దట్టమైన పొగమంచు మడికేరీ పర్వత శ్రేణుల నుంచి అదృశ్యమైపోయింది.
రాత్రంతా పొగమంచులో స్నానం చేసినట్లు గెస్ట్ హౌస్ ముందున్న పూల మొక్కలు, లాన్, ఫ్లవర్ బోర్డర్స్ తొలి సంధ్య కిరణాల వెలుగులో మెరిసిపోతున్నాయి. ఆరోగ్యంగా, ఉత్సాహంగా చిరుగాలికి తలలూపుతున్నాయి.
అక్కడక్కడా విసిరేసినట్లున్న ఇళ్ళ కప్పుల్లోంచి తొంగిచూసే ఫైర్ ప్లేస్ పొగగొట్టాల్లోంచి తెల్లటి పొగ బయటకు వచ్చి అదృశ్యమైపోతోంది.
జన సంచారం మొదలయింది.
"ఏమిటి మీరింకా బయలుదేరలేదా? విరాజ్ పేట వెళ్ళాలి. అక్కడికి దగ్గర్లో వున్న కేరళ బోర్డర్ దాకా వెళ్ళి రావాలని ప్లాన్ చేసారు. త్వరగా బయలుదేరండి" అంటూ ఓ విద్యార్ధి దగ్గరగా వేసి వున్న వారి గది తలుపుల్ని లోపలకు నెట్టి అన్నాడు.
మేరీ, సుధారాణి లేచారు.
వచ్చిన విద్యార్ధి వెళ్ళిపోయాడు మిగతావార్ని లేపేందుకు.
"మీరన్నట్లు మధు తన పశుత్వం ద్వారానే నన్ను లొంగదీసుకోవాలనుకున్నా, అతన్ని నేను గెలవనివ్వను. ఆత్మాభిమానంతో, అభిజాత్యంతో, నాకున్న తెలివితేటల పరిధిలో ఓడించి తీరతాను. ఇట్స్ ఏ ఛాలెంజ్ - మీ శరీరాలు మీ మనస్సును శాసిస్తాయి కాని నా విషయంలో నా మనస్సు నా శరీరాన్ని శాసిస్తుంది..." అంటూ మహతి వడివడిగా బాత్ రూంకేసి సాగిపోయింది.
ఆ ఇద్దరూ మహతి ఆత్మస్థయిర్యానికి, ధైర్యానికి నిశ్చేష్టులయిపోయారు.
* * * * *
"మోస్ట్ సక్సెస్ ఫుల్ సింగర్, అందాల సామ్రాజ్ఞి మడోన, వింబుల్ డన్ ఛాంపియన్స్ స్టెఫీగ్రాఫ్, మోనికా సెలస్, పొటెన్షియల్ సినీ ఆర్టిస్ట్స్ మెరిల్ స్ట్రీప్, జేన్ పోండా, బోడె రెక్, లిండా బ్లెయిర్, చివరకు రేఖా, మాధురీదీక్షిత్" లాంటి వాళ్ళు కూడా నీ అపార సంపదను చూసి పరిగెత్తుకొస్తారు.
మహతి మీద నీకున్న ప్రేమ, ఇష్టం , ఆరాధనా వార్ని రప్పించగాలదా? లేదు.
అందుకే భాయ్... మనిషిని బ్రతికించేది, బ్రతికించాల్సింది ప్రేమ కాదు డబ్బు... ఆరాధనా కాదు అపార సంపద. మ్యాడ్ గా తయారవ్వకు. పిచ్చి ప్రేమలో పడి ఎన్ని తరాలు తిన్నా, వృధా చేసినా తరగని సంపదని ఒదులుకోకు. మహతి కంటే అందగత్తెలు ఈ ప్రపంచంలో లేరనా నీ ఉద్దేశ్యం? ఐ యామ్ సారీ... అదే నీ ఉద్దేశమైతే, దానితో నేను ఏకీభవించను... ఆ పైన నీ ఇష్టం" ఓ ఫైవ్ స్టార్ హోటల్ బార్ లో కూర్చున్న మధుకర్, అతని ఫ్రెండ్ మూర్తికి మధ్య సంభాషణ నడుస్తోంది.
బార్ లో జనం పల్చగా వున్నారు.
బార్ సెంట్రల్ ఎయిర్ కండిషన్డ్ ద్వారా నియంత్రించిన వాతావరణం చల్లగా, ఆహ్లాదంగా వుంది.
కాని మధుకర్ కి మెదడు వేడెక్కి పోతోంది. జేబులో పైసా లేకుండా వచ్చినా అతని ఫ్రెండ్ మూర్తికి ఆ అనుభూతి రెట్టింపు తృప్తిని, ఆనందాన్ని ఇస్తోంది.
"నీకు మరీ అంతగా కోరికగా వుంటే చెప్పు... ఆమెను నీ చెంతకు చేర్చే పథకం ఆలోచిస్తాను. ఒంటరి మహతిని అనుభవించు. నీ కళ్ళతో ఆమెలోని ప్రతి అణువును చూడు. ఏమీ మిగలకుండా చూసుకో. అప్పుడు నీకు తెలీని, నీవు చూడని, నువ్వు అనుభవించని అందం, ఆమెలో ఏమీ లేదన్న తృప్తీ, గర్వం దక్కుతాయి.
అక్కడికి ఒక ట్రాన్సాక్షన్ ఫినిష్ అవుతుంది. నీ సంపదా నీకు మిగులుతుంది. నీ తల్లిదండ్రుల ప్రేమాభిమానాల్ని ఎప్పటిలాగే మిగుల్చుకోగలవు.
వ్రతం చెడ్డా ఫలితం దక్కుతుంది.
మరో పెగ్ తీసుకో ధైర్యం వస్తుంది.
కోర్కె తీర్చుకో, మోజు తీరిపోతుంది.
ఆపైన ఆమెను మర్చిపో, ఆస్థి దక్కుతుంది" మధుకర్ గ్లాసులోకి ఇంపోర్టెడ్ విస్కీ వంపుతూ అన్నాడు మూర్తి.
క్రమంగా నరాల్లో చైతన్యం, ఉత్సాహాన్ని తాత్కాలికంగా నింపే స్కాచ్ విస్కీ మధుకర్ ని వశపర్చుకుంటోంది.
"చూసావా... ఈ బార్ వాళ్ళు ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారో...?" మూర్తి కావాలనే రెచ్చగొట్టాడు.
అసలే మహతి విషయంలో అవుటాఫ్ మూడ్ లో వున్న మధుకర్ ఇన్ స్టెంట్ గానే రియాక్టు అయ్యాడు.
చెట్టుపై ఉన్న వృద్ధురాలైన గ్రద్ధ తన పిల్లల్ని రక్షించుకోవటం కోసం అంతఃపురానికి వెళ్ళి నగ దొంగతనం చేసి, రాజభటులకు తన గమనం తెలిసేలా చేసి, చెట్టుక్రింద వున్న పుట్టలో జారవిడిచి, తన శతృవుకన్నా బలమైన శక్తిని శతృవుకి చేసి తన బిడ్డల్ని కాపాడుకుంది.
అది అనివార్యమైన న్యాయం....
తన అస్థిత్వం కోసం పన్నిన పథకం...
హర్షణీయం అది.
ఇంగిత జ్ఞానం, బుద్ధి, మేధస్సు, తెలివితేటలు లేని గ్రద్ధ న్యాయ నిబద్ధతకు లోబడింది. కాని మనిషి... తనలోని ఈగోని, స్వార్థాన్ని, కుచ్ఛితాన్ని సంతృప్తి పర్చుకోవటం కోసం ఆ సూత్రాన్నే అమలుపరచి అక్రమ పద్ధతినే జీవన విధానంగా మార్చుకుంటున్నాడు.
ఒకప్పుడు మూర్తి అదే బార్ కి వచ్చినప్పుడు జేబుని మర్చిపోయి తాగిన ఫలితంగా తన వాచీని ఆ బార్ లో తాకట్టుపెట్టి వెళ్ళవలసి వచ్చింది. ఆ కసిని తన బలమైన మిత్రుడ్ని తను శతృవుగా భావిస్తున్న బార్ యజమానికి శతృవుని చేసి తన కసిని తీర్చుకొనేందుకు తెలివిగా ఎదుటి వ్యక్తి బలహీనత మీద ఆడుకున్నాడు. తను బలహీనతల మీద ఆడుకునేందుకు తెలిసి తెలిసి కూడా అవకాశం ఇచ్చే వెర్రిబాగులవాళ్ళు జమిలీగా ఎప్పుడూ తగులుతూనే వుంటారు ఈ ప్రపంచంలో. నోరులేని జంతువులు తమ ఆకలిని తీర్చుకోవటం కోసం, తమ ప్రాణాల్ని రక్షించుకోవటం కోసం మాత్రమే ప్రయత్నిస్తాయి.
మనిషి స్వార్థానికి, కుటిలత్వానికి, కుచ్ఛితానికి ప్రతిసారీ ప్రాణం తీసేందుకై ప్రయత్నిస్తాడు.
"ఆఫ్ట్రాల్. ఈ బార్ ఎంత...? వీడి బ్రతుకెంత...? డి గ్రేట్ ఇండస్ట్రియలిస్ట్ రాఘవేంద్రనాయుడుగారి ఏకైక వారసుడ్నని మర్చిపోతే ఫలితం అనుభవిస్తాడు. అరేయ్... ఎవర్రాక్కడ?" కళ్ళు కోపంతో ఎర్రబడుతుండగా అరిచాడు మధుకర్.
బార్ లో అటూ, ఇటూ తిరుగుతున్న స్టీవర్డ్స్ లో మధుకర్ పిలుపు గగుర్పాటుని కలిగించింది.
వెంటనే వడివడిగా వచ్చాడు.
"ఏరా... లెఖ్ఖలేదా...? ఏం సర్వీసురా ఇది....?" తూలుతూ లేస్తూ ఒక స్టీవర్డ్ చొక్కా పట్టుకుని ప్రశ్నించాడు మధుకర్.
అతను క్షణకాలం బిత్తరపోయాడు.
ఆపైన మూర్తికేసి చూసి విషయాన్ని అర్థం చేసుకున్నాడు.
నీ నిర్వాకమా బాబు అన్నట్లు నిరసనగా చూసాడు.
"యూ నో మై ఫాదర్...?" మధుకర్ తిరిగి అరిచాడు.
తెలీదన్నట్లు ఆ స్టీవర్డ్ తలని అడ్డంగా ఆడించాడు.
అంతలో బార్ మేనేజర్ కి విషయం తెలిసి నలుగురైదుగుర్ని తీసుకొని అటుకేసి బయలుదేరాడు వేగంగా.