Previous Page Next Page 
నిర్భయ్ నగర్ కాలనీ పేజి 7

                                 


                             గంధా కానూన్


                       


    కాలనీ మీటింగ్ లు జరిగి చాలారోజులు గాప్ రావడంతో మాకందరికీ చాలా రిలీఫ్ దొరికినట్లయింది. గోపాల్రావ్ అయితే ఈ ప్రశాంతతకు నిజంగా ఆనంద పడిపోయాడు.
    "ఆహా! మన చుట్టూ ఉన్న సమాజాన్ని పట్టించుకోకుండా, మన మీదకే సమస్య వచ్చినా 'ఏం చేస్తాం! తప్పదు' అనే ధోరణి అవలంబిస్తే జీవితం ఇంత ఆనందదాయకంగా వుంటుందా?" అనడిగాడు నన్ను.
    "అవును! ఉంటుంది" అన్నాన్నేను.
    "అయితే మనం ఇకనుంచి కాలనీ కమిటీని రద్దుచేసి పారేసి ఒకడి సంగతి ఒకడు పట్టించుకోకుండా- ఎవరిదారిన వాళ్ళు బ్రతికేయటం మంచిదికదూ?" అడిగాడు రంగారెడ్డి.
    "అవును. చాలా మంచిది" అన్నాన్నేను కాషన్ గా.
    ఎందుకంటే అదెలాగూ జరిగేదికాదు, పెట్టేదికాదు.
    ఎవడికేం ఆపద వచ్చినా దూకుడుగా వాడికి సహాయం చేయడానికెళ్ళటం, సహాయం బదులు చివరకు హానిచేసి రావటం మన తెలుగువాళ్ళ స్పెషాలిటీ అన్న విషయం నాకు తెలుసు.
    ఏమయితేనేం కాలేనీలో ఎలాంటి మీటింగ్ లూ గొడవలూ లేకుండా ప్రశాంతంగా మరో వారం రోజులు గడిచింది. ఈ వారం రోజుల్లోనూ చాలా దిగులుగా, నిరుత్సాహంగా, ఎదో పోగొట్టుకున్నట్లు కాలనీ స్టేజ్ దగ్గర ఒక్కడే కూర్చుని మైక్ సెట్ రిపేర్ చేస్తున్నట్లు నటిస్తూ "హలో వన్ టూ- త్రీ- ఫోర్- ఫైవ్- సిక్స్- సెవన్" అంటూ వందవరకూ అంకెలు ఇంగ్లీష్ లో చదివి మైక్ టెస్టింగ్ అంటూ కనిపించిన ఒకే ఒక వ్యక్తి శాయిరామ్.
    కానీ అలా ఎంతోకాలం జరగలేదు. మరో వారం రోజుల తర్వాత అకస్మాత్తుగా ఓ సంఘటన జరగడంతో అందరం అందులో ఇరుక్కోక తప్పలేదు. మా కాలనీ రైటర్ చంద్రకాంత్ ఛటోపాధ్యాయ స్టేట్ ట్రేడింగ్ కార్పొరేషన్ వాళ్ళ ధర్మమా అని ఒక స్కూటర్ ఇన్ స్టాల్ మెంట్స్ లో కొనడానికి సన్నాహాలు ప్రారంభించాడు. ముందు కట్టాల్సిన నాలుగువేల రూపాయలు మేమంతా కలిసి పోగుచేసి అప్పుగా ఇచ్చాం అతనికి. అతను ఆ అప్పుని తను రాసే పుస్తకాలకు ముందుమాటలో మా అందరికీ కృతజ్ఞతలు చెప్పి తీర్చుకుంటానన్నాడు గానీ మేము వప్పుకోలేదు. ఎవరి డబ్బు వాళ్లకి ఎప్పటికయినా కాష్ రూపంలోనే ఇవ్వాలని వార్నింగిచ్చాం. అయిష్టంగానే వప్పుకున్నాడతను. స్టేట్ ట్రేడింగ్ కార్పొరేషన్ వాళ్ళు ఆ స్కూటర్ షోరూమ్ వారికి లెటర్స్ రాసి ఇచ్చారు. అందరం ఆ లెటర్ తీసుకుని షోరూమ్ కి చేరుకున్నాం!
    షోరూమ్ మేనేజర్ మా లెటర్ ఓసారి చదివాడు.
    అతని మొఖంలో కనబడాల్సినంత ఆనందం కనిపించటం లేదు ఎందుకనో.
    "ఏ కలరు స్కూటర్ కావాలి?" అనడిగాడు అనాసక్తిగా. మేమంతా ముందే ఏ కలర్ అడగాల్సిందీ చంద్రకాంత్ కి నూరిపోశాం. అంచేత చంద్రకాంత్ తడుముకోకుండా 'మెరూన్ దొరకదు" అతనూ మొండికేశాడు.
    "ఎందుకు దొరకదు?"
    "అవి తక్కువ సప్లయ్ అవుతాయి కాబట్టి"
    "ఎందుకు తక్కువ సప్లయ్ అవుతాయ్?" అతనికి చిర్రెత్తు కొచ్చింది.
    "ఇదిగో చూడు మిష్టర్, ఇన్ స్టాల్ మెంట్స్ లో కొనేవాళ్ళు అట్లా అరవకూడదు. మీకా కలర్ కావాలంటే ఇంకో నెల రోజులయాక రండి"
    అందరం మొఖాలు చూసుకున్నాం.
    "నెలరోజులా?"
    "అవును!"
    మా గొడవ చూసి యాదగిరి మధ్యలో కొచ్చాడు.
    "ఏదొక్కలర్ తీస్కొ రాదురా భయ్! ఒకటే లొల్లి పెడ్తున్రు. మెరూన్ అయితే మంచిగా నడస్తదా, వేరేది నడువదా?"
    యాదగిరి డైలాగ్ తో ఇక చేసేది లేక పరమ భయంకరంగా కనిపించే కలర్ స్కూటర్ సెలెక్ట్ చేసుకున్నాం. మామూలుగానే మొదటిరోజు అందరం చంద్రకాంత్ ఇంటిముందు గుమికూడాము ప్రారంభోత్సవానికి.
    చంద్రకాంత్ భార్య వచ్చి కొబ్బరికాయ కొట్టి స్కూటర్ కి దణ్ణం పెట్టింది.
    "ఇలా పూజలు చేస్తే యాక్సిడెంట్స్ ఏమి అవకుండా ఉంటాయట" అందామె మిగతా ఆడాళ్ళతో.
    "అవునవును" అన్నారు మిగతా ఆడవాళ్ళు.
    "మరి రోడ్ నెంబర్- త్రీలో ఉన్న వరాహాల్రావ్ ముహూర్తం పెట్టి పూజలు చేసి మొదటి రౌండ్ లోనే రెండుకాళ్ళూ విరగ్గొట్టుకుని స్కూటర్ ని పాత ఇనుప సామాన్ల దుకాణంలో అమ్మేశాడు కదా?" అడిగింది డిటెక్టివ్ రచయిత్రి రాజేశ్వరి.
    అందరికీ రాజేశ్వరి మీద కోపం వచ్చింది. రాజేశ్వరికి మొదటి నుంచి కొంచెం కన్యూనిస్ట్ భావాలు ఎక్కువ.
    "శుభమా అని మనాడు స్కూటర్ కి ప్రారంభోత్సవం చేస్తూంటే ఈవిడ యాక్సిడెంట్స్ గురించి మాట్లాడుతుందేమిటి?" విసుక్కున్నాడు రంగారెడ్డి.
    పూజ కార్యక్రమం అయిపోయింది. అందరికీ తలో చిక్కీ పాకెట్ కానుకగా ఇచ్చాడు చంద్రకాంత్. తను ఇంకా పాపులర్ రచయిత అవలేదు కాబట్టి ప్రస్తుతానికి వాటితోనే సర్దుకోమని బ్రతిమాలాడు. పాపులర్ అయిన రచయిత అయిన మరుక్షణం అందరికీ హాట్ డ్రింక్స్ చికెన్ టిక్కా పబ్లిషర్స్ ఖర్చుమీద ఏర్పాటు చేయిస్తానని కూడా ప్రామిస్ చేశాడు. మేము సరేనని వప్పుకున్నాం.
    ముందు వాళ్ళ పిల్లలను ఎక్కించుకుని స్కూటర్ స్టార్ట్ చేశాడు తను. ఫస్ట్ గేర్ వేయగానే మేమంతా తప్పట్లు కొట్టాము.
    చంద్రకాంత్ కాలనీ చుట్టూ ఓ రౌండ్ దిగ్విజయంగా పూర్తి చేసుకుని వచ్చాడు. ఈ సారి వాళ్ళావిడని ఎక్కించుకుని కాలనీ చుట్టూ ఓ రౌండ్ కొట్టమని కోరారు ఆడాళ్ళందరూ.

 Previous Page Next Page