Previous Page Next Page 
చీకట్లో నల్లపులి పేజి 5


    "ఇందులో మనిషి వివరాలు ముఖం అదీ సరిగ్గా రిజిస్టర్ కాలేదు."

    "ఇంట్లో అదొక్కటే ఉంది సార్"

    సాలోచనగా తల పంకించాడు రాజారామ్.

    "అన్నట్లు ఇంకో ఫోటో పోలీసులకి ఇచ్చాను వాళ్ళనడిగి తీసుకొస్తాను."

    "అలాగే నేను కూడా మా రిపోర్టర్లకి చెప్తాను. పోలీస్ స్టేషన్ లో కూడా నాకు తెల్సినవాళ్ళున్నారు లెండి"

    "ఇంకో విషయం నాకు చాలా ఆశ్చర్యంగా వుంది సార్..."

    "ఏమిటది?"

    "మా సుందరి ఎకౌంట్ లోకి హఠాత్తుగా ఎక్కన్నించి పాతికవేలు వచ్చాయో ఆశ్చర్యంగా ఉంది. అదీ ఈ మధ్యనే సుందరి బ్యాంక్ పాస్ బుక్ ఇచ్చింది.

    రాజారామ్ బ్యాంక్ ఎకౌంట్ వివరాలు చూశాడు. అంతకు ముందు ఎకౌంట్ లో 25 రూపాయలే ఉండాలి. అది కాస్తా 25, 025 అయింది ఒక్క ఎంట్రీతో.

    పాస్ బుక్ ఆమె చేతికిచ్చి వీధిగుమ్మం వేపు నడిచాడు రాజారామ్. అతన్ని అనుసరించింది సుమిత్ర.

    "శ్రమ అనుకోకుండా ప్రయత్నించండి సార్"

    "అలాగే"

    "థాంక్స్ ఉంటాను సార్"

    తల పంకించి స్కూటర్ వేపు నడిచాడు.

    హైదరాబాదు మహానగరంలో రోజూ ఎందరో అమ్మాయిలు హఠాత్తుగా మాయం అవుతూ ఉంటారు. కొందరు హుసేన్ సాగర్లో తేలుతారు. మరికొందరు బొంబాయి వ్యభిచార గృహాల్లో...ఇంకొందరు నకిలీ ప్రియుల బహు బంధాల్లో...మరి కొందరు మద్రాస్ లోని కుహనా నిర్మాతల బెడ్ రూముల్లో...

    "ఎక్కడుందో ఈ సుందరి', అనుకుంటూ స్కూటర్ స్టార్ట్ చేశాడు రాజారామ్.

    భవిష్యత్తు మీద ఎన్నెన్నో ఆశలు పేర్చుకుంటూ, అబిడ్స్ లో ఉన్న 'ఆంధ్రా టైమ్స్' ఆఫీస్ చేరుకున్నాడు రాజారామ్.

    అతను డెస్క్ రూం చేరుకునేసరికి సరిగ్గా ఒంటి గంటకి ఇంకా పావుగంట ఉంది. షిఫ్ట్ ఇన్చార్జ్ జనార్ధన్ తో ఓ పది నిముషాలు మాట్లాడి పోతే బాగుండు నన్పించింది రాజారామ్ కి.

    "జనార్ధన్, మన క్రయమ్ రిపోర్టరుతో మాట్లాడి ___ పోలీస్ హెడ్ క్వార్టర్స్ కి వెళ్ళమను. మిస్సింగ్ పెర్సన్స్ లిస్ట్ లో మిస్. సుందరి ఉందేమో చూడమను. మొత్తం వివరాలు నాకు ఇవాళే కావాలి. ఓకే?" అన్నాడు.

    జనార్ధన్ సీట్లోంచి లేచి నిలబడి "అలాగే సార్" అన్నాడు.

    రాజారామ్ తను వేసుకున్న నీలం రంగు సూటు వేపు, చూసీ చూడనట్టు పరిశీలనగా చూసుకున్నాడు. అంతా సరిగ్గా ఉంది. వదులైన టైని సరిచేసుకుంటూ డెస్క్ రూం లోంచి బయటికి వెళ్లాలని చక చక అడుగులు వేశాడు.   

    ఏదో తెలియని ఉద్రిక్తత....ఆరాటం.....తనను ఆవహించిన విషయం అతనప్పుడే తెలుసుకున్నాడు. దానికి కారణం లేకపోలేదు.

    విష్ణుమూర్తి....తను గురువుగా భావించే విష్ణుమూర్తి ఒద్దన్నా ఒకవేళ తనను ఎడిటర్ స్థానంలో చైర్మన్ కూర్చోబెట్టినా 'యస్' అనడానికి సిద్దంగా ఉన్నాడు తను. గంటసేపు మధనపడి తను ఈ నిర్ణయానికి వచ్చాడు. అందుకే ఈ టెన్స్ నెస్.....

    రాజారామ్ కి తెలుసు. దినపత్రిక ఎడిటర్ కి ఉండాల్సిన అర్హతలన్నీ తనకి ఉన్నాయి. అనుభవాలూ ఉన్నాయి. న్యూస్ సెన్స్ ఉంది. జనంతో మాట్లాడి పని చేసుకుపోయే స్వభావమూ ఉంది. ఇంతవరకూ ఏ దినపత్రిక సంపాదకుడూ చేయలేని ఫీట్స్ తను చేయగలడు...

    కళ్ళముందు...తను కన్న కలలన్నీ నిజమైనట్టు అదో గమ్మత్తయిన అనుభవం.

    సెకండ్ ఫ్లోర్ లో ఉన్న ఎగ్జిక్యూటివ్ ఆఫీసెస్ వేపు వెళ్ళాడు రాజారామ్.

    సినిమా ఎడిటర్ రాజేశ్వరి అతని వేపు చూసి పలకరింపుగా నవ్వింది.

    రాజేశ్వరి ఇంకా పెళ్ళికాలేదు. వయస్సు పాతిక్కిమించదు. ఆమె ఊఁ అంటే పెళ్ళి చేసుకోవడానికి కనీసం పాతికమంది ఆమె ఇంటి ముందు క్యూ కట్టే వారేమో...

    ఎందుకంటే ... తెల్లగా పొడుగ్గా ఉంటుంది రాజేశ్వరి.  అందానికి ప్రతి రూపంలా ఉంటుంది. ఖరీదైన చీరలకి ఆమె ఓ హుందాతనాన్ని ఇస్తుంది.

    చిరునవ్వు నవ్వితే వెన్నెలలుకురుస్తాయి. ఆ నవ్వులో అరమరికలు ఉండవు. హృదయంలోంచి.... మనస్సులోంచి... పలకరిస్తున్నట్టు వింత అనుభూతి కలుగుతుంది. అమాయకంగా మాయామర్మాలు ఏమీ తెలీనట్టుగా నవ్వే ఆమె మొహం కోటి కోటిదీపాల కాంతిలో వెలుగుతున్నట్టు అన్పిస్తుంది రాజారామ్ కి.

    అయితే, ఒక్క విషయం మాత్రం అతనికి నచ్చదు. పనిలో మునిగి ఉన్నప్పుడు ఒంటి మీద చీర ధ్యాస ఉండదామెకి. పైట జారినా, ఒంటి ఒంపులు బహిర్గతమవుతున్నా, తను చేస్తున్న పని మీదే ఆమె దృష్టి...

    "రాజారామ్ గారూ...."

    ఆగాడు రాజారామ్.

    "మీతో ఒక్క నిమిషం మాట్లాడాలి"

    "ఓకే"

    దగ్గరికి వచ్చింది. ఇంటిమేట్ సెంట్ వాసన - ఆడవాసనతో, జడలో మల్లెల వాసన, ఆ రోజే కట్టుకున్న కొత్తచీర వాసన.

    ఈ సువాసనలన్నీ రాజారామ్ ని 20 ఏళ్లు వెనక్కి తీసుకెళ్ళాయి. ఒక్క నిమిషం...అంతే!

    "విష్ణుమూర్తిగారు రిజైన్ చేశారు!" అంది రాజేశ్వరి.

    "అయాం సారీ" అన్నాడు రాజారామ్.

    పాత జ్ఞాపక లేవో ఇంకా అతని మెదడుని దొలుస్తునే వున్నాయి.

 Previous Page Next Page