Previous Page Next Page 
చిక్కలేదు చిన్నదాని ఆచూకీ... పేజి 6


    అంతేకాదు...అప్పటికి నాతో సంసారం చేయగల ఓపిక కూడా నీకుండాలి..." అంది అపర్ణ గల గల నవ్వుతూ.

 

    ఆమె మాటల్లో తొంగిచూసిన వల్నరబిలిటీకి మెచ్చుకోవాలో... నిర్మొహమాటంగా పెళ్ళి ఇప్పుడు కాదని తెగేసి చెప్పినందుకు కోపగించుకోవాలో అర్థంకాక విస్తుపోయాడు శ్రీధర్.

 

    "అయితే...ఈ జన్మలో నీకు పెళ్ళి కాదు" తనలో రేగుతున్న అసహనాన్ని అణుచుకుంటూ అన్నాడు శ్రీధర్.

 

    "అలాగైతే మరీ మంచిది. హాయిగా బ్రహ్మచారిణిగా వుండిపోతా. ఈ మొగుడనే బ్రహ్మ పదార్ధం, పిల్లలూ... బాధలూ... ఇవేమీ లేకుండా హాయిగా వుండడమే నా కిష్టం."

 

    కవ్వింపుగా అంది అపర్ణ. ఆ పైన ఏం మాట్లాడాలో అర్థం కాలేదు శ్రీధర్ కి.

 

    అపర్ణ దృష్టిని పెళ్ళి వైపు మరల్చాలన్నది శ్రీధర్ ప్రయత్నం.

 

    ఈ విషయమింకా తన తాత గారికి తెలీదు. తెలిస్తే ఏమంటారో కూడా తెలీదు.

 

    తన పెళ్ళి నిర్ణయాన్ని తనకే వదిలేస్తారో - తన తండ్రి లేదా తాత నిర్ణయం చాలనుకుంటున్నారో కూడా తెలీదు.

 

    ఆలోచనల్లోంచి తేరుకుని, బట్టలకంటిన ఇసుకను దులుపుకుంటూ ఆంధ్రా యూనివర్శిటీ రోడ్ లో వడివడిగా నడవసాగాడు.

 

    నిజానికి తను రోడ్ల మీద నడవాల్సిన పని లేదు.

 

    విశాఖలో నాలుగు వేల కోట్ల పెట్టుబడితో నాప్తా ఆధారిత విద్యుత్ కేంద్రం ఏర్పాటు చేసే ఉద్దేశంతోటే సెలవుల్లో అమెరికా నుంచి తను ముంబాయి రాగానే విశాఖ పంపించారు తాతగారు.

 

    తన తాతగార్ని దృష్టిలో పెట్టుకుని తను విశాఖలో ఫ్లైట్ దిగిన దగ్గర్నుంచి లోకల్ పారిశ్రామిక వేత్తలు తనని కాలు క్రింద పెట్టనివ్వటం లేదు.

 

    అలాంటి వారి నుంచి తప్పించుకుని, తనిలా, తను ప్రేమిస్తున్న అపర్ణ కోసం రోడ్డెంట నడుచుకుంటూ వెళ్ళడం తనకే వింతగా వుంది.

 

    సముద్రపు ఒడ్డునుంచి నడుచుకుంటూ కాన్ఫరెన్స్ హాల్ కి వచ్చే సరికి రాత్రి ఏడు గంటలయింది.

 

    అప్పటికే ప్రోగ్రామ్ స్టార్ట్ అయిపోయింది.

 

    డయాస్ మీద అపర్ణ డాన్స్ చూస్తున్న శ్రీధర్ మంత్రముగ్ధుడై పోయాడు. ప్రోగ్రామ్ తరువాత అభినందనలు తెలియజేస్తున్న సమయంలో అపర్ణ టాపిక్ ను శ్రీధర్ వైపు మరల్చి "నా అభివృద్ధికి పరోక్షంగా కృషిచేస్తున్న వ్యక్తి, నా ఫ్రెండ్ శ్రీధర్.

 

    మేమిద్దరం అమెరికాలో ప్రస్తుతం ఎం.బి.ఏ చేస్తున్నాం. ఒన్ ఇయర్ పూర్తయింది. ఇక్కడ నాకు ఎన్నో విధాల సహాయ మందిస్తున్న జెంటిల్ మన్ శ్రీధర్. నేనీ ప్రోగ్రామ్ కోసమే స్టేట్స్ నుంచి వచ్చాను.

 

    తాను కూడా కొద్ది రోజుల క్రితం ముంబాయి వచ్చాడు. కానీ ప్రోగ్రామ్ ఇస్తున్నట్టు ఫోన్ ద్వారా తనకి తెలియజేసే ప్రయత్నం చేశాను. తను బిజినెస్ పని మీద ఈ నగరానికే వచ్చినట్టు తెలిసింది.

 

    ఇప్పుడిద్దరం ఇదే నగరంలో వున్నాం. నేనిక్కడ... తనెక్కడో తెలీదు. నా ప్రోగ్రామ్ డీటైల్స్ తో ఈ నగరమంతా అంటించిన పోస్టర్స్ చూసే వీలు తనకి కలిగుంటే ఇక్కడికి వచ్చేవాడు. రాలేదంటే తన పనుల ఒత్తిడిలో వుండి ఉండవచ్చు.

 

    ఆయన నాకు కేవలం ఫ్రెండ్ మాత్రమే కాదు. అంత కంటే ఎక్కువే. ఆయనెక్కడున్నా, ఈ సభా ముఖంగా కృతజ్ఞతలు తెలుపు కుంటున్నాను...." అంది అపర్ణ ఎంతో ఉద్వేగంతో.

 

    అప్పటికే ఆడిటోరియమ్ చివరలో ఒక కుర్చీలో సెటిలై వున్న శ్రీధర్ ఆమె మాటలు విని చాలా ఆనందించాడు.

 

    ఆ వెంటనే మనసులోను అనుకున్నాడు- "షీ ఈజ్ మోస్ట్ ఇన్ స్క్రూటబుల్ లేడీ" అని.

 

    మరో గంటకి ప్రోగ్రామ్ పూర్తయి అపర్ణ గ్రీన్ రూమ్ కి వెళ్ళగానే - కావాలనే శ్రీధర్ "హలో...తింగర బుచ్చి" అంటూ పెద్దగా అరిచాడు.

 

    అప్పుడే డ్రస్ మార్చుకోబోతున్న అపర్ణ ఒక్కసారి ఉలిక్కిపడి వెనుదిరిగి, శ్రీధర్ ని సడన్ గా అక్కడ చూసి మరోసారి ఉలిక్కిపడింది.

 

    నమ్మలేని నిజాన్ని చూస్తున్నట్టుగా ఆమె అందమైన కనురెప్పలు టపటప కొట్టుకున్నాయి.

 

    అలా కొట్టుకుంటున్న ఆ కనురెప్పల వెనుక ఆనందం తొంగి చూసింది.


                               *    *    *    *


    అక్కడి నుంచి హోటల్ కి టాక్సీలో వస్తున్నప్పుడు అడిగాడు శ్రీధర్- "నేనేం చేశానని... డయాస్ మీద అలా కృతజ్ఞతలు చెప్పావ్?"

 

    అందుకామె ముందు మృదువుగా నవ్వింది. "అందంగా, నిశ్శబ్ధంగా తరువాత తీరిగ్గా నవ్వుదువు కాని...ముందు నా ప్రశ్నకు సమాధానం చెప్పు" అన్నాడు శ్రీధర్ తిరిగి.

 

    అపర్ణ కళ్ళు పెద్దవి చేసుకుని "ఇంకా చాలా చెప్పాలనుకున్నాను - చెప్పలేదు. ఆ విషయాల్లో ముఖ్యమైన విషయం ఏమిటో తెలుసా! నేను ప్రపంచంలో ప్రేమించే ముఖ్యవ్యక్తుల్లో నువ్వు మొదటి వాడివి..."

 

    ప్రేమ అనే పదం అపర్ణ నోటి నుంచి రావడం అదే మొదటిసారి. మనసులోనే ఆనందించాడు శ్రీధర్... "ప్రేమంటే నువ్వనుకునే లవ్ కాదు - నా దృష్టిలో ప్రేమకు నేను చెప్పే అర్థం వేరు" ఖండితంగా అంది అపర్ణ. మళ్ళీ గాలి తీసేసినట్టయింది శ్రీధర్ కు.

 

    అసలు తనను ఎలా ఊహిస్తుంది ? కేవలం స్నేహితుడిగానేనా ఏమో...

 

    "అంటే నేను నీకు కేవలం ఫ్రెండ్ నేనా?" చిరాగ్గా అడిగేసాడు శ్రీధర్.

 

    "ఇప్పుడే చెప్పలేను...నాక్కొంచెం టైమ్ కావాలి? నా ప్రపంచ నాట్య యాత్ర పూర్తికావాలి" చెప్పేసింది అపర్ణ స్థిరంగా.

 

    సస్పెన్స్ లో వుంచడం ఆమెకు బాగా ఇష్టమల్లే వుంది- సస్పెన్స్ తనకూ ఇష్టమే- మరీ ఇంత టెన్షన్ లో పెట్టే సస్పెన్సా!

 

    ప్రేమ విషయంలో సస్పెన్స్ పనికిరాదు...ఎందుకంటే ప్రేమే ఒక మిస్టరీ కాబట్టి....

 

    ఆ రోజు రాత్రి ఇద్దరూ ముంబాయి బయలుదేరారు ఫ్లైట్ లో.

 Previous Page Next Page