Previous Page Next Page 
తిరిగి దొరికిన జీవితం పేజి 6


    "డాక్టరుగారూ యీమే మీకేమన్నా బంధువా, మీరు ఆ అమ్మాయికి బావ వరుసా, మీకీ అమ్మాయి తెలుసన్నమాట. పోనీ లెండి.పాపం ఎవరూ లేరు ఎలా అనుకున్నాను" అంటూ ఆవిడ ఆశ్చర్యపోతూనే భారం దిగినట్లు తేలిగ్గా వూపిరి తీసుకుంది.
    "అబ్బేబ్బే-నాకేం తెలీదండీ, యీ అమ్మాయి ఎవరో కూడ నేను చూడలేదు ఇదివరకు. నన్ను బావ అంటుందేమిటో?" అతనంతకంటే ఆశ్చర్యంగా అన్నాడు.
    "మరదేమిటి అలా అంది!"
    "వుండండి, ముందీ అమ్మాయి సంగతి చూడనీండి." అంటూనే సరోజకి తెలివి తెప్పించే ప్రయత్నాలు చేయనారంభించాడు. కాసేపటికి కళ్ళు తెరిచింది సరోజ. తనమీదకి వంగి ఆరాటంగా చూస్తున్న కృష్ణమోహన్ ని చూస్తూనే ఆరాటంగా అతని చేయిపట్టుకుంది. "బావా! యిన్నాళ్ళు ఏమయిపోయావు? మమ్మల్ని వదిలి ఎందుకు వెళ్ళిపోయావు?" అంటూ అతని చేతిలో మొహం దాచుకుంది ఏడుస్తూ. కృష్ణమోహన్ యీసారి ఆశ్చర్యపోతూనే "చూడమ్మా, నేను మీ బావని కాను. నీవు నన్ను ఎవరనుకుంటున్నావో....అసలు నీ వెవరి తాలూకు--" ఒకవేళ తనకు తెలియని దూరపు బంధువులు ఎవరన్నా వున్నా రేమోనన్న సందేహంతో వివరం తెలుసుకుందామని అడిగాడు. కాని సరోజకి ఆ మాటలు వినిపించినట్లు లేదు. మళ్ళీ చిన్న మగత లాంటిది కమ్మిందని అర్ధం చేసుకున్నాడు కృష్ణమోహన్. ఆ పరిస్థితిలో ఆమెని ఏమీ అడిగి ప్రయోజనం లేదని బోధపడింది.
    "ఏం యింకా అవలేదా? పిల్లలు ఏడుస్తున్నారు" అంటూ ఆమె భర్త లోపలికి వచ్చాడు. ఆమె "డాక్టరుగారూ, యీ అమ్మాయిని నర్సింగ్ హోమ్ లో వుంచుకుంటారు గదా. కాస్త నయమయ్యాక ఆ అమ్మాయే వివరాలు చెప్తుంది. మరి నే వెడతాను" అంటూ తన బాధ్యత తీరినట్లు అప్పగించేసింది కృష్ణమోహన్ కి. అతనికి ఏమనాలో, ఏం చెయ్యాలో తోచలేదు. ముక్కు మొఖం తెలియని అమ్మాయిని పేషెంటుగా ఎలా ఉంచుకోవాలో, అలా అని అంత జ్వరంలోదిక్కూ మొక్కూ లేకుండావచ్చిన ఓ అయినింటి అమ్మాయిని ఉంచుకోలేనని ఎలా చెప్పాలో అర్ధంగాని అయోమయవస్థలో అతను ఉండిపోయాడు. అతని జవాబన్నా వినకుండా ఆమెభర్తతో బయటికి వెళ్ళి పోయింది. ఇంక ఆలోచనకి స్వస్తిచెప్పి సరోజని పరీక్షించి ఓయింజక్షన్ యిచ్చాడు. ఏ జ్వరమో తేల్చుకోడానికి ఆ కాస్తసమయంచాలదు. ఏది ఎలావున్నా ముందు ఆ అమ్మాయిని నర్సింగ్ హోమ్ కి చేర్చి బెడ్ మీదపడుకోబెట్టాలి. పని మనిషిని పిలవడానికి లోపలికి వెళ్ళాడు కృష్ణమోహన్.
    పూజగదిలోంచి తల్లి శ్రావ్యంగా స్తోత్రం చదువుతూండడం విని ఒక్కక్షణం ఆగిపోయాడు. ఆ అమ్మాయి ఏమన్నా దూరం బంధువేమో తల్లికి తెలుస్తుంది. తల్లిని చూడ మనాలి. తనకి తెలియని ఏ దూరం బంధువో వుండి ఉండవచ్చు. లేకపోతే బావా అని ఎందుకు పిలుస్తుంది. పోనీ బావా అంటే అందికాని యిన్నాళ్ళు ఎక్కడికి పోయావు అంటూ ఏడ్చిందిమరి- అతని ఆలోచన ముందుకు వెళ్ళలేదు. ఓసారి తల్లిని చూడమంటే సందేహనివృత్తి అవుతుందిగదా-
    తల్లిపూజ ముగిసేవరకు ఆరాటంగా ఎదురుచూశాడు. సరస్వతమ్మ బయటికి రాగానే "అమ్మా....అమ్మా ఒక్కసారి కన్సల్టింగ్ రూమ్ లోకి వస్తారా" అనడిగాడు. ఆవిడ తెల్లబోయింది. "ఎందుకు?....ఎందుకురా నాయనా" అంది ఆశ్చర్యంగా, ఆరాటంగా. "రా" చెప్తాను. ఒకవింత విషయం చెప్తాను రా' అంటూ దారితీశాడు. ఆవిడ గాబరాగా కొడుకు వెంట వెళ్ళింది.
    బల్లమీద పడుకున్న, సరోజని చూపిస్తూ "యిలాంటి మరదలు ఒక అమ్మాయి వుందని ఎప్పుడూ చెప్పలేదే మమ్మా" అన్నాడు-"యీ అమ్మాయికి ఏ వరస బావ నమ్మా" అన్నాడు. సరస్వతమ్మ కొడుకువంక, సరోజవంక ఆశ్చర్యంగా చూస్తూ. "ఏమిటిరా, మరదలేమిటి, బావేమిటి, యీ అమ్మాయి ఎవరు?" అంది.
    "ఏమో నాకేం తెల్సు ఆ సంగతి, నీవు చెపుతావనే నిన్ను పిలిచాను" అన్నాడు నవ్వి కృష్ణ.

 Previous Page Next Page