మన పూర్వీకులు ఎంత ముందుచూపుతో ఈ కట్టుబాట్లని పెట్టారో వివరిస్తుంది. మనసు చలించకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి చెబుతుంది.
సంవత్సరం శిక్షణ పూర్తికాగానే వీళ్ళను పంపించివేస్తుంది. వెళ్ళిన వాళ్ళు తమ తమ గ్రామాల్లో విడిగా వుంటూ సనాతన ధర్మాల్ని ప్రచారం చేస్తూ శేషజీవితాన్ని గడపాలని బోధిస్తుంది.
ఇప్పటివరకు వెళ్ళిన స్త్రీలంతా అలానే చూస్తున్నారు. ఇప్పటివరకు ఆమె శిక్షణలో వున్న ఏ స్త్రీ కూడా తిరిగి భౌతిక బంధనాల్లో చిక్కుకు పోలేదు.
విమలాబాయి అలాంటి శిక్షణ ఇస్తుంది. మాస్ హిప్నటైజ్ చేసినట్లు తను చెప్పినవాటినే వాళ్ళు ఆచరించేటట్లు చేస్తుంది.
అందుకే చాలామంది తమ అమ్మాయిల్ని అక్కడికి పంపించేందుకు ఇష్టపడతారు.
ప్రస్తుతం ఇరవై నాలుగుమంది అమ్మాయిలున్నారు అక్కడ. వీళ్ళను సంవత్సరం క్రితం అనాథ మహిళా సదన్ లో చేర్చుకున్న రోజు సాయంకాలం విమలాబాయి ప్రసంగించింది.
"మీ పూర్వజన్మ పాపపుణ్యాల వల్ల మీరు ఇప్పుడు వితంతువులయ్యారు. స్త్రీ జీవితం పూలమొక్కలాంటిది. దానికి ఎవరో నీళ్ళు పోయాలి. చుట్టూ కంచె కట్టాలి. పూలతీగెలు అల్లుకోవడానికి ఓ ఆలంబనను ఏర్పాటు చేయాలి. ఇవన్నీ స్త్రీ యవ్వనంలో వున్నప్పుడు భర్త చేయాలి. కానీ అలంటి భర్తే పోయాడు. అందుకే పూలతీగ పుష్పించదు.
కానీ మిమ్మల్ని మీ చుట్టూ వున్న ప్రపంచం ఊరుకోనివ్వదు. భర్తపోతే మళ్ళీ పెళ్ళి చేసుకోవడంలో తప్పు లేదంటుంది. బతికుండగానే భర్తల్ని వదిలేసే పాశ్చాత్య దేశాల్లోని నాగరికతను వర్ణిస్తారు. వాళ్ళెంత దుఃఖంలో వున్నారో ఆలోచించారా?
ఆ దేశాల్లోని స్త్రీలలో వున్న అభద్రతా భావం, అశాంతి మన స్త్రీలలో లేదు. కారణం మన వ్యవస్థ. దీన్ని మనం కాపాడుకోవాలి.
దురదృష్టం అనండి, ఖర్మ అనండి - మీరు భర్తను పోగొట్టుకున్నారు. ఇక మీ వ్యాపకమంతా ఈ వ్యవస్థను కాపాడడమే. మాటలు చెబితే ఎవరూ వినరు. మనం ఏం చెబుతామో వాటిని మనం ఆచరించాలి. వాటిని ఆచరించాలంటే ముందుగా దేహాభిమానాన్ని వదులుకోవాలి. ఐహిక సుఖాలకు దూరంగా వుండాలి. నిర్మలహృదయులై వుండాలి. అదిగో ఆ దృఢచిత్తాన్ని మీకు యివ్వడానికే ఈ శిక్షణ."
అలా వాళ్ళ శిక్షణ ప్రారంభమైంది.
నిద్ర లేవగానే వాళ్ళు అదే ఆవరణలో ఓ పక్కగా వున్న బావి దగ్గరికి వెళ్ళారు.
మౌనిక అప్పటికే అక్కడ స్నానం చేస్తోంది. స్నానం అంటే చన్నీళ్ళు తోడి పోసుకోవడం. సబ్బు రుద్దుకోవడం అక్కడ నిషేధం. పీచుతో మాత్రం ఒళ్ళు శుభ్రం చేసుకోవచ్చు.
ఆమెకి పాతికేళ్ళుంటాయి.
వెండిపళ్ళెంలోని మల్లెపూల దండలా తెల్లటి బట్టల్లో ఎంతో అందంగా వుందామె. సంవత్సరం నుంచి మితాహారం భుజిస్తున్నా అదేం విచిత్రమోగాని ఆమె శరీరం మాత్రం లెక్క ప్రకారం ఒంపులు తిరిగింది.
ఆమె కళ్ళు మూసుకుని బక్కెటెడు నీళ్లు చివరిసారిగా ఒంటిమీద పోసుకుంది.
చలిగాలి - పైగా చన్నీటి స్నానం - కానీ ఆమె ముఖకవళికలు మారలేదు. శరీరం మీద అగ్గులు పడ్డా, ఆమె చలించదనిపించింది. ఆమె అంతగా తన శరీరాన్ని, మనసునీ కంట్రోల్ లో వుంచుకుంది.
అందుకే విమలాబాయికి ఆమె ప్రధమ శిష్యురాలు. అనాథ మహిళా సదన్ కి ఇన్ చార్జ్.
ఆమెను చూడగానే మిగిలిన అమ్మాయిలంతా నమస్కారం చేశారు. అంతే తప్ప ఉబుసుపోని కబుర్లు ప్రారంభించలేదు. అక్కడ వున్నవాళ్లు మరీ అవసరమైతే తప్ప మాట్లాడుకోరు.
మౌనిక స్నానం ముగించుకుని తన గదిలోకి వచ్చింది. ఒక్కో క్వార్టర్స్ లో రెండు గదులుంటాయి. ఒక్కో గదిని ఒక్కో అమ్మాయికి కేటాయిస్తారు.
ఆమె గది నెంబర్ ఒకటి.
రూమ్ లో కొచ్చాక తడిబట్టల్ని విప్పి, పొడిబట్టల్ని కట్టుకుంది. తెల్లటి కాటన్ చీర, తెల్లటి జాకెట్టు. అవి తప్ప లోదుస్తుల్ని ఎవరూ వేసుకోకూడదు. తల దువ్వుకుని వదులుగా జడ వేసుకుంది. నుదుటున విబూదిని చిన్న గీతలాగా పెట్టుకుంది. పౌడర్, స్నో, తిలకంలాంటివి దగ్గరకు చేర్చకూడదు.
మౌనిక అద్దంలో ఓసారి తన ముఖాన్ని చూసుకుని బయల్దేరింది. ఆమె రోడ్డంట నడిచి గేటు తీసుకుని సభామందిరానికి చేరుకుంది.
నలుగురు వృద్ధులు సభా మందిరాన్ని ఊడుస్తున్నారు. అక్కడ పనులన్నీ వృద్ధుల్లో బలిష్టంగా వున్న వాళ్లు చేస్తారు. తోటపని నుంచి, సెంట్రీ పనుల వరకు వాళ్ళనే వినియోగిస్తారు. వంట, వడ్డన కూడా వాళ్ళే చూసుకుంటారు.
అప్పటికింకా అమ్మాయిలు ఎవరూ రాకపోవడంతో మౌనిక వరండాలోకి వచ్చింది.
అక్కడక్కడ వాతావరణం అద్భుతంగా వుంది. తమకంటే ముందే నిద్ర లేచిన పక్షుల్ని చూసి సిగ్గుపడుతున్నట్లు చెట్లు తమ రెమ్మల్ని కిందకు వాల్చేశాయి. పక్కనే వున్న పచ్చటి కొండ మౌనవ్రతం పాటిస్తున్నట్లు నిశ్చలంగా వుంది.
ఆకాశాన్ని శుభ్రంచేయడానికి వెళుతున్నట్లు పక్షులు బయలుదేరి వెళుతున్నాయి.
అమ్మాయిలు ఒక్కొక్కరే సభామందిరానికి రావడం ప్రారంభించారు.
ఖచ్చితంగా ఆరుగంటలకు ధ్యానం మొదలైంది. మనసును నిశ్చలంగా వుంచుకోవడానికి ధ్యానం వుపయోగపడుతుందని విమలాబాయి నమ్మకం. మనసును స్వచ్ఛంగా వుంచుకోవడానికి, శరీరాన్ని తన కంట్రోల్ లో వుంచుకోవడానికి ఇది దోహదం చేస్తుంది.
ఎనిమిది గంటలకు ధ్యానం ముగిసింది.
అమ్మాయిలంతా తిరిగి తమ గదులకి వచ్చి తొమ్మిది గంటలకు భోజనశాలకు వెళ్ళారు.
భోజనశాలలో పనిచేసే వృద్ధులు వీరికోసమే చూస్తున్నారు. అమ్మాయిలంతా అక్కడున్న సిమెంటు చప్టాలమీద కూర్చున్నారు. ఇరవై నాలుగుమంది ఆడపిల్లలున్నా అక్కడ నిశ్శబ్దం తాండవిస్తోంది. మరీ అవసరమైతే తప్ప ఎవరూ మాట్లాడుకోరు.
వృద్ధులు వాళ్ళకి విస్తర్లు వేశారు. చిన్న గిన్నె నిండా పొంగలి వడ్డించారు. అందులో కలుపుకోవడానికి సాంబారు పోశారు.
వృద్ధులు ఎంతయినా తినచ్చుగానీ వీళ్ళు మాత్రం మితాహారం తినాలి. అన్నిటినీ కొలత ప్రకారం వడ్డిస్తారు. శరీరం పుష్టిగా వుంటే కోరికలు కలుగుతాయని విమలాబాయి భావిస్తోంది. అందుకే మితాహారం తినమంటుంది. అందులోనూ సాత్విక ఆహారం. ఉప్పు, కారం వేయకుండా కూరలకు వేసినట్లు ఎందులోనూ సరిపడేంత కారం, ఉప్పు ఉండవు.