తులసి త్వరగా తన బట్టలన్నీ సూట్ కేస్ ల్లో సర్దేస్తోంది. దీప అతన్ని వదిలించుకోడానికని తులసికి సహాయం చేయసాగింది.
సురేష్ టేబుల్ మీద ట్రాన్సిస్టర్ అన్ చేశాడు.
"బిడ్డకూ, బిడ్డకూ మధ్య ఎడం కావాలంటే వాడండి - నిరోద్"
ట్రాన్సిస్టర్ ఆఫ్ చేశాడు.
"బిడ్డకూ, బిడ్డకూ మధ్య ఎడం కావాలంటే భార్య భర్త మధ్య ఎడం కావాలి' అన్నాడు రేడియో ప్రకటన గొంతుతో.
తులసి నవ్వేసింది.
'అయాం రడీ" అందామె సూట్ కేస్ లు క్లోజ్ చేసి.
సురేష్ రెండు చేతుల్తో రెండు సూట్ కేస్ లూ తీసుకున్నాడు.
"ఒకటి నేను పట్టుకుంటాను" అందామె.
"నో డార్లింగ్! బ్యూటీ పుల్ గాళ్స్ కి సర్వీస్ చేయటం నా హాబీ" అంటూ బయటకు నడిచాడు.
తులసి కళ్ళల్లో నీళ్ళు నిలిచినాయ్! "థాంక్యు దీపా! ఎంతో హాపీగా గడిపాం. విడిపోవాలంటే ఏమిటోగా వుంది."
"నాకూ ఏమిటోగా వుంది" బాధగా అంది దీప.
సురేష్ సూట్ కేస్ లు ఫోల్దింగ్ కాట్ ఆటోలో పెట్టాడు. తులసి అతని పక్కన కూర్చుంది. అటో వెళుతుంటే వింత అనుభూతులు ఆమెను చుట్టుముట్టినాయ్.
తనూ, సురేష్ ఈ రాత్రి నుంచి ఒకే ఇంట్లో గడపబోతున్నారు. అతనితో తనకు ఈ రాత్రి మొదటిది కాదు. కానీ భార్యా భర్తల్లా కలసి గడపటం ఇవాళ నుంచే .....ఈ రాత్రి నుంచే మొదలు. తను ఊహించుకుంది. ఒకటి - జరుగుతొందొకటి. పెళ్ళయ్యాకే ఇలాంటివన్నీ అనుకుంది అప్పట్లో, ఒకటోకటిగా అన్నీ చేజారిపోయినాయ్. పెళ్ళి కావాల్సిన హంగులేమీ లేవు ఇద్దరి దగ్గరా. అందుకే అది నిరవధికంగా వాయిదా పడుతోంది.
సురేష్ ఆమె చుట్టూ చెయ్యి వేసి చటుక్కున దగ్గరకు లాక్కుని ముద్దు పెట్టుకున్నాడు.
"ఏయ్! ఏమిటిది?" కోపంగా అందామె.
అతను ఆశ్చర్యపోయాడు. "ఇంత వయసొచ్చింది యింకా తెలీదా? దీనిని 'కిస్ ' అంటారు. ఇంకా పూర్తి వివరాలు చెప్పయ్యనా?" ఉత్సాహంగా అడిగాడు.
'అక్కర్లేదు."
అటో గంగాభవాని ఇంటిముందు ఆగింది. గంగాభవాని వాళ్ళ యింటి గడపలోనే నిలబడింది.
"నేను ఆటోలో కూర్చుంటాను. నువ్వూ అటో అతనూ సామాను లోపలికి చేరేయండి." అన్నాడు సురేష్.
సామాను చేరవేయటం పూర్తయింది.
"ఫర్వాలేదులే......రా" అంది తులసి. అటో దిగి నిలబడ్డాతను. జేబులోంచి కర్చీఫ్ తీసి చెవులకి చుట్టుకుని, కళ్ళజోడు పెట్టుకుని తులసితో పాటు త్వరత్వరగా ఇంట్లోకి నడిచాడు.
తలుపులు మూసివేశాక గానీ ధైర్యం రాలేదు.
"ఆకలి" అన్నాడు తర్వాత.
"అదేమిటి?" ఆకలుండదు దహముండదు నిన్ను చూస్తుంటే ' అనే పాట ఎందుకు రాసినట్లు సినిమావాళ్ళు?"
"అది కొత్త అమ్మాయి దొరికినప్పటి సంగతి"
తులసి అతని చేతి మీద గట్టిగా గిల్లింది నవ్వుతూ.
"ఆ టిఫిన్ లో దీప ఫలహారం యిచ్చింది. ప్లేట్స్ లో పెట్టు. నేను ఇంటామేనడిగి మంచినీళ్ళు తెస్తాను.'
సురేష్ త్వరత్వరగా ఫలహారం చేస్తుంటే తులసి ట్రాన్సిస్టర్ అన్ చేసింది.
నడిరేయి ఏ జాములో స్వామి నిను చేర దిగివచ్చునో పాట
"యూస్ లెస్" అన్నాడతను.
"ఏమిటి?"
"నడిరాత్రి వ్యవహారం! బహుశా షిప్టు డ్యూటీలు చేసేవాళ్ళ కోసం రాశారేమో?"
"నీకొంకో ధ్యాస వుండదు" నవ్వుతూ అంది.
ఫోల్దింగ్ కాట్ అన్ ఫోల్డ్ అయింది. అతని పక్కనే మంచం మీద కూర్చుంటూ అడిగింది - " ఇల్లు చాలా బాగుంది కదూ!"
"ఇల్లు కాదు ఇంట్లో బాగుంది" ఆమెను కౌగిట్లోకి లాక్కుంటూ అన్నాడు. తులసి తెలుసు. అతని చేతుల్లో తను మైనపు బొమ్మలా నలిగి పోవటం తప్ప వద్దు అనగలిగే శక్తి లేదని. వరుస క్రమంలోనే జరుగుతుందంతా. గుండెమీద చక్కిలిగిలి, వళ్ళంతా ఆవిరి, చెవిలో గుసగుస ఊపిరికి అడ్డం పడే నగ్నత్వం.
"తులసీ!"
"ఊ!"
"మై లవ్ గాడెస్."
"సురేష్....."
"తులసీ!"
తలుపు తట్టిన చప్పుడు. ఎన్నో లోకాలను దాటుకుంటూ వెనక్కు రావాల్సి వచ్చింది.
"ఎవరది?" అడిగాడు సురేష్.
"ఇంత అర్ధరాత్రి ఎవరయ్యుంటారు?" అతనిని కప్పివేసిన తన పొడుగాటి జుట్టుని వెనక్కు తీసుకుని ముడి వేసుకుంటూ అంది.
మళ్ళీ తలుపు చప్పుడు.
"నువ్వుండు" అని ఆమె లేచివెళ్ళి తలుపు దగ్గర నిలబడింది.
"ఎవరు?"
"పాల ప్యాకెట్"
ఇద్దరికీ అశ్చర్యం!
"ఇంత రాత్రా?" తలుపు కొంచెంగా తెరచి చేయి జాపింది తులసి.
"రాత్రేమిటమ్మా అరవుతోంది."
తలుపు భళ్ళున మూసుకుంది.
టైం పీస్ చూసి మంచం మీద పడి తల్చుకుని తల్చుకుని నవ్వుతోంది తులసి.
* * * *
"తులసి గారూ!"
సురేష్ ముఖం కడుక్కుని కాఫీ తాగుతుంటే హటాత్తుగా లోపలి కొచ్చింది గంగాభవాని. మరుక్షణం నిశ్చేష్టురాలై నిలబడిపోయింది.
"మీరు.......నువ్వు......."
అతను నవ్వాడు . ఆమె ఇప్పుడు గొడవ చేసేది ఖాయం. ఈ లోగానే తను షాక్ ట్రీట్ మెంట్ యివ్వాలి.
"తులసి బెస్ట్ గాళ్. మీకు మంచి కంపెని. ఆమె ఆఫీసు కెళ్ళినప్పుడు నేనుండనే వుంటాను ఏమంటారు?"
తులసి వంటింట్లో నుంచి బయటికొచ్చింది.
"నుంచునే వున్నారేం? అలా కూర్చోండి" అందామె.
"మీ భర్త ఇతనేనని ముందు చెప్పలేదేం?" కోపంగా అడిగిందామె.
"ముందు నేను భర్తయితే గదా! రాత్రే అయ్యాను" అనుకున్న ఎఫెక్ట్ వచ్చింది . షాక్ అయిందామే.
తులసి గిల్లింది నవ్వాపుకుంటూ.
"మీకు మావారు ముందే తెలుసా?" అడిగింది తులసి......తత్తరపాటు.
"నిన్న ఇంటి కోసం వస్తే యివ్వనని చెప్పాను. మళ్ళీ యీ రకంగా మోసగించటం......"
"ఇవాళ మీ కోసం వచ్చాను. ఇంటి కోసం కాదు" అన్నాడతను కల్పించుకుంటూ.
ఆమె కళ్ళల్లో మళ్ళీ కోపం.
'అంటే.....మీకు పరిస్థితంతా చెప్పి ఇంట్లో కొన్ని రోజులయినా వుండేందుకు."
"నాకేమీ తెలీదు. తక్షణం ఇల్లు ఖాళీ చేయాలి.'
'చిన్న పాపతో మళ్ళీ ఇంకో ఇంటికి మారటమేలా? నాల్రోజులాగితే......."
ఆమె గదంతా వెతికింది.
"చిన్న పాప ఎక్కడ?"
తులసీ పొట్ట వైపు చూపాడతను.
"ప్రాక్టీస్ చేస్తున్నాం."
గంగాభవాని మొహం అంతా ఇంకా ఎరుపెక్కింది.
'అంతా వట్టిదే" అంది తులసి.
గంగాభవానికి కోపం, నవ్వు రెండు వచ్చాయి , కానీ రెండింటిని కంట్రోల్ చేసుకుంది.
"మీకు సరిగ్గా మాట్లాడటం తెలీదు.' అంది కోపం నటిస్తూ.
"ఎంత తీసుకుంటారు?"
"తీసుకోవటమేమిటి?"
"సరిగ్గా మాట్లాడటం నేర్పడానికి. అది వచ్చాక మిగతావి నేర్చుకుంటాను."
నిజంగానే కోపమొచ్చిందామెకి.
"ఇంకోసారిలా మాట్లాడితే బాగుండదు."
విసవిసనడుస్తూ వెళ్ళిపోయింది.
తులసి వంటింట్లోకి నడిచింది. సురేష్ కూరగాయల్ని చాకుతో కోసి యిచ్చాడు.
"నేను స్నానం చేసి వస్తాను. కూర చూస్తూ వుండు."
"నేనూ వస్తాను"
"ఎక్కడికి?"
"స్నానానికి."
"ఛీ! సిగ్గులేదు?" నవ్వాపుకుంటూ అడిగింది.
"ఇంకా పెళ్ళి అవందే?"
బాత్ రూమ్ లోకెళ్ళి తలుపు మూసేసుకుంది. బయటికి వచ్చేసరికి ఇద్దరికీ భోజనం రడీ చేశాడు.