బ్రూయిట్ అనే పదానికి ఈ రాత్రికి అర్ధాన్ని చూసి....రేపటి విషయం నిర్ణయిద్దాం.
పావనికి సాజిత్ అంటే తెలియకుండానే ఒక లైకింగ్ చోటు చేసుకుంది.
"స్లో అండ్ స్టడీ డియర్! ఆల్ దట్ గ్లిట్టర్ ఈజ్ నాట్ గోల్డ్" ఆమె అంతరంగం అరిచింది.
పావని తనను తాను కంట్రోల్ చేసుకుంది.
తిరిగి తన నోడ్ వైపుకు తిరిగి ప్రాక్టీస్ మొదలెట్టింది.
* * * *
పావని తమ మధ్య జరిగినా ఆ టెక్నికల్ సంభాషణను శ్రీనివాస్ క్కూడా చెప్పలేదు. ఎందుకనో చెప్పాలనిపించలేదు.
తను ఇంటికి పోయి ఇంగ్లీషు డిక్షనరీ తీసింది.
'బ్రూయిట్' అంటే హృదయం చేసే వింత స్పందన. శరీరంలో వినిపించే అసాధారణమైన ధ్వని. అందులో టచ్ సాంగ్ ను వినమన్నాడు.
అంటే లవ్ సాంగ్ ను వినమన్నాడు.
పావనికి కాసేపు హృదయం ఆగిపోయినంత పనయింది.
తనంటే సాజిత్ కు అంత లైకింగ్ ఎందుకు ఏర్పడింది. అతని హృదయ స్పందనలో ఓ టచ్ సాంగ్ తన పరంగా వినిపిస్తే....అది నిజమయితే....తను నిజంగా అదృష్టవంతురాలే.
కానీ ప్రపంచం మారుతుంది.
మనుష్యుల కాలిబరీ పెరుగుతుంది.
మోసాలు కూడా హైటెక్ స్థాయికి ఎదిగి, ముందుగా తనలాంటి అమ్మాయిల్ని బలితీసుకుంటే....
తనకంటే మరో దురదృష్టవంతురాలుండదు.
ఆమె అంతరంగంలో ఒక తీయటి అంతర్ మధనం మొదలయింది. ఎప్పటికో ఆమెకు నిద్రపట్టింది.
* * * *
ఉదయం ఎనిమిది గంటలు!
పావని మైమరచి నిద్రపోతోంది. ఆమె తల్లి లలితమ్మ తట్టి లేపింది.
"ఏమిటే ఈరోజింత మొద్దు నిద్ర? రోజూ ఆరింటికి లేచేదానివి?"
పావని బద్దకంగా నిద్రలేచింది.
ఇంటిముందు వేపచెట్టుమీద కోయిల సన్నగా తీస్తున్న కూతలు....అందులో ఏదో 'టచ్ సాంగ్' వినిపిస్తోంది.
"హియర్ మై బ్రూయిట్! ఓన్లీ టచ్ సాంగ్."
నిన్నటి తన టెర్మినల్ స్క్రీన్ మీది అక్షరాలు మరింత అర్ధవంతంగా ఆమెకు కనిపించాయి.
తను మెల్లగా లేచి....బాత్ రూం కెళ్ళి బ్రష్ చేసుకుంటూ ఇంటి ముందున్న వేపచెట్టు క్రింద అటూ ఇటూ తిరుగుతుంది. అది తనకు ఓ హాబీ!
అదే చెట్టుక్రింద కాస్త దూరంగా తన తండ్రి ఆ రోజు పేపరు తిరగేస్తున్నాడు. రోజూ న్యూస్ పేపరు చదువుతూ, తనకు నచ్చని విషయాలు చదివినప్పుడు కోపం తెచ్చుకుంటూ వుండే ఆయన, ఆ సమయంలో చాలా సంతోషంగా ఒక వార్త చదువుతున్నాడు.
ఆయన సంతోషానికి కారణమైన ఆ 'న్యూస్' ఏదో తనకూ తెలుసు కోవాలనిపించింది.
బ్రష్ చేసుకునే పనిని వెంటనే ముగించి, వంటింటిలో తల్లి తయారుచేసిన టీని రెండు కప్పుల్లో తీసుకుని మెల్లగా తనూ తండ్రి దగ్గరకు చేరింది.
"వాట్ డాడీ! ఈ రోజు మీ ముఖంలో ఒక సంతోషం. అంతగా మిమ్మల్ని ఆనందపరచిన ఆ వార్త ఏమిటి?"
ఆయన కుమారువంక చిన్నగా నవ్వుతూ చూసి-
"ఈ మేటర్ తప్పకుండా నీ కథకు వుపయోగపడుతుంది. నీవు వ్రాసే కథల్లో ఇలాంటి హీరోలే వుండాలి.
'నిమ్స్'లో ఎవరో కుర్రడాక్టర్. పేరు సాజిత్! మంచి ఎక్స్ పర్ట్ అట! ఓ పేద విద్యార్ధికి తనే ఖర్చులు భరించి, బ్రెయిన్ లో వున్న 'ట్యూమర్' ఎలాంటి ప్రమాదం లేకుండా తొలగించాలనీ, ఆ ట్యూమర్ చాలా పెద్దదనీ వ్రాశారు. ఆ పేద విద్యార్ధికి ఇతరత్రా అయిన మనీ మొత్తం తనే 'బేర్' చేశాడని వ్రాశారు. అమెరికాలో అయినా వారినందరినీ వదిలి మాతృదేశం సేవకోసం వచ్చిన అరుదైన డాక్టర్ అంటూ ఈ పత్రిక పొగుడుతూ వ్రాసింది.
కానీ అమ్మడూ....ఇలాంటి కుర్రడాక్టర్లకు ఈ పొగడ్త చాలదు. మరేదయినా బహుమతులూ, బిరుదులూ యిచ్చి ఈ జాతి సత్కరించాలి" అన్నాడు.
తండ్రి నోటినుండి ఆ విషయాన్ని విన్న పావని కాసేపు శిలాప్రతిమలా అయిపోయింది.
సాజిత్ లాంటి సిన్సియర్ యంగ్ డాక్టర్ తనమీద ప్రేమ కనపరిస్తే తను తిరస్కరించింది.
అలాంటి వారికి తనను ప్రేమించమని అంచెలవారీగా ఆడపిల్లల వెంటపడటానికీ, ఘర్షణ పడటానికీ, చివరికి సినిమాటిక్ గా ఏకమై డ్యూయెట్ పాడుకోవటానికీ తీరిక వుండదు.
ప్రస్తుతం నడుస్తోంది హైటెక్ యుగం.
మనషికి జీవితంలో ఒక స్పీడ్ కావాలి. అలాంటి వ్యక్తులను ప్రేమిస్తూ కూర్చోవటానికి అసలు వీలుండదు.
బహుశా సాజిత్ తన జీవితంలో మొదటిసారిగా ఇష్టపడి, "నిన్ను అమితంగా ప్రేమించాను" అన్న మొదటి అమ్మాయి తనే అయి వుంటుంది.
తనకు సాజిత్ ను త్వరగా కలుసుకోవాలనే ఆరాటం క్షణ క్షణానికీ అధికమవుతోంది.
ఆయన్ను కలవాలి....
ఏదో 'టచ్ సాంగ్' తనకు వినిపిస్తోంది.
ఈ రోజు సాయంత్రం సాజిత్ 'సాఫ్ట్ వేర్' సైంటిఫిక్ ఇన్ స్టి ట్యూట్ కి వస్తాడో, లేదో!
వస్తానని శ్రీనివాస్ తో చెప్పాడు.
వెళ్ళేటప్పుడు అంత ప్లెజెంట్ గా వెళ్ళలేదు.
తను మరీ మొరటుగా పదాల్ని వాడింది. ఆ స్థాయిలో తను తొందర పడి అనటం జరుగుతుందని ఆయన ఊహించి వుండడు.
ఇప్పుడు తన తండ్రి సాజిత్ గొప్పతనాన్ని పేపరులో చదివి ఎంతగానో మురిసిపోతున్నాడు. అదే సాజిత్ నిన్న సాయంత్రం హైటెక్ ప్రాసెలో 'ప్రేమ' కోసం తన కుమార్తెను అభ్యర్ధించాడని ఆయనకు తెలీదు.
తెలియజేస్తే ఏమంటాడో?
ఒక తండ్రిగా ఎలా స్పందిస్తాడో?
పావని బ్రెయిన్ లో ఒక విచిత్రమైన ఊహ!
తరువాత పావనిలో ఒక ఆరాటం మొదలయింది. తిరిగి సాజిత్ ను తనెప్పుడు చూస్తానా అని.
ఆ రోజు సాయంత్రం ఎప్పుడు వస్తుందా అని....
* * * *
ఆ సాయంత్రం పావని తనకిష్టమైన చీరె కట్టుకుంది. అదే రంగు జాకెట్ వేసుకుంది. షాంపూతో తలంటిన వెంట్రుకల్ని చక్కగా దువ్వుకొని జడ వేసుకుంది. తన జడ గుప్పెడు లావుగా నడుం క్రింధవరకూ సాగి బారుగా వుంది. చాలామంది తన స్నేహితులు తన జుట్టును చూసి అనూయపడతారు.
"ఏదైనా షాంపూ కంపెనీకి తెలియజేయవే- వచ్చి ఇంచక్కా యాడ్ ఫిల్మ్ తీసుకొని నీ చేతిలో కొన్ని వేల రూపాయలు పెట్టి వెళ్తారు" అనేవారు.
నిజంగానే తన జుట్టును చూసుకొని తనే గర్వపడేది.
చెవులకు చేరెడంత రింగులు తన స్టయిల్. అవి తన ముఖానికి మరింతగా అమరి- తన బ్యూటీ యొక్క రిచ్ నెస్ ని తమ తళుకుల్లో తెలియజేస్తాయి.
ముక్కుపుడకలు ఈ రోజుల్లో చాలామంది వాడుతున్నా పావనికి దానిమీద మోజుపోలేదు. దానివల్ల తన ముక్కుకు అందం రావటం అలా వుంచితే- ఆ పుడకవల్ల తన ముక్కుకున్న అందం పోతుందని మానివేసింది. తన కళ్ళు వెడల్పుగా వుంటాయి. ఐబ్రోస్ కీ, ఐబాల్ కీ మధ్య చాలా గాప్ వుంది. ఆ గాప్ వుండటం....కళ్ళకు ఎక్కడలేని అందం వస్తుంది. పెదాలు సన్నగా వుంటాయి. ఎలాంటి లిప్ స్టిక్ వాడకుండానే ఎర్రగా వుంటాయి. తను నవ్వితే తెల్లటి పలువరుస కాంతులు ఎర్రటి పెదాల మధ్యనుండి మరింత ఎల్యూరింగ్ గా కనిపిస్తాయి.
తన శరీరం స్ట్రక్చర్ అంత సన్నమూ కాదు. లావూ కాదు. ఒక పద్దతి ప్రకారం తీర్చిదిద్దినట్టు వుంటుంది. ఒక ప్రసిద్ద చిత్రకారుడు అందమైన స్త్రీ శరీరాన్ని అతి జాగ్రత్తగా కొలతలు తీసుకొని పెయింట్ చేసినట్టు ఆకర్షణీయంగా వుంటుంది.
పావని తనను తాను ఒకసారి తలుచుకొని....
తన అందాన్ని అందంగా అలంకరించుకొని అద్దంముందు నిలబడింది.
వెనుగ్గా తల్లి వచ్చి అడిగింది.
"....ఏవిటే ఎప్పుడూ లేని ఈ సింగారం? ఏదో పేరంటానికి బయలుదేరినట్టు బయలుదేరుతున్నావ్? ఎక్కడయినా ఫంక్షనుందా?"
తల్లి అడిగిన ఆ ప్రశ్నకు పావని చిన్నగా నవ్వింది. తరువాత మనసులో అనుకుంది.
"అవును-ముందు ముందు ఒక ఫంక్షన్ ఈ ఇంటిలో జరగతానికే ఈ సింగారం. ఒక శృంగారభావం అంకురించినందుకే ఈ సింగారం. హైటెక్ మెథడ్స్ లో తన బ్రతుకును బంగారు బాటలోకి మళ్ళించటానికే ఈ సింగారం."
తల్లితో మాత్రం__
"ఫంక్షన్ కాదమ్మా! కంప్యూటర్ మెషీన్ను పద్దతిగా ఫంక్షన్ చేయించటానికే ఈ సింగారం."
'అర్ధమయ్యేట్టు చెప్పవే! చీరె కట్టుకొంటే తప్ప అది పని చేయదా?"
తల్లి మాటలకు పావని కిసుక్కుమని నవ్వింది.