ఉక్రోషం వచ్చింది నాకు "అంత వినకూడని తప్పు మాట నేనేం అనలేదు ఆవిడ ఏమనుకుంటారోనన్న మాట తప్ప. కొత్తగా కాపురానికి వచ్చినదాన్ని, వచ్చీరాగానే నన్ను, నా వాళ్ళని అంటే నా కెంత కష్టంగా ఉంటుంది?" కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి.
ఆయన అదోలా చూసి "ఉన్న మాటేగా అంది" అన్నారు.
"ఏమిటి ఉన్నమాట. పదివేలిచ్చారు మీకు, పెళ్ళి చేశారు. ఇంకా ఇంకా దోచిపెట్టటానికి అక్కడ తరగని సంపాదన లేదు. ఇంకా పిల్లలున్నారు వాళ్ళకి. ఇంకా ఏం పెడ్తారు. పిల్ల సుఖపడ్తుందని నానా యాతన పడి పది వేలిస్తే ఇంకా చాలలేదా మీకు" కోపంగా అన్నాను.
ఆయన నా ఎర్రబడ్డ మొహం చూసి చిరాగ్గా నుదురు చిట్లించి "అంత పెట్టలేనివాళ్ళు, తూగలేని వాళ్ళు ఎందుకు ఎగబడాలి? ఎవరి తాహతుకి తగ్గ సంబంధం వాళ్ళు చూసుకోవాలి. మా వదినవాళ్లు ఎంత బాగా చేశారో తెలుసా? ఇంట్లో అన్ని సామానులు ఇచ్చి పంపారు. మా అక్కకి మేము ఇవ్వలేదూ -" అన్నారు.
ఇంకేం అంటాను!
"అవును నిజమే. మా నాన్నగారికి బుద్ధిలేక అత్యాశకి పోయి తాహతు మరచిపోయారు. మీ తాహతింతటిది అని తెల్సుకోలేక పెద్ద తప్పుచేశారు" నా గొంతు పట్టుకుంది. అప్పుడయినా ఆయన కాస్త సౌమ్యంగా "సరే ఏదో అయింది" అంటూ మాట్లాడితే సంతోషించి మరిచి పోయేదాన్ని.
"మా వాళ్ళందరూ మీ అత్తవారిలా అలా ఏది చెప్పలేదు అంటూంటే మా అన్నయ్య అత్తవారిని పొగుడుతూంటే నాకెంత చిన్నతనంగా ఉందో నీకేం తెలుసు? పెళ్ళిలో మా వాళ్ళందరికీ ఎంతో కోపం వచ్చింది. ముందు తెలిస్తే అసలు చేసుకోక పోయేవాళ్ళం" అన్నాడు.
ఇదీ మా మొదటిరాత్రి సరస సంభాషణ! వింటూ ఆత్మాభిమానం గల పిల్ల సహించ గలదు చెప్పండి?
"హూ! మీరంతా చదువుకున్న వాళ్ళు. సంస్కారులు అని మేమందరం సంతోషించాం. సంబంధం కుదిరాక - కాని మీ ఆధునికత అంతా వేషభాషలలో తప్ప సంస్కారం శూన్యం అని ఇప్పుడర్ధం అయింది" అని జవాబు చెప్పకుండ వుండలేనంత ఆవేశం ముంచెత్తింది నన్ను.
వాళ్ళ సంస్కారాన్ని వేలెత్తిచూపించేసరికి పౌరుషం వచ్చినట్లుంది. "నోర్ముయ్! అంత కట్నం వద్దని చేసుకోడానికి నీవేం రంభలా ఊర్వశిలా వున్నాననుకుంటున్నావా? లోకంలో ఎవరూ చెయ్యని పనులేం చెయ్యలేదే" తీక్షణంగా అన్నాడు.
చాలు - అంతకంటే అవమానం ఏ ఆడపిల్లకీ వుండదు. మొదటి రాత్రి భర్త నోట తను అందంగా లేదనిపించుకోవడంకంటే యింకేం అవమానం కావాలి? నేను రంభలా వుంటే పోనీ అని దయతలచి కట్నం మానేసేవారన్నమాట! ఇలాంటి మనిషితో ఇంకేం మాట్లాడడానికి కనిపించలేదు. అటు తిరిగిపోయాను. నాకు తెలియకుండానే కన్నీటితో తలగడ తడవసాగింది. ఆయన నిశ్చింతగా నిద్రపోతున్నారు. మొదటిరాత్రి దంపతులు నిద్రపోరట! నేనూ ఆ రాత్రి నిద్రపోలేదు!
* * *
"డాక్టర్! మొదటిరాత్రికాదు. మిగతా రాత్రులు యీ ఏణ్ణర్ధం నించి నా ప్రమేయం లేకుండానే, ఏ అనుభూతి లేకుండానే గడిచిపోయాయి.
అత్తవారింటవున్న నాలుగు రోజులు ముళ్ళమీద వున్నట్లే గడిపాను. ఆడపడుచులు నాతో మాట్లాడేవారు కారు. తోడికోడలు ఎప్పుడు నన్ను చూసినా ఏదో హేళన భావం ఆమె కళ్ళల్లో మెదిలేది. అత్తగారు సరేసరి మొహం చిట్లించేది. గృహప్రవేశం కాగానే అక్క వెళ్ళిపోయింది. మాట్లాడేవారులేక వంటరిగా దిగులుగా వుండేది. నాఅంతట నేను ఏదన్నా పని కల్పించి చేద్దామన్నా వంటకి మనిషి- పైపనికి మనిషి అందరూ వున్నారు. ఆడపడుచులతో ఏదన్నా మాట కలపబోతే మాట్లాడుతూ వాళ్ళల్లో వాళ్ళు అదోలా చూసుకోటం వేళాకోళంగా నవ్వుకొంటూ సైగలు చేసుకోడం చూశాక నాకు వాళ్ళతో మాట్లాడడం అంటే అసహ్యంపుట్టింది. వీళ్ళందరి ఉద్దేశంఏమిటి? నాకేంతక్కువని వీళ్ళందరూ ఇంతచులకన చేస్తున్నారు? అని ఆవేశపడేదాన్ని. మరిది కాస్త నయం. అపుడప్పుడు ఏదన్నా మాట్లాడేవాడు. ఆ వాతావరణంలో వారంరోజులు వుండడం అంటేనే భయం పుట్టింది. తక్కిన అందరూ ఎలావున్నా ఆయనైనా కాస్త చనువుగా మాట్లాడితే నాకంత కొత్త వుండేది కాదు. పగలు పెళ్ళాంతో అందరి ఎదుట మాట్లాడితే ఏంఅంటారో నన్నట్టుగానో లేక ఆయన తీరే అంతో నన్ను చూసి చూడనట్లు తప్పుకు తిరిగేవారు.
రెండో రాత్రి ముభావంగా వున్న నన్ను చూసి "ఏం అలా వున్నావు?" అన్నారు.
"ఇంకెలా వుంటాను?" అదోరకం విరక్తి నిర్లిప్తత నన్ను ముంచెత్తాయి.
"ఏమిటా పెడసరం జవాబు? అడిగిందానికి సరిగా జవాబివ్వలేవా?"
"ఏం జవాబివ్వాలి? మీ అందరూ చూపిస్తున్న ఆదరణ, అభిమానానికి, కొత్తకోడలికిమీరిచ్చినస్వాగతానికి యిలాకాక ఎలా వుంటాను?" పగలు అందరి ప్రవర్తన చూశాక యింక ఆగలేని ఉక్రోషంతో జవాబు దురుసుగానే వచ్చింది నోట్లోంచి.
"ఏం! ఏం లోటు చేశారు నీకు? ఈ యింటి కోడలివి నీవు. నిన్నందరూ, అందలం ఎక్కించి మహారాణిలా సేవలు చెయ్యాలనా నీ ఉద్దేశం."