"గంట క్రితం చైర్మన్ గారితో మాట్లాడాను. ఆయన మాటల్లో తెల్సిందీ విషయం అంతేకాదు 'ఆంధ్రా టైమ్స్'కి ఇవేళ ఓ కొత్త ఎడిటర్ వస్తాడు! అంది.
రాజారామ్ మాట్లాడలేదు.
"ఇవాళ మీరు చైర్మన్ గారితో లంచ్ చేస్తున్నారని కూడా అప్పుడే తెలిసింది. గుడ్ లక్!"
"నిజానికి నేనింతవరకూ చైర్మన్ గారు ఎలా ఉంటారో చూడలేదు. ఆయన స్వభావం కూడా నాకు తెలీదు."
"వాళ్ళూ వీళ్ళూ ఆయన గురించి రకరకాలుగా చెప్పుకుంటారు. ప్రచారం చేస్తారు. ఒక్క విషయం చెప్పనా? ఆయనకెలాంటి దురలవాట్లూ లేవు. చాలా మంచి మనిషి. ఎవరికీ అపకారం తల పెట్టేతత్వం కాదాయన్ది. అన్నట్లు నాదో సలహా....వింటారా?" అంటూ రాజారామ్ మొహంలోకి చూసింది రాజేశ్వరి.
రాజారామ్ ఆమె నడుం వైపు చూస్తున్నాడు. చీరకే కొత్తఅందాలు తెచ్చిన ఆమె శరీరాన్ని ఆరాధనగా భావంతో చూస్తున్నాడు. 'వింటరా?' అని ఆమె అనగానే తలెత్తి ఆమెవేపు చూశాడతను.
"చైర్మన్ గారు చాలా నిక్కచ్చిమనిషి. అతనికి భార్య పిల్లలు లేరు. ఒంటరివాడు. దగ్గరి బంధువులు అంటూ ఎవరూలేరు. ఒక్క మేనకోడలు తప్ప! తోడబుట్టిన చెల్లెలు కూతురామె!! ఎవర్ని నమ్మాలో తెలియని పరిస్థితి. అంచేత అందర్నీ అనుమానంగానే చూస్తాడు. మేనకోడలు మొగుడైనంత మాత్రాన మన డైరెక్టర్ విరించి గారిని గుండెల్లో పెట్టుకుంటున్నాడనుకోకండి...ఆయన పని అంతే!"
"చైర్మన్ గారి గురించి మీ కంతా తెలిసినట్టు చెప్పేస్తున్నారే!" అన్నాడు రాజారామ్.
"అవును మరి, మానాన్నగారు ఆయన దగ్గర పాతికేళ్ళు పని చేశారు. నా చిన్నప్పుడు చైర్మన్ గారి ఒళ్ళో ఆడుకున్నాను. ఆ సంగతి తెలుసా మీకు?"
ఆరాధనా భావంతో రాజేశ్వరి మొహంలోకి చూశాడు రాజారామ్. ఆమె వయస్సు మహా అయితే పాతిక ఉంటుంది. తనకి నలభై యేళ్ళు, తనంటే ఆమెకి ఎందుకంత అభిమానం?! అదే తెలీక కళ్ళతో ప్రశ్నించాడు.
ఆ ప్రశ్నని రాజేశ్వరి అర్ధంచేసుకోలేదు.
"అన్నట్టు ఒంటి గంటైంది. మీకోసం వాళ్ళంతా ఎదురు చూస్తూ ఉంటారు. లేటు కాకుండా వెళ్ళండి." అందామె మనోహరంగా నవ్వుతూ-
తనివితీరా ఆమె నవ్వుని చూసి థర్డ్ ఫ్లోర్ లోకి వెళ్ళాడు రాజారామ్.
థర్డ్ ఫ్లోర్ లో ఒక వేపు డైరెక్టర్ విరించి ఆఫీసూ, మరో వేపు చైర్మన్ ఆఫీసూ ఉన్నాయి. రెండింటి మధ్య కాన్ఫరెన్స్ హాలుంది.
"హలో రాజా!"
డైరెక్టర్ విరించి తన వాచ్ కేసి చూసుకున్నాడు. "కరెక్ట్ టైం కి వచ్చావు పద." అంటూ రాజారామ్ భుజాలమీద చెయ్యి వేశాడు.
విరించి నల్లగా ఉంటాడు. కళ్ళు లోతుగా ఉంటాయి. మొహం ఎప్పుడూ సీరియస్ గా ఉంటుంది. భార్యతో పడగ్గదిలో కూడా అంత సీరియస్ గానూ ఉంటాడేమోనని రాజారామ్ అనుమానం.
చైర్మన్ గారి రూంలో... అప్పటికే అప్పారావున్నాడు. రాజారామ్ ని చూడగానే మొహం ఇంత చేసుకుని నవ్వాడు.
విరించి ఇద్దర్నీ లోపలికి తీసుకు వెళ్ళాడు చిన్న డైనింగ్ రూమ్. మధ్యలో పొడవాటి టేబుల్, అటూ ఇటూ ఆరు కుర్చీలున్నాయి. ఏదో మాట్లాడుకుంటూ ముగ్గురు కూర్చున్నారు.
అంతలో ఏదో తలుపు తీసి, మూసినా చప్పుడైంది. తలతిప్పి చూశాడు రాజారామ్. తెల్లని పైజమా, లాల్చీలతో ఎర్రని మొహంతో...
అతనే చైర్మన్ అని గ్రహించి రాజారామ్ లేచి నిలబడ్డాడు. మిగతా ఇద్దరూ కూడా నిలబడ్డారు. చైర్మన్ నిశితంగా రాజారామ్ మొహంలోకే చూస్తున్నాడు. విరించి దగ్గరగా వచ్చి "ఇతనేనండి....రాజారామ్ " అని పరిచయం చేశాడు.
రాజారామ్ రెండు చేతులూ జోడించి నమస్కరించాడు.
"నువ్వేనన్నమాట రాజారామ్!" అంటూ చైర్మన్ రాజభూషణరావు అతన్ని పరిశీలనగా ఎగాదిగా చూశాడు.
అందరూ భయపడే చైర్మన్ ఇతనేనన్నమాట! -అనుకున్నాడు రాజారామ్.
రాజభూషణరావు మరీ పండు ముసలికాదు. కాని, వార్ధక్యంలోకి అడుగు పెట్టాడని ముఖం మీది ముడుతలు, పండు జుత్తూ చెప్తాయి. గోల్డ్ రిమ్డీ కళ్ళద్దాలు. ఆ కళ్ళద్దాల వెనక పులికాళ్ళళా భయంకరంగా మెరిసే అనుభవం పండిన కళ్ళు.
డైనింగ్ టేబుల్ దగ్గర కుర్చీలో కూర్చుంటూ చైర్మన్ రాజారామ్ వేపు తిరిగాడు. "ఆర్ యూ ఏ డ్రింకింగ్ మేన్, మిష్టర్ రాజారామ్?" అని ప్రశ్నించాడు.
రాజారామ్ కి రాజేశ్వరి మాటలు గుర్తుకువచ్చాయి. 'అబద్దము చెప్పరాదు' అనుకున్నాడు.
"ఎస్సర్ ఇన్ ఏ మోడరేట్ వే!" అన్నాడు.
"విరించీ, రాజారామ్ తాగడానికి ఏమైనా రెడీ చేశావా?" అని అటు చూశాడు.
"ఆఫీసులో తాగాకూడదని నేనో నియమం పెట్టుకున్నాను సర్. అదీగాక లంచ్ ముందు తాగితే నాకు నిద్రవొస్తుంది" అని రాజారామ్ అన్నాడు.
"గుడ్ దెన్ వుయ్ విల్ డిస్పెన్స్ విత్ ద బూజ్! విరించీ నాయర్ ని పిలువ్!" అన్నాడు చైర్మన్, తరువాత మరోసారి రాజారామ్ ని పరిశీలనగా చూశాడు.
"రాజారామ్! నువ్వు విజయవాడలో ఎక్స్ లెంట్ గా పని చేశావు. మన పత్రిక పేరుని నిలబెట్టావు" అన్నాడు.
"థాంక్ యూ సార్"
"మంచి టేలెంట్ ఉన్న వాళ్ళకోసం నా కళ్ళు అనుక్షణం గాలిస్తూ ఉంటాయి. గాడిదల్నీ, గుర్రాల్నీ ఓకే గాటని కట్టడం నాకిష్టం ఉండదు. అన్నట్టు టేలెంట్ అంటే గుర్తొచ్చింది. ఏ దినపత్రికయినా అమ్మేది ప్రతిభనే! ప్రతిభ గల వాళ్ళకి మన సంస్థలో ఎప్పుడూ స్థానం ఉంటుంది....అన్నట్టు విరించీ...ఏదీ నాయర్!" అన్నాడు చైర్మన్.