రోజులు నెమ్మదిగా గడుస్తున్నాయి.
అచ్యుతానికి ఎంతో దూరంగా వుండాలనుకొంటూంది శంకరి. కాని వుండలేకపోతూంది. అతడి అమాయకత, చిన్న బాధకుకూడా తట్టుకోలేని సున్నిత మనస్తత్వం శంకరి మనసులో అతడిపట్ల చెప్పలేనంత కరుణ వర్షం కురిపించేట్టు చేస్తున్నాయి.
జయలక్ష్మికి అతడంటే చెప్పలేనంత చులకన. తమ ఇంట్లో వెట్టికిపడి తింటున్నాడని అతడిని ఓ నౌకరులాచూసి పనులు పురమాయించేది. శ్రమతో కూడుకొన్నదయినా పళ్ల బిగువున చేసేవాడు అచ్యుతం. బాధనంతనీ మనసులో బిగబట్టి మామూలుగా వుండడానికి ప్రయత్నించేవాడు. కాని, అతడి బాధంతా శంకరికి తెలిసిపోతూనే వుండేది.
ఆచారికి ఆ ఇంట్లో విషయాలేవీ పట్టేవికాదు.
జయలక్ష్మికి కాన్పు దగ్గరపడుతున్న కొద్దీ అసలు మంచం దిగడమే మానేసింది. పనంతా శంకరిదే.
ఆమె పనిభారం తగ్గించేందుకు అచ్యుతం ప్రయత్నించే వాడు.
పురిటికి తీసికెళ్లడానికి పుట్టింటివాళ్లు వస్తే జయలక్ష్మి వెళ్లలేదు. "నేను రావడానికి వీలుకాదు నాన్నగారూ. ఇంట్లో వయసులోవున్న మా విధవాడపడుచుంది. చదువుకోసమంటూ వచ్చిన వయసు పిల్లాడూ వున్నాడు. ఇద్దరికీ మధ్యన ఏదయినా జరిగితే మాకు జరిగే పరువునష్టం ఎవరూ తీర్చలేరు" అని చెప్పింగది.
"కాన్పయితే ఎవరుచేస్తారమ్మా ఇక్కడ?"
"ఉందిగా? ఇంట్లో తేరగా పడితింటున్నది?చెయ్యక ఏం చేస్తుంది?"
"ఆడపడుచుతో చేయించుకుంటే ఆనక మాటలు పడాల్సి వస్తుందమ్మా?"
"పనీ పాట లేకుండా ఊరికే మేపాలేమిటి? ఒళ్ళు క్రొవ్వి ఊరిమీద పడదూ?"
ఆ మాటలు శంకరి వినాలనే అంటూందో, ఊరికే అంటుందో -
శంకరి చెవిలో పడ్డాయి!
ఒకనాడు ఇది తన పుట్టిల్లేమోకాని ఇప్పుడుకాదు!
ప్రస్తుతం తనకీ ఇంటిలో దాసీ హోదా తప్పితే ఇంకేం లేదు.
శంకరి కుమిలిపోతున్నట్టుగా ఆ సాయంత్రం పెరట్లో మల్లెపందిరిక్రింద నిశ్శబ్దంగా కూర్చొంది. కాస్త తీరిక దొరికితేచాలు ఏదో ఒక పుస్తకం పట్టుకొనే ఆమె, ఆరోజు కరభూషణం లేకుండా కూర్చోవడం విస్మయం గొల్పింది అచ్యుతానికి.
శ్లోకం చెప్పించుకునే నెపంతో ఆమె దగ్గరికి వెళ్లాడు.
"ఈ శ్లోకం ఒకసారి చెప్పరా?"
"ఉహు ఈరోజు నా మనసు బాగాలేదు అచ్యుతా!"
"ఏం జరిగిందండీ?"
"........"
"వదినగారు ఏమయినా అన్నారా?"
"ఈరోజు ఒక్కరోజు అంటే పడొచ్చు! కాని, వున్నన్నాళ్లు ఏదోఒకటి ఆవిడ అనడం, నేను పడడం ఎలా కుదురుతుంది? ఈ ఇల్లు విడిచిపెట్టేస్తే తప్ప నేను బ్రతకలేను! అచ్యుతా!"
"ఈ ఇల్లు విడిచి పెట్టేస్తారా? ఎక్కడికి వెడతారు మరి?" దిగులుగా అడిగాడు.