పేపర్లో ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీదొర స్టేట్ మెంట్ చూశాం.

 

    "ఆర్టీసీ బస్సులు కాకుండా ప్రైవేట్ వాహనాలలో ప్రజలు ఎక్కువగా ప్రయాణం చేయటం వల్ల అటు ఆర్టీసీకి నష్టాలు రావటమే కాకుండా ఇటు ప్రయాణీకులు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోతున్నారు. కనుక ప్రైవేట్ వాహనాల్లో ప్రయాణం చేయటాన్ని నిషేధించాలి" అవటాని చెప్పారాయన.

 

    మాకందరికీ ఆ స్టేట్ మెంట్ చూసేసరికి అమితమయిన ఆనందం కలిగింది.

 

    "ఆయన చెప్పిన మాట నిజమే! ఈ లారీల్లో ఎవరూ ప్రయాణం చేయకపోతే ప్రమాదాల్లో ఎవరూ చనిపోరు కదా!" అన్నాడు రంగారెడ్డి సపోర్ట్ చేస్తూ.

 

    "అవును! నన్నడిగితే ప్రయాణీకులను తీసుకెళ్ళే లారీ డ్రైవర్ లను షూట్ చేయాలి" అన్నాడు శాయిరామ్.

 

    "అసలు పల్లెటూళ్ళల్లోని ప్రజలందరినీ ఎడ్యుకేట్ చేయాలి. లారీల్లోనూ, ఇతర ప్రైవేట్ వాహనాల్లోనూ ప్రయనించటం వల్ల ప్రాణాలు పోగొట్టుకునే ప్రమాదం ఉందని వారందరికీ మనం వివరంగా చెప్పాలి!" అన్నాడు చంద్రకాంత్.

 

    "అంటే మనందరం అదో సోషల్ సర్వీస్ లాగా చేపట్టాల్సిన కార్యక్రమం అవుతుందన్న మాట!" అన్నాడు జనార్థన్ సైడ్ ఫోజిచ్చి ఓ చేయి గోడమీద ఆనిస్తూ.

 

    "మన ఆర్టీసీ ఎమ్ డీగారు పాపం ప్రజల ప్రాణాల గురించి అంత ఓవర్ గా జాలి పడుతూన్నప్పుడు, మన వంతు కర్తవ్యం మనం కూడా నెరవేర్చాలి కదా!" అంది డిటెక్టివ్ రచయిత్రి రాజేశ్వరీదేవి.

 

    "అంటే మన కాలనీ వాళ్ళందరం కలసి మన రాజధాని చుట్టుపక్కలున్న ఊళ్ళకెళ్ళి మన ఆర్టీసీ చైర్ మెన్ దొరగారి మనోవేదననూ, ప్రజలు పాటించాల్సిన జాగ్రత్తలు గురించీ- అందరికీ చెప్పగలుగుతే మనవంతు కర్తవ్యాన్ని మనం నెరవేర్చిన వారిమవుతాం!" అన్నాడు గోపాల్రావ్.

 

    ఆ తరువాత ఆదివారంనాడే ఆ కార్యక్రమాన్ని చేపట్టాలని పార్వతీదేవి సూచించింది.

 

    అందరం ఆ సూచనను అంగీకరించాం!

 

    ఆరోజు తెల్లారుజామునే నిద్రలేచి ఆడామగా కలసి ఓ పదిమంది సోషల్ సర్వీస్ కోసం బయల్దేరాం.

 

    బస్ డిపో చేరుకోగానే ప్లాట్ ఫారం మీద బస్ సిద్ధంగా కనిపించింది. అందరం ఆనందంగా ఆ ఎర్రబస్ లో కూర్చున్నాం.

 

    "చూశారా! మన ఆర్టీసీ ఎంత అభివృద్ధి అయిందో! పాసింజర్ బస్ లు, లగ్జరీ బస్ లు, సెమీ లగ్జరీ బస్ లు- ఎలా కిటకిట లాడిపోతున్నాయో!" అన్నాడు రంగారెడ్డి ఆనందంగా.

 

    "అవును! ఇంత అద్భుతమయిన బస్ సర్వీస్ పెట్టుకుని ఆ ఊరోళ్ళు లారీలూ ఎందుకెక్కుతారు నాకర్థం కావటం లేదు" అన్నాడు శాయిరామ్.

 

    అందరం కాసేపు భారత ప్రజల అజ్ఞానం గురించి మాట్లాడుకున్నాం.

 

    "నిజానికి మన బస్ ళు మనదేశంలోనే మొదటి బహుమతిని పొందాయ్!" అన్నాడు చంద్రకాంత్. "మిగతా రాష్ట్రాల బస్ లన్నీ మన తెలుసు బస్ లముందు బలాదూర్ అట" అన్నాడతను.

 

    మన ఏపీఎస్ ఆర్టీసీకి ఎన్టీఆర్ టైమ్ లో వరుసగా రెండేళ్ళు నేషనల్ అవార్డు రావటం మాకందరికీ గుర్తువచ్చింది.

 

    "మనదేశంలో ఏమిటి నీ తలకాయ? ఆసియాలోనే బెస్ట్ సర్వీస్ అట మనది! మొన్న ఉప్పల్ డిపో కండక్టర్ చెప్పాడు. పైగా అతను అల్లాటప్పా కండక్టరేం కాదు. నా ఫాన్! మొత్తం వరల్డ్ లోని బస్ సర్వీసెస్ గురించి టెరిఫిక్ నాలెడ్జ్ ఉందతనికి! అతనే కాదు. సాధారణంగా నా ఫాన్స్ అసోసియేషన్ వాళ్ళందరూ అంతే! చాలా క్లాస్ ఆడియెన్స్" అంటూ జనార్ధన్ ఇంకా చాలా చెప్పబోయాడుగానీ చప్పున అతనిని కట్ చేసేశాడు శాయిరామ్.

 

    మా బస్ అగిడిపల్లి చేరుకుంది.

 

    దిగి ఊళ్ళోకి నడిచాం అందరం. ఆ ఊరి సర్పంచ్ మమ్మల్నందరినీ చూసి ఆప్యాయంగా ఆహ్వానించాడు.మా అందరికీ క్షణాల్లో 'చాయ్' సప్లయ్ చేయించాడు. ఊరివాళ్ళందరూ మా చుట్టూ మూగారు ఆసక్తిగా.

 

    మాకు వాళ్ళ వినయం, విధేయత చాలా ఆనందం కలిగించినయ్.

 

    "పాపం! కపటం, కల్మషం లేని ప్రజలంటే కేవలం ఈ విలేజర్సే" అన్నాడు గోపాల్రావ్.

 

    మేము వెంటనే మా ప్రచారం ప్రారంభించాం.  

 

    ఆర్టీసీబస్ లు మాత్రమే వాళ్ళందరూ ఎక్కాలనీ, లారీలు, ఇతర ప్రైవేట్ వెహికల్స్ ఎక్కితే ప్రమాదానికి గురి అయి ఎగిరిపోతారనీ-

 

    "అదిగో చెప్పకపోతిరి? మీరు బాంకోళ్ళు కాదా?" అనడిగాడు సర్పంచ్ దెబ్బతిన్న ఫీలింగ్ తో.

 Previous Page Next Page