Previous Page Next Page 
హ్యూమరాలజీ - 3 పేజి 7

                                 


    "నీ డ్యూటీలు రోజూ చేసేది వాడే కదయ్యా- ఇవాళ పర్మిషనెందుకు ప్రత్యేకంగా?"

 

    "ఎందుకంటే- నిన్న వాడి పొరబాటువల్లే కదా- ఆ వాయుదూత్ ముక్కలయింది. అందుకని వాడిని కోప్పడ్డారట ఎంక్వయిరీలో! వాడికి కోపం వచ్చింది. మీరు వప్పుకుంటేగానీ చేయనంటున్నాడు."

 

    "సరే- మాట్లాడమను వాడిని"

 

    "హల్లో అంగముత్తూ ఏం ఫర్లేదులే! ఇవాళ ప్లేన్లు పడినా నిన్నే మీ అనంగానీ- కొంచెం చూస్కో- మన రాజ్ సింగ్ స్టేషన్ కు వెళ్ళి వచ్చేవరకూ-"

 

    ఫోన్ పెట్టేశాడతను.

 

    అప్పుడే మళ్ళీ పైలట్ ఇంకో వ్యక్తితో పాటు హడావుడిగా వచ్చాడు.

 

    "సార్- ఈ మీటియోరోలాజికల్ వాళ్ళ వెదర్ రిపోర్ట్ మీద నిన్నటి తారీఖుంది- అదేమంటే ఇష్టమయితే తీసుకో- లేకపోతే పొమ్మంటున్నాడు. పదిహేను రోజుల్నుంచీ ఇదే రిపోర్ట్ ఇస్తున్నాడు."

 

    వెదర్ రిపోర్ట్ తెచ్చిన అధికారి కస్సుమంటూ లేచాడు.

 

    "వెదర్ నిన్నటి వెదర్ లాగానే వుందయ్యా! అసలు పదిహేను రోజుల్నుంచీ మారటం లేదది! నేనేం చేయను? అందుకని అదే ఇచ్చాను కావాలంటే డేట్ మార్చి రాస్తాను ఇటివ్వు"

 

    అవతల ఏరోడ్రోమ్ అంతా మంచుపట్టి భీకరంగా వుంటే వెదర్ క్లియర్ అని ఎలా రాస్తావయ్యా!"

 

    "నువ్వెక్కడో పిచ్చాడిలాగున్నావే యాక్చువల్ వెదర్ కీ, వెదర్ రిపోర్టుకీ సంబంధం ఎందుకుంటుందయ్యా! దాని దారిదాంన్దే! కావాలంటే ఇవాల్టికి నా బైనాక్యులర్స్ ఇస్తానుగానీ- ఈ రిపోర్ట్ తీసుకుని సంతకం చెయ్! రేపు కావాలంటే వెదర్ రిపోర్ట్ మారుస్తాను."

 

    ఆ అధికారి ఇద్దరికీ సర్దిచెప్పాడు.

 

    "ఇవాల్టికి పోనీవయ్యా! రేపట్నుంచీ రోజుకోరకంగా మార్చి వెదర్ రిపోర్ట్ ఇస్తానంటున్నాడుగా"

 

    పైలట్ గొణుక్కుంటూ సంతకం చేసి వెదర్ అధికారి మెడలోని బైనాక్యులర్స్ తీసుకుని వెళ్ళిపోయాడు.

 

    సరిగ్గా అప్పుడె వెల్డింగ్ మిషన్ తో ఓ వ్యక్తి వచ్చాడక్కడికి.

 

    "ఏం సార్! మొత్తం ఒక సైడ్ రెక్కంతా వెల్డింగ్ చేసినా ఆర్రూపాయలేనా సార్! ఇదే నేను బస్ కి చేస్తే అరవై రూపాయలు చార్జ్ చేస్తాన్సార్!"

 

    "మరి ముందు ఆర్రూపాయలు అన్నావ్ కదయ్యా!"

 

    "రెక్క చివర్లో కొంచెం వెల్డింగ్ అంటే నిజంగా కొంచెమే అనుకున్నాను సార్! తీరా చూస్తే మొత్తం విరిగి వేలాడుతోంది. అందుకని స్ట్రాంగ్ గా వెల్డింగ్ చేసి పారేశాను. మద్రాస్ చేరేవరకూ ఊడదది! కావాలంటే చూస్కోండి"

 

    "సరే ఇంతకూ ఇప్పుడెంతిమ్మంటావ్!"

 

    "నలభై రూపాయలివ్వండి"

 

    "అంత డబ్బిస్తే రేపు మాకు ఆడిట్ అబ్జెక్షన్ వస్తుందిరా!"

 

    "అయితే ఓ పని చేయండి సార్! ఈడు మా చిన్నమ్మ కొడుకు. వెల్డింగ్, ఫిట్టర్ పనులు జబర్దస్త్ చేస్తాడు. జర ఈడిని మీ ఇండియన్ ఎయిర్ లైన్స్ లో ఇంజనీర్ గా ఉద్యోగంలోకి తీసుకోండి. మీ దగ్గర ఇంజనీర్లు షార్టున్నారని 'ఇండియా టుడే' లో రాశారు కదా"

 

    ఎయిర్ పోర్ట్ అధికారి ఓ క్షణం ఆలోచించాడు.

 

    "అచ్చా! సరే- ఇప్పుడే పనిలో చేరమను"

 

    వాడి తమ్ముడు ఆనందంగా సెల్యూట్ కొట్టాడు.

 

    "వెళ్ళరా! ఆ మూల రూమ్ లోకెళ్ళి నేను చెప్పానని చెప్పి ఇంజనీర్ డ్రస్ వేసుకో పో."

 

    "సరిగ్గా అప్పుడే ఎనౌన్స్ మెంట్ ప్రారంభమయింది. మద్రాస్ ప్రయాణీకులు సెక్యూరిటీ చెక్ కెళ్ళాలని!

 

    రంగారెడ్డి కెవ్వున కేకవేసి ఎయిర్ పోర్ట్ బయటకు పరుగెత్తడం ప్రారంభించాడు.

 

    అందరం అతని వెనుక పడ్డాం!

 

    అప్పుడు మెలకువ వచ్చింది నాకు. గుండె వేగంగా కొట్టుకుంటోంది. బయట రంగారెడ్డి గొంతు గట్టిగా వినబడుతోంది. ఓరినీ! ఇదంతా కలా?"

 

    లేచి వాళ్ళింటివేపు నడిచాను. అప్పటికే టైమ అయిదవుతోంది. అచ్చం నాకు వచ్చిన కలలాంటిదే తనకూ వచ్చినట్లుంది. అంతా వర్ణించి అందరికీ చెపుతున్నాడతను.

 

    అందరం అతనికి ధైర్యం చెప్పి ఎయిర్ పోర్టుకి బయల్దేరదీశాము.

 

    సెక్యూరిటీ చెక్ ఎనౌన్స్ మెంట్ కోసం ఎదురు చూస్తూండగా వినిపించింది ఎనౌన్స్ మెంట్.

 

    "మద్రాస్ ఫ్లైట్ తాలూకూ లాండింగ్ గేర్ జామ్ అయిపోవడం వల్ల బాంబే నుంచి ఇంజనీర్స్ వచ్చి రిపేర్ చేయవలసి వుంది. అంచేత ఈ ప్లైట్ రాత్రి ఎనిమిది గంటలకు బయల్దేరును. ప్రయాణీకులు తను లంచ్ కూపన్స్ కౌంటర్ దగ్గర కలెక్ట్ చేసుకోవచ్చును."

 

    రెడ్డి ముఖంలో భయం స్పష్టంగా కనిపించసాగింది. కాళ్ళూ చేతులూ వణుకుతున్నాయ్?


                  


    "చూశారా! అదృష్టం మనయందుండబట్టే లాండింగ్ గేర్ ఇక్కడే జామ్ అయింది. ఇదే ఆకాశంలో వుండగా ఫెయిలయితే ఏమయిపోయుండేవాడిని" అన్నాడు గాబరాగా.

 

    "పద మళ్ళీ సాయంత్రం ఎనిమిదింటికి వద్దాం" అన్నాడు శాయిరామ్.

 

    "ఊహూ! వద్దు బ్రదర్! నేనసలు విమానంలో మద్రాస్ వెళ్ళను. నాకు ఇంకొన్ని రోజులు బ్రతకాలని వుంది" అంటూ కౌంటర్ దగ్గర కెళ్ళి టికెట్ కేన్సిల్ చేసుకున్నాడు.

 

    అందరం అతనిని వెంబడించాం ఇంక చేసేదేమీలేక.


                                  *  *  *  *  *

 Previous Page Next Page