నాకూ, మిగతావారికీ కూడా రంగారెడ్డి మీద కోపం వచ్చింది.
రంగారెడ్డి ఛప్పున స్పృహలో కొచ్చాడు.
"సారీ బ్రదర్! ఈ న్యూస్ పేపర్స్ లో పోలీస్ వర్షన్ ళు చదివి చదివి "బ్రెయిన్ వాష్" అయిపోయినట్లనిపించింది. హోమియోపతి మెడిసిన్ వాడితే గాని లాభంలేదు" అన్నాడు కణతళు నొక్కుకుంటూ. తరువాత మా కాలనీని ఆనుకుని వున్న ఓ భవనంలోనుంచి కాల్పులు వినిపించాయ్.
అయితే ఈసారి ఎవ్వరం పరుగెత్తుకెళ్ళలేదు.
ఆ సాయంత్రం ఆ భవనం యజమాని ఇంట్లోనుంచి అతని భార్య శవాన్ని తీసుకెళ్తున్నప్పుడు మాత్రం అందరం మెయిన్ రోడ్ దగ్గర కెళ్ళి నిలబడ్డాం.
ఆమె భర్త భోరున ఏడుస్తూ శవం ముందు నడుస్తూంటే మాకతని మీద విపరీతమయిన జాలి కలిగింది.
మేమందరం గుమిగూడి అతనిమీద జాలి పడుతూంటే వాళ్ళింట్లో పనిచేస్తున్న ముసలి నౌకరు మా దగ్గరకొచ్చాడు.
"ఘోరం బాబూ! దేవతలాంటి అమ్మగారిని వాడే చంపేశాడండీ! పెళ్ళయిన రోజు నుంచీ ఆ అమ్మాయిని నాలుగ్గోడల మధ్యే బంధించి చిత్రహింసలు పెట్టాడండీ! ఆమె అందంగా వుందని ఆమె శీలం మీద ఒకటే అనుమానం. నిన్న సినిమా హాల్లో కూల్ డ్రింక్స్ అమ్మే వాడితో రహస్యంగా మాట్లాడిందని సాకు- చూపి నానా రభస చేసి చివరకు నా కళ్ళెదురుగ్గానే తుపాకితో కాల్చి పారేశాడు బాబూ!"
మేం నిశ్చేష్టులమైపోయాం గానీ క్షణాల్లో మామూలు పరిస్థితి కొచ్చేశాం.
"వాడే చంపుతే అలా భార్యకోసం రోడ్ మీద ఏడుస్తాడా ఎవడయినా?" అనుమానంగా అన్నాడు రంగారెడ్డి.
"అదేబాబూ నాటకం! ఈ విషయం బయటపెడితే నా ప్రాణం తీస్తానని కూడా బెదిరించాడు! పోనీండి బాబూ! ఆ తల్లి జీవితమంతా ఇలాంటివాడి దగ్గర నరకం అనుభవించటం కంటె ఆడి చేతిలో ఒకేసారి చావడం మంచిది!"
మాకెందుకో ఆ నౌకరు మాటలు పట్టించుకోబుద్ధికాలేదు.
అతను చెప్పేది నిజమే అని తెలిసినా, మేమేమీ చెయ్యలేని పరిస్థితిలో ఉన్నప్పుడు ఆ విషయాల గురించి ఆలోచించటం అనవసరమని మాకు తెలుసు.
మర్నాడు ఎంత వద్దనుకున్నా న్యూస్ పేపర్లో ఆ వార్త గురించిన పోలీస్ స్టేట్ మెంట్ చదవక తప్పలేదు.
"నిన్న నిర్భయ్ నగర్ కాలనీ సమీపంలో ఒక ఇల్లాలు గన్ తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకుంది. ఆమె గత కొద్ది సంవత్సరాలుగా విపరీతమయిన కడుపునొప్పితో బాధపడుతోందని, ఆ బాధ విముక్తికోసమే ఇప్పుడు ఆత్మహత్య చేసుకుందనీ పోలీస్ అధికారులు చెప్పారు ఆమెకు భర్త ఒక పాప వున్నారు. ఆమెను అమితంగా ప్రేమించే ఆమె భర్త ఈ దారుణానికి తట్టుకోలేక మూర్చిల్లినట్టూ, ప్రస్తుతం నగరంలోని ఒక ప్రైవేట్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నట్లూ తెలుస్తోంది."
"పాపం! పూర్ ఫెలో! భార్యలను అమితంగా ప్రేమిస్తే యిదే ట్రబుల్!" అన్నాడు రంగారెడ్డి.
"అవును. అందుకే నేను మా ఆవిడను రెండు మూడేళ్ళకోసారి కసురుకుంటుంటాను" అన్నాడు చంద్రకాంత్.
రాన్రాను ఈ వార్తలు మరింత వింత రూపంలో న్యూస్ పేపర్స్ లో కనిపించసాగాయి.
"నిన్న ఉదయం పంజాగుట్టలో ఒక బార్ ఓనర్ కీ, కస్టమర్ కీ జరిగిన వాగ్వివాదంలో కస్టమర్ తన గన్ తో జరిపిన కాల్పులలో బార్ ఓనర్ తోపాటు ఒక్క టేబుల్ దగ్గర కూర్చున్న మరో ఆరుగురు కస్టమర్లు మృతి చెందారు. అయితే హత్యానంతరం అంతులేకుండా పారిపోయిన ఆ వ్యక్తి ఆచూకీ కోసం పోలీసులు దేశమంతా గాలిస్తున్నారని పోలీస్ వర్గాలు వెల్లడిస్తున్నాయి."
మరో రెండురోజుల తర్వాత ఇంకో వార్త.
"నిన్న రాత్రి మంజీరా ప్లాట్స్ లో నివసిస్తున్న రెండు కుటుంబాల మధ్య హోలీ సందర్భంగా చెలరేగిన వివాదం కారణంగా ఓ కుటుంబానికి చెందిన వ్యక్తి రెండో కుటుంబం సభ్యులందరినీ గన్ తో కాల్చి చంపినట్లు తెలుస్తోంది. సాక్షులెవరూ లేకపోవడం వల్ల పోలీస్ లు ఇంకా హంతకులను నిర్ధారించుకోలేదని పోలీస్ అధికారులు చెపుతున్నారు."
మర్నాడు మరికొన్ని వార్తలు.
"నిన్న రాత్రి నగరంలోని కొంతమంది గూండాలు తాగిన మైకంలో కొన్ని ఇళ్లమీద దాడిచేసి అనేకమంది స్త్రీలను, పురుషులను తుపాకులతో కాల్చి చంపి కొంతమంది స్త్రీలను ఎత్తుకుపోయినట్టు తెలుస్తోంది. పోలీసులు పరిశోధన ప్రారంభించారు."
"నిర్భయ్ నగర్ కాలనీ సమీపంలో యాభైమంది నగ్జలైట్ల కాల్చివేత" మేం అదిరిపడ్డాం. ఆ యాభైమందీ నిజంగా నగ్జలైట్లు కాదు. కాంట్రాక్ట్ లేబర్. వాళ్ళకు డబ్బులు ఎగ్గొట్టిన కాంట్రాక్టర్ ని నిలదీయడానికి వెళ్తే కాల్చి చంపి నగ్జలైట్లని స్టేట్ మెంటిచ్చాడు.
"భర్తతో కాపురానికి రానని మొరాయించిన భార్యనూ, ఆమె తల్లిదండ్రులనూ ఆమె భర్త గన్ తో కాల్చిచంపిన సంఘటన నిన్న చార్మినార్ సమీపంలో జరిగింది. అతనికి అదివరకే ఇద్దరు భార్యలున్నట్లు తెలుస్తోంది. పోలీసులు అతనికోసం గాలిస్తున్నారు" ఇది మరో వార్త.
"గంగిగోవులపాలెంలో నిన్న రాత్రి ఒక వర్గం మీద భూస్వామి వర్గానికి చెందిన కొందరు దాడిచేసి అక్కడి నివసిస్తున్న రెండొందల తొంభైమంది పురుషులు,స్త్రీలు, పిల్లలను గన్స్ తో కాల్చి చంపారు. కిందటి ఎన్నికల్లో తమకు ఓటు వేయలేదన్న కక్షతో ఇలా చేసినట్లు అక్కడి ప్రజలంటున్నారు. కానీ అదంతా అబద్ధమని వాళ్ళంతా నగ్జలైట్స్ నీ, వారే భూస్వామి వర్గానికి చెందిన వారిమీద దాడి చేశారనీ, ఆత్మరక్షణ కోసం ఆ ఎమ్మెల్యే ఆయన అనుచరులు కాల్పులు జరిగిపినప్పుడు వారంతా హతులయ్యారనీ, పోలీస్ వర్గాలు అంటున్నాయ్."
మాకు భయం వేసింది. మా ఏరియా పోలీస్ ఇన్ స్పెక్టర్ కి మేమంటే పడదు. ఏ క్షణాన్నయినా మా కాలనీ వాళ్ళందర్నీ పిల్లల్ని కాల్చినట్లు కాల్చేసి నగ్జలైట్స్ అని ముద్ర వేస్తాడేమోనని.
"దాని కింద మరోవార్త చదివేసరికి మాకు మతిపోయినట్లయింది. అట్టడుగు వర్గాలున్న ఓ ఊళ్ళో ఆ వూరి జనాభా ఆరొందల మంది గన్స్ తో కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నారు. అప్పుల బాధవల్ల ఆ విధంగా ఆత్మహత్యలకు పాల్పడినట్లు పోలీస్ కమిషనర్ పేర్కొన్నారు."
ఆ తరువాతి రోజు అలాంటి వార్తలు మరో పాతిక్కనిపించాయ్.
ఈ లెక్కన న్యూస్ పేపరంతా అలాంటి వార్తలతోనే నిండే రోజు ఎంతో దూరం లేదని మా కర్ధమయిపోయింది. శాయిరామ్ వెంటనే ఆ విషయం చర్చించటానికి మీటింగ్ ఏర్పాటు చేశాడు.
"పరిస్థితి ఇలాగే కొనసాగితే మన సమాజం రూపురేఖలే భయంకరంగా తయారవుతాయి. ఏదో ఒక ఉపాయం ఆలోచించాలి" అన్నాడు శాయిరామ్.
అందరూ రకరకాల సలహాలు ఇవ్వసాగారు.
ప్రజలకు ప్రభుత్వం ఇచ్చిన గన్స్ ని వాపస్ తీసుకోవాలని కొంతమంది సూచించారు.
మిగతా అందరికీ కూడా గన్స్ యిస్తే ఒకరంటే మరొకరికి భయం వుంటుందనీ, అందువల్ల హత్యలు జరగవనీ రంగారెడ్డి అన్నాడు.
ఆఖర్లో యాదగిరి వేదిక మీదికొచ్చాడు.
"సోదర సోదరీమణులారా! మనం వున్నది డెమోక్రసీలో! గనుక ప్రజలు అంటే మనం ఇచ్చిన సలహాలు గిట్ట ప్రభుత్వం బరాబర్ నిరాకరిస్తది. గనుక మనం ఈ పరిస్థితి నుంచి తప్పించుకోనికి ఒకే ఒక్క రాస్తా వున్నది. అదేమంటే న్యూస్ పేపర్ చదివెడిది బంద్ చేయడం. న్యూస్ పేపర్స్ ని మనం చదువుతుండబట్టేగదా గిసంటి ఖతర్ నాక్ దందాల గురించి ఎరుకవుతున్నది. కేనుక మనం రేపటికెళ్ళి న్యూస్ పేపర్స్ కొనద్దు. సమజైనాది?"
అందరూ ఆనందంగా తప్పట్లు కొట్టారు.
ఆ తరువాత మేమెప్పుడూ న్యూస్ పేపర్లు చదవలేదు. కనుక ఎలాంటి అవాంఛనీయ సంఘటనలూ జరగడంలేదని మేము సంతృప్తి చెందాం.
* * * * *